You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్‌లో టాప్ 10 దేశాలేవి? భారత్ ఎక్కడుంది?
భారత్ బలమైన స్థితిలో ఉండాలంటే, విదేశీ మారక ద్రవ్య నిల్వలను(ఫారెక్స్) కనీసం ఒక ట్రిలియన్ డాలర్లకు పెంచుకోవాల్సిన అవసరం ఉందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ డిప్యూటీ గవర్నర్ మైఖేల్ దేబబ్రత పాత్రా అన్నారు.
భారత్ వద్ద ప్రస్తుతం 690 బిలియన్ డాలర్ల విదేశీ మారకద్రవ్య నిల్వలు ఉన్నాయి. అంటే ఒక ట్రిలియన్ డాలర్ల లక్ష్యానికి ఇంకా 310 బిలియన్ డాలర్లు తక్కువగా ఉన్నాయి.
‘‘మార్కెట్ సున్నితత్వం దృష్ట్యా కూడా విదేశీ మారకద్రవ్య నిల్వల స్థాయి చాలా కీలకం. 1 ట్రిలియన్ డాలర్ల లక్ష్యం రెండు ముఖ్యమైన రక్షణ చర్యలపై ఆధారపడి ఉంది" అని ఈ ఏడాది మార్చి 16న బేసిస్ పాయింట్‌లో ప్రచురితమైన ఒక వ్యాసంలో పాత్రా రాశారు.
"వీటిలో సుమారు 350 బిలియన్ డాలర్లు ఏడాదికాలంలో చెల్లించాల్సిన అన్ని విదేశీ అప్పులను కవర్ చేయడానికి అవసరం. మిగిలిన 650 బిలియన్ డాలర్లు విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడిదారులు భారీగా పెట్టుబడులు ఉపసంహరించుకునే సందర్భంలో రక్షణగా ఉండేందుకు అవసరం" అని ఆయన అన్నారు.
పాత్రా ఇలా రాశారు, "విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడుల ఉపసంహరణ భారీగా ఉండి, చాలా ఏళ్లపాటు కొనసాగవచ్చు. 2022-23 తర్వాత భారత్ ఇప్పటికే ఈ సవాలును ఎదుర్కొంది. ప్రాథమిక అంచనాల ప్రకారం అటువంటి రక్షణ కోసం సుమారుగా 600 బిలియన్ డాలర్ల నుంచి 650 బిలియన్ డాలర్ల వరకు అవసరం ఉండొచ్చు" అని ఆ వ్యాసంలో పాత్రా రాశారు.
"ఈ ప్రాతిపదికన భారత విదేశీ మారక నిల్వల లక్ష్యం కనీసం 1 ట్రిలియన్ డాలర్లు ఉండాలి. కనీసం అనడం వెనుక కారణం ఏమిటంటే ఆ నిల్వల్లో ఎంత ద్రవ్య రూపంలో అందుబాటులో ఉంటుంది అనేది కూడా అంచనా వేయాల్సి ఉంటుంది" అని ఆయన చెప్పారు.
ఇరాన్ యుద్ధం వల్ల ముడి చమురు ధరలు పెరగడంతో భారత్ వంటి చమురు దిగుమతి ఆధారిత ఆర్థిక వ్యవస్థలపై ఒత్తిడి పెరిగింది. దీంతో రూపాయి విలువ పడిపోతూ రికార్డు స్థాయి కనిష్టానికి చేరుకుంది. అందుకే ఇటీవలి వారాల్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కరెన్సీ మార్కెట్‌లో తన జోక్యాన్ని పెంచింది. ప్రస్తుతం ఒక డాలర్‌కు రూపాయి విలువ 95 రూపాయలు దాటింది.
డాలర్ ఆధిపత్యం
ఈ ఒత్తిళ్లు ఉన్నప్పటికీ రూపాయి ప్రతి సంవత్సరం 4 నుంచి 5 శాతం తగ్గడం అనేది పొదుపులు, పెట్టుబడుల మధ్య ఉన్న మోస్తరు వ్యత్యాసం వంటి ఆర్థిక మౌలిక అంశాలకు అనుగుణంగానే ఉందని మైఖేల్ పాత్రా అంటున్నారు.
"ఈ స్థాయి పతనం విషయంలో ఆర్‌బీఐ ఆందోళన చెందలేదని రికార్డులు చూపిస్తున్నాయి. ఒక్కసారిగా తీవ్రమైన పతనం లేదా షాక్‌లకు బదులుగా నియంత్రితంగా, క్రమంగా రూపాయి విలువ తగ్గేలా కేంద్ర బ్యాంక్ సమర్థవంతంగా వ్యవహరించింది" అని ఆయన అన్నారు.
ప్రపంచదేశాలు తమ విదేశీ మారక నిల్వల్లో సాధారణంగా 60 శాతం కంటే ఎక్కువ భాగాన్ని అమెరికన్ డాలర్ల రూపంలోనే ఉంచుకుంటాయి. దిగుమతుల బిల్లులు చెల్లించడానికి లేదా తమ కరెన్సీకి మద్దతు ఇవ్వడానికి విదేశీ మారక నిల్వలు ఉంచాల్సిన అవసరం అమెరికాకు ఉండదు.
ఏ దేశం వద్ద ఎంత?
అమెరికా రేసులో లేదు
అందుకే అత్యధిక విదేశీ మారక నిల్వలు ఉన్న దేశాల జాబితాలో అమెరికాను సాధారణంగా చేర్చరు. ఎందుకంటే అది స్వయంగా డాలర్లను ముద్రించే దేశం.
భారత్, చైనా, జపాన్ వంటి దేశాలు వస్తువులను ఎగుమతి చేయడం ద్వారా విదేశీ కరెన్సీ సంపాదిస్తాయి. తర్వాత ఆ కరెన్సీతో తమ విదేశీ మారక నిల్వలను పెంచుకుంటాయి. అమెరికా డాలర్ ప్రపంచవ్యాప్తంగా అంగీకరిస్తారు. కాబట్టి అమెరికాకు పెద్ద మొత్తంలో విదేశీ మారక నిల్వలను పోగుచేసుకోవాల్సిన అవసరం లేదు.
అమెరికా ప్రధాన వ్యూహాత్మక భద్రతా రక్షణగా అమెరికా ప్రపంచంలోనే అతిపెద్ద బంగారు నిల్వలను కలిగి ఉంది.
అమెరికా అప్పులు కూడా తన సొంత కరెన్సీ అయిన డాలర్లలోనే ఉంటాయి. అందువల్ల విదేశీ అప్పులు తీర్చడానికి డాలర్ నిల్వలు అవసరమయ్యే ఇతర దేశాల మాదిరిగా అమెరికా డిఫాల్ట్ అయ్యే పరిస్థితి తక్కువగా ఉంటుంది.
ఇతర దేశాలు మారకపు రేటు హెచ్చుతగ్గుల నుంచి రక్షించుకోవడానికి తమ విదేశీ మారక నిల్వలను పర్యవేక్షిస్తుంటే, ఆ నిల్వల విలువను లెక్కించడానికి అమెరికా డాలరే ప్రామాణిక కరెన్సీగా ఉంటుంది.
విదేశీ మారక నిల్వ ఎందుకు ముఖ్యం?
భారత్ వస్తువులు కొనుగోలు చేసినప్పుడు డాలర్లలో చెల్లిస్తుంది. అమ్మినప్పుడు డాలర్లలోనే పొందుతుంది. అంటే ఒక దేశం ఎక్కువగా అమ్మితే డాలర్లు ఎక్కువగా వస్తాయి. ఎక్కువగా కొనుగోలు చేస్తే డాలర్లు ఎక్కువగా ఖర్చవుతాయి.
అందువల్ల ఎగుమతులు ఎక్కువగా ఉన్న దేశాల్లో విదేశీ మారక నిల్వలు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదే సమయంలో దిగుమతులు ఎక్కువగా ఉన్న దేశాల్లో ఆ నిల్వలపై ఒత్తిడి పెరుగుతుంది.
2025-26 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ వాణిజ్య లోటు 333.2 బిలియన్ డాలర్లుగా ఉంది. అంటే భారత్ ఎగుమతుల కంటే దిగుమతులే ఎక్కువగా చేసింది. భారత్ తన అవసరమైన చమురులో సుమారు 90 శాతం దిగుమతి చేసుకుంటుంది కాబట్టి, విదేశీ మారకంలో అత్యధిక భాగం ఇక్కడే ఖర్చవుతుంది.
వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం ఎగుమతులు, దిగుమతుల మధ్య తేడా జనవరిలో 34.68 బిలియన్ డాలర్లకు పెరిగింది. నెలరోజుల క్రితం ఇది 25.05 బిలియన్ డాలర్లుగా ఉండేది.
జనవరిలో దిగుమతులు గతేడాదితో పోలిస్తే 19.2 శాతం పెరిగి 71.24 బిలియన్ డాలర్లకు చేరగా, ఎగుమతులు కేవలం 0.6 శాతం పెరిగి 36.56 బిలియన్ డాలర్లకు చేరాయి.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)