హార్ముజ్ జలసంధికి పైపులైన్ల నెట్వర్క్ ప్రత్యామ్నాయం కాగలదా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, లూయిస్ బర్రుచో
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 7 నిమిషాలు
అమెరికా- ఇరాన్ మధ్య ఏర్పడిన తాజా ఉద్రిక్తతల కారణంగా ప్రపంచంలో కీలక సముద్ర మార్గాల్లో ఒకటైన హార్ముజ్ జలసంధి మరోసారి ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది.
సంఘర్షణకు శాశ్వత ముగింపు పలికేందుకు ఉద్దేశించిన తాత్కాలిక ఒప్పందంపై సంతకం చేసిన నెలకే అమెరికా- ఇరాన్ మళ్లీ కాల్పులు ప్రారంభించాయి. దీంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరిగాయి.
హార్ముజ్ జలసంధి మీదుగా రవాణా తీవ్ర ప్రమాదకరంగా మారితే గల్ఫ్ ఎగుమతిదారులకు తమ చమురు, సహజవాయువును మార్కెట్‌ను చేర్చేందుకు ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయా? ఉన్నాయని నిపుణులు చెబుతున్నా ప్రస్తుతానికైతే వాటిల్లో ఏదీ కీలకమైన హార్ముజ్ జలసంధిని భర్తీ చేయలేదు.
హార్ముజ్ జలసంధి ఇరాన్- ఒమన్ మధ్య ఉంది. దీని విస్తృతి, భౌగోళికంగా వ్యూహాత్మక ప్రాంతంలో ఉండటం, ఈ మార్గం ద్వారా ఎగుమతులకు ఖర్చు తక్కువ కావడం వల్ల చమురు, సహజవాయువు ఉత్పత్తుల్లో ఎక్కువ భాగం ఎగుమతి చేయడానికి సౌలభ్యంగా ఉండే ప్రధాన మార్గంగా కొనసాగుతోంది.


ఫొటో సోర్స్, EPA
హార్ముజ్ ఎందుకు కీలకం?
పైపులైన్ నెట్‌వర్క్‌లతో పోలిస్తే చమురు ట్యాంకర్లు తక్కువ ఖర్చుతో ఎక్కువ సరకు రవాణా చేయగలవు. పైపులైన్ల ఏర్పాటు, నిర్వహణకు భారీ పెట్టుబడులు అవసరం.
హార్ముజ్ జలసంధి ద్వారా రోజుకు సుమారు 2కోట్ల బ్యారెళ్ల చమురు, పెట్రోలియం ఉత్పత్తుల రవాణా జరుగుతుందని అంతర్జాతీయ ఇంధన సంస్థ అంచనా వేసింది . ప్రపంచ వ్యాప్తంగా సముద్ర మార్గాల ద్వారా జరిగే చమురు వాణిజ్యంలో ఇది దాదాపు నాలుగోవంతుకు సమానం. అందులో 80 శాతం ఆసియా దేశాలకు వెళుతోంది.
లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ ఎగుమతుల్లో ఐదో వంతు ఈ జలమార్గం ద్వారానే రవాణా అవుతోంది.
ఎల్ఎన్జీ విషయంలో ఈ జలసంధిపై ఆధారపడటం మరింత ఎక్కువ.
ప్రపంచంలో అతి పెద్ద ఎల్ఎన్జీ ఎగుమతిదారుల్లో ఒకటైన ఖతార్ అంతర్జాతీయ మార్కెట్లను చేరుకోవడానికి ఈ మార్గంపైనే ఆధారపడుతోంది.
ప్రస్తుతం ఖతార్‌కు తన ఎల్ఎన్జీ ఉత్పత్తులను అంతర్జాతీయ మార్కెట్లకు చేర్చేందుకు ప్రత్యామ్నాయ మార్గాలేవీ లేవు.

అందుబాటులో ఉన్న ఇతర మార్గాలు
హార్ముజ్ జలసంధిపై ఇరాన్‌కున్న పట్టు ప్రపంచ ఇంధన మార్కెట్లపై గణనీయ ప్రభావం చూపుతోంది. గల్ఫ్ ప్రాంతంలో చమురు ఉత్పత్తిదారులు హార్ముజ్‌పై ఆధారపడకుండా చమురు తరలించేందుకు అవసరమైన మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెట్టారు.
వాటిలో అతి పెద్దది సౌదీ అరేబియాకు చెందిన ఈస్ట్-వెస్ట్ పైపులైన్. దీనిని పెట్రో లైన్ అని కూడా పిలుస్తారు. ఇది 1200 కిలోమీటర్ల పొడవైన నెట్వర్క్. ఇది సౌదీలోని తూర్పు చమురు క్షేత్రాలను ఎర్ర సముద్రంలోని ఎన్బు ఎక్స్పోర్ట్ టెర్మినల్‌తో అనుసంధానిస్తుంది.
1980లలో ఇరాన్- ఇరాక్ యుద్ధ సమయంలో దీన్ని నిర్మించారు. ఈ యుద్ధం జరిగేటప్పుడు రెండు దేశాలు గల్ఫ్‌లో చమురు ట్యాంకర్లు, ఇతర వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకున్నాయి.
ఈ పైప్‌లైన్ సామర్థ్యాన్ని 2019లో అత్యవసర గరిష్ట పరిమితి అయిన రోజుకు 70 లక్షల బ్యారెళ్లకు పెంచారు.
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కూడా 406 కిలోమీటర్ల పొడవైన అబుదాబి క్రూడాయిల్ పైపులైన్ ద్వారా తన సొంత ప్రత్యామ్నాయ మార్గాన్ని అభివృద్ధి చేసింది.
ఇది అబుదాబి హబ్షాన్ చమురు క్షేత్రాలను ఒమన్ గల్ఫ్‌లోని ఫుజైరా నౌకాశ్రయంతో అనుసంధానిస్తోంది.
దీని వల్ల యూఏఈ చమురు ఎగుమతులకు హార్ముజ్ మీద ఆధారపడాల్సిన అవసరాన్ని పూర్తిగా తగ్గించుకుంది.
దుబాయ్‌కు చెందిన పోర్ట్ ఆపరేటర్ 'డీపీ వరల్డ్' ఫుజైరాలో కొత్త పోర్టును అభివృద్ధి చేయడం, ఇప్పటికే ఉన్న పోర్టులో కొత్త టెర్మినల్ నిర్మాణానికి చర్చలు జరుపుతున్నట్లు ఫైనాన్షియల్ టైమ్స్ కథనం చెబుతోంది.
దుబాయ్‌లోని జెబెల్ అలీ పోర్టుపై ఆధారపడటాన్ని తగ్గించడం, హార్ముజ్ వెలుపల సముద్ర మార్గాలను ఉపయోగించుకోవడం ఈ కొత్త ప్రతిపాదనల ఉద్దేశం.
హార్ముజ్కి, ప్రత్యామ్నాయ మార్గాలకు మధ్య తేడా పరిమాణం. ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా రోజుకు 35 నుంచి 55 లక్షల బ్యారెళ్ల చమురును మాత్రమే రవాణా చేయవచ్చని అంతర్జాతీయ ఇంధన సంస్థ అంచనా. ఇది హార్ముజ్ గుండా రోజూ ప్రయాణించే 2 కోట్ల బ్యారెళ్ల ముడి చమురుతో పోలిస్తే చాలా తక్కువ.
"ఇది ఏ మాత్రం సరిపోదు" అని లండన్‌లోని కింగ్స్ కాలేజ్‌లో అంతర్జాతీయ భద్రత, మధ్య ప్రాచ్య అధ్యయనం అసోసియేట్ ప్రొఫెసర్ డేవిడ్. బి. రాబర్ట్స్ ఇటీవల ఒక వ్యాసంలో రాశారు.
ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్న ప్రాంతాల్లో కూడా అక్కడున్న సమస్యల వల్ల వాటి ఉపయోగం తక్కువగా ఉంది. ఉదాహరణకు ఎన్బులోని లోడింగ్ టెర్మినళ్లు "ఇంత చమురును ఇంత వేగంగా" నిర్వహించేలా నిర్మించలేదని రాబర్ట్స్ వాదిస్తున్నారు.
ప్రత్యామ్నాయ మార్గాలుగా భావిస్తున్న వాటిపైనా దాడులు జరిగాయి. ఫుజైరాలోని చమురు నిల్వ క్షేత్రాలపై మార్చ్‌లో ఇరాన్ దాడి చేసిందని యూఏఈ ఆరోపించింది. ఇరాన్ దాడుల వల్ల చమురు నిల్వ ట్యాంకుల్లో మంటలు చెలరేగడంతో లోడింగ్ కార్యకలాపాలు ఆగిపోయాయి.
ఏప్రిల్‌లో సౌదీలోని పెట్రోలైన్ పంపింగ్ స్టేషన్‌పై జరిగిన ఇలాంటి దాడుల కారణంగా రోజుకు 7 లక్షల బ్యారెళ్ల సరఫరా నిలిచిపోయింది. ఈ పైప్‌లైన్‌ను నిర్వహిస్తున్న ఆరామ్కో సంస్థ మూడు రోజుల్లోనే దాన్ని పూర్తి సామర్థ్యంతో తిరిగి ప్రారంభించింది.
ఇరాన్ కూడా హార్ముజ్‌కు ప్రత్యామ్నాయంగా తన సొంత మార్గాన్ని నిర్మించింది. ఇది గల్ఫ్ ఉత్తర భాగంలోని గోరెహ్ నుంచి ఒమన్ గల్ఫ్‌లోని జాస్క్ ఎక్స్పోర్ట్ టెర్మినల్ వరకు 1000 కిలోమీటర్ల పొడవైన పైపులైన్. రోజుకు గరిష్టంగా 10లక్షల బ్యారెళ్ల చమురును తరలించేలా దీన్ని నిర్మించారు. హార్ముజ్‌తో అవసరం లేకుండా ఇరాన్ నుంచి ఈ పైప్ లైన్ ద్వారా చమురును అంతర్జాతీయ మార్కెట్లకు చేరవేయవచ్చు.
గణాంకాల్లో పెద్దదిగా కనిపిస్తున్నా వాస్తవ పరిస్థితుల్లో అంటే అమెరికా ఆంక్షలు, టెర్మినల్‌లో అసంపూర్తి సౌకర్యాల వల్ల ఈ పైపులైన్ ద్వారా తరలిస్తున్న చమురు పరిమాణం దాని నిర్దేశిత సామర్థ్యం కంటే చాలా తక్కువ.

ఫొటో సోర్స్, Reuters
భవిష్యత్‌లో చమురు ఎగుమతి మార్గాలు
హార్ముజ్ జలసంధిపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు కొత్త ఎగుమతి మార్గాలను పరిశీలిస్తున్నారు.
అలాంటి వాటిలో ఒకటి 970 కిలోమీటర్ల పొడవున్న కిర్కుక్ – జెహాన్ పైపులైన్. ఇది ఉత్తర ఇరాక్‌లోని కిర్కుక్ ప్రాంతం నుంచి మధ్యధరా సముద్ర తీరంలోని జెహాన్ పోర్టుకు చమురును తీసుకెళుతుంది.
రెండున్నరేళ్ల నిలిపివేత తర్వాత ఈ పైపులైన్ 2025 సెప్టెంబర్‌లో మళ్లీ మొదలైంది. 2026 మార్చ్ నాటికి రోజుకు 2.5 లక్షల బ్యారెళ్ల చమురు దీని గుండా వస్తోంది. దీని వల్ల ఇరాక్‌కు ప్రత్యామ్నాయ ఎగుమతి మార్గం లభించినప్పటికీ ఇరాక్ మొత్తం ఎగుమతులతో పోలిస్తే ఇది చిన్నదే.
ఇరాక్ రోజుకు సుమార్ 34 లక్షల బ్యారెళ్ల ముడి చమురు ఎగుమతి చేస్తోంది. ఇందులో దాదాపు 95శాతం బస్రా పోర్టు ద్వారా బయల్దేరి హార్ముజ్ గుండా అంతర్జాతీయ మార్కెట్లలోకి చేరుతోంది.
ఇరాక్‌లో మరో మార్గం కిర్కుక్-బానియాస్ పైపులైన్‌ను పునరుద్ధరించడం. దీని ద్వారా ఇరాక్ చమురు నేరుగా సిరియా వద్ద మధ్యధరా సముద్ర తీరానికి చేరుకోవచ్చు.
సుమారు 800 కిలోమీటర్ల పొడవున్న ఈ పైపులైన్ 1952లో పూర్తయింది. అయితే ఇరాన్-ఇరాక్ యుద్ధ సమయంలో దీనిని మూసివేశారు. ప్రాంతీయ ఎగుమతి మార్గాలను విస్తరించే ప్రయత్నాల్లో భాగంగా దీన్ని పునర్నిర్మించే అంశంపై ఇరాక్, సిరియా, అమెరికా మధ్య చర్చలు జరిగినట్లు ఇటీవలి మీడియ కథనాలు వెల్లడిస్తున్నాయి.
హార్ముజ్‌కు ప్రత్యామ్నాయంగా మరింత ప్రతిష్టాత్మక ప్రతిపాదనల్లో ఒకటి ఫోర్ సీస్ ప్రాజెక్ట్. ఇది సిరియా, తుర్కియే ద్వారా మధ్యధరా సముద్రం, నల్ల సముద్రం, కాస్పియన్ సముద్రం, అరేబియన్ గల్ఫ్‌ను అనుసంధానించే ప్రతిపాదిత ఇంధన నెట్వర్క్.
అరేబియా ద్వీపకల్పం మీదుగా ఖతార్‌ను తుర్కియేతో అనుసంధానించే గ్యాస్ పైపులైన్‌కు సంబంధించి 2009నాటి ప్రతిపాదనను మళ్లీ మొదలు పెట్టాలని తుర్కియే ఇంధన మంత్రి అల్ఫార్స్లాన్ బైరక్తార్ ఏప్రిల్‌లో సూచించారు.
ఇరాక్ చమురును జోర్డాన్‌లోని అక్బా నౌకాశ్రయానికి చేర్చేందుకు ఉద్దేశించిన బస్రా- అక్బా పైప్‌లైన్ నిర్మాణం కోసం మళ్లీ మద్దతు పెరుగుతోంది. దీని కోసం 1983లో తొలిసారి ప్రతిపాదించారు. రాజకీయ వివాదాలు, నిధుల కొరత వల్ల ఈ ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యం అయింది.
ఇలాంటి ప్రయత్నాల వల్ల గల్ఫ్ ప్రాంతంలో ఏర్పడే చమురు సరఫరా ఆటంకాలు లేకుండా సాగుతుందని, ప్రపంచ ఇంధన మార్కెట్లపై ఇరాన్ ప్రభావం బలహీన పడుతుందని ఈ ప్రాజెక్టుల మద్దతుదారులు చెబుతున్నారు.
అయితే ఈ మార్గాల వల్ల ఆధారపడే విషయంలో కొత్త సమస్యలు ఏర్పడవచ్చని సింగపూర్‌లోని ఎస్. రాజరత్నం స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టడీస్‌కు చెందిన సీనియర్ విశ్లేషకుడు హుజెయిర్ ఎజెకియెల్ జుల్హిషామ్ ఇటీవల ప్రచురించిన ఒక పత్రంలో హెచ్చరించారు.
"ఈ మార్గాలు చమురు వ్యాపారంపై చమురు ఉత్పత్తి చేయని దేశాలకు నియంత్రణ ఏర్పడేందుకు అవకాశం కల్పిస్తాయి" అని ఆయన రాశారు. తుర్కియే వంటి దేశాల ప్రభావం మరింత పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు.
హార్ముజ్ ప్రత్యామ్నాయ మార్గాల్లో భద్రత కూడా పెద్ద సమస్యగా ఉంది. ఇరాక్, సిరియాల్లో సాయుధ మిలిటెంట్ గ్రూపులు ఇంధన రవాణా మార్గాలను లక్ష్యంగా చేసుకోవచ్చని జుల్హిషామ్ చెప్పారు.

ఫొటో సోర్స్, Reuters
హార్ముజ్‌కు ఆవల
గల్ఫ్ ప్రాంతంలో చమురు ఎగుమతి చేసే దేశాలు హార్ముజ్‌పై ఆధారపడటాన్ని తగ్గించినా, ఈ ప్రాంతం గుండా ఇంధన రవాణా కోసం ఉపయోగించే ప్రత్యామ్నాయ మార్గాల్లో ఉన్న భౌగోళిక, రాజకీయ ప్రమాదాల నుంచి తప్పించుకునే అవకాశాలు చాలా తక్కువ.
ఈజిప్ట్‌లోని ఎస్యూఎంఈడీ పైపులైన్ దీనికి ఉదాహరణ. ఇది ఎర్ర సముద్రాన్ని మధ్యధరా సముద్రాన్ని అనుసంధానిస్తుంది. సూయెజ్ కాలువతో సంబంధం లేకుండా యూరప్‌కు చేరుకునేందుకు ఇదొక కీలక మార్గం. ఈ పైపులైన్ ద్వారా రోజుకు 25 లక్షల నుంచి 28 లక్షల బ్యారెళ్ల చమురు రవాణా చేయవచ్చు.
అయితే ఇటీవల ఎర్ర సముద్రం, బాబ్ అల్-మందెజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై హూతీలు దాడులు చేశారు. ఈ పరిస్థితి విస్తృతమైన సూయెజ్ కారిడార్ ఎంత సున్నితమైందో స్పష్టం చేస్తోంది.
అమెరికా- ఇరాన్ యుద్ధం మొదలైన త ర్వాత ఎస్యూఎంఈడీ పైపులైన్ ద్వారా చమురు రవాణా పెరిగినప్పటికీ, దాని సామర్థ్యం తక్కువ కావడంతో "యూరప్‌కు ఇప్పటికీ అవసరమైనంత చమురు అందడం లేదు" అని రాబర్ట్స్ చెప్పారు.
అమెరికా తన దాడులను ఆపేంత వరకు హార్ముజ్‌ను తెరిచేది లేదని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ బుధవారం ప్రకటించింది. అలాగే ఈ ప్రాంతంలోని ఇతర ఆయిల్ , గ్యాస్ ఎగుమతి మార్గాలను కూడా అడ్డుకుంటామని ఇరాన్ హెచ్చరించింది.
హార్ముజ్ మీద ఆధారపడటం తగ్గుతుందా?
గల్ఫ్ దేశాలు హార్ముజ్ మీద ఆధారపడటాన్ని తగ్గించుకోడానికి మరింత దృఢ సంకల్పంతో ఉన్నాయని బ్రిటన్ కేంద్రంగా ఉన్న థింక్ ట్యాంక్ రాయల్ యునైటెడ్ సర్వీసెస్ ఇన్స్టిట్యూట్లో మిడిల్ ఈస్ట్ వ్యవహారాల నిపుణుడు డా. హెచ్.ఎ. హెల్లియర్ చెప్పారు.
హార్ముజ్ మీద గతంలో మాదిరిగా ఆధారపడే పరిస్థితుల్లేవని భావిస్తున్న ప్రాంతీయ ప్రభుత్వాలు ప్రత్యామ్నాయ మార్గాలవైపు దృష్టి పెడతాయని ఆయన అన్నారు.
అయితే ఆ మార్గాలు హర్ముజ్‌కు ప్రత్యామ్నాయం కాగలవని ఆయన అనుకోవడం లేదు.
ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా చూస్తే హార్ముజ్ జలసంధి "మరింత విలువైనది కాకుండా, తక్కువ విలువైనదిగా మారుతుందని" అని హెల్లియర్ అభిప్రాయపడ్డారు.
"ఈ ప్రాంతం ఇజ్రాయెల్ ఆధిపత్యాన్ని కోరుకోవడం లేదు. అలాగే ఇరాన్ ఆధిపత్యాన్ని కూడా కోరుకోవడ లేదు" అని ఆయన చెప్పారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)































