You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
అనంతపురంలో దళితుడిని ఎస్సై కొడుతున్నట్లుగా వీడియో వైరల్.. అక్కడ అసలు ఏం జరిగింది?
- రచయిత, తులసీ ప్రసాద్ రెడ్డి
- హోదా, బీబీసీ కోసం
- చదివే సమయం: 5 నిమిషాలు
అనంతపురం జిల్లాలో ఒక యువకుడిని ఎస్సై కొడుతున్నట్లుగా కనిపించిన వీడియో ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
పోలీస్ యూనిఫారాలు ధరించిన ఇద్దరు, సివిల్ డ్రెస్సులో ఉన్న మరో వ్యక్తి ఆ యువకుడిని అదిమి పట్టుకోగా, ఎస్సై ఆంజనేయులు అతని పాదాలపై కర్రతో కొడుతున్నట్లుగా ఆ వీడియోలో కనిపిస్తోంది.
ఆ సమయంలో చుట్టూ జనం ఉన్నారు.
గడ్డివాములకు నిప్పుపెట్టాడనే ఆరోపణలతో ఒక వ్యక్తిని ఎస్సై విచక్షణారహితంగా కొడుతున్నారంటూ చాలామంది ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
ఆ వీడియోలో కనిపిస్తున్న వ్యక్తి ఎవరు? అక్కడ అసలు ఏం జరిగిందో తెలుసుకునేందుకు బీబీసీ ప్రయత్నించింది.
అనంతపురం జిల్లాలోని పెద్దవడుగూరులో ఉన్న పోలీస్ స్టేషన్ ఆవరణలో ఏప్రిల్ 19న ఈ ఘటన జరిగింది.
దీని గురించి స్థానికులతో పాటు పోలీసులతో కూడా బీబీసీ మాట్లాడింది.
దెబ్బలు తిన్న వ్యక్తి పేరు పాండురంగడు అలియాస్ సుధాకర్ అని, ఆయన ఒక దళితుడని స్థానికులు, దళిత సంఘాలు చెప్పాయి.
'సీసీ కెమెరాలకు చిక్కాడు'
'నిందితుడిది గుంతకల్లు మండలం నాగసముద్రం. ఆయన బంధువులు పెద్దవడుగూరులో ఉండటంతో అతను ఇక్కడే ఉంటూ గత పది రోజులుగా చుట్టుపక్కల చాలా గడ్డివాములను తగలబెట్టాడు' అని స్థానికులు చెబుతున్నారు.
నిర్మాణంలో ఉన్న గోశాల దగ్గర ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో రికార్డయిన ఫుటేజీ ద్వారా నిందితుడిని గుర్తించి పోలీసులు అదుపులోకి తీసుకున్నారని పెద్దవడుగూరుకు చెందిన రామేశ్వర్ రెడ్డి బీబీసీకి చెప్పారు.
''ఏప్రిల్ 19న మేం భోజనానికి వెళ్లినపుడు, వచ్చి మా గడ్డివాముకు నిప్పుపెట్టాడు. మేం వచ్చేసరికే అదంతా కాలిపోయింది. కెమెరా సౌండ్ విని పోలీసుల సైరన్ అనుకుని పారిపోయాడు. అతని మానసిక పరిస్థితి ఏంటో మాకు తెలియదు. ఇంతకు ముందు నాగసముద్రంలో కూడా గడ్డి వాములు తగలబెట్టడంతో అక్కడినుంచి అతన్ని తరిమేశారట' అని రామేశ్వర్ రెడ్డి వివరించారు.
గత పది రోజులుగా ఊళ్లో గడ్డివాములు తగలబడుతుంటే, ఆ పని ఎవరు చేస్తున్నారో అంతుపట్టక రాత్రంతా అందరూ మేల్కొని ఉండేవాళ్లని అదే గ్రామానికి చెందిన అజయ్ కుమార్ రెడ్డి అన్నారు.
'గ్రామంలో ఎవరికీ శత్రుత్వాలు, రాజకీయాలు లేవు. 35 ఏళ్ల నుంచి ఇక్కడే ఉంటున్నాం. ఎప్పుడూ ఇలా జరగలేదు. ఏప్రిల్ 15న రాత్రి మా గడ్డివాము కాలిపోయింది. అంతకు ముందు మా చిన్నాన్న వాళ్ల దానికి నిప్పు పెట్టాడు. తర్వాత గోశాల దగ్గర గడ్డివాముకు నిప్పు పెడుతూ కెమెరాలకు చిక్కాడు' అని ఆయన తెలిపారు.
గుంతకల్లు నుంచి ఫైరింజన్లు వచ్చే లోగా జరగాల్సిన నష్టమంతా జరిగిపోతోందని, తమ మండలంలో అగ్నిమాపక యంత్రాలు లేవని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
నిందితుడు సుధాకర్‌ను బయటకు రాకుండా చూడాలని, బయటకు వస్తే మళ్లీ గడ్డివాములు దహనం చేసే ప్రమాదం ఉందని ఆ గ్రామానికి చెందిన అనంత్ రెడ్డి బీబీసీతో అన్నారు.
గతంలో ఇక్కడ ఫ్యాక్షన్ ఉండడంతో మా శత్రువులు చేశారేమోనన్న సందేహాలు కూడా వచ్చాయని పెద్దవడుగూరుకు చెందిన చంద్రశేఖర్ చెప్పారు.
వైరల్ వీడియోకు ముందు ఏం జరిగింది?
వైరల్ వీడియోలో ఎస్సై, నిందితుడి పాదాలపై కొట్టడానికి ముందు ఏం జరిగిందో కూడా చంద్రశేఖర్ బీబీసీకి వివరించారు.
''నిందితుడిని స్టేషన్‌కు తీసుకొచ్చినప్పుడు వందలమంది రైతులు స్టేషన్‌ను చుట్టుముట్టారు. అతన్ని మాకు వదిలేయాలంటూ రైతులు ఉద్రిక్త పరిస్థితులు సృష్టించారు. దీంతో ఎస్సై ఆంజనేయులు నిందితుణ్ని అలా కొట్టారు. ఆయన కొట్టకపోయి ఉంటే, రైతులు తీవ్ర చర్యలకు పాల్పడి ఉండేవాళ్లు' అని ఆయన వెల్లడించారు.
దళితుడిని ఎస్సై విచక్షణారహితంగా కొట్టారని వస్తున్న ఆరోపణలపై కూడా గ్రామస్థులు స్పందించారు.
నిందితుడిని పట్టుకోవడంతో పాటు ఆగ్రహంలో రైతులు గీత దాటకుండా నిలువరించిన ఎస్సైకి తాము మద్దతుగా నిలుస్తామని చంద్రశేఖర్ చెప్పారు.
''మా గ్రామంలో జరిగిన ఈ ఘటనకు కులాలకు, మతాలకు, రాజకీయాలకు సంబంధం లేదు. నిందితుడిని కొట్టిన ఎస్సైను విధుల నుంచి తొలగించాలని ఎస్సీ కమిషన్ ఫిర్యాదు చేసినట్లు మాకు తెలిసింది. మా పెద్దవడుగూరు మండలంలో ఉన్న రైతులు, ప్రజలు అందరూ ఎస్సై ఆంజనేయులుకు మా మద్దతు తెలుపుతున్నాం'' అని ఆయన అన్నారు.
దళిత సంఘాలు, పోలీసులు ఏమన్నారు.?
ఈ ఘటనపై దళిత సంఘాలు భిన్నంగా స్పందించాయి.
ఎస్సై చర్యను స్థానిక దళిత సంఘాలు సమర్థిస్తుంటే, రాష్ట్ర స్థాయిలోని సంఘాలు ఖండిస్తున్నాయి.
‘‘ఆగ్రహంగా ఉన్న రైతులు వెనుదిరగాలనే ఉద్దేశంతో ఎస్సై అతనిని అక్కడ కూర్చోపెట్టి నాలుగైదు దెబ్బలు కొట్టారు. అతడిని కొడుతున్నప్పుడు అతడు దళితుడా, బీసీనా, ఎస్సీనా, ఓసీనా అనేది ఎస్సైకి తెలియదు’’ అని స్థానిక ఎంఆర్పీఎస్ నాయకులు రామాంజనేయులు అన్నారు.
నిందితుడు తప్పు చేసి ఉంటే చట్టప్రకారం శిక్షించాలని, కానీ ఒక దళితుడిని ఇలా బహిరంగంగా కొట్టడం సరికాదని మాజీ ఎమ్మెల్సీ, వైసీపీ అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకర్ రావు బీబీసీతో అన్నారు.
'నిందితుడు ఎస్సీ కులానికి చెందినవారు. తప్పు చేసి ఉంటే అరెస్ట్ చేసి కోర్టుకు తీసుకెళ్లాలి. చట్టాన్ని ఇలా చేతుల్లోకి తీసుకోకూడదు. దళితులపైన ఈ విధమైన దాడులు కరెక్టు కాదు'' అని ఆయన అన్నారు.
ఈ అంశంపై స్పందన కోసం ఎస్సై ఆంజనేయులుతో మాట్లాడేందుకు బీబీసీ ప్రయత్నించింది. ఈ కేసు విచారణలో ఉన్నందున మాట్లాడటానికి ఆయన నిరాకరించారు.
మరోవైపు నిందితుడు సుధాకర్ రిమాండులో ఉండటంతో బీబీసీ మాట్లాడలేకపోయింది. అతడి కుటుంబ సభ్యులు కూడా అందుబాటులోకి రాలేదు. సుధాకర్ తమ్ముడిని ఫోన్లో సంప్రదించేందుకు బీబీసీ ప్రయత్నించింది. కానీ, ఆయన ఫోన్ ఎత్తలేదు. పెదవడుగూరు ఎస్సీ కాలనీలోని సుధాకర్ బంధువులు కూడా మాట్లాడానికి ఇష్టపడలేదు.
ఈనెల 20న అనంతపురం పర్యటనలో ఉన్న ఎస్సీ కమిషన్ చైర్మన్ జవహర్, జిల్లా ఎస్పీతో మాట్లాడారు. ఘటనపై విచారణ చేపట్టాలని కోరారు.
విచారణ నివేదిక అందిన తర్వాత బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ పి. జగదీశ్ స్పష్టం చేశారు.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)