హెర్క్యూలిస్: అది వాళ్లకు కొడుకులాంటిది, కళ్ల ముందే చనిపోయింది - 25 ఏళ్లపాటు ఎలుగు బంటిని పెంచుకున్న దంపతుల కథ

    • రచయిత, బీబీసీ ముండో
  • చదివే సమయం: 5 నిమిషాలు

ఆండి, మ్యాగీ రాబిన్‌ దంపతుల ఇంటికి హెర్క్యూలిస్ వచ్చిన రోజునుంచి, వారి ముగ్గురి జీవితం విడదీయరాని బంధంగా మారిపోయింది.

ప్రతీ ఉదయం వారు వంటగదిలో కలిసి అల్పాహారం చేసుకునేవారు. ఆ తర్వాత రోజంతా ఆటలు, ట్రైనింగ్, లేదా కలిసి తిరగడంలాంటి పనులతో గడిపేవారు.

చూస్తే అది ఒక కుటుంబంలానే అనిపించేది. కానీ అదొక అసాధారణమైన కుటుంబం. ఎందుకంటే హెర్క్యూలిస్ హెర్క్‌ అని పిలిచేది మనిషిని కాదు, ఒక ఎలుగుబంటిని.

కుక్కలు, పిల్లలను పెంపుడు జంతువులుగా ఇంట్లో పెంచుకోడాన్ని చూసుంటాం, కాని ఏకంగా ఒక ఎలుగుబంటినే ఇంట్లోకి తెచ్చుకొని 25 ఏళ్ల పాటు పెంచుకున్నారు స్కాట్లాండ్‌కు చెందిన ఆండీ, మ్యాగీ రాబిన్. తమ ఇంట్లో 25 ఏళ్ల పాటు హెర్క్యూలిస్ అనే ఎలుగుబంటిని కొడుకులా పెంచుకున్నారు.

అది ఒక గ్రిజ్లీ బేర్. తొమ్మిది నెలల పిల్లగా ఉండగా దాన్ని రాబిన్ దంపతులు దత్తత తీసుకున్నారు. పెద్దదయ్యాక అది 2.5 మీటర్లకు పైగా ఎత్తు పెరిగి, 190 కిలోలకుపైగా బరువుండేది.

మ్యాగీకి చిన్నప్పటి నుంచే జంతువులంటే ఇష్టం. స్కాట్లాండ్‌లోని ఒక వ్యవసాయ కుటుంబంలో పెరిగిన ఆమెకు గుర్రాలంటే ప్రత్యేకమైన మమకారం. చిన్న వయసులోనే గుర్రపు స్వారీ నేర్చుకుని, షో జంపింగ్‌ పోటీల్లో బహుమతులు గెలుచుకున్నారు.

ఆమె భర్త ఆండి ఒక కలప. రెజ్లింగ్‌ చాంపియన్ కూడా. ఆమెకంటే పదిహేనేళ్లు పెద్దవాడు. ఆండి మొదటిసారి ‘‘ఒక ఎలుగుబంటి పిల్లను తెచ్చుకుందాం అన్నప్పుడు, అది మా జీవితాన్ని ఇంతగా మార్చేస్తుందని నేను ఊహించలేదు. దానితో మాకు ప్రత్యేకమైన బంధం ఏర్పడింది’’ అని మ్యాగీ అన్నారు.

కెనడాలో ఉన్నప్పుడు 'టెడ్ ది టెరిబుల్‌' అనే గ్రిజ్లీ బేర్‌తో రెజ్లింగ్ పోరాటానికిగాను ఆండీకి 1,000 డాలర్ల ఆఫర్‌ రావడం ఈ ఆలోచనకు దారి తీసింది. ఆ అనుభవం అతనిలో ఒక ఎలుగుబంటిని పెంచుకోవాలనే ఆలోచనను కలిగించింది.

వారి కుటుంబ సభ్యులు, స్నేహితులు ఈ నిర్ణయాన్ని వెర్రితనంగా భావించారు. తోసిపుచ్చారు. అయినప్పటికీ, ఆండీ, మ్యాగీ వెనుకడుగు వేయలేదు. స్కాట్లాండ్‌లోని ఒక జూ నుంచి తమకు నచ్చిన ఎలుగుబంటి పిల్లను ఎంపిక చేసుకున్నారు.

‘కొడుకులా పెంచుకున్నాం... ’

1975 ఆగస్టు 31న, 67 డాలర్ల చెల్లించి ఒక ఎలుగుబంటిని అధికారికంగా దత్తత తీసుకున్నారు. దానికి హెర్క్యూలిస్ అని పేరు పెట్టారు. దానితో పాటు పుట్టిన అట్లాస్‌, శాంసన్‌ అనే ఎలుగుబంటి పిల్లలు జూలోనే ఉండిపోయాయి.

హెర్క్యూలిస్ తన సోదరులకంటే ప్రశాంతంగా, ప్రేమతో ఉండటాన్ని గమనించి హెర్క్యూలిస్‌ని ప్రత్యేకంగా ఎంచుకున్నామని వారన్నారు. అయినప్పటికీ, మొదట్లో అది బాగా అల్లరి చేసేది. మ్యాగీ దాన్ని దగ్గరికి తీసుకోడానికి రెండు నెలలు పట్టింది. ఆమెకు హెర్క్‌ ఒక కొడుకులా మారిపోయింది.

‘‘పిల్లలకూ, జంతువులకూ చిన్నప్పుడూ ఏ చెడు తెలీదు. వారిని అలాగే స్వచ్ఛంగా ఉంచడం మన బాధ్యత’’ అంటారు మ్యాగీ.

ఈ ముగ్గురి సహజీవనం ఆశ్చర్యకరంగా సాఫీగా సాగింది. హెర్క్‌ ఆండీతో కలిసి రెజ్లింగ్‌ ప్రదర్శనల్లో పాల్గొనేది. వారు నడిపే పబ్‌లో తరచూ కనిపించేది. అక్కడికి వచ్చే కస్టమర్లతో కలిసిపోయి, ఒక ప్రత్యేక ఆకర్షణగా మారింది. పబ్‌లో దానికో ఫేవరెట్ డ్రింక్ కూడా ఉండేదట.

‘‘భారీ శరీరాకృతికి విరుద్ధంగా మృదువైన స్వభావంతో ఉండడం వల్ల అది స్థానికుల హృదయాలను గెలుచుకుంది. స్కాట్‌లాండ్‌లోని డన్‌బ్లేన్‌లో అదొక పాపులర్ ఫిగర్. అది మా కమ్యూనిటీలో ఒక భాగంగా మారిపోయింది’’ అని మ్యాగీ చెప్పారు.

హెర్క్ కోసం ఏకమైన గ్రామం

1980 వేసవిలో ఒక ప్రసిద్ధ టాయిలెట్‌ పేపర్‌ ప్రకటన కోసం హెర్క్యూలిస్‌ను వెస్ట్రన్‌ హెబ్రిడ్స్‌కు తీసుకెళ్లారు. చిత్రీకరణ ప్రారంభానికి ముందు, ఆండి దానితో కలిసి సముద్రంలో ఈతకు వెళ్లారు.

ఎప్పటిలాగే హెర్క్ మెడకు తాడు కట్టాకే నీళ్లలోకి దిగారు. కానీ చలి వల్ల తాడు కుదించుకుపోయి, ముడి తెగిపోయి హెర్క్ తప్పిపోయింది. అది ఈదుకుంటూ కనిపించకుండా పోయింది.

ఈ ఘటన ఒక పెద్ద సెర్చ్ ఆపరేషన్‌కు దారితీసింది. హెలికాప్టర్లు కూడా భాగమైన ఈ ఆపరేషన్‌లో వందలాది వలంటీర్లు పాల్గొన్నారు. మీడియా కూడా ప్రతి పరిణామాన్ని రిపోర్ట్ చేసింది.

‘‘24 రోజుల తర్వాత హెర్క్యూలిస్ దొరికింది. చివరికది ఒక ఖాళీ బొచ్చు కోటులా కనిపించింది’’ అని మ్యాగీ గుర్తుచేసుకున్నారు. అది దాని బరువులో సగానికి సగం తగ్గింది.

స్థానికులు 50 లీటర్లకు పైగా పాలను దాని కోసం తీసుకొచ్చారు. అదే దాని ప్రాణాలను కాపాడింది. అనంతరం దాన్ని ఇంటికి తీసుకువచ్చి, క్రమంగా కోలుకునేంత వరకూ చూసుకున్నారు.

ఈ సంఘటన తర్వాత హెర్క్యూలిస్ ఖ్యాతి అంతర్జాతీయ స్థాయికి చేరుకుంది. అమెరికా, జపాన్‌ వంటి దేశాలకు వెళ్లి, ప్రముఖ రాజకీయ నాయకులు, టెలివిజన్‌ తారలని కలుసుకుంది హెర్క్యూలిస్. వినోద కార్యక్రమాల్లో పాల్గొంది 'ఆక్టోపస్సీ' అనే జేమ్స్‌ బాండ్‌ చిత్రంలో కూడా కనిపించింది.

25 ఏళ్లకు మరణం

2000లో హెర్క్యూలిస్ ఆరోగ్యం క్షీణించడం మొదలైంది. వెన్నుపై గాయం కారణంగా దాని వెనుక కాళ్లు పనిచేయకుండా పోయాయి. ఆండి ఎంతో కృషి చేసి దానికి చికిత్స చేసేందుకు ప్రయత్నించారు. ప్రతిరోజూ స్విమ్మింగ్‌ పూల్‌లో వ్యాయామం చేయించారు.

కొంత మెరుగుదల కనిపించినప్పటికీ, పరిస్థితి మళ్లీ దిగజారింది. వెన్నుపైన పుండు ఏర్పడింది. చివరికి 2001 ఫిబ్రవరిలో, సుమారు 25 ఏళ్ల వయసులో హెర్క్యూలిస్ మరణించింది.

ఆండి 2019లో 84 ఏళ్ల వయసులో కన్నుమూశారు. ఇద్దరికీ యూయిస్ట్‌లో, హెర్క్‌ తప్పిపోయిన ప్రదేశానికి సమీపంలో పక్కపక్కనే సమాధి నిర్మించారు.

‘‘ఇక్కడికి వచ్చినప్పుడల్లా నాకు సంతోషంగా అనిపిస్తుంది’’ అని మ్యాగీ అన్నారు.

‘‘ఆండీ, హెర్క్‌ మధ్య ఉన్న బంధం ప్రత్యేకమైంది. ఎవరైనా ఎలుగుబంటిగా పుట్టాల్సి ఉంటే ఆండీనే సరైన వ్యక్తి. మనిషిగా పుట్టాల్సి ఉంటే హెర్క్‌ సరైన బంటి. హెర్క్యూలిస్ అన్ని ప్రతికూలతలను ఎదుర్కొంది. ప్రేమ, దయ ఉంటే ఏదైనా సాధ్యమని అది నిరూపించింది’’ అంటారు మ్యాగీ.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)