బాండేజ్ సెక్స్: 'ప్రియుడి కళ్లకు గంతలుకట్టి, పెట్రోల్ పోసి నిప్పంటించిన ప్రియురాలు', ఈ కేసులో అసలేం జరిగింది?

    • రచయిత, ఇమ్రాన్ ఖురేషీ
    • హోదా, బీబీసీ కోసం, బెంగళూరు నుంచి
  • చదివే సమయం: 4 నిమిషాలు

(హెచ్చరిక: ఈ కథనంలోని అంశాలు కలచివేయవచ్చు)

'సరదాగా గడుపుదాం' అని ఊరించి ఇంటికి పిలిచి, ప్రియుడిపై పెట్రోల్ పోసి నిప్పంటించడంతో ఆ యువకుడు మరణించినట్లు ఒక మహిళపై ఆరోపణలు వచ్చాయి.

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ప్రేమ, కిరణ్‌లు ఇద్దరూ ఒకప్పుడు ఒకే మొబైల్ సర్వీస్ కంపెనీలో పనిచేసేవారు. ఆ సమయంలోనే వారిద్దరికి స్నేహం కుదిరింది. గత ఏడాది కాలంగా వారు రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. కొన్ని నెలలుగా వారి మధ్య విబేధాలు తలెత్తాయి.

'కిరణ్ తనను దూరం పెడుతున్నాడని ప్రేమ భావించింది. అయితే, అసలు కారణం ఏంటనేది విచారణ తర్వాతే తెలుస్తుంది' అని బెంగళూరు (నార్త్-వెస్ట్) డిప్యూటీ పోలీస్ కమిషనర్ నగేశ్ బీబీసీకి చెప్పారు.

అంజన్‌ నగర్‌లోని తన ఇంటికి కిరణ్‌ను ప్రేమ పిలిచినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఏరియా బయదరహళ్లి పోలీస్‌ స్టేషన్ పరిధిలోకి వస్తుంది. ఆ సమయంలో ప్రేమ తల్లి, సోదరుడు పని నిమిత్తం బయటకు వెళ్లినట్లు పోలీసులు వెల్లడించారు.

'కిరణ్ రాగానే ప్రేమ అతని కళ్లకు గంతలు కట్టి, చేతులు కట్టేసి, దుస్తులు విప్పేసింది. తర్వాత పెట్రోల్ పోసి నిప్పంటించింది' అని పోలీసులు తెలిపారు.

ఇది 'ముందస్తు ప్రణాళిక ప్రకారం చేసిన హత్య'గా పోలీసులు భావిస్తున్నారు.

ఆ మహిళ తన మొబైల్‌లో ఇదంతా రికార్డు చేసిందనే వార్తల గురించి అడిగినప్పుడు, 'ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఏదీ లేదు' అని నగేశ్ స్పష్టం చేశారు.

ఒక చిన్న భవనంలోని రెండో అంతస్థులో ఉన్న ఇంట్లో నుంచి మంటలు రావడం గమనించిన స్థానికులు బకెట్లతో నీళ్లుపోసి ఆర్పేందుకు ప్రయత్నించారు. కానీ, మంటలు అదుపులోకి రాకపోవడంతో అగ్నిమాపక సిబ్బందికి, పోలీసులకు సమాచారమిచ్చారు.

మొదట కిరణ్ ఆత్మహత్యకు ప్రయత్నించాడంటూ పోలీసులకు సమాచారం అందింది. కానీ, నిందితురాలిని విచారించిన తర్వాత, దీనిని హత్యగా పోలీసులు నిర్ధరించారు.

కిరణ్ తండ్రి నరసింహయ్య, తుమకూరు జిల్లాలోని చిక్కనాయకానహళ్లి నుంచి రావాల్సి ఉన్నందున కేసు నమోదు చేయడంలో ఆలస్యం జరిగిందని ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు.

పెళ్లి చేసుకోవడానికి నిరాకరించినందువల్లే కిరణ్‌ను ప్రేమ 'హత్య' చేసినట్లు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు.

తన కొడుకును చాలా ప్రేమగా పెంచుకున్నానని, పోస్టుమార్టం జరిగిన ఆసుపత్రి వద్ద విలేఖరులతో నరసింహయ్య చెప్పారు.

'కనీసం ఒక్కసారి కూడా వాడిపై చెయ్యెత్తలేదు. భవిష్యత్తు బాగుంటుందనే ఆశతో నా కొడుకుని బెంగళూరు పంపించాను' అని ఆయన అన్నారు.

BDSM అంటే ఏంటి?

ఈ హత్యకు బీడీఎస్‌ఎంకు సంబంధం ఉండొచ్చని కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు.

ఈ హత్య జరిగినప్పటి నుంచి, 'బాండేజ్ సెక్స్' గురించి ఇంటర్నెట్‌లో ప్రజలు వెతుకుతున్నారు.

ఒక పురుషుడిని లేదా మహిళను కట్టేయడం లైంగిక చర్యలో భాగంగా భావిస్తారు. ఈ పద్ధతినే బీడీఎస్ఎం (బాండేజ్, డిసిప్లిన్, డామినెన్స్, సబ్‌మిషన్, శాడిజం, మాసోకిజమ్) అని అంటారు.

ఈ పద్ధతిలో ఇద్దరు వ్యక్తులు పరస్పర అంగీకారంతో, ఫాంటసీల ఆధారంగా లైంగిక చర్యలో పాల్గొంటారు.

'ఫిష్టీ షేడ్స్ ఆఫ్ గ్రే' అనే హాలీవుడ్ సినిమా వచ్చిన తర్వాత నుంచి ఈ టాపిక్ ఎక్కువగా చర్చల్లోకి వచ్చింది.

నిరుడు తమిళనాడులోని హోసుర్‌లోనూ ఇలాంటి ఒక కేసు నమోదైంది.

'బాండేజ్ సెక్స్' సమయంలో తన భార్య ముక్కు నుంచి రక్తం కారిందని, అందుకే ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లానని జిమ్ ట్రైనర్‌గా పనిచేసే ఒక వ్యక్తి పోలీసులకు చెప్పారు.

కానీ, అతను తన భార్య కాళ్లూచేతులు కట్టేసి ఒక క్లాత్‌తో ఆమె గొంతు నులిమేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. తర్వాత అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు.

ఈ కేసులో నిందితుడు జిమ్ నడుపుతారని, అతని భార్య ఒక ప్లే స్కూల్ నిర్వహిస్తారని పోలీసులు వెల్లడించారు.

కట్నం కోసం తమ కూతుర్ని అల్లుడు వేధించేవారని, దీనివల్లే వారిద్దరి మధ్య తరచుగా గొడవలు జరుగుతుండేవని మహిళ తండ్రి ఆరోపించారు. వారికి ఇద్దరు పిల్లలు.

బీడీఎస్‌ఎం సమయంలోనే అనుకోకుండా చనిపోయారంటూ నిందితులు పేర్కొన్న కేసులు ప్రపంచవ్యాప్తంగా చాలా నమోదయ్యాయి. కానీ, వారు అబద్ధం చెబుతున్నట్లుగా తర్వాత పోలీస్ విచారణలో తేలుతుంది.

ఇలాంటి కేసులను 'ఫిఫ్టీ షేడ్స్ డిఫెన్స్' అని పిలుస్తుంటారు.

భారత్‌లో హత్యా కేసులను సాధారణంగా డబ్బు, గృహ హింస, కట్నం కోసం వేధింపులు వంటి విభాగాల్లో చేర్చుతారు. బీడీఎస్‌ఎం ప్రతిపాదికన చూడరు.

చాలా కేసుల్లో దర్యాప్తు సమయంలో ఈ అంశం బయటకు వస్తుంది.

బీడీఎస్ఎం అసహజమని, సురక్షితం కాదని మానిసిక ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)