టీ20 ప్రపంచ కప్ సమయంలో ‘‘డ్రగ్స్ తీసుకున్న పాకిస్తానీ క్రికెటర్’’ - ఐసీసీ నివేదికపై పీసీబీ ఏం చెబుతోంది?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, అసద్ సుహైబ్
- హోదా, అసద్ సుహైబ్
- చదివే సమయం: 5 నిమిషాలు
పాకిస్తాన్ క్రికెటర్ మొహమ్మద్ నవాజ్ విషయంలో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ నివేదిక ఆధారంగా తగిన చర్యలు తీసుకుంటున్నట్టు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ప్రకటించింది.
ఈ నివేదిక నవాజ్ రిక్రియేషనల్ డ్రగ్స్ వాడారనే దానికి సంబంధించినది.
దీనిపై ఏప్రిల్ 22లోగా స్పందన తెలియజేయాలని మొహమ్మద్ నవాజ్‌ను ఐసీసీ కోరిందని పీసీబీ ప్రతినిధి అమీర్ మీర్ బీబీసీ ఉర్దూకు చెప్పారు.
మొహమ్మద్ నవాజ్ డ్రగ్స్ వినియోగానికి సంబంధించి ఐసీసీ పంపిన నివేదికలో 'పాజిటివ్' వచ్చిందని, దీనిపై పీసీబీ చర్యలు తీసుకుంటుందని మీర్ ధృవీకరించారు.
ఇలాంటి కేసుల్లో ముందుగా ఐసీసీ విచారణ జరుపుతుంది. తాను గుర్తించిన అంశాల గురించి స్పందించేందుకు ఆటగాళ్లకు అవకాశం కల్పిస్తుందని అమీర్ మీర్ చెప్పారు.

ఇది పూర్తిగా ఐసీసీ పరిధిలోనే ఉంటుందని ఆయన తెలిపారు.
ఫిబ్రవరి, మార్చిలో జరిగిన టీ ట్వంటీ వరల్డ్ కప్ టోర్నీ భారత్, శ్రీలంకల్లో జరిగింది. ఇందులో పాక్ ఆటగాడు రిక్రియేషనల్ డ్రగ్స్ వాడారని, ఆయనపై నిర్వహించిన పరీక్షల్లో 'పాజిటివ్' వచ్చిందని క్రికెట్ వెబ్‌సైట్ క్రిక్ ఇన్ఫో తెలిపింది.

ఫొటో సోర్స్, Getty Images
'రిక్రియేషనల్ డ్రగ్' అంటే ఏంటి?
టీ ట్వంటీ ప్రపంచ కప్ కోసం పాకిస్తాన్ జట్టులో చోటు దక్కించుకున్న మొహమ్మద్ నవాజ్ ఏడు మ్యాచ్‌లలో ఆడాడు.
పాకిస్తాన్ సెమీఫైనల్స్‌కు చేరుకోలేకపోయింది. టోర్నీలో ఎక్కడా నవాజ్ చెప్పుకోదగ్గ రీతిలో ఆడలేదు.
అతను ప్రస్తుతం పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో భాగంగా ముల్తాన్ సుల్తాన్స్ జట్టులో ఆడుతున్నాడు.
డ్రగ్స్ పాజిటివ్ నివేదిక వచ్చిన తర్వాత అతని భవిష్యత్ గురించి ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
దీని గురించి తెలుసుకోడానికి బీబీసీ ప్రతినిధి ఐసీసీని సంప్రదించారు. వారి నుంచి ఎలాంటి స్పందనా రాలేదు.
'రిక్రియేషనల్ డ్రగ్స్' వల్ల క్రీడాకారుల సామర్థ్యం పెరగడం లేదా మెరుగైన ప్రదర్శన చేయడం లాంటివేమీ ఉండవని, రిలాక్స్ అయ్యేందుకు వీటిని తీసుకుంటారని నిపుణులు చెబుతున్నారు.
"సరళంగా చెప్పాలంటే వీటిని మత్తు పదార్ధాలు అని పిలవచ్చు. ఎందుకంటే మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం లేదా విశ్రాంతి కోసం వీటిని తీసుకుంటారు" అని రావల్పిండిలోని కేఏయుఎస్‌టీ యూనివర్సిటీ ఫార్మసీ విభాగంలో పని చేస్తునన డాక్టర్ సలీం చెప్పారు.
"మందులు రెండు రకాలు. ఒకటి మీకు విపరీతమైన ఆనందం లేదా ఉత్సాహం కలిగిస్తాయి. మరొకటి నిద్ర లేదా విశ్రాంతిని అందిస్తాయి. వీటిని పార్టీ డ్రగ్స్ లేదా రిక్రియేషనల్ డ్రగ్స్ అంటారు. కృత్రిమంగా విశ్రాంతిని పొందడమే వీటి ఉద్దేశం" అని ఆయన చెప్పారు.
రిక్రియేషనల్ డ్రగ్స్ వల్ల ఆటగాళ్ల సామర్ధ్యం పెరగదు. పైగా క్షీణించే అవకాశం ఉందని డాక్టర్ సలీం చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
ఐసీసీ నిబంధనలు ఏం చెబుతున్నాయి?
ఐసీసీ యాంటీ డోపింగ్ నిబంధనల ప్రకారం వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీలో ఇంటర్నేషనల్ క్రికెట్ కమిటీ సభ్యురాలిగా ఉంది.
క్రీడల సమగ్రతను రక్షించడం, ఆటగాళ్ల మంచి చెడ్డలు, క్రీడల్లో డ్రగ్స్ వాడకుండా చూడటం దీని లక్ష్యం.
అంతర్జాతీయ మ్యాచ్‌లలో పాల్గొనే ఆటగాళ్లు నిషేధిత వస్తువులకు దూరంగా ఉండేలా ఐసీసీ అవగాహన కల్పిస్తుంది.
ఐసీసీ నియమావళి ప్రకారం అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనే ఆటగాళ్లకు డోపింగ్ పరీక్షలు నిర్వహించే అధికారం ఐసీసీకి ఉంది.
యాంటీ డోపింగ్ కోడ్‌లోని ఆర్టికల్ 2.1.2 ప్రకారం అథ్లెట్ శరీరం నుండి రెండు నమూనాలు సేకరించి వాటిని వేర్వేరుగా నిల్వ చేస్తారు. మొదట ఒక నమూనాను పరీక్షిస్తారు. అది పాజిటివ్‌గా తేలితే నివేదిక జారీ చేస్తారు.
నిబంధనల ప్రకారం ఆటగాడు కోరుకుంటే రెండో శాంపిల్ కూడా పరీక్షించవచ్చు. ప్రస్తుతం మొహమ్మద్ నవాజ్ కేసులో ఆయన రెండో శాంపిల్‌ను పరీక్షించాలని ఐసీసీని కోరే అవకాశం ఉందని పాకిస్తాన్ మీడియాలో కథనాలు వచ్చాయి.
రెండో శాంపిల్‌ను పరీక్షించే సమయంలో ఆటగాడు లేదా అతని ప్రతినిధి లేదా అతను ప్రాతినిధ్యం వహిస్తున్న దేశపు క్రికెట్ బోర్డు స్వయంగా పర్యవేక్షించవచ్చు.
రెండో శాంపిల్ రిపోర్టు నెగటివ్‌గా వస్తే ఆటగాడిపై చర్యలు నిలిపివేసి, అతనికి పూర్తి క్లీన్ చిట్ ఇవ్వాలని ఐసీసీ నియమావళి చెబుతోంది.
పరీక్షలో పాజిటివ్‌గా తేలితే ఆటగాడిపై నాలుగేళ్ల వరకు నిషేధం విధించవచ్చు.
నిషేధిత పదార్థాన్ని తనకు తెలియకుండా తీసుకున్నట్లు ఆటగాడు నిరూపించగలిగితే శిక్షను తగ్గించే అవకాశం ఉంది.

ఫొటో సోర్స్, Getty Images
సోషల్ మీడియాలో స్పందన
32 ఏళ్ల మొహమ్మద్ నవాజ్ పాకిస్తాన్ తరఫున ఆరు టెస్టులు, 44 వన్డేలు, 98 టీ20లు ఆడాడు.
అతను టెస్టుల్లో 16, వన్డేల్లో 49, టీ20ల్లో 98 వికెట్లు పడగొట్టాడు.
కొన్నేళ్లుగా పాక్ టీ20 జట్టులో స్థిరమైన ఆటగాడిగా ఉన్నాడు. గత నాలుగు టీ20 ప్రపంచ కప్‌లలో కూడా ఆడాడు.
మొహమ్మద్ నవాజ్ కేసుపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు జరుపుతున్న విచారణ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
క్రికెట్ విశ్లేషకులు, అభిమానులు ఈ ఆల్‌రౌండర్‌పై ఆన్‌లైన్‌లో విమర్శలు గుప్పిస్తున్నారు.
"మొహమ్మద్ నవాజ్ గురించిన వార్త నన్ను ఏమాత్రం ఆశ్చర్యపరచలేదు. ప్రపంచ కప్ సమయంలో అతని ప్రదర్శన అలాగే ఉంది" అని సాద్ నాసిర్ అనే అభిమాని ఎక్స్‌లో రాశారు.
"పాకిస్తానీ క్రికెటర్లు ఏమీ నేర్చుకుంటున్నట్లు కనిపించడం లేదు. మొహమ్మద్ నవాజ్ రిక్రియేషనల్ డ్రగ్స్ వాడినట్లు పరీక్షలో తేలడంతో అతను విచారణను ఎదుర్కొంటున్నట్లు రిపోర్ట్ వచ్చింది. సీనియర్ ఆటగాళ్లే ఇలాంటి తప్పులు చేస్తుంటే, జూనియర్లకు ఆదర్శంగా ఉండేదెవరు?" అని స్పోర్ట్స్ జర్నలిస్ట్ సలీం ఖాలిక్ ప్రశ్నించారు.
ఇప్పుడు మొహమ్మద్ నవాజ్‌ను సోషల్ మీడియాలో దూషిస్తారు. జర్నలిస్టులు తీర్పులు ఇచ్చేస్తారని పాకిస్తాన్ మాజీ పేసర్ తన్వీర్ అహ్మద్ రాశారు.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
































