You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
వాలా-2 మూవీ రివ్యూ: ‘నవ్వుతూ చూస్తాం.. బరువుగా బయటకొస్తాం’
- రచయిత, జీఆర్ మహర్షి
- హోదా, బీబీసీ కోసం
- చదివే సమయం: 3 నిమిషాలు
వాలా-2.. ఇదొక మలయాళ డబ్బింగ్ సినిమా.
అక్కడ రూ. 200 కోట్లు వసూలు చేసి సంచలనం సృష్టించింది. శంకర వరప్రసాద్ నిర్మాత సాహూ గారపాటి దీన్ని తెలుగులో తెచ్చారు. ఏమిటి ఈ సినిమా ప్రత్యేకత?
మలయాళంలో వాళ అంటే అరటి చెట్టు. కేరళలో వాళ అనే పదాన్ని ఒక తిట్టుగా లేదా ఎగతాళి చేయడానికి కూడా వాడుతుంటారు.
అంటే, పిల్లలు ఏ పని చేయకుండా సోమరిగా ఉంటే, ''నిన్ను కనడం కంటే అరటి చెట్టుని (వాళ) పెంచినా బావుండేది' అనే నానుడిని వాడతారు. ఈ సినిమా ఇతివృత్తం కూడా అదే. వాళ అనే పదం తెలుగులోకి వచ్చేసరికి 'వాలా'గా మారింది.
ఫస్ట్ పార్ట్ సూపర్‌హిట్
వాలా ఫస్ట్ పార్ట్ గతంలో సూపర్‌హిట్. ఎందుకు చదువుతున్నారో, చదివి ఏం చేయాలో తెలియని లక్షల మంది యువతరం కథ అని ఫస్ట్ పార్ట్ పరిచయంలో చెబుతారు. అది యూత్ ఎంటర్టైనర్గా అందరినీ ఆకర్షించింది.
పార్ట్-2లో వినోదంతో పాటు ఉద్వేగాలు కూడా ఉన్నాయి.
సింఫుల్‌గా కథ ఏంటంటే... హషీర్, అలన్, వినాయక్, అజిన్ నలుగురూ చిన్నప్పటి నుంచి ప్రాణ స్నేహితులు. కాలేజీ రోజుల్లో వీళ్ల అల్లరి, ప్రేమలు, బ్రేకప్‌లు, పోలీస్ కేసులతో ఫస్టాఫ్ నడుస్తుంది. వీళ్లు విదేశాలకు వెళ్లి స్థిరపడాలని అనుకోవడం, అక్కడ వీళ్ల ఇబ్బందులన్నీ రెండో భాగంలో ఉంటాయి.
తెలీకుండానే కళ్లు తడుస్తాయి..
ఫస్టాఫ్‌లో ఎంత నవ్వుతామో, సెకండాఫ్‌లో అంత ఎమోషన్ ఫీలవుతాం. తెలియకుండానే కళ్లు తడుస్తుంటాయి.
దీనికి కారణం మనం పెద్దవాళ్లమైతే.. తెరపై మన పిల్లలు కనిపిస్తుంటారు. యూత్ అయితే మన ప్రతిబింబాలు కనిపిస్తుంటాయి.
అందరూ మధ్య తరగతి లేదా దిగువ మధ్య తరగతి వ్యక్తులు. పిల్లల్ని చదివించడానికి అప్పులు చేస్తారు, కష్టపడతారు.
హషీర్ని తల్లి కష్టపడి పెంచుతుంది. వినాయక్‌కి తల్లి ఉండదు. తండ్రి పెంపకం.
పిల్లల ప్రవర్తనకి కాలేజీ ప్రిన్సిపల్ ముందు పదేపదే తల్లిదండ్రులు తలదించుకోవడం, ఒక దశలో పోలీస్టేషన్‌కి వెళ్లాల్సి రావడం.. ఈ బాధల్ని పిల్లలు అర్థం చేసుకోలేక సినిమాలు, ఫోన్లు, బైక్‌లు, మందు పార్టీలని తిరగడం. ఇదంతా మెజార్టీ కుటుంబాల్లో కనిపించే కథ.
రొటీన్‌కు భిన్నం..
రొటీన్ ఫార్ములా సినిమాలకి ఇది విరుద్ధం. రచయిత విపిన్దాస్ గొప్పతనం ఇది. దర్శకుడు సావి ఎంత సహజంగా తీశాడంటే ఆ పిల్లలు మన పక్కింటి కుర్రాళ్లలా కనిపిస్తుంటారు.
కథలో ఎక్కడా బలమైన ట్విస్టులు, బరువైన సన్నివేశాలు ఉండవు.
కాలేజీ రోజులు, డ్రగ్స్ వాడకం, పేరెంటింగ్, ప్రేమకథలు సినిమాలో అలా వచ్చి వెళుతుంటాయి. నవ్వుతూ ఉంటాం.. ఎక్కడో బరువుగా తగులుతుంటుంది.
రెగ్యులర్ సమీక్షలకి కూడా ఇది ఇమడదు. ఇది కొత్త తరం సినిమా. జెన్ జీకి బాగా కనెక్ట్ అవుతుంది.
థియేటర్ అంతా కుర్రాళ్ల కోలాహలమే దీనికి నిదర్శనం.
భారతీయ సినిమా రంగాన్ని మలయాళ కథలు మార్చబోతున్నాయని అనడానికి వాలా-2 ఒక ఉదాహరణ.
రాబోయే రోజుల్లో రొటీన్ ఫార్ములా కథలు పాత తుక్కుగా మారబోతున్నాయి.
క్యారెక్టర్లలో విశేషం ఏంటంటే..
ప్లస్ పాయింట్స్: నటనతో పాటు అన్ని విభాగాలు
మైనస్ పాయింట్స్: వెతకడం కష్టం
ఫైనల్‌గా ఇలాంటి సినిమాలు పదేపదే రావు. అందరూ చూడాల్సిన సినిమా. ఆశ్చర్యం ఏమంటే డబ్బింగ్ కూడా అతి శ్రద్ధగా చేశారు. తెలుగు ప్రేక్షకులకి కనెక్ట్ అయ్యేలా మార్పులు చేసుకున్నారు. నటుల ఒరిజినల్ పేర్లు, సినిమా పేర్లు ఒకటే కావడం విశేషం.
(నోట్: అభిప్రాయాలు రచయిత వ్యక్తిగతం)
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)