You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
రాఘవ్ చడ్డా: సామాన్యుల కోసమంటూ ఇటీవల రాజ్యసభలో అనేక ప్రశ్నలు లేవనెత్తిన ఈ నేత బీజేపీలో చేరుతూ ఏం చెప్పారు?
ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)ని వీడి బీజేపీలో చేరుతున్నట్లు రాజ్యసభ ఎంపీ రాఘవ్ చడ్డా ప్రకటించారు.
సందీప్ పాఠక్, అశోక్ మిట్టల్‌లతో కలిసి శుక్రవారం విలేఖరుల సమావేశంలో మాట్లాడిన రాఘవ్, "రాజ్యాంగ నిబంధనల ప్రకారం, రాజ్యసభలోని ఆమ్ ఆద్మీ పార్టీ సభ్యులలో మూడింట రెండువంతుల సభ్యులం బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నాం" అని చెప్పారు.
ఈ చర్యపై ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్ర విమర్శలు చేస్తూ, దీన్ని "ఆపరేషన్ లోటస్"గా అభివర్ణించింది.
పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ తాజా పరిణామాలపై ఎక్స్‌లో స్పందిస్తూ, రాఘవ్ చడ్డా పేరు ప్రస్తావించకుండా "బీజేపీ మరోసారి పంజాబీలకు ద్రోహం చేసింది" అని పేర్కొన్నారు. చడ్డాతోపాటు బీజేపీలో చేరిన ఆమ్ ఆద్మీ రాజ్యసభ సభ్యులను పార్టీలోకి ఆహ్వానించిన ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు నితిన్ నబిన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ డైనమిక్ నాయకత్వంలో పని చేయడానికి సిద్ధమైనందుకు వారికి అభినందనలు తెలిపారు.
ఈ నెల ప్రారంభంలో ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభలో పార్టీ డిప్యూటీ లీడర్ బాధ్యతల నుంచి రాఘవ్ చడ్డాను తొలగించి అశోక్ కుమార్ మిట్టల్‌కు అప్పగించింది. ఆయన కూడా ఇప్పుడు బీజేపీలో చేరుతున్నట్లు ప్రకటించారు.
రాఘవ్ చడ్డా, సందీప్ పాఠక్ ఏం చెప్పారు?
ఆమ్ ఆద్మీ పార్టీ వైఖరిని రాఘవ్ చడ్డా ప్రశ్నించారు. తాను ప్రజా ప్రయోజనాలకు సంబంధించిన అంశాలను లేవనెత్తుతున్నానని, దీనివల్ల ఆమ్ ఆద్మీ పార్టీకి ఏ నష్టం జరుగుతుందని అన్నారు.
"నా రక్తం, చెమట ధారపోసి, నా యవ్వనంలోని 15 ఏళ్లను అంకితం చేసి పెంచి పోషించిన ఆమ్ ఆద్మీ పార్టీ, ఇప్పుడు తన సూత్రాలు, విలువలు, ప్రాథమిక నైతిక విలువల నుంచి పూర్తిగా పక్కకు తప్పుకుంది. ఇప్పుడు ఈ పార్టీ దేశం కోసం గానీ, జాతీయ ప్రయోజనాల కోసం గానీ పనిచేయడం లేదు. కేవలం వ్యక్తిగత స్వార్థం కోసం పనిచేస్తోంది" అని రాఘవ్ చడ్డా అన్నారు.
"కొన్నేళ్లుగా మీలో చాలామంది నాకు ఈ విషయం చెబుతూ వస్తున్నారు, నేను సరైన వ్యక్తినే కానీ తప్పుడు పార్టీలో ఉన్నానని. ఇప్పడది గ్రహించాను. మళ్ళీ చెబుతున్నాను..నేను సరైన వ్యక్తినే, కానీ తప్పుడు పార్టీలో ఉన్నాను. కాబట్టి ఈ రోజు నేను ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి విడిపోయి ప్రజల్లోకి వెళ్తున్నానని ప్రకటిస్తున్నాను" అని ఆయన అన్నారు.
"రాజ్యసభలో ఆమ్ ఆద్మీ పార్టీకి మొత్తం 10 మంది ఎంపీలు ఉన్నారు. వారిలో మూడింట రెండు వంతుల కంటే ఎక్కువ మంది మాతో ఉన్నారు. వారు ఇప్పటికే సంతకాలు చేశారని, ఆ సంతకాలు చేసిన పత్రాలు, డాక్యుమెంట్లను రాజ్యసభ చైర్మన్‌కు సమర్పించాం. వాటిలో కొందరు సభ్యులు మీడియా ముందే ఉన్నారు. ఇంకా హర్భజన్ సింగ్, రజీందర్ గుప్తా, విక్రమజీత్ సింగ్ సాహ్ని, స్వాతి మాలివాల్ కూడా ఉన్నారు" అని పాత్రికేయుల ప్రశ్నలకు సమాధానమిచ్చారు చడ్డా.
"నా జీవితంలో ఇలాంటి పరిస్థితి వస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదు, కానీ వచ్చింది. నేను పదేళ్లుగా ఈ పార్టీలో భాగంగా ఉన్నా. ఈ రోజు ఆమ్ ఆద్మీ పార్టీని విడిచిపెడుతున్నాను" అని రాఘవ్ చడ్డాతో కలిసి విలేఖరుల సమావేశానికి హాజరైన ఎంపీ సందీప్ పాఠక్ అన్నారు.
"న్యూ పాలిటిక్స్, పని ఆధారిత రాజకీయాల గురించి ఆమ్ ఆద్మీ పార్టీ మాట్లాడటం వలనే నేను అందులో చేరాను. పదేళ్లుగా కష్టపడి, నిజాయితీగా పనిచేశాను. నేను తీసుకున్న రాజకీయ నిర్ణయాలన్నింటిలోనూ పార్టీ ప్రయోజనాలకే ప్రాధాన్యతనిచ్చాను. ఈ రోజు నేను భారతీయ జనతా పార్టీలో చేరుతూ, ఆమ్ ఆద్మీ పార్టీలో అన్ని పదవులకు రాజీనామా చేస్తున్నాను" అని పాఠక్ అన్నారు.
'ఆపరేషన్ లోటస్'
ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ నాయకుడు, జాతీయ మీడియా ఇన్చార్జి సంజయ్ సింగ్ శుక్రవారం సాయంత్రం 4 గంటలకు విలేఖరుల సమావేశం నిర్వహించి , రాఘవ్ చడ్డాతో సహా ఏడుగురు పార్టీ ఎంపీలు బీజేపీలో చేరడాన్ని 'ఆపరేషన్ లోటస్'గా అభివర్ణించారు.
"ఆమ్ ఆద్మీ పార్టీ రాఘవ్ చడ్డాను ఎమ్మెల్యేగా, ఎంపీగా చేసింది. ఆయనకు అన్నీ ఇచ్చింది కానీ ఆయన పార్టీకి ద్రోహం చేశారు. పంజాబ్ ప్రజలు ఆయన్ను ఎప్పటికీ క్షమించరు" అని సంజయ్ సింగ్ అన్నారు.
"రాఘవ్ చడ్డా, అశోక్ మిట్టల్, రాజేంద్ర గుప్తా, విక్రమ్‌జీత్ సాహ్ని, స్వాతి మాలివాల్, విక్రమ్ సాహ్ని, హర్భజన్ సింగ్‌లను ఆప్, ప్రజలు పార్లమెంటుకు పంపారు. ఈ ఏడుగురు పంజాబ్ ప్రజలకు వెన్నుపోటు పొడిచి, వారికి ద్రోహం చేశారు. వారు భగవంత్ మాన్ ప్రభుత్వానికి ద్రోహం చేశారు" అని ఆయన అన్నారు.
"భగవంత్ మాన్ ప్రభుత్వం బాగా పని చేస్తోంది, అందుకే ఆపరేషన్ లోటస్ వంటివి చేస్తున్నారు. ఈడీ-సీబీఐలను ప్రయోగిస్తున్నారు. నాలుగు రోజుల క్రితం ఈడీ అశోక్ మిట్టల్ ఇంటిపై దాడి చేసి, అతడిని బెదిరించి,ఆ ఇంటిని కూల్చేసింది" అని జాతీయ మీడియా ఇన్చార్జి సంజయ్ సింగ్ అన్నారు.
"పంజాబ్ ప్రజలను మోసగించడానికి అమిత్ షా, నరేంద్ర మోదీల నాయకత్వంలో ప్రారంభించిన ఆపరేషన్ లోటస్ ఇది" అని ఆయన నొక్కి చెప్పారు.
పంజాబ్ సీఎం భగవంత్ మాన్ ఏమన్నారు?
ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీలలో మూడింట రెండువంతుల మంది బీజేపీలో విలీనం చేస్తున్నట్లు రాఘవ్ చడ్డా ప్రకటించిన తర్వాత, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ శుక్రవారం సాయంత్రం విలేఖరుల సమావేశం నిర్వహించారు.
"పార్టీ గొప్పది, సంస్థ గొప్పది. కానీ అందులోని వ్యక్తులు గొప్పవారు కాదు. వెళ్ళిపోయిన ఈ 6-7 మంది పంజాబ్‌కు చెందినవారు కాదు. వాళ్లు దేశద్రోహులు. పంజాబీ ద్రోహులు. ఏమీ చేయకుండానే సింహాసనాన్ని అధిష్టించారు. ఓట్లు అడగాల్సిన అవసరం వారికి రాలేదు. ఎక్కడా చేతులు జోడించాల్సిన అవసరం గానీ, ప్రజల సమస్యల గురించి మాట్లాడటానికి వీధుల్లోకి వెళ్లాల్సిన అవసరం గానీ రాలేదు. రెడీగా ఉన్న సీటు దొరికింది, కాబట్టి రాజ్యసభకు వెళ్లి కుతంత్రాలు చేయడం మొదలుపెట్టారు" అని ఆయన అన్నారు.
రాఘవ్ చడ్డా ఎవరు?
కేజ్రీవాల్ ఒకప్పుడు విశ్వసనీయ వ్యూహకర్తగా ఉండేవారు. 2013లో అన్నా హజారే చేపట్టిన 'ఇండియా ఎగైనెస్ట్ కరప్షన్' ఉద్యమం తుది దశలో ఉన్నప్పుడు, అరవింద్ కేజ్రీవాల్‌ను కలిశారు రాఘవ్ చడ్డా.
వృత్తిరీత్యా చార్టర్డ్ అకౌంటెంట్ అయిన రాఘవ్ చడ్డా, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో చదువుకున్న తర్వాత భారతదేశానికి తిరిగి వచ్చారు.
పార్టీలో రాఘవ్ చడ్డాకు అప్పగించిన మొదటి బాధ్యత, దిల్లీ జన్ లోక్‌పాల్ బిల్లు ముసాయిదా రూపకల్పనలో న్యాయవాది రాహుల్ మెహ్రాకు సహాయం చేయడమని, దీన్ని అరవింద్ కేజ్రీవాల్ ఆయనకు అప్పగించారని 'డైలీ ఓ' పత్రిక పేర్కొంది.
రాఘవ్ చడ్డా పార్టీలో అతి పిన్న వయస్కుడైన అధికార ప్రతినిధి అయ్యారు. కొద్ది కాలంలోనే టెలివిజన్‌లో ఆమ్ ఆద్మీ పార్టీకి ఫేస్‌గా మారారు.
2013లో ఆమ్ ఆద్మీ పార్టీ మేనిఫెస్టో రూపకల్పన బృందంలో రాఘవ్ సభ్యుడు. ఆయన కొద్ది కాలం పాటు పార్టీ కోశాధికారిగా కూడా పని చేసినట్లు ఆమ్ ఆద్మీ పార్టీ వెబ్‌సైట్‌లోని సమాచారం చెబుతోంది.
దశాబ్దం కిందట అరవింద్ కేజ్రీవాల్ బృందంలో వలంటీర్‌గా చేరిన రాఘవ్ చడ్డాను, ఆయన అత్యంత విశ్వసనీయ వ్యూహకర్తలలో ఒకరిగా పరిగణించేవారు.
2019లో దక్షిణ దిల్లీ పార్లమెంటరీ స్థానం నుంచి పోటీ చేసిన రాఘవ్ చడ్డా ఆ ఎన్నికల్లో ఓడిపోయారు. తర్వాత 2020 దిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో రాజేంద్ర నగర్ స్థానం నుంచి గెలిచారు.
2022 మార్చిలో పంజాబ్ నుంచి రాఘవ్ చడ్డాతోపాటు మరో నలుగురిని రాజ్యసభకు నామినేట్ చేసింది ఆమ్ ఆద్మీ పార్టీ. ఆ సమయంలో 33 ఏళ్ల వయసున్న రాఘవ్ చడ్డా, అతి పిన్న వయస్కుడైన ఎంపీ అయ్యారు.
2022లో పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ సాధించిన ఘన విజయంలో రాఘవ్ చడ్డా కీలక పాత్ర పోషించారని అంటారు.
పంజాబ్‌లో సాధించిన విజయాన్ని దృష్టిలో ఉంచుకుని, ఆప్ 2022 చివరలో జరగబోయే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల బాధ్యతను కూడా ఆయనకు అప్పగించి, కో-ఇన్చార్జ్గా నియమించింది. కానీ, ఇప్పుడాయన పార్టీ నుంచి బయటకు వచ్చి బీజేపీలో చేరారు.
బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)