You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
కీర్తన: ఒకప్పుడు చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో కన్సల్టెంట్,ఇప్పుడు విజయ్ కేబినెట్‌లో మంత్రి అయిన ఏకైక మహిళ
తమిళగ వెట్రి కళగం అధినేత, సినీ హీరో జోసెఫ్ విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా ఆదివారం ప్రమాణస్వీకారం చేశారు.
ఆయనతో పాటు, మరో తొమ్మిది మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు.
విజయ్ మంత్రి మండలిలో చోటు దక్కించుకున్న తొమ్మిది మంది మంత్రుల్లో ఏకైక మహిళ మంత్రి ఎస్. కీర్తన.
29 ఏళ్ల కీర్తన ఇప్పుడు విజయ్ మంత్రి మండలిలో సభ్యురాలు.
మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మాట్లాడిన కీర్తన, ''ఇప్పుడు అంతా మారబోతుంది. వాస్తవానికి మార్పు ఇప్పటికే వచ్చేసింది. సి. జోసెఫ్ విజయ్ ముఖ్యమంత్రి అయ్యారు. నేను మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చాను. నాకు కేబినెట్ మినిస్టర్ అయ్యే అవకాశం దక్కింది. ఇతర రాష్ట్రాల్లో ఇది ఇంత తేలిగ్గా జరుగుతుందని అనుకోను'' అన్నారు.
కీర్తనతో పాటు, టీవీకే ప్రధాన కార్యదర్శి ఎన్.ఆనంద్, ఎన్నికల ప్రచార నిర్వహణ ప్రధాన కార్యదర్శి అధవ్ అర్జున, కె.జి.అరుణ్‌రాజ్, కె.ఎ సెంగొట్టయాన్, పి. వెంకటరమణన్, సి.టి.ఆర్. నిర్మల్ కుమార్, ఎ.రాజ్‌మోహన్, టి.కె. ప్రభు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు.
"మనుషులలోని సామర్థ్యాన్ని, ప్రతిభను విజయ్ చూశారు. మార్పు తీసుకురావడానికే మనమందరం ఇక్కడ ఉన్నాం. ఈ ప్రభుత్వం 35 నుంచి 50 ఏళ్ల పాటు కొనసాగుతుంది. అత్యంత సుదీర్ఘకాలం అధికారంలో ఉండే ప్రభుత్వం మనదే కాబోతుంది" అని కీర్తన అన్నారు.
ఎవరీ కీర్తన ?
టీవీకే అభ్యర్థిగా శివకాశి నుంచి కీర్తన పోటీ చేశారు. ఎన్నికల సంఘం వెబ్‌సైట్ ప్రకారం.. 11,670 ఓట్ల మెజారిటీతో ఆమె గెలుపొందారు. మొత్తంగా ఆమెకు 68,709 ఓట్లు వచ్చాయి.
ఆమె చేతిలో ఓడిపోయిన కాంగ్రెస్ అభ్యర్థి అశోకన్‌కు 57,039 ఓట్లు పోలయ్యాయి.
ఏఐఏడీఎంకే అభ్యర్థి, మాజీ మంత్రి రాజేంద్ర బాలాజీ మూడో స్థానంలో 51,078 ఓట్లను పొందారు.
ఎమ్మెస్సీ చేశారు కీర్తన. ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్న వివరాల ప్రకారం...ఆమె పర్సనల్ కన్సల్టెంట్‌గా పనిచేస్తున్నారు. ఆమె మొత్తం ఆస్తుల విలువ రూ. 22,57,710.
ఎన్నికల్లో గెలిచిన తర్వాత, ఒక ఇంటర్వ్యూలో కీర్తన హిందీ మాట్లాడటంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది.
బీబీసీ అసోసియేట్ జర్నలిస్ట్ ఇమ్రాన్ ఖురేషీ చెప్పిన వివరాల ప్రకారం, కీర్తనకు దాదాపు అర డజను భాషలు తెలుసు. ఆమె హిందీ కూడా అనర్గళంగా మాట్లాడతారు.
హిందీ మాట్లాడటంపై వివాదం
ఎన్నికల్లో గెలిచిన తర్వాత.. ఆమె హిందీ మాట్లాడటం తీవ్ర వివాదానికి దారితీసింది.
దీనిపై స్పందించిన కీర్తన, ఏఎన్ఐ వార్తా సంస్థతో హిందీలో మాట్లాడుతూ.. ''నేను హిందీలో మాట్లాడతాను. దేశవ్యాప్తంగా, ఇతర దేశాల్లో నా పార్టీ ప్రాతినిధ్యం వహించాలని కోరుకుంటున్నా. అందుకే, హిందీలో మాట్లాడతాను. ప్రతిఒక్కరూ మా నాయకుడు గురించి తెలుసుకోవాలి'' అని అన్నారు.
''ప్రతి ఒక్కరూ మాపార్టీ గురించి తెలుసుకోవాలి. రాజకీయాలంటే భయపడేవి కావు. ప్రతి ఒక్కరూ రాజకీయాల్లోకి రావాలి. నేను కేవలం ఒక ఉదాహరణ మాత్రమే. ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి, రాజకీయాల్లో చేరాలని కోరుకుంటున్నా'' అని చెప్పారు.
ఎన్‌డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో.. తాను రాజకీయ వ్యూహకర్తగా పనిచేసినట్లు చెప్పారు. ఈ వ్యవస్థ, అధికార యంత్రాంగం ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోవాలనే ఉద్దేశ్యంతో.. చాలా కాలంగా తాను రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నట్లు తెలిపారు.
ఈ ఇంటర్వ్యూలో ఆమె తాను విరుదునగర్ అనే ఒక చిన్న జిల్లా నుంచి వచ్చానని, శివకాశి ఈ జిల్లాలోనే ఉందని చెప్పారు.
''తమిళ మాధ్యమానికి చెందిన ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నాను. నేను ఈరోజు ఎక్కడున్నా.. ఇదంతా నా హార్డ్‌వర్క్ వల్లనే సాధ్యమైంది'' అని తెలిపారు.
కీర్తనకు తమిళం, తెలుగు, హిందీ, ఇంగ్లిష్ తెలుసు.
హిందీ ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందో వివరించారామె. ''భాష తెలియడం వల్ల నాకెన్నో అవకాశాలు వచ్చాయి. ఎన్నో రాష్ట్రాల్లో పనిచేసే అవకాశం దక్కింది. ఆ విధంగానే నేను పలు భాషలు నేర్చుకున్నాను. కొత్త భాషలు నేర్చుకోవడం అంటే చాలా ఇష్టం. మీడియా వాళ్లు రావడం మొదలయ్యాక టీవీకేను రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు, అలాగే ఇతర రాష్ట్రాలకు కూడా విస్తరించేందుకు ఒక అవకాశం దక్కిందని నాకు అనిపించింది" అని చెప్పారు.
డీఎంకే, ఏఐఏడీఎంకేకు రాజకీయ సలహాదారుగా పనిచేసినట్లు కూడా అదే ఇంటర్వ్యూలో ఆమె వెల్లడించారు. ''నా నేపథ్యం ఏంటో తెలియకుండా తేలికగా ఇక్కడ అవకాశం లభించింది'' అని చెబుతూ.. టీవీకేలో తన రాజకీయ వృత్తిని ప్రారంభించేందుకు గల కారణాన్ని వివరించారు.
ఆమె టీవీకేలోకి రాకముందు వివిధ రాజకీయా పక్షాల తరఫున క్యాంపెయిన్ కన్సల్టెంట్‌గా పని చేశారు. గతంలో చంద్రబాబు నాయుడు కోసం కూడా ఆమె ఎన్నికల ప్రచారంలో సలహాదారుగా పనిచేశారు.
శివకాశి పట్టణం బాణసంచా ఉత్పత్తికి ప్రసిద్ధి చెందింది. భారత 'ఫైర్ క్రాకర్ క్యాపిటల్'గా దీన్ని పిలుస్తుంటారు.
గతంలో అక్కడ అనేక పేలుడు ఘటనలు జరిగాయి. ఎన్నికల ప్రచార సమయంలో.. శివకాశి కోసం కీర్తన ప్రత్యేక మేనిఫెస్టోను సిద్ధం చేశారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)