You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఆ నలుగురు చనిపోవడానికి ‘పుచ్చకాయే’ కారణమా... పోలీసులు ఏం చెబుతున్నారు?
- రచయిత, గీతా పాండే, దీపాలీ జగ్తప్, అల్పేష్ కర్కరే
- హోదా, బీబీసీ ప్రతినిధులు
- ప్రచురణ
- చదివే సమయం: 5 నిమిషాలు
ముంబైలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మరణించి దాదాపు మూడు వారాలు గడిచాయి.
వారి మరణాలకు గల కారణాలు ఇప్పటికీ తెలియడంలేదని పోలీసులు బీబీసీతో చెప్పారు. నలుగురు కుటుంబ సభ్యులు ఇంట్లో చనిపోయి కనిపించారు.
డోకాడియా కుటుంబంలో అబ్దుల్లా, ఆయన భార్య నస్రీన్, వారి ఇద్దరు కుమార్తెలు అయేషా, జైనాబ్ ఏప్రిల్ 25న ముంబై పైధునీ ప్రాంతంలో విగత జీవులుగా కనిపించారు.
ఈ వార్త బయటకు వచ్చిన వెంటనే మీడియా ఈ మరణాలను '' పుచ్చకాయ మరణాలు’గా చెప్పింది.
చనిపోవడానికి ముందు వారు చివరగా తిన్నది పుచ్చకాయే.
రాత్రి ఆలస్యంగా పుచ్చకాయ తిని....
ఈ మరణాలపై మీడియాలో బాగా వార్తలొచ్చాయి. పుచ్చకాయలు తినేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేస్తూ వార్తలు రాశారు, ప్రసారం చేశారు.
డొకాడియా కుటుంబం రాత్రి బాగా పొద్దుపోయిన తరువాత పుచ్చకాయను తినడంతో... పుచ్చకాయ కల్తీ అయినా జరిగి ఉండాలి, లేదంటే విషమైనా కలిసి ఉండాలనే అనుమానాలు వ్యక్తమయ్యాయి.
ఈ ఘటన తర్వాత ముంబై పండ్ల మార్కెట్‌లో పుచ్చకాయల కొనుగోళ్లు బాగా తగ్గి, ధరలు పడిపోయాయి.
ఈ మరణాలు ప్రమాదవశాత్తు జరిగినవా, ఉద్దేశపూర్వకమైనవా అనేవాటిపై అనేక ఊహాగానాలు సాగుతున్నాయి.
ఫోరెన్సిక్ టెస్టుల్లో జింక్ ఫాస్ఫైడ్ కనిపించిందని గత వారం ముంబయి పోలీసులు చెప్పారు. అత్యంత విషపూరితమైన ఈ రసాయనాన్ని సాధారణంగా ఎలుకలను చంపడానికి ఉపయోగిస్తారు. డోకాడియా కుటుంబం మరణానికీ ఇదే కారణమని, వారి శరీర భాగాలలో, పుచ్చకాయ ముక్కల్లో కూడా ఇదే ఉందని పోలీసులు తెలిపారు.
జింక్ ఫాస్పైడ్ అనే విషపదార్థం ఉందని తెలిసినా, ఇప్పటికీ జవాబు దొరకని ప్రశ్నల కారణంగా ఈ కేసులో అసలేం జరిగిందనేది తెలియడం లేదు.
ఈ మరణాలకు కారణమేంటి, పుచ్చకాయలోకి విషయం ఎలా చేరిందనేదానిపై ఇప్పటికీ స్పష్టత లేదని ముంబయి పోలీసు వర్గాలు బుధవారం (మే 13న) బీబీసీతో చెప్పాయి.
''మేం ఆధారాలు సేకరిస్తున్నాం. దీని వెనక గల కారణాలను అన్ని కోణాల్లో పరిశీలిస్తున్నాం'' అని సీనియర్ పోలీసు అధికారి చెప్పారు. ''ఇవి హత్యలా లేక ప్రమాదంలో మరణించడమా లేక ఆత్మహత్యలా అనే విషయంపై ఏమీ చెప్పలేమని, ఈ కోణాలను తోసిపుచ్చలేమని'' సీనియర్ పోలీసు అధికారి చెప్పారు.
‘పుచ్చకాయ తిన్న కాసేపటికే అనారోగ్యం’
దక్షిణ ముంబయిలోని పైధుని ప్రాంతంలో ఉన్న ఓ పాత భవనం మొదటి అంతస్తులో డోకాడియా కుటుంబం నివసిస్తోంది.
ఆ కుటుంబం మరణించిన తరువాత పోలీసులు తొలిసారి మాట్లాడినప్పుడు కొన్ని విషయాలు చెప్పారు. ఆ రాత్రి కుటుంబ సభ్యులు కొందరు బంధవులను డిన్నర్‌కు ఆహ్వానించారని, అందరూ కలిసి బిర్యానీ తిన్నారని తెలిపారు.
రాత్రి పదిన్నర గంటల సమయంలో బంధువులు వెళ్లిపోయారు. కొన్ని గంటల తర్వాత అబ్దుల్లా, ఆయన భార్య, వారి ఇద్దరు పిల్లలు పుచ్చకాయ తిన్నారు. ఆ తర్వాత కాసేపటికే వారు అనారోగ్యం పాలయ్యారు.
''ఆ నలుగురికీ వాంతులు, విరేచనాలయ్యాయి. మొదట వారిని దగ్గరలోని ఆస్పత్రికి తరలించి తర్వాత జేజే ఆస్పత్రిలో చేర్పించారు. దురదృష్టవశాత్తూ నలుగురూ చనిపోయారు'' అని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ పర్విన్ ముండే మీడియాతో చెప్పారు.
మృతుల శరీర భాగాల్లో జింక్ ఫాస్ఫైడ్ అవశేషాలు
అనారోగ్యం గురించి తెలిసిన వెంటనే చుట్టపక్కలవాళ్లు ఆ కుటుంబానికి సాయం చేసేందుకు వచ్చారు. వారిలో అదే భవనంలోని నాలుగో అంతస్తులో నివసించే డాక్టర్ జైడ్ ఖురేషీ కూడా ఉన్నారు.
''ఆ నలుగురిలో వాళ్ల చిన్నమ్మాయికి ఊపిరి తీసుకోవడం కష్టమవుతోందని గమనించా. సీపీఆర్ చేశా. అయినా పరిస్థితి మెరుగవ్వలేదు. దగ్గరలోని ఆస్పత్రికి తీసుకెళ్లాం. ఆమె చనిపోయారు''అని డాక్టర్ ఖురేషీ బీబీసీతో చెప్పారు.
''మిగిలిన ముగ్గురినీ స్థానిక ఆస్పత్రి నుంచి జేజే ఆస్పత్రికి తరలించారు. వాళ్లు కూడా చనిపోయారు. వాళ్ల పోస్టుమార్టమ్ రిపోర్టులు ఇంకా రావాల్సి ఉంది'' అని ఆయన చెప్పారు.
కల్తీ జరిగింది లేదో తెలుసుకోవడానికి పుచ్చకాయతొక్కలతోపాటు ఆహార పదార్థాలన్నింటినీ స్వాధీనం చేసుకున్నామని పోలీసులు చెప్పారు. అనారోగ్యానికి ముందు కుటుంబ సభ్యులంతా చివరిగా తిన్నది పుచ్చకాయే కావడంతో అందరి దృష్టి దానిపై పడింది.
ముంబయిలోని ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ(ఎఫ్ఎస్ఎల్)గత వారం ఇచ్చిన రిపోర్టు తర్వాత అందరి దృష్టి పుచ్చకాయపైనుంచి జింక్ ఫాస్ఫైడ్ మీదకు మళ్లింది.
''మృతుల శరీరాల్లో కాలేయం, కిడ్నీలు, ప్లీహం, పొట్ట వంటి పలు భాగాల్లో జింక్ ఫాస్ఫైడ్ కనిపించింది. పుచ్చకాయ శాంపిల్‌లో కూడా జింక్ ఫాస్ఫైడ్ ఉంది'' అని ఎఫ్ఎస్ఎల్ డైరెక్టర్ డాక్టర్ విజయ్ ఠాక్రే బీబీసీతో చెప్పారు.
''దర్యాప్తులో భాగంగా సేకరించిన పుచ్చకాయ శాంపిళ్లలో జింక్ ఫాస్ఫైడ్ ఉన్నట్టు గుర్తించారు. మిగిలిన ఆహారపదార్థాల్లో ఎక్కడా అది కనిపించలేదు'' అని కేసు దర్యాప్తు చేస్తున్న అధికారి ముండే చెప్పారు.
‘ఎలుకలను చంపడానికి ఉపయోగించే విషమది’
డోకాడియా నివసించే భవనంలో ఎలుకల సమస్య ఉందని, అక్కడి కుటుంబాల్లో చాలా మంది ఎలుకలను చంపడానికి విషపూరిత పదార్థాలు, విషం కేక్‌లు, గ్లూ పాడ్‌లు వాడుతున్నారని ఇండియన్ ఎక్స్‌ప్రెస్ న్యూస్‌పేపర్ తెలిపింది.
ఎలుకలను చంపడానికి ఉపయోగించే కొన్ని రకాల మందుల్లో జింక్ ఫాస్ఫైడ్ ఉంటుందని, అది తీవ్రమైన విష రసాయనాల సమ్మేళనమని ముంబయికి చెందిన డాక్టర్ భూషణ్ రొకడే చెప్పారు.
ఇది శరీరంలోకి వెళ్లినా లేదా గాలిలో కలిసినా ఈ రసాయనం ఫాస్ఫైన్ గ్యాస్ ఉత్పత్తి చేస్తుందని, దీని వల్ల శరీరంలోని కణాలు ఆక్సిజన్‌ను ఉపయోగించుకోలేవని, ఫలితంగా అనేక అవయవాలు తీవ్రంగా దెబ్బతింటాయని ఆయన తెలిపారు.
వాంతులు, ఛాతీ పట్టేసినట్టు ఉండటం, ఊపిరి ఆడకపోవడం, షాక్‌లోకి వెళ్లిపోవడం లాంటి లక్షణాలు కనిపిస్తాయని, చాలా చిన్న పరిమాణమైనా అది ప్రాణంతకంగా మారొచ్చని డాక్టర్ వివరించారు.
ఎలుకల విషం పుచ్చకాయలోకి ఎలా చేరిందన్నది ఇంకా తేలలేదని సీనియర్ పోలీసు అధికారి బీబీసీతో చెప్పారు.
''మేం 40 నుంచి 50మందిని ప్రశ్నించాం. బంధువులను, స్నేహితులను, ఇరుగుపొరుగువారిని, డోకాడియా కొలీగ్స్‌ను ప్రశ్నించాం. పలు బృందాలు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నాయి. సమాధానాలు దొరికేవరకు దర్యాప్తు కొనసాగిస్తాం'' అని ఆయన తెలిపారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)