సింధు జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపివేయడం వల్ల పాకిస్తాన్‌కు నష్టమేనా?

ఫొటో సోర్స్, Nasir Kachroo/NurPhoto via Getty Images
- రచయిత, అసద్ సుహైబ్
- హోదా, బీబీసీ ఉర్దూ.కామ్, ఇస్లామాబాద్
- చదివే సమయం: 7 నిమిషాలు
సింధు జలాల ఒప్పందానికి సంబంధించి భారత్ తీసుకున్న ఏకపక్ష నిర్ణయంపై దృష్టి సారించాలని కోరుతూ పాకిస్తాన్ ఐక్యరాజ్యసమితికి లేఖ రాసింది. ఈ ఒప్పందాన్ని నిలిపివేయడం దక్షిణాసియా శాంతి, భద్రతలకు తీవ్ర ప్రభావాలు కలిగించవచ్చని ఆ లేఖలో పేర్కొంది.
పాకిస్తాన్ ఉప ప్రధాన మంత్రి, విదేశాంగ మంత్రి తరపున, ఐక్యరాజ్యసమితిలో పాకిస్తాన్ శాశ్వత ప్రతినిధి అయిన అసిమ్ ఇఫ్తికార్ పోయిన గురువారం ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి అధ్యక్షుడికి ఈ లేఖను సమర్పించారు.
ఈ విషయంపై భారత్ ఇంకా అధికారికంగా స్పందిచలేదు.
గతేడాది జరిగిన పహల్గాం దాడి తర్వాత పాకిస్తాన్‌తో దౌత్య సంబంధాలను పరిమితం చేయడంతో పాటు 1960 నాటి సింధు జల ఒప్పందాన్ని కూడా భారత్ నిలిపివేసింది.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన భారత కేబినెట్ భద్రతా కమిటీ సమావేశంలో సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేసే నిర్ణయం తీసుకున్నారు.

భారత్ ఏడాదికాలంగా సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయడంతో శాంతి, భద్రతలతో పాటు ప్రజల జీవన పరిస్థితులపై కూడా తీవ్ర ప్రభావం పడుతోందని ఐక్యరాజ్యసమితిలోని పాకిస్తాన్ మిషన్ గురువారం ఎక్స్‌లో పోస్ట్ చేసింది.
ఈ ప్రమాదకర పరిస్థితిని భద్రతా మండలి గుర్తించి, సింధు జలాల ఒప్పందాన్ని పునరుద్ధరించాల్సిందిగా భారత్‌ను కోరాలని ఆ లేఖలో విజ్ఞప్తి చేసింది.
ఏడాదిపాటు సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయడం వల్ల పాకిస్తాన్ నష్టపోయిందా?
ఇది భవిష్యత్తులో పాకిస్తానలో నీటి కొరతకు దారితీస్తుందా?
రైతులు, వ్యవసాయంపై ఎలాంటి ప్రభావం చూపుతుంది?

ఫొటో సోర్స్, X/@PakistanUN_NY
పాకిస్తాన్ నష్టపోయిందా?
సింధు జలాల ఒప్పందం ప్రకారం, బియాస్, రావి, సట్లెజ్ నదుల జలాలపై భారత్‌కి హక్కులు లభించాయి. అలాగే పశ్చిమ ప్రాంతంలోని మూడు నదులైన సింధు, చీనాబ్, జీలం నదుల జలాలపై పాకిస్తాన్‌కు హక్కులు లభించాయి. అయితే ఈ మూడు నదుల (సింధు, చీనాబ్ , జీలం) జలాల్లో సుమారు 20 శాతం భారత్‌కూ హక్కు ఉంది.
"ఈ ఒప్పందం కింద రెండు దేశాలకు కొన్ని ప్రాథమిక బాధ్యతలు ఉన్నాయి. రెండు దేశాల వాటర్ కమిషనర్స్ ఏడాదికి కనీసం ఒక్కసారైనా సమావేశంకావడం, నదులలో నీటి ప్రవాహం డేటాను ఇచ్చి పుచ్చుకోవడం, అలాగే నదులపై ఏర్పాటవుతున్న ప్రాజెక్టులను పరిశీలించేందుకు రెండు దేశాల బృందాలు వెళ్లడం వంటివి" అని సింధు జలాల ఒప్పందం మాజీ అదనపు కమిషనర్ షిరాజ్ మెమన్ తెలిపారు.
సాధారణంగా ఈ సమావేశం మే నెలలో జరుగుతుంది. జూన్ 1న రెండు ప్రభుత్వాలకు వార్షిక నివేదిక సమర్పిస్తారు. ఒప్పందాన్ని నిలిపివేయడం అంటే ఈ సమావేశాలు, పరిశీలన పర్యటనలు, నీటి డేటా షేరింగ్ ఆగిపోతాయని ఆయన చెప్పారు.
ఏదైనా ఒప్పందం నుంచి ఒక పక్షం వెనక్కి తగ్గితే, అది చిత్తశుద్ధి లేకపోవడాన్ని సూచిస్తుందని సింధు జలాల మాజీ కమిషనర్ జమాత్ అలీ షా అన్నారు.
అయితే ఇప్పటివరకు చూస్తే పాకిస్తాన్‌కు చాలా పెద్ద నష్టం జరగలేదని, కానీ భవిష్యత్తులో ప్రతికూల ప్రభావాలు ఉండవచ్చని ఆయన అన్నారు.
దశాబ్దాల నాటి ఈ ఒప్పందాన్ని నిలిపివేసి, దాన్ని రద్దు చేయడానికి ప్రయత్నిస్తే, మరో పక్షం ఆందోళన చెందుతుందని, అందుకే పాకిస్తాన్ ఈ విషయాన్ని భద్రతా మండలి దృష్టికి తీసుకెళ్లిందని ఆయన చెప్పారు.
"ఈ ఒప్పందం పాకిస్తాన్‌కు ఇచ్చిన రాయితీ కాదు. మూడు నదులను భారత్‌కు ఇచ్చిన ఒక ముఖ్యమైన ఒప్పందం. ప్రతి ఒప్పందానికి ఒక గౌరవం ఉంటుంది, దానిని కాపాడుకోవాలి. మాకు అత్యంత ముఖ్యమైన విషయం ఈ ఒప్పందం విశ్వసనీయత" అని షా అన్నారు.
పాకిస్తాన్‌కు నీటిని పూర్తిగా ఆపే సామర్థ్యం భారత్‌కు లేదని, కానీ భవిష్యత్తులో అలా ప్రయత్నిస్తే పాకిస్తాన్‌పై ప్రభావం తప్పకుండా ఉంటుందని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
సింధు జల ఒప్పందం కింద భారత్ ప్రవహించే నదులపై స్టోరేజ్ (నీటి నిల్వ) నిర్మించే అవకాశం ఉందని పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీ మాజీ సభ్యులు, నీటి వ్యవహారాల నిపుణులు అయిన మోసిన్ లెఘారి అంటున్నారు.
"ఉదాహరణకు భారత్ చినాబ్ నదిపై ఉన్న తన డ్యామ్‌లను నింపడం మొదలు పెట్టిందంటే, పాకిస్తాన్ వైపు నీటి ప్రవాహం తగ్గిపోతుంది" ఆయన చెప్పారు.
అలాగే, భారత్ ఈ డ్యామ్‌లను ఉన్నపళంగా ఖాళీ చేసినాకూడా, పెద్ద మొత్తంలో నీరు ఒక్కసారిగా పాకిస్తాన్ వైపు వెళ్తుందని ఆయన చెప్పారు.
సింధు జలాల ఒప్పందం ద్వారా, నీటి ప్రవాహానికి సంబంధించిన విషయాలపై ఇరుదేశాల అధికారులు ఒకరితో ఒకరు సంప్రదింపులు జరుపుకుంటూ ఉండేవారని, అయితే ఏడాదిగా సంప్రదింపులు లేకపోవడంతో, రెండు దేశాలు ఈ డేటాను పంచుకోవడం లేదని లెఘారి అంటున్నారు.
పంటకు కాలం చాలా ముఖ్యమని, అవసరమైన సమయంలో నీరు లేకపోతే రైతు నష్టపోతాడని లెఘారి అన్నారు.

ఫొటో సోర్స్, ANI
తక్షణ ప్రమాదం కాదు, కానీ...
భవిష్యత్తులో భారత్ ఒప్పందాన్ని ఉల్లంఘించి, నీటి సరఫరాను అడ్డుకునే ప్రాజెక్టులను నిర్మిస్తే, అది పాకిస్తాన్‌కు వచ్చే నీటి ప్రవాహంపై ప్రభావం చూపుతుందని జమాత్ అలీ షా అంటున్నారు.
"మనకు అవసరమైనప్పుడు నీరు ఉండకపోవచ్చు, అలాగే నీటి డిమాండ్ తక్కువగా ఉన్నప్పుడు అవసరానికి మించి నీరు రావచ్చు" అని ఆయన అన్నారు.
ఈ ఒప్పందాన్ని నిలిపివేయడం వల్ల ప్రస్తుతం పాకిస్తాన్ వ్యవసాయానికి పెద్దగా నష్టం జరగడం లేదని, అయితే భారత్ కొత్త ప్రాజెక్టులు ప్రారంభిస్తే వచ్చే 5–10 సంవత్సరాల్లో నష్టం జరిగే అవకాశం ఉందని షా చెబుతున్నారు.
నీటి ప్రవాహంపై భారత్ సమాచారం ఇవ్వకపోతే, ప్రణాళికలు వేసుకోవడం పాకిస్తాన్‌కు కష్టమవుతుందని, కొన్నిసార్లు అవసరమైన దానికంటే తక్కువ నీరు ఉండడం, మరికొన్నిసార్లు ఎక్కువ నీరు కారణంగా వరదల ప్రమాదం పెరుగుతుందని ఆయన చెప్పారు.
భద్రతా మండలి భారత్‌పై ఒత్తిడి తీసుకురాగలదా?
ఇది పాకిస్తాన్ తీసుకున్న కేవలం ఒక ప్రతీకాత్మక చర్య మాత్రమేనని.. భద్రతా మండలికి పాకిస్తాన్ రాసిన లేఖ గురించి జమాత్ అలీ షా చెప్పారు.
ఈ విషయంలో పాకిస్తాన్ అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చని, అక్కడ పాకిస్తాన్‌కు అనుకూలంగా తీర్పువస్తే, భారత్ ఆ తీర్పును పాటించడం లేదని చెప్పి ఐక్యరాజ్య సమితిని ఆశ్రయించి ఆంక్షలు విధించాలని పాక్ కోరవచ్చని ఆయన చెప్పారు.
అలాగే యూరోపియన్ కమిషన్, అమెరికా వంటి వేదికలపై కూడా భారత్ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోందని నిరూపించాల్సి ఉంటుందని, అప్పుడు మాత్రమే చర్యలు తీసుకోవాలని పాక్ కోరవచ్చని ఆయన చెప్పారు.
సింధు జలాల ఒప్పందం అంటే ఏంటి?
ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంతో తొమ్మిదేళ్లపాటు జరిగిన చర్చల తర్వాత సింధు నది, దాని ఉపనదుల జలాలను పంచుకోవడానికి 1960 సెప్టెంబర్‌లో సింధు జలాల ఒప్పందంపై భారత్, పాకిస్తాన్‌లు సంతకాలు చేశాయి.
అప్పుడు భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ, పాకిస్తాన్ అప్పటి దేశాధినేత జనరల్ అయూబ్ ఖాన్ కరాచీలో ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ సంధి ఇరు దేశాల రైతులకు శ్రేయస్సును చేకూర్చి, శాంతి, సద్భావన, స్నేహానికి హామీ ఇస్తుందని ఆశించారు.
ఎన్నో యుద్ధాలు, వివాదాలు, ఘర్షణలు జరిగినప్పటికీ నదీ జలాల పంపిణీకి సంబంధించిన ఈ ఒప్పందం 65 ఏళ్లుగా కొనసాగుతూ వచ్చింది.
1960 సింధు జలాల ఒప్పందం ప్రకారం సింధు పరివాహక ప్రాంతానికి తూర్పున ఉన్న సట్లజ్, రావి, బియాస్ నదులను భారతదేశానికి.. పశ్చిమాన ఉన్న సింధు, జీలం, చీనాబ్ నదీ జలాల్లో 80 శాతం పాకిస్తాన్‌కు కేటాయించారు.
పశ్చిమ నదుల ప్రవహించే నీటి నుంచి విద్యుత్తును ఉత్పత్తి చేసుకునే హక్కు భారత్‌కు ఉంది. కానీ ఒప్పందం ప్రకారం నీటిని నిల్వ చేసే లేదా దాని ప్రవాహాన్ని తగ్గించే ప్రాజెక్టులను నిర్మించకూడదు.
తూర్పు నదులైన రావి, బియాస్, సట్లెజ్‌లపై ఎలాంటి ప్రాజెక్టునైనా నిర్మించే హక్కు భారత్‌కు ఉంది, దీనికి పాకిస్తాన్ అభ్యతరం చెప్పకూడదు.
ఏదైనా ప్రాజెక్ట్ వివాదాస్పదమైన సందర్భంలో పరిష్కారం కోసం కృషి చేయడానికి ఈ ఒప్పందం ఒక శాశ్వత సింధు కమిషన్‌ను కూడా ఏర్పాటు చేసింది. ఒకవేళ కమిషన్ సమస్యను పరిష్కరించలేకపోతే, ప్రభుత్వాలు స్వయంగా పరిష్కరించేందుకు ప్రయత్నిస్తాయని ఈ ఒప్పందంలో ఉంది.
అంతేకాకుండా నిపుణుల సాయం తీసుకోవడం లేదా వివాద పరిష్కారానికి "కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్" ('మధ్యవర్తిత్వ న్యాయస్థానం)ను ఆశ్రయించడాన్ని కూడా ఈ ఒప్పందంలో సూచించారు.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
































