హంటావైరస్: ఎలుకల విసర్జితాలు ఎండిపోయి గాలిలో కలిసినప్పుడు, ఆ గాలి పీల్చేవారికి సోకే వైరస్.. క్రూయిజ్ షిప్‌లో మరణాలకు కారణం ఇదేనా?

    • రచయిత, యాంగ్ టియాన్
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • చదివే సమయం: 5 నిమిషాలు

అట్లాంటిక్ మహాసముద్రంలోని ఒక క్రూయిజ్ షిప్‌లో హంటావైరస్ వ్యాపించిందనే అనుమానాల తర్వాత, అందులో ప్రయాణిస్తున్న ముగ్గురు మరణించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ప్రకటించింది.

మరణించిన వారిలో డచ్ దంపతులతో పాటు జర్మనీకి చెందిన ఒకరు ఉన్నారని ఎంవీ హోండియస్ నౌకను నడుపుతున్న 'ఓషన్ వైడ్ ఎక్స్‌పీడిషన్స్' సంస్థ తెలిపింది.

ప్రస్తుతం ఇద్దరికి హంటావైరస్ సోకినట్లు నిర్ధరణ కాగా, అందులో చనిపోయిన డచ్ మహిళ కూడా ఉన్నారు. మిగిలిన ఇద్దరి మరణాలకు కారణాలపై విచారణ జరుగుతోంది.

మరోవైపు, నౌకలోని ఇద్దరు సిబ్బంది శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్నట్లు ఓషన్ వైడ్ ఎక్స్‌పీడిషన్స్ వెల్లడించింది.

షిప్ అర్జెంటీనా నుంచి కేప్ వెర్డే వెళ్తున్న సమయంలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

ఏమిటీ హంటావైరస్?

హంటావైరస్ అనేది ఎలుకల ద్వారా వ్యాపించే వైరస్ సమూహం. ఎలుకల విసర్జితాలు ఎండిపోయి గాలిలో కలిసినప్పుడు, ఆ గాలిని పీల్చడం వల్ల ఇది మనుషులకు సోకుతుంది.

ఎలుకల మూత్రం, లాలాజలం, మల విసర్జితాల నుంచి వైరస్ గాలిలోకి చేరుతుందని అమెరికాకు చెందిన 'సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్' (సీడీసీ) వివరించింది. అరుదుగా ఇవి కరవడం లేదా గీరడం వల్ల కూడా వ్యాపించవచ్చు.

ఈ వైరస్ రెండు రకాల తీవ్రమైన అనారోగ్యాలకు కారణమవుతుంది:

  • హంటావైరస్ పల్మనరీ సిండ్రోమ్ (హెచ్‌పీఎస్): ఇది మొదట అలసట, జ్వరం, కండరాల నొప్పితో మొదలై.. ఆ తర్వాత తలనొప్పి, కళ్లు తిరగడం, చలి, ఉదర సమస్యలకు దారితీస్తుంది. శ్వాసకోశ ఇబ్బందులు తలెత్తితే మరణాల రేటు సుమారు 38 శాతం వరకు ఉంటుందని సీడీసీ తెలిపింది.
  • హెమరేజిక్ ఫీవర్ విత్ రీనల్ సిండ్రోమ్ (హెచ్ఎఫ్ఆర్ఎస్): ఇది చాలా ప్రమాదకరమైనది. ప్రధానంగా మూత్రపిండాలపై ప్రభావం చూపుతుంది. రక్తపోటు తగ్గడం, అంతర్గత రక్తస్రావం, మూత్రపిండాలు వైఫల్యం చెందడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

హంటావైరస్‌గా ధ్రువీకరించిన, అనుమానిత కేసులు

దక్షిణాఫ్రికాలోని ఒక ఆసుపత్రిలో ఐసీయూలో ఉన్న 69 ఏళ్ల బ్రిటిషర్‌కు హంటావైరస్ సోకినట్లు నిర్ధరణ అయింది. అలాగే సెయింట్ హెలీనాలో నౌక దిగిన తర్వాత మరణించిన డచ్ మహిళలో కూడా ఈ వైరస్ ఉన్నట్లు గుర్తించారు.

బ్రిటన్, నెదర్లాండ్స్ దేశాలకు చెందిన ఇద్దరు సిబ్బంది తీవ్రమైన శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్నారని, అయితే వారికి హంటావైరస్ సోకినట్లు ఇంకా ధ్రువీకరణ కాలేదని ఓషన్ వైడ్ ఎక్స్‌పెడిషన్స్ తెలిపింది.

వారిలో ఒకరికి స్వల్పంగా, మరొకరికి తీవ్రంగా లక్షణాలు ఉన్నాయని, ఇద్దరికీ తక్షణ వైద్య సహాయం అవసరమని పేర్కొంది. ప్రస్తుతం 23 దేశాలకు చెందిన 149 మంది ప్రయాణికులతో ఈ క్రూయిజ్ షిప్ కేప్ వెర్డే తీరంలో ఉంది.

ఎప్పుడేం జరిగింది?

ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ), ఓషన్ వైడ్ ఎక్స్‌పీడిషన్స్ ప్రకారం:

  • ఏప్రిల్ 6: నౌకలో ఉన్న డచ్ ప్రయాణికుడిలో జ్వరం, తలనొప్పి, స్వల్పంగా విరేచనాల లక్షణాలు కనిపించాయి.
  • ఏప్రిల్ 11: ఆ వ్యక్తికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తి మరణించారు.
  • ఏప్రిల్ 24: సెయింట్ హెలీనాలో ఆయన మృతదేహాన్ని నౌక నుంచి దించారు. అదే సమయంలో జీర్ణకోశ సమస్యలతో బాధపడుతున్న ఆయన భార్య (డచ్ మహిళ) స్వదేశానికి బయలుదేరారు.
  • ఏప్రిల్ 25: దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్‌కు విమానంలో వెళ్తుండగా ఆ డచ్ మహిళ ఆరోగ్యం క్షీణించింది.
  • ఏప్రిల్ 26: ఆమె ఆసుపత్రిలో మరణించారు. పరీక్షల్లో హంటావైరస్ ఉన్నట్లు ధ్రువీకరించారు.
  • ఏప్రిల్ 27: మరో ప్రయాణికుడు, 69 ఏళ్ల బ్రిటిషర్ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఆయన్ను అత్యవసరంగా దక్షిణాఫ్రికాకు తరలించారు. ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్న ఆయన పరిస్థితి విషమంగా ఉన్నప్పటికీ స్థిరంగా ఉంది. ఈయనకు కూడా వైరస్ సోకినట్లు నిర్ధరణ అయింది.
  • మే 2: న్యుమోనియాతో బాధపడుతున్న జర్మనీకి చెందిన ఒక ప్రయాణికురాలు మరణించారు. ఈమెలో హంటావైరస్ ఉందో లేదో ఇంకా ధ్రువీకరించాల్సి ఉంది.

ఎన్ని కేసులు నమోదవుతున్నాయి?

నేషనల్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ హెల్త్ రిపోర్ట్ ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా ఏటా సుమారు 1,50,000 హెమరేజిక్ ఫీవర్ విత్ రీనల్ సిండ్రోమ్ కేసులు నమోదవుతున్నాయి.

ఇవి ప్రధానంగా యూరప్, ఆసియా ఖండాల్లో కనిపిస్తున్నాయి. ఇందులో సగానికి పైగా కేసులు చైనాలోనే వస్తున్నాయి.

అమెరికాలో హంటావైరస్ నిఘా ప్రారంభమైన 1993 నుంచి 2023 వరకు మొత్తం 890 కేసులు నమోదయ్యాయి.

అయితే, నార్వే ఎలుకల (బ్రౌన్ ర్యాట్) ద్వారా వ్యాపించే 'సియోల్ వైరస్' అనే హంటావైరస్ రకం అమెరికాతో సహా ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తుంది.

చికిత్స ఎలా అందిస్తారు?

హంటావైరస్ ఇన్ఫెక్షన్లకు నిర్దిష్టమైన ప్రత్యేక చికిత్స లేదు. లక్షణాల తీవ్రతను బట్టి ఆక్సిజన్ థెరపీ, మెకానికల్ వెంటిలేషన్, యాంటీవైరల్ మందులు, డయాలసిస్ వంటి సహాయక వైద్యం అందించాలని సీడీసీ సూచిస్తోంది. పరిస్థితి విషమంగా ఉన్న రోగులను ఐసీయూలో చేర్చి చికిత్స అందించాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో కృత్రిమ శ్వాస కోసం ట్యూబ్ వేయాల్సి రావచ్చు.

నివారణ చర్యలు:

  • వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి ఇళ్లు లేదా పని ప్రదేశాల్లో ఎలుకలు లేకుండా చూసుకోవాలి.
  • ఎలుకలు లోపలికి రాకుండా బేస్‌మెంట్లు, అటకల వద్ద ఉన్న మార్గాలను మూసివేయాలి.
  • ఎలుకల విసర్జితాలను శుభ్రం చేసేటప్పుడు గాలి ద్వారా వైరస్ సోకకుండా రక్షణ కవచాలు ధరించాలి.

ఇటీవల హంటావైరస్ కేసులు నమోదయ్యాయా?

ఫిబ్రవరి 2025లో, ఆస్కార్ అవార్డు గ్రహీత నటుడు జీన్ హ్యాక్‌మాన్ భార్య బెట్సీ అరకావా హంటావైరస్ వల్ల వచ్చిన శ్వాసకోశ వ్యాధితో మరణించారు.

అమెరికాలో ఎక్కువగా కనిపించే హెచ్‌పీఎస్ రకం ఆమెకు సోకినట్లు వైద్య పరిశోధకులు గుర్తించారు. ఆమె నివసించే ఇంటి బయట ఉన్న కట్టడాల్లో ఎలుకల గూళ్లు, చనిపోయిన ఎలుకలు కనిపించాయి.

మరణించడానికి కొన్నిరోజుల ముందు ఆమె ఇంటర్నెట్‌లో ఫ్లూ, కోవిడ్ లక్షణాల గురించి వెతికినట్లు పోలీసు రికార్డుల్లో ఉంది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)