You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఇరాన్ తీరంపై అమెరికా దిగ్బంధనం ప్రారంభం- ఆహారం, మందులకు మినహాయింపు
ఇరాన్ తీరప్రాంతం మొత్తాన్ని చుట్టుముట్టేలా అమెరికా నౌకాదళం దిగ్బంధిస్తోందని రాయిటర్స్ వార్తా సంస్థ రిపోర్ట్ చేసింది.
అయితే, ఆహారం, వైద్య సామగ్రి వంటి మానవతా దృక్పథంతో పంపే సరకులను తనిఖీ చేసిన తర్వాత మాత్రమే అనుమతిస్తామని అమెరికా సెంట్రల్ కమాండ్ (సెంటకామ్) స్పష్టం చేసినట్లు తెలిపింది.
ఇరాన్ పోర్టులు, ఆయిల్ టెర్మినల్స్ అన్నీ ఈ దిగ్బంధన పరిధిలోకి వస్తాయని నావికులకు పంపిన నోట్‌లో పేర్కొన్నట్లు రాయిటర్స్ వెల్లడించింది.
హార్ముజ్ జలసంధికి తూర్పున ఉన్న అరేబియా సముద్ర ప్రాంతం, ఒమన్ గల్ఫ్‌లో నౌకలను అమెరికా దిగ్బంధించనున్నట్లు రాయిటర్స్ తెలిపింది.
ఏ దేశ పతాకంతో ప్రయాణిస్తున్నా సరే, ఈ పరిధిలోకి వచ్చే అన్ని నౌకలకు ఈ నిబంధనలు వర్తిస్తాయని అమెరికా సెంట్రల్ కమాండ్ (సెంటకామ్) నావికులకు పంపిన నోట్‌లో పేర్కొన్నట్లు తెలిపింది.
అనుమతి లేకుండా దిగ్బంధన ప్రాంతంలోకి ప్రవేశించే లేదా బయటకు వెళ్లే నౌకలను అడ్డుకోవడం, మళ్లించడం లేదా స్వాధీనం చేసుకోవడంలాంటివి చేస్తామని సెంటకామ్ విడుదల చేసిన నోట్‌లో హెచ్చరించింది.
ఆ నోట్ ప్రకారం ఈ దిగ్బంధనం మధ్యాహ్నం గం.2కు (గ్రీనిచ్ కాలమానం) ప్రారంభమవుతుంది. (భారత కాలమానం ప్రకారం సోమవారం సాయంత్రం 7:30 గం.లకు)
ఇప్పటికే ఈ దిగ్బంధనం అమల్లోకి వచ్చినట్లు రిపోర్టులు వస్తున్నాయి.
ఇజ్రాయెల్ మద్దతు
"ఇరాన్ మినహా ఇతర ప్రాంతాలకు హార్ముజ్ జలసంధి ద్వారా సాగే తటస్థ నౌకాయానానికి ఈ దిగ్బంధనం వల్ల ఎలాంటి ఆటంకం ఉండదు" అని సెంటకామ్ స్పష్టం చేసినట్లు రాయిటర్స్ తెలిపింది.
మరోవైపు, అమెరికా, ఇరాన్ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను పరిష్కరించడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయని పాకిస్తాన్ ప్రధాని షాబాజ్ షరీఫ్ తెలిపారు.
ఏఎఫ్‌పీ వార్తాసంస్థ కథనం ప్రకారం.. తన మంత్రివర్గ సమావేశంలో షరీఫ్ మాట్లాడుతూ, "ప్రస్తుతానికి కాల్పుల విరమణ కొనసాగుతోంది. ఈ సమయంలో కూడా, పెండింగ్‌లో ఉన్న సమస్యల పరిష్కారానికి అన్ని విధాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి" అని పేర్కొన్నారు.
మరోవైపు ఇరాన్ పోర్టులపై అమెరికా విధిస్తున్న ఈ నౌకాదళ దిగ్బంధనానికి ఇజ్రాయెల్ పూర్తి మద్దతు ప్రకటించింది. ట్రంప్ తీసుకున్న ఈ దిగ్బంధన నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తన మంత్రివర్గ సమావేశంలో తెలిపారు.
పాకిస్తాన్ నుంచి తిరిగి వస్తున్న సమయంలో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌తో మాట్లాడినట్లు నెతన్యాహు తెలిపారు.
'ఇరాన్ వద్ద ఉన్న అణ్వాయుధ పదార్థాల తొలగింపే ప్రధానాంశం'గా చర్చలు సాగాయని జేడీ వాన్స్ వెల్లడించినట్లు తెలిపారు. చర్చల గురించి పూర్తి సమాచారం అందించారని పేర్కొన్నారు. అమెరికా, ఇజ్రాయెల్ మధ్య విభేదాలు ఉన్నాయనే వార్తలను నెతన్యాహు కొట్టిపారేశారు.
మేం సిద్ధం: ఇరాన్
అమెరికా హెచ్చరికలపై ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాగేర్ గాలిబాఫ్ స్పందిస్తూ.. తాము బెదిరింపులకు లొంగబోమని, పోరాడటానికి సిద్ధమని ప్రకటించారు.
హార్ముజ్ జలసంధి వైపు వచ్చే సైనిక నౌకలపై కఠినంగా వ్యవహరిస్తామని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కోర్ హెచ్చరించింది.
శాంతి కోసం పోప్ విజ్ఞప్తి
'యుద్ధం అనే పిచ్చి'ని అంతం చేయాలని ప్రపంచ దేశాలకు పోప్ లియో విజ్ఞప్తి చేశారు. అయితే, తాను రాజకీయ నాయకుడిని కాదని, ట్రంప్‌తో వాదించే ఉద్దేశం తనకు లేదని ఆయన స్పష్టం చేశారు.
మరోవైపు, లెబనాన్‌లో ఇరాన్ మద్దతు ఉన్న హిజ్బొల్లా లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి. దక్షిణ లెబనాన్‌లోని బింట్ జ్బైల్ పట్టణాన్ని ఇజ్రాయెల్ దళాలు చుట్టుముట్టాయి.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)