రన్నింగ్ బస్‌లో 16 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం ఆరోపణలు.. దిల్లీలో డ్రైవర్, కండక్టర్ అరెస్ట్

ఫొటో సోర్స్, ANI
50 కిలోమీటర్ల వేగంతో వెళుతున్న బస్సులో 16 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారనే ఆరోపణలపై ఆ బస్సు డ్రైవర్, కండక్టర్‌ను దిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు.
డ్రైవర్ కుల్దీప్, కండక్టర్ సందీప్‌లను ఘటన జరిగిన రోజే తిమార్పూర్ ప్రాంతంలోని పార్కింగ్ ప్రదేశం వద్ద పోలీసులు అరెస్ట్ చేశారని ఉత్తర దిల్లీ డీసీపీ నిహారికా భట్ హిందుస్తాన్ టైమ్స్‌కు తెలిపారు.
బాధిత బాలికను ఆమె కుటుంబ సభ్యులకు అప్పగించగా, నిందితులను కస్టడీకి పంపినట్టు హిందుస్తాన్ టైమ్స్ పేర్కొంది.
పోలీసులు బస్సును స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ పరీక్షల కోసం పంపినట్టు మీడియా కథనాల ద్వారా తెలుస్తోంది.
మరోవైపు ఈ ఘటనపై రాజకీయ విమర్శలు తీవ్రతరమయ్యాయి. కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ, సీపీఐలు దిల్లీ పోలీసుల తీరుపై, కేంద్ర ప్రభుత్వంపై ప్రశ్నలు సంధించాయి. అయితే దిల్లీ పోలీసులు వేగంగా చర్యలు తీసుకుంటూ, నేరాల నియంత్రణపై దృష్టి సారిస్తున్నారని బీజేపీ పేర్కొంది.

‘‘ఉత్తరప్రదేశ్‌లోని మేన్పురికి చెందిన 16 ఏళ్ల ఇంటర్ విద్యార్థినికి కుటుంబ సభ్యులతో గొడవ జరిగింది.
తర్వాత కుటుంబ సభ్యులకు చెప్పకుండా నోయిడా సెక్టార్ 63లో ఉన్న బంధువుల ఇంటికి వెళ్లేందుకు ఆమె బయలుదేరింది’’ అని పోలీసులను ఉటంకిస్తూ మీడియా కథనాలు పేర్కొన్నాయి.
ఆగస్టు 4వ తేదీ రాత్రి వర్షం, చీకటి కారణంగా బాలిక పొరపాటున నోయిడాలోని పరీ చౌక్ వద్ద దిగిపోయినట్టు కొన్ని మీడియా కథనాలు వెల్లడించాయి.
ఇంతలో కిటికీలకు కర్టెన్లు కట్టి ఉన్న ఓ స్లీపర్ బస్సు ఆమె వద్దకు వచ్చి ఆగింది.
ఆ బస్సులో ప్రయాణికులేవరూ లేరు.
అయితే బాలికను నోయిడా సెక్టార్ 63లో దింపుతామని కండక్టర్ చెప్పినట్లు ఆరోపణలు ఉన్నాయి.
ఆ బస్సు సూరజ్‌పూర్‌లోని ఓ వర్క్‌షాప్‌లో రిపేర్ చేయించుకున్న ఖాళీగా తిరిగి వస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
బస్సు ఎక్కిన కొద్దిసేపటికే కండక్టర్ తనతో అసభ్యంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడని బాధితురాలు చెప్పినట్టు హిందుస్తాన్ టైమ్స్ వెల్లడించింది.
'బాలికపై అత్యాచారం జరిగింది. ఆమె ప్రతిఘటించడంతో నిందితులు చంపేస్తామని బెదిరించారు. తర్వాత నిందితులు ఆమెను కశ్మీరీ గేట్ సమీపంలోని రింగ్ రోడ్ వద్ద దింపి వెళ్లిపోయారు. తర్వాత ఆ బాలిక తమను సంప్రదించినట్టు పోలీసులు తెలిపారు' అని దిల్లీ పోలీసులను ఉటంకిస్తూ హిందుస్తాన్ టైమ్స్ పేర్కొంది.
పరీ చౌక్ నుంచి కశ్మీరీ గేట్ వరకు 40 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఈ సమయమంతా బాధితురాలు బస్సులోనే ఉన్నట్లు రిపోర్ట్స్ పేర్కొంటున్నాయి.

ఫొటో సోర్స్, ANI
ట్రావెల్ కంపెనీ మేనేజర్ ఏం చెప్పారు?
బస్సు ట్రావెల్ కంపెనీ మేనేజర్ మోనూ గుప్తాతో వార్తా సంస్థ ఏఎన్ఐ మాట్లాడింది.
'రిపేర్ కోసం జూలై 27 నుంచి ఆగస్ట్ 4 వరకు సూరజ్‌పూర్ హిమగిరి ప్రాంతంలో బస్సును ఉంచాం.. సెన్సర్ దొరకకపోవడంతో బస్సును అక్కడే ఉంచేశారు. ఆగస్ట్ 4న రిపేర్ అయ్యాక సాయంత్రం 5 గంటలకు బస్సు అక్కడి నుంచి బయలుదేరింది. మధ్యలో ఆపి, తర్వాత రాత్రి 9 గంటలకు వాళ్లు మళ్లీ బస్సును తీసుకెళ్లారు' అని ఆయన చెప్పారు.
'తిమార్‌పూర్‌కు వెళ్లి బస్సుకు అవసరమైన చిన్నచిన్న పనులు చేయించుకోవాలని వాళ్లకు చెప్పా. తర్వాత వాళ్లు తిమార్పూర్ వైపు వెళ్లారు. బస్సు తిమార్‌పూర్‌కు చేరుకుని ఉంటుందని అనుకున్నాం. కానీ ఉదయం దిల్లీ పోలీసులు మాకు ఫోన్ చేసి, మీ బస్సును పట్టుకున్నామని, డ్రైవర్, కండక్టర్ జైలులో ఉన్నారని చెప్పారు' అన్నారాయన.
కండక్టర్, డ్రైవర్ ఇద్దరూ కాన్పూర్ దేహాత్ ప్రాంతానికి చెందినవారని, రెండేళ్లుగా తమ సంస్థలో పనిచేస్తున్నారని మోనూ గుప్తా తెలిపారు.

ఫొటో సోర్స్, ANI
దిల్లీ పోలీసులపై రాజకీయ పార్టీల విమర్శలు
ఈ ఘటన తర్వాత కేంద్రప్రభుత్వంపై, దిల్లీ పోలీసులపై కాంగ్రెస్, సీపీఐతో పాటు ప్రతిపక్షపార్టీలు తీవ్రంగా విమర్శలు గుప్పిస్తున్నాయి.
'రన్నింగ్ బస్సులో 16 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది. దాదాపు 50 కిలోమీటర్ల మేర బస్సు ప్రయాణిస్తుండగానే ఈ దారుణం కొనసాగింది. కానీ రెండు రాష్ట్రాల పోలీసులు చెవుల్లో దూది పెట్టుకుని నిద్రపోయారు' అని 'ఎక్స్'లో పోస్ట్ చేసింది కాంగ్రెస్.
'ఎలాంటి గస్తీ లేదు, తనిఖీలు లేవు. ఈ ఘటన మహిళల భద్రతపై ప్రశ్నలు లేవనెత్తడమే కాకుండా, నేరస్తులకు చట్టం అంటే ఎలాంటి భయం లేదనే విషయాన్ని రుజువు చేస్తోంది. డబుల్ ఇంజిన్ ప్రభుత్వాల్లో శాంతిభద్రతలు పూర్తిగా కుప్పకూలాయి. నేరస్తులు భయం లేకుండా నేరాలకు పాల్పడుతున్నారు. కానీ బీజేపీ ప్రభుత్వం మాత్రం ఉత్తుత్తి హామీలు ఇవ్వడంలో మునిగిపోయింది. ప్రజల భద్రతపై వారికి ఎలాంటి శ్రద్ధ లేదు' అని ఆ పోస్ట్‌లో రాసింది కాంగ్రెస్.
దిల్లీలో జరిగిన మూడు నేరాలను ప్రస్తావిస్తూ, దీనికి దిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా బాధ్యత వహించాలని దిల్లీ ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు సౌరభ్ భరద్వాజ్ వార్తా సంస్థ ఏఎన్ఐతో అన్నారు.
'రేఖా గుప్తాలాంటి సున్నితత్వంలేని మహిళా ముఖ్యమంత్రిని ఇప్పటివరకూ చూడలేదు. అత్యాచార నిందితులకు మద్దతుగా మాట్లాడుతున్న ఇలాంటి నాసిరకం ఇన్ఫ్లుయెన్సర్లను బీజేపీ రంగంలోకి దించింది' అని అన్నారు.
దిల్లీ ప్రజల ప్రాణాలు, జీవనోపాధికి భద్రత కల్పించాల్సిన దిల్లీ పోలీసులకు ప్రభుత్వం ఇతర బాధ్యతలను అప్పగించిందని, ప్రజలకు భద్రత కల్పించడం ప్రభుత్వ ప్రధాన బాధ్యత అని సీపీఐ నాయకురాలు ఎనీ రాజా వార్తా సంస్థ ఏఎన్ఐతో అన్నారు.
'ఇలాంటి నేరాలను అరికట్టడంపైనే వారి పూర్తి బాధ్యత, దృష్టి ఉండాలి. కానీ ఇప్పుడు దిల్లీ పోలీసులను ఇతర పనుల కోసం ఉపయోగిస్తున్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర హోం మంత్రిత్వ శాఖ రెండూ తీవ్రంగా పరిగణించాలి" అని ఆమె అన్నారు.
మరోవైపు బీజేపీ నేత, దిల్లీ ప్రభుత్వ మంత్రి ప్రవేశ్ వర్మా దిల్లీ పోలీసులకు మద్దతుగా మాట్లాడుతూ, నేరాలతో పాటు దిల్లీ పోలీసులు ఎంత వేగంగా చర్యలు తీసుకుంటున్నారో కూడా చూడాలని అన్నారు.
'నేర నియంత్రణపై దిల్లీ పోలీసులు పనిచేస్తున్నారు. అయితే ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని నేను కోరుతున్నాను. మీ పరిసరాల్లో లేదా కాలనీలో ఇలాంటి విషయం కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలి. తద్వారా ఘటన జరగకముందే దాన్ని అడ్డుకోవచ్చు' అని ఆయన అన్నారు.
దిల్లీ పోలీసులు వెంటనే చర్యలు తీసుకున్నారని, బస్సు డ్రైవర్, కండక్టర్‌ను తక్షణమే అరెస్ట్ చేశారని దిల్లీ మహిళా కమిషన్ అధ్యక్షురాలు లతా గుప్తా తెలిపారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
































