ఇరాన్ యుద్ధంతో ఆగిన మ్యాంగో పల్ప్ ఎగుమతులు.. ఉమ్మడి చిత్తూరు జిల్లా రైతుల ఇబ్బందులు

    • రచయిత, తులసీ ప్రసాద్ రెడ్డి
    • హోదా, బీబీసీ కోసం
  • చదివే సమయం: 9 నిమిషాలు

ఇరాన్ యుద్ధం ప్రభావం ఏపీలోని మ్యాంగో పల్ప్ ఇండస్ట్రీ మీద కనిపిస్తోంది.

మిడిల్ ఈస్ట్‌లో పరిస్థితులు చక్కబడి, ఏడాదికాలంగా పరిశ్రమల్లోనే నిల్వ ఉన్న పల్ప్ ఎగుమతులు జరిగితే తప్ప తాము కోలుకోవడం కష్టమని ఉమ్మడి చిత్తూరు జిల్లా మామిడి రైతులు చెబుతున్నారు.

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో సుమారు 40 మామిడి గుజ్జు పరిశ్రమలు (మ్యాంగో పల్ప్ ఇండస్ట్రీస్) ఉన్నాయి.

ఈ ఏడాది పల్ప్ ఎగుమతులు మొదలుకాకపోతే కాయలు చెట్లకిందే వదిలేయాల్సిన పరిస్థితి వస్తుందని పూతలపట్టు మండలంలోని తేనెపల్లి మామిడి రైతు కుమారస్వామి రెడ్డి చెప్పారు.

''రైతుల పరిస్థితి ఇప్పటివరకు ఎంతో కొంత రేటు వస్తోందిలే అనేలా ఉండేది. ఇంకా రెండు నెలలు టైం ఉంది. పరిస్థితులు చక్కబడితే మళ్లీ ఎగుమతులు మొదలవ్వొచ్చు. లేదంటే మా పరిస్థితి దారుణంగా ఉంటుంది. రేటు పడిపోయి, కొనకపోతే, చెట్ల కింద వదిలేయాల్సిన పరిస్థితి వస్తుంది. గతేడాది సగం పోయింది. ఈ ఏడాది కూడా అలాగే జరిగితే మరింత నష్టం తప్పదు'' అన్నారు కుమారస్వామి రెడ్డి.

పెట్టుబడి, కూలీల ఖర్చు, ఎరువుల ధరలు అన్నీ పెరిగిపోయాయని కనీస ధరకు అమ్మితే తప్ప రైతులు బతికే పరిస్థితి లేదని పాలకూరుకు చెందిన మామిడి రైతు జ్ఞాన శేఖర్ రెడ్డి చెప్పారు.

''టన్ను మామిడి కనీసం రూ. 20 వేలకు అమ్మితే గిట్టుబాటు అవుతుంది. లేబర్ కాస్ట్ పెరిగింది, ఎరువులు పెరిగిపోయాయి. గతంలో రూ. 2 వేలు ఖర్చయ్యే చోట ఇప్పుడు రూ.3 వేలు ఖర్చవుతోంది. ఆ భారం అంతా మాపైనే పడుతుంది. ఫ్యాక్టరీ వాళ్ళు ఇప్పుడే వద్దు అంటున్నారు. దీనిపైన ఆధారపడిన మేం ఏం చేయాలి. ప్రభుత్వమే ఏమైనా చేయాలి. కాయలు పందులకు వేయాల్సిందే. నిల్వ చేసే అవకాశం కూడా లేదు. వాటి టైమ్ వస్తే, పండిపోతే రాలి చెట్ల కింద పడిపోతాయి. ఫ్యాక్టరీలు బీగమేస్తే(తాళాలు వేసుకుంటే) వదిలేయాలి'' అని ఆయన అన్నారు.

పల్ప్ పరిశ్రమల యజమానులు ఏమంటున్నారు?

మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తతల కారణంగా గతేడాది తయారైన పల్ప్ ఇంకా ఎగుమతి కాకుండా గోడౌన్లోనే ఉందని పరిశ్రమల యజమానులు అంటున్నారు.

నిరుడు ఇచ్చిన ఆర్డర్లకు ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ఎగుమతులు జరగాల్సి ఉండగా.. వెళ్లిన కొన్ని నౌకలు సముద్రంలోనే నిలిచిపోయాయని చెబుతున్నారు.

ఇరాన్ యుద్ధం వల్ల ఇప్పటికే చాలా ఉత్పత్తి ఎగుమతి కాకుండా ఆగిపోయిందని, తక్షణం యుద్ధం ఆగకపోతే వచ్చే సీజన్‌పై ఆ ప్రభావం తీవ్రంగా ఉంటుందని ‘నేచురల్ ఫ్రూట్స్ అండ్ ఫేషియల్స్’ ఎండీ తరుణ్ రెడ్డి బీబీసీతో అన్నారు.

''యుద్ధం మొదలవక ముందు పంపించిన పల్ప్ ప్రొడక్ట్ ఇంకా శ్రీలంకలోని కొలంబో రేవులోనే ఉంది. వాళ్లు అక్కడ దాన్ని ఉంచడానికి చార్జీలు చెల్లించమంటున్నారు. ఆ చార్జీలు కట్టడానికి అక్కడ ఉన్న ఉత్పత్తి విలువ సరిపోదు. ఇప్పుడు మా పరిస్థితి ఎలా ఉందంటే, యుద్ధం తక్షణం ఆగకపోతే తప్ప వచ్చే సీజన్‌లో వ్యాపారం నడపలేని పరిస్థితి'' అని ఆయన చెప్పారు.

ఉన్న ఉత్పత్తి అమ్ముడైతే తప్ప ధైర్యంగా పల్ప్ ప్రొడక్షన్‌కు ముందుకు రాలేమని ఆయన చెప్పారు.

''ఈ యుద్దం వల్ల మేం ప్రొడక్షన్ చేయడానికి ముందుకు రాలేకపోతున్నాం. ఇప్పటికే పెట్టిన పెట్టుబడులన్నీ నిలిచిపోయాయి. మా గోడౌన్లతోపాటూ, వేరే గోడౌన్లలో పల్ప్ ఉత్పత్తి నిల్వ ఉంది. అవి అమ్ముడైతే తప్ప మేం మళ్లీ పెట్టుబడి పెట్టి ప్రొడక్షన్ చేయలేం. బ్యాంకర్స్, గవర్నమెంట్ ఏదైనా మద్దతిస్తే ఉత్పత్తి చేసినా, మళ్లీ అమ్ముకోవాలంటే భయం ఉంటుంది కదా. కచ్చితంగా పెద్ద ప్రభావం ఉండబోతోంది'' అని తరుణ్ రెడ్డి చెప్పారు.

‘గంట పాటు కరెంట్ పోతే కనీసం 120 -200 లీటర్ల డీజిల్ ఖర్చవుతుంది’

''ఎగుమతి దారులు ఉత్పత్తి తీసుకోవడం లేదని, సంప్రదించడానికి ప్రయత్నిస్తున్నా స్పందించడం లేదని తరుణ్ రెడ్డి చెప్పారు.

యుద్ధం ప్రభావం వల్ల కన్ఫర్మ్ అయిన ఆర్డర్స్ కూడా క్యాన్సిల్ చేసేస్తున్నారని, భవిష్యత్తులో డీజిల్ వల్ల కూడా సమస్య రావచ్చని తెలిపారు.

''మావి భారీ విద్యుత్ వినియోగం ఉండే యూనిట్లు. పల్ప్ పరిశ్రమలకు ఒక గంట కరెంట్ కట్ అయినా ఆ గంటలో 120 నుంచి 200 లీటర్ల డీజిల్ ఖర్చు అవుతుంది. మాకు రోజుకు రెండు మూడు గంటలు పవర్ కట్ ఉంటుంది. పవర్ కట్ అయినప్పుడు ఫ్యూయల్ దొరక్కపోతే దానివల్ల కూడా దీనిపై ప్రభావం పడుతుంది. పెట్రోల్ బంకులకు వెళ్తే ఎక్కువ మొత్తంలో ఇవ్వం అంటున్నారు. మాకు ఒక రోజుకు మూడు నాలుగు గంటలు జనరేటర్ రన్ చేయాలన్నా 400 నుంచి 500 లీటర్ల డీజిల్ కావాలి. యుద్ధం ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో డీజిల్ కూడా దొరకదు కదా. అలా మరింత సమస్య అవుతుంది'' అని తరుణ్ రెడ్డి అంటున్నారు.

హార్ముజ్‌ దగ్గరే నిలిచిన నౌకలు

యుద్ధం వల్ల పల్ప్ ఎగుమతుల మీద ఎలాంటి ప్రభావం పడిందో ఆల్ ఇండియా ఫుడ్ ప్రాసెస్ అసోసియేషన్, న్యూదిల్లీ సౌత్ జోన్ చైర్మన్ కట్టమంచి గోవర్ధన బాబి వివరించారు.

''మనం తయారుచేసే గుజ్జులో 80 శాతం వరకు పూర్తిగా ఎగుమతి చేస్తాం. సాధారణంగా భారత్ నుంచి ఎగుమతి అయ్యే మామిడి గుజ్జు యూరప్, మిడిస్ఈస్ట్ ప్రాంతాలకు ఎక్కువగా వెళ్తుంది. మిడిల్‌ఈస్ట్ ఇండియాకు దగ్గర కాబట్టి రవాణాకు తక్కువ సమయం పడుతుంది. ఫిబ్రవరి చివర్లో లేదా మార్చి ప్రారంభం నుంచి గమ్యస్థానాలకు చేరుస్తుంటాం'' అని ఆయన అన్నారు.

''యుద్ధం కారణంగా నౌకలు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. కొన్ని సముద్రంలో ఉన్నాయి. మరికొన్ని హార్ముజ్ జలసంధి దగ్గర ఉన్నాయి. ఇంకొన్ని మధ్యప్రాచ్యంలో పోర్టులకు కూడా వెళ్లాయి. కానీ అక్కడ వాళ్లు దిగుమతి చేసుకునే పరిస్థితిలో లేరు. రేవులు ధ్వంసం కావడంతో అక్కడా కొన్ని నౌకలు ఆగిపోయాయి. అది కాకుండా మనం ఇంకా ఎగుమతి చేయాల్సిన పల్ప్‌లో దాదాపు లక్ష టన్నులు పూర్తిగా ఆగిపోయింది. దానిని ఎక్కడికీ ఎగుమతి చేయకుండా గోడౌన్లలోనే ఉంచాం'' అని గోవర్ధన బాబి చెప్పారు.

''వార్ రిస్క్ అని కొత్తగా షిప్పింగ్ కంపెనీ వాళ్ళు మాకు మెసేజ్‌లు పెట్టారు. సముద్రంలో నిలిచిపోయిన మీ ఒక్కో కంటైనర్‌కి దాదాపు రెండు వేల డాలర్లు చెల్లించాలని చెప్పారు. ఆ చార్జీలు మేం చెల్లించే పరిస్థితుల్లో లేం. ఇప్పుడున్న ఇంటర్నేషనల్ మార్కెట్ ప్రకారం ఒక కంటైనర్‌‌పై పదివేల రూపాయల నుంచి ఇరవైవేల రూపాయల వరకు లాభం వచ్చినా చాలు అని ఎగుమతులు చేస్తున్నాం. కొన్నిసార్లు నష్టం కూడా వచ్చింది. అలాంటి పరిస్థితుల్లో 2 లక్షల రూపాయలు ఇచ్చే పరిస్థితుల్లో మేం లేం. అందుకే ఎగుమతి చేసే పరిస్థితి లేదు'' అని ఆయన చెప్పారు.

ఫ్యాక్టరీ తెరిచే పరిస్థితి లేదు

మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు తగ్గి వెంటనే ఆర్డర్లు వచ్చి, ఏమైనా చేయగలిగితే తప్ప రైతుల దగ్గర మామిడి కొనే పరిస్థితి లేదని గోవర్ధన్ బాబీ చెబుతున్నారు.

''మేం ప్రధానంగా మామిడి పైనే ఆధారపడి ఉంటాం. మామిడి పల్ప్ చేస్తేనే మేం మా ఉద్యోగులకు జీతాలు, కరెంటు చార్జీలు, రుణాలు చెల్లించడం వంటివన్నీ సాధ్యమవుతాయి. రైతులు కూడా మామిడిని ఒకే పంటగా వేస్తారు, అందులో అంతరపంటలేమీ వేయరు. వాళ్లకు మామిడే జీవనాధారం. ఇప్పుడు మామిడిని ఫ్యాక్టరీ వాళ్ళు కొనకపోతే వాళ్లు మళ్లీ ఇబ్బందుల్లో పడతారు. అందుకే మేం మా ప్రయోజనాల కోసం కలిసి ఎలా ముందుకు పోవాలో ఆలోచిస్తున్నాం'' అని ఆయన చెప్పారు.

పరిస్థితులు చక్కబడితే కనీసం గల్ఫ్ ఆర్డర్స్ లేకపోయినా యూరప్ నుంచి 50 శాతం ఆర్డర్స్ అయినా వస్తాయని గోవర్ధన్ ఆశిస్తున్నారు. ఆల్ఫోన్సో మామిడిని ప్రధాన కొనుగోలుదారు అయిన ఇరాన్‌కు ఎగుమతులు నిలిచిపోయాయన్నారు.

ఫిబ్రవరి 15 నుంచి ఎగుమతులు జీరో

ఫిబ్రవరి 15 నుంచి ఇప్పటివరకూ ఎగుమతులు జీరో అయ్యాయని ప్రెష్ ఫుడ్స్ డైరెక్టర్ చంద్రబాబు చెప్పారు.

''ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని 80 నుంచి 90 శాతం పరిశ్రమలు వర్క్ ఆర్డర్‌పైనే ఆధారపడతాయి.. మాకు ఆర్డర్ వస్తేనే మేం పల్ప్ చేస్తాం. ఏటా మార్చిలో ఈ ఒప్పందాలు జరుగుతాయి. ఈ ఏడాది ఒక్కరు కూడా ఆర్డర్ కన్ఫర్మ్ చేయలేదు. మా ప్లాంట్ మ్యాంగో పల్ప్ కెపాసిటీ 10 వేల టన్నులు. ప్రస్తుతం 2000 టన్నుల ఆర్డర్ ఉంది. 8000 టన్నుల లాస్‌లో ఉన్నాం. ఎప్పుడు కన్ఫర్మ్ చేస్తారో కూడా తెలియదు. మాకు ఎప్పుడు ఫోన్ వస్తుందా ఎప్పుడు కంటైనర్లు వస్తాయా? ఎప్పుడు పల్ప్ పంపిద్దామా అని ఎదురుచూస్తున్నాం. రెండు నెలలుగా ఇదే పరిస్థితి'' అని ఆయన చెప్పారు.

పరిశ్రమలు పల్ప్ కొనకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వమే ఏవైనా చర్యలు చేపట్టి మామిడి రైతులను ఆదుకోవాలని మామిడి రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మునీశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు.

''ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలి. టీటీడీకి గానీ, రాష్ట్రంలోని పెద్ద పెద్ద ఆలయాలకు, యాత్రికులకు, భక్తులకు మ్యాంగో పల్ప్ సప్లై చేయాలని డిమాండ్ పెట్టాం. గత సంవత్సరం రేట్లు లేకపోగా పెట్టిన పెట్టుబడి కూడా రాకపోవడంతో జిల్లాలోని రైతులు దాదాపు 50 సంవత్సరాలు సాగు చేసిన మామిడి చెట్లని కొట్టేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఒక కమిటీ వేసి పెట్టి రైతులకు కనీస మద్దతు ధర అందేలా చూడాలి'' అని అన్నారు.

అధికారులేమంటున్నారు?

మామిడి రైతులు, పల్ప్ తయారీ పరిశ్రమలు, ఎగుమతి సమస్యలపై మాట్లాడేందుకు చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్‌ను బీబీసీ సంప్రదించింది.

'దీనికి సంబంధించి పూర్తిస్థాయి సమాచారం నా దగ్గర లేదు. దీనిపైన స్టడీ చేస్తాం' అని కలెక్టర్ చెప్పారు.

చిత్తూరు జిల్లా హార్టికల్చర్ అధికారి రామాంజనేయులతో బీబీసీ పలుమార్లు మాట్లాడింది. అయితే దీనిపైన సమాచారం సేకరించాల్సి ఉందని.. ప్రస్తుతం తాను క్యాంపులో ఉన్నానని, సమాచారం తెలుసుకొని తెలియజేస్తానని ఆయన అన్నారు.

మ్యాంగో పల్ప్ ఉత్పత్తి, ఎగుమతులు

2024 – 2025 సీజన్లో భారత్‌లో మొత్తం మామిడి ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ వాటా 21.55 శాతం.

మ్యాంగో పల్ప్ ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ కంటే ఉత్తరప్రదేశ్ పైనుంది. ఈ రెండు రాష్ట్రాలూ కలిసి దేశ ఉత్పత్తిలో దాదాపు సగం పండిస్తున్నాయని అగ్రికల్చరల్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్ పోర్ట్స్ డెవలప్‌మెంట్ అథారిటీ (ఏపీఈడీఏ) వివరాలు చెబుతున్నాయి.

ఏపీఈడీఏ వివరాల ప్రకారం దేశంలో మ్యాంగో పల్ప్ ఇండస్ట్రీకి రెండు ప్రధాన క్లస్టర్లు ఉన్నాయి. వాటిలో ఒకటి తమిళనాడులోని కృష్ణగిరి జిల్లాలో ఉండగా, రెండోది ఆంధ్రప్రదేశ్‌లోని ఉమ్మడి చిత్తూరు జిల్లా.

మ్యాంగో పల్ప్ ఉత్పత్తి, ఎగుమతులకు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో సుమారు 40 మామిడి పల్ప్ ఇండస్ట్రీస్ ఉన్నాయి.

2024-25లో ఇండియా నుంచి 63, 253 టన్నుల మ్యాంగో పల్ప్ ఎగుమతులు జరగగా, దాని ద్వారా 8 కోట్ల డాలర్ల ఆదాయం లభించిందని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ కమర్షియల్ ఇంటెలిజెన్స్ అండ్ స్టాటిస్టిక్స్ డీజీసీఐఎస్ లెక్కలు చెబుతున్నాయి.

ఉమ్మడి చిత్తూరు జిల్లాతో పాటూ రాయల సీమలోని కొన్ని ప్రాంతాలు, నూజివీడు, తమిళనాడు, కర్ణాటకలలో రైతులు భారీగా మామిడి సాగు చేస్తారు.

ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని పరిశ్రమలు ఈ మామిడిని కొనుగోలు చేసి, ప్రాసెస్ చేసి పల్ప్‌గా మార్చి గల్ప్, యూరప్ దేశాలకు ఎగుమతి చేస్తుంటాయి. మే, జూన్, జూలైలలో ఈ ప్రాసెసింగ్ కొనసాగుతుంది. పరిశ్రమల్లో తయారైన పల్ప్‌ను గోడౌన్లలో నిల్వ చేసి ఆర్డర్ల ప్రకారం ఎగుమతులు చేస్తుంటారు.

ప్రధానంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాల్లో పండించే అల్ఫోన్సో, తోతాపురి రకం మామిడిని పల్ప్ పరిశ్రమల్లో ప్రాసెసింగ్ చేస్తున్నారు. ఈ మామిడి గుజ్జులో అల్ఫోన్సో రకం పల్ప్ యూఏఈకి ఎగుమతి అవుతుండగా, తోతాపురి రకం పల్ప్ సౌదీ అరేబియాతో పాటూ మిగతా గల్ఫ్ దేశాలకు ఎగుమతి అవుతోందని ఫిట్ ట్రీ ఇంటర్నేషనల్ వెబ్‌సైట్‌ వివరాలు చెబుతున్నాయి.

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)