You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
దేశ రాజకీయాలపై ఈ ఎన్నికల ఫలితాల ప్రభావమేంటి, టీవీకే విజయం నుంచి ప్రతిపక్షాలు పాఠాలు నేర్చుకోగలవా?
- రచయిత, జుగల్ పురోహిత్
- హోదా, బీబీసీ ప్రతినిధి
- చదివే సమయం: 7 నిమిషాలు
దేశంలో ఈ ఏడాది జరిగిన అతిపెద్ద ప్రాంతీయ ఎన్నికల ఫలితాలపై సాగిన ఊహాగానాలు ముగిశాయి.
బీజేపీ తన మిత్రపక్షాలతో కలిసి పశ్చిమ బెంగాల్‌లో మమత కంచుకోటను ఎట్టకేలకు కూల్చింది. అస్సాం, పుదుచ్చేరిలలో అధికారాన్ని నిలుపుకుంది.
తమిళనాడులో పెద్దగా మార్పు లేనప్పటికీ, కేరళలో పనితీరును మెరుగుపరుచుకుంది.
అయితే ఈ ఎన్నికల ఫలితాలు భవిష్యత్తులో బీజేపీకి, ప్రతిపక్షాలకు.. రెండింటికీ ఎలాంటి పరిణామాలను సూచిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.
పెరుగుతున్న బీజేపీ ప్రభావం
పశ్చిమ బెంగాల్‌లో గెలుపుతో బీజేపీ, ఎన్డీయే ఇప్పుడు 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో అధికారంలో ఉన్నాయి. ఝార్ఖండ్ మినహా, మధ్య భారతమంతా ఈ పార్టీదే అధికారం.
ఈశాన్య భారతంలో మిజోరం మినహా, ఇతర ప్రాంతీయ పార్టీలతో పొత్తు పెట్టుకుని ప్రభుత్వాన్ని నడుపుతోంది బీజేపీ.
బీజేపీ దాని నేషనల్ డెమొక్రటిక్ అలయెన్స్ (ఎన్డీఏ)తో కలిసి లోక్‌సభలో ఇప్పటికే సాధారణ మెజారిటీ కలిగివుంది. కాగా, ఇప్పుడు కొత్తగా గెలిచిన రాష్ట్రాలతో కలిపి రాజ్యసభలో దాని సీట్ల సంఖ్య ప్రస్తుతమున్న 113 నుంచి పెరిగే అవకాశం ఉంది.
తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశమున్న రాష్ట్రాల్లో బీజేపీ మంచి పనితీరు కనబరిచింది. ఈ ఫలితాలు ప్రాంతీయ నాయకులపై బీజేపీ ఆధిపత్యాన్ని మరింత పెంచుతాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
"బీజేపీని వ్యతిరేకిస్తున్న ప్రాంతీయ శక్తులు బలహీనపడుతుండగా, ఆ పార్టీ ఎదుగుతోంది" అని ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నేషనల్ ఒపీనియన్ ఎడిటర్ వందితా మిశ్రా రాశారు.
ఈ ఎన్నికల్లో మమతా బెనర్జీ, ఎం.కె.స్టాలిన్ అధికారం కోల్పోయారు. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కి చెందిన అరవింద్ కేజ్రీవాల్, ఒడిశాలో బిజూ జనతా దళ్‌కు చెందిన నవీన్ పట్నాయక్, బిహార్‌లోని రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ)కి చెందిన తేజస్వి యాదవ్ వంటి నాయకులు ఓడిపోవడాన్ని చూశాం.
ఈ ఫలితాలు ప్రస్తుత జాతీయ రాజకీయ వాతావరణంలో బీజేపీకి నిలకడైన ప్రత్యామ్నాయం లేదనే భావనను చాలామందిలో బలపరుస్తున్నాయి.
"జాతీయ స్థాయిలో ఇది బీజేపీ హవా. స్పష్టమైన, ఆచరణాత్మకమైన ప్రత్యామ్నాయం రానంత వరకు ఈ పరిస్థితి కొనసాగే అవకాశం ఉంది" అని యూపీఏ ప్రభుత్వ హయాంలో న్యాయశాఖ మంత్రిగా పనిచేసిన అశ్వనీ కుమార్ అన్నారు.
"సమీప భవిష్యత్తులో అలాంటి అవకాశం ఏదీ కనిపించడం లేదు" అని ఆయన అన్నారు.
అయితే, ఒకే పార్టీకి ఇంతటి ఆధిపత్యం ఉండటం ప్రజాస్వామ్యానికి మంచిదేనా అని బీజేపీ విమర్శకులు చాలామంది ఆందోళన చెందుతున్నారు.
"వారి (బీజేపీ) పాలన నమూనా 'సంపూర్ణ అధికారం' మీద ఆధారపడి ఉంది. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ పరిణామాలు ఆ దిశగా మరో అడుగు మాత్రమే. కానీ సంపూర్ణ అధికారాన్ని సమర్థించేవారు అప్పుడప్పుడు ఆత్మపరిశీలన చేసుకోవాలి. సంపూర్ణ అధికారం అనే తర్కం.. ప్రజాస్వామ్య తర్కానికి ఎంతవరకు సరిపోతుందో ఆలోచించాలి" అని రాజకీయ విశ్లేషకులు యోగేంద్ర యాదవ్ అన్నారు.
అయితే, ప్రస్తుతానికి బీజేపీ ప్రభావం ఇంకా దక్షిణాదికి విస్తరించలేదు. కొత్తగా ఎన్నికైన ప్రభుత్వాలతో ఆ పార్టీ సంబంధాలు ఎలా ఉంటాయో కూడా స్పష్టత లేదు.
"డీఎంకే పాలనలో కేంద్రంతో ఘర్షణపూరితంగా మారిన రాష్ట్ర సంబంధాలను టీవీకే ఎలా నిర్వహిస్తుందో తెలియదు" అని సీనియర్ జర్నలిస్ట్ అదితి ఫడ్నిస్ అన్నారు.
కేరళలో జరగబోయే పరిణామాలు కూడా అక్కడ కాంగ్రెస్ ఎవరిని ముఖ్యమంత్రిగా ఎంచుకుంటుందో, ఆ ముఖ్యమంత్రి కేంద్రంతో సంబంధాలు ఎలా కొనసాగిస్తారనే దానిపై ఆధారపడి ఉంటాయని అదితి చెప్పారు.
"అయితే, ఈ ఫలితాలు జాతీయ స్థాయిలో బీజేపీకి అనుకూలమని చెప్పేందుకు మాత్రం నేను కాస్త సంయమనం వహిస్తాను" అని ఆమె అన్నారు.
"2024 లోక్‌సభ ఎన్నికల్లో చూసినట్లుగా.. రాష్ట్రాల్లో మంచి పనితీరు కనబరిచినప్పటికీ జాతీయ స్థాయిలో మాత్రం ఆ పార్టీ పనితీరు బలహీనంగానే ఉంది."
విధాన, పాలనపరంగా ఎలా ఉండొచ్చు?
ఈ విజయం బీజేపీ సంక్షేమ విధానాలు, 'పుష్‌బ్యాక్'(తిప్పిపంపడం) విధానం వంటి వివాదాస్పద అంశాలతో పాటు అస్సాం, పశ్చిమ బెంగాల్‌లో సరిహద్దు చొరబాట్ల సమస్యపై ఎలాంటి ప్రభావం చూపుతుందో వేచిచూడాలి.
మే 4వ తేదీ సాయంత్రం దిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో 'నారీ శక్తి వందన్ చట్టం 2023'కి సంబంధించిన రాజ్యాంగ సవరణను ఆమోదింపజేయడంలో విఫలయత్నం గురించి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రస్తావించారు.
మహిళా ఓటర్లు డీఎంకే, టీఎంసీ, కాంగ్రెస్‌లను శిక్షించారని ఆయన అన్నారు.
"ప్రజలు వివాదాలను కోరుకోవడం లేదు, అభివృద్ధిని కోరుకుంటున్నారు. ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ మహిళల ఆగ్రహాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. వారు తమ పాపాలను కడిగేసుకోలేరు" అని మోదీ అన్నారు.
పశ్చిమ బెంగాల్‌లో మహిళలకు మెరుగైన భద్రత లభిస్తుందని, యువతకు ఉపాధి దొరుకుతుందని, వలసలను అరికడతామని ప్రధాన మంత్రి హామీ ఇచ్చారు. తొలి కేబినెట్ సమావేశంలోనే ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య పథకాన్ని అమలు చేస్తామని తెలిపారు.
పశ్చిమ బెంగాల్ ఓటర్ల జాబితా నుంచి 90 లక్షల మంది ఓటర్ల పేర్లను తొలగించారని, దీనివల్ల ముర్షిదాబాద్, ఉత్తర 24 పరగణాలు, మాల్దా వంటి ముస్లింలు అధికంగా ఉన్న జిల్లాలు ఎక్కువగా ప్రభావితమైనట్టు కొన్ని రిపోర్టులు చెబుతున్నాయి.
ఇలాంటి పరిస్థితుల్లో కొత్త బీజేపీ ప్రభుత్వం ఈ పరిస్థితిని ఎలా ఎదుర్కొంటుందన్నదానిపై స్పష్టత లేదు.
"ఇది సంక్లిష్టమైనది, అనూహ్యమైనది" అని సీనియర్ జర్నలిస్ట్ అదితి ఫడ్నిస్ అభివర్ణించారు.
"పశ్చిమ బెంగాల్‌లో, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) కారణంగా పెద్ద సంఖ్యలో ఓటు హక్కు కోల్పోయిన ప్రజల భవిష్యత్తు ఎలా ఉండబోతుందో తెలియడంలేదు" అని ఆమె అన్నారు.
బీజేపీ దీన్ని అలాగే ముందుకు తీసుకెళ్లి, వారి పౌరసత్వంపై కూడా ప్రశ్నలు లేవనెత్తుతుందా? అనే ప్రశ్నకు..
"ఇప్పటికే చాలా మంది న్యాయ పోరాటంలో ఓడిపోయారు. వారి పరిస్థితేంటి? ప్రతిపక్ష నాయకురాలిగా మమత బలమైన నేత. పశ్చిమ బెంగాల్‌లో ఆమె ఈ రకమైన ధ్రువీకరణ జరగనిస్తారని నేను అనుకోను. అడ్డుకుంటారనే అనుకుంటున్నా" అని అదితి సమాధానమిచ్చారు.
"పశ్చిమ బెంగాల్‌లో ఉద్యమ రాజకీయాలు తిరిగి వస్తాయి. రాబోయే రోజుల్లో మరిన్ని ఘర్షణలు చోటుచేసుకోవచ్చు" అని అదితి ఫడ్నిస్ అంటున్నారు.
అర్హులైన ఓటర్లందరినీ చేర్చడం, అనర్హులైన ఓటర్లను మినహాయించడమే తమ లక్ష్యమని పేర్కొంటూ ఎన్నికల సంఘం తన నిర్ణయాన్ని సమర్థించుకుంది.
పొరుగు రాష్ట్రమైన అస్సాంలో అక్రమ బంగ్లాదేశీయులను తిరిగి బంగ్లాదేశ్‌కు పంపించే చర్యలు కొనసాగుతాయని ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ పదేపదే చెప్పారు.
రాబోయే రోజుల్లో చొరబాటుదారులు, ఆక్రమణదారులపై బుల్డోజర్లు బీభత్సం సృష్టిస్తాయని కూడా ఆయన మార్చిలో పోస్ట్ చేశారు.
"బీజేపీ పాలనలో, దేశంలో నిరంకుశత్వం వైపు మొగ్గు.. ముస్లింలు, విమర్శకులపై పెరుగుతున్న అణచివేత కనిపిస్తోంది" అని హ్యూమన్ రైట్స్ వాచ్ ఇటీవల పేర్కొంది.
"అధికారులు వందల మంది బెంగాలీ ముస్లింలను, రోహింజ్యా శరణార్థులను అక్రమంగా బంగ్లాదేశ్‌కు పంపించారు. వారిలో కొందరు భారతీయ పౌరులే. వారిని అక్రమ వలసదారులని ఆరోపించారు" అని మానవ హక్కుల సంస్థ పేర్కొంది.
అస్సాం విషయానికొస్తే, "బంగ్లాదేశ్‌కు పంపిన వారిలో కనీసం 300 మంది అస్సాం నుంచి వచ్చినవారే" అని హ్యూమన్ రైట్స్ వాచ్ పేర్కొంది.
"ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం జులై, ఆగస్టు నెలల్లో కనీసం ఏడు బుల్డోజర్ డ్రైవ్‌లను చేపట్టింది. దీనివల్ల 5,000కు పైగా కుటుంబాలు ప్రభావితమయ్యాయి. వీరిలో అధిక శాతం మంది బెంగాలీ ముస్లింలే ఉన్నారు" అని హ్యూమన్ రైట్స్ వాచ్ పేర్కొంది.
దక్షిణాదిలో ఏం జరుగుతోంది?
ప్రస్తుత ఎన్నికల సీజన్‌లో బహుశా అనూహ్య ఫలితాలు తమిళనాడులో నమోదయ్యాయి. అక్కడ అధికార పార్టీ, దాని ప్రధాన ప్రత్యర్థి పార్టీ రెండూ ఒక కొత్త అభ్యర్థి చేతిలో ఓడిపోయాయి.
టీవీకే ఎదుగుదల డీఎంకేకు మాత్రమే కాకుండా జాతీయ స్థాయిలో బీజేపీకి కూడా ఒక సవాల్ అని ఫడ్నీస్ అభిప్రాయపడ్డారు.
"మెరుగైన జనాభా నియంత్రణ చర్యలు తీసుకున్నందుకు తమను శిక్షిస్తున్నారనే భావన దక్షిణాది రాష్ట్రాల్లో పెరుగుతోంది, విజయ్ సాధించిన ఫలితాలను కూడా ఈ కోణంలోనే చూడాల్సి ఉంటుంది" అని ఆమె అన్నారు.
"ద్రవిడ రాజకీయాల చట్రంలోనే తమిళ రాజకీయాల్లో ఒక శూన్యత ఏర్పడింది. గతంలో రాజకీయాలు డీఎంకే, ఏఐఏడీఎంకేలకు మాత్రమే పరిమితమై ఉండేవి. కానీ, ఇప్పుడు ఏఐఏడీఎంకే పలుమార్లు చీలిపోయింది, దాని లక్ష్యమేంటనే దానిపై స్పష్టత కరువైంది" అని యోగేంద్ర యాదవ్ చెప్పారు.
"ఇదంతా బీజేపీ తెరవెనుక నుంచి నడుపుతోందన్న అభిప్రాయం కూడా ఉంది. ఇలాంటి సమయంలో, విజయ్ ముందుకు వస్తున్నారు. ఆయన క్రైస్తవుడు. డీఎంకే తన రాజకీయ ప్రత్యర్థి కాగా, బీజేపీ తన సైద్ధాంతిక ప్రత్యర్థి అని, ఇద్దరికీ దూరంగా ఉంటానని ఆయన అంటున్నారు" అని యోగేంద్ర యాదవ్ అన్నారు.
"యువ ఓటర్లు, విద్యార్థులు, మహిళలు, పట్టణ ఓటర్ల నుంచి లభించిన భారీ మద్దతే విజయ్ ఎదుగుదలకు ప్రధాన కారణం" అని ఆయన చెప్పారు.
ఇది అకస్మాత్తుగా పుట్టుకొచ్చిన ఒక సంప్రదాయ నిరసన ఉద్యమమని, దీన్ని దిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధికారంలోకి వచ్చిన సమయంతో పోల్చవచ్చని ఆయన అన్నారు.
విజయ్ ఎదుగుదల స్థిరపడిన రాజకీయ వ్యవస్థను సవాల్ చేసేందుకు మార్గం చూపగలదా? భారత్‌లోని 'నిరాశ చెందిన' ప్రతిపక్షం టీవీకే విజయం నుంచి పాఠాలు నేర్చుకోగలదా?
ఈ ప్రశ్నకు యోగేంద్ర యాదవ్ బదులిస్తూ, "తమిళనాడు బయట ఉన్న ప్రజలు ఉత్తర ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో ఇది సాధ్యం కాదని అనవచ్చు. కాబట్టి నా అసలు ఆందోళన ఏంటంటే.. ఇలాంటి నమూనాను దేశంలోని ఇతర ప్రాంతాలలో పునరావృత్తం చేయగలమా?" అని అన్నారు.
"పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల సంఘం పనితీరును, కేంద్ర ప్రభుత్వం అధికారాన్ని వినియోగించే తీరును దృష్టిలో పెట్టుకుంటే టీవీకే విజయం నుంచి ప్రతిపక్షాలు ధైర్యం తెచ్చుకోగలవా? అలా చేయగలవని నాకనిపించడం లేదు" అని యోగేంద్ర యాదవ్ అన్నారు.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)