హార్ముజ్: ఇక్కడి నుంచి వెళ్లే నౌకలపై డోనల్డ్ ట్రంప్ టోల్ విధించగలరా? అంతర్జాతీయ చట్టంలో ఏముందంటే..

హార్ముజ్ జలసంధి, ఇరాన్, అమెరికా, టోల్ వసూలు

ఫొటో సోర్స్, Shady Alassar/Anadolu via Getty Images

ఫొటో క్యాప్షన్, హార్ముజ్ సముద్ర మార్గ రక్షణకు బదులుగా 20 శాతం టోల్ వసూలు చేస్తామని అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ అన్నారు.
ప్రచురణ
చదివే సమయం: 4 నిమిషాలు

హార్ముజ్ జలసంధి అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలకు కేంద్రంగా మారింది. దీనిపై పట్టు సాధించే విషయంలో ఈ రెండు దేశాలు మరోసారి ముఖాముఖి తలపడుతున్నాయి.

హార్ముజ్‌కు గార్డియన్ (సంరక్షకుడు) తానేనని, ఈ సముద్ర మార్గాన్ని రక్షిస్తున్నందుకు 20 శాతం టోల్ వసూలు చేస్తామని అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ అన్నారు.

దీనికి స్పందనగా, హార్ముజ్ జలసంధి నిర్వహణలో అమెరికా జోక్యాన్ని అనుమతించబోమని ఇరాన్ సైనిక ప్రధాన కార్యాలయం 'ఖాతం అల్-అంబియా' స్పష్టం చేసింది.

హార్ముజ్ విషయంలో ట్రంప్ ప్రకటనపై ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ ఎక్స్‌లో స్పందిస్తూ, "అమెరికా అధ్యక్షుడు చెప్పింది ముమ్మాటికీ నిజం. హార్ముజ్ జలసంధి గుండా కార్గో నౌకల సురక్షిత ప్రయాణాన్ని ఎవరు పర్యవేక్షిస్తారో, ఆ సేవలకు వారికే రుసుము చెల్లించాలి" అని తెలిపారు.

"హార్ముజ్ జలసంధికి ఇరాన్ ఎంతోకాలం నుంచి గార్డియన్‌గా వ్యవహరిస్తోంది. మున్ముందు కూడా అలాగే ఉంటుంది. 20 శాతం అనేది కచ్చితంగా చాలా ఎక్కువ. మేం న్యాయబద్ధంగా వ్యవహరిస్తాం" అని చెప్పారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
హార్ముజ్ జలసంధి, ఇరాన్, అమెరికా, టోల్ వసూలు

ఫొటో సోర్స్, Aaron Schwartz/CNP/Bloomberg via Getty Images

'మాకు గల్ఫ్ దేశాల అవసరం లేదు'

ఈ మధ్య కాలంలో అమెరికా జరిపిన దాడులకు ప్రతిచర్యగా, గల్ఫ్ దేశాలలో ఉన్న అమెరికా సైనిక స్థావరాలను ఇరాన్ లక్ష్యంగా చేసుకోవడం ప్రారంభించింది. ఈ అంశంపై డోనల్డ్ ట్రంప్ వైట్ హౌస్‌లో మీడియాతో మాట్లాడారు. ఆయా దేశాలకు అమెరికా రక్షణ కల్పిస్తుందని, అయితే అందుకు బదులుగా వారు తగిన మూల్యం చెల్లించాల్సి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.

"నేను కోరుకునేది ఒక్కటే. మాకు డబ్బు చెల్లించాలి. ఎందుకంటే ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన ప్రాంతానికి మేం రక్షణ కల్పిస్తున్నాం. దీనికోసం మేం డబ్బు ఖర్చు చేస్తున్నాం" అని ట్రంప్ అన్నారు.

"మేం ఏ దేశాలకైతే రక్షణ కల్పిస్తున్నామో, వాటి నుంచి మాకు డబ్బు అందుతుంది. ఉదాహరణకు సౌదీ అరేబియా, యూఏఈ, ఖతార్, బహ్రెయిన్, కువైట్ లాంటి దేశాలు ఉన్నాయి. మాకు ఈ దేశాల అవసరం లేదు, వాటికే మా అవసరం ఉంది. వెనెజ్వెలాతో కలుపుకుంటే మా వద్ద చాలా చమురు నిల్వలు ఉన్నాయి" అన్నారు.

హార్ముజ్ జలసంధి, ఇరాన్, అమెరికా, టోల్ వసూలు

ఫొటో సోర్స్, AFP via Getty Images

పన్ను వసూలు చేసే హక్కు అమెరికాకు ఉందా?

ఈ నేపథ్యంలో, ప్రపంచవ్యాప్త సముద్ర రవాణాను పర్యవేక్షించే ఐక్యరాజ్యసమితి సంస్థ 'ఇంటర్నేషనల్ మేరిటైమ్ ఆర్గనైజేషన్' ప్రతినిధి ఒకరు స్పందించినట్లు రాయిటర్స్ పేర్కొంది.

"అంతర్జాతీయ సముద్ర రవాణాకు ఉపయోగించే జలసంధుల గుండా ప్రయాణించినందుకు రుసుము వసూలు చేయడాన్ని మేం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం" అని ఆ ప్రతినిధి తెలిపారు.

"కేవలం ఒక జలసంధి గుండా ప్రయాణించినందుకు తప్పనిసరి టోల్ వసూలు చేయడానికి ఎలాంటి చట్టపరమైన హక్కు లేదు" అని ఆయన స్పష్టం చేశారు.

షిప్పింగ్ పరిశ్రమ అధికారులు ఈ తాజా పరిణామాలపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి చర్య అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించడమే అవుతుందని అభిప్రాయపడ్డారు.

పేరు వెల్లడించడానికి నిరాకరించిన ఒక అధికారి ట్రంప్ పోస్ట్‌పై స్పందిస్తూ, "దీనివల్ల ఆ మార్గం గుండా నౌకల ప్రయాణం ఎలా సురక్షితంగా మారుతుంది? దీనితో ఎలాంటి గ్యారెంటీ ఇస్తున్నారు?" అని ప్రశ్నించారు.

ట్రంప్ చేసిన ఈ తాజా ప్రకటన ఆచరణలో ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందనేది ప్రస్తుతానికి స్పష్టంగా లేదు.

ఐక్యరాజ్యసమితి నిబంధనల ప్రకారం, దేశాలు తమ తీరప్రాంతం నుంచి 12 నాటికల్ మైళ్ల (సుమారు 22 కిలోమీటర్లు) వరకు ఉన్న ప్రాంతీయ సముద్ర జలాలను నియంత్రణలో పెట్టుకోవచ్చు. హార్ముజ్ జలసంధి అత్యంత ఇరుకైన భాగం, దాని షిప్పింగ్ లేన్లు పూర్తిగా ఇరాన్, ఒమన్ ప్రాంతీయ సముద్ర జలాల పరిధిలోకి వస్తాయి. అంటే, ఐక్యరాజ్యసమితి నిబంధనల ప్రకారం ఈ భాగంపై ఇరాన్, ఒమన్‌లకే నియంత్రణ ఉంది.

అయితే, ఐక్యరాజ్యసమితి సముద్ర చట్టంలోని ఆర్టికల్ 38 ప్రకారం, హార్ముజ్ జలసంధితో సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న 100కు పైగా జలసంధుల గుండా ఎలాంటి ఆటంకాలు లేకుండా నౌకలు ప్రయాణించేందుకు "ట్రాన్సిట్ ప్యాసేజ్" (రవాణా మార్గ) హక్కును కల్పిస్తోంది.

హార్ముజ్ చుట్టూ కొనసాగుతున్న ఉద్రిక్తతలు

గతంలో ప్రపంచవ్యాప్త చమురు సరఫరాలో దాదాపు 25 శాతం, అలాగే ఎల్‌ఎన్‌జీ సరఫరాలో సుమారు 20 శాతం ఈ జలమార్గం గుండానే సాగేవి.

అయితే, ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు ఇరాన్‌పై దాడి చేశాయి. దీనికి ప్రతిచర్యగా ఇరాన్ హార్ముజ్ జలసంధిని మూసివేసింది. ఇజ్రాయెల్‌తో పాటు పలు గల్ఫ్ దేశాలలో ఉన్న అమెరికా సైనిక స్థావరాలపై క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేసింది.

అనుమతి లేకుండా హార్ముజ్ జలసంధి దాటడానికి ప్రయత్నించిన కార్గో నౌకలపై ఐఆర్‌జీసీ కాల్పులు జరపడమే కాకుండా, రెండు నౌకలను తన ఆధీనంలోకి తీసుకుంది. ఈ పరిణామాల తర్వాత ఈ జలసంధి ద్వారా జరిగే సముద్ర రవాణా భారీగా పడిపోయింది. ఇది చమురు ధరలు ఒక్కసారిగా పెరగడానికి కారణమైంది.

ఈ ఘర్షణకు ముగింపు పలికే ఉద్దేశంతో జూన్ నెలలో ఇరు దేశాల మధ్య జరిగిన అవగాహనా ఒప్పందం (మెమొరాండం ఆఫ్ అండర్‌స్టాండింగ్) ప్రకారం అమెరికా ఈ ముట్టడిని ఉపసంహరించుకుంది. అయినప్పటికీ, హార్ముజ్ జలసంధి వివాదం ఇప్పుడు మళ్లీ తెరపైకి వచ్చింది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)