తప్పిపోయిన గున్న ఏనుగును తరిమేస్తున్న ఏనుగు మందలు, ఆందోళన వ్యక్తం చేసిన మద్రాస్ హైకోర్టు, అసలేం జరిగింది?

    • రచయిత, కె. శుభగుణం
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • చదివే సమయం: 5 నిమిషాలు

కోయంబత్తూరులోని సిరుముగై అటవీ పరిధిలో తల్లికి దూరమైన ఒక ఏనుగు పిల్లను మళ్లీ అడవి ఏనుగుల మందతో చేర్చేందుకు అటవీ శాఖ అధికారులు గత కొన్ని రోజులుగా శ్రమిస్తున్నారు.

అయితే, ఈ ప్రయత్నాలు ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు.

ఈ నేపథ్యంలో, ఆ చర్యలను మరింత వేగవంతం చేయాలని మద్రాస్ హైకోర్టు ఏప్రిల్ 30న అటవీ శాఖను ఆదేశించింది.

ఆ ఏనుగు పిల్ల వయసు మూడు నెలలని తమిళనాడు పర్యావరణ, అటవీ శాఖ కార్యదర్శి సుప్రియా సాహు అన్నారు.

"అది జీవించడానికి అడవే సరైన వాతావరణం కాబట్టి, ఏదో ఒక ఏనుగుల మందతో దానిని కలిపేందుకు అటవీ శాఖ అన్ని విధాలా ప్రయత్నిస్తోంది. ఆ ప్రయత్నాల ఫలితాన్ని బట్టి తదుపరి ప్రణాళికలు సిద్ధం చేస్తాం" అని సుప్రియా సాహు తెలిపారు.

పిల్ల ఏనుగును తరిమికొట్టిన మగ ఏనుగు

ఏప్రిల్ 25న, కాందవయల్ ప్రాంతంలోని రోడ్డు పక్కన ఉన్న చెక్‌పోస్ట్ సమీపంలో తన మంద నుంచి విడిపోయి తిరుగుతున్న ఈ ఏనుగు పిల్లని అటవీ శాఖ గుర్తించింది.

వెంటనే రంగంలోకి దిగిన అధికారులు అడవిలో ఏనుగుల మంద ఎక్కడ ఉందో డ్రోన్ల ద్వారా గాలించారు. ఒక మందను గుర్తించిన తర్వాత, ఈ పిల్ల ఏనుగును నెమ్మదిగా ఆ మంద వైపు నడిపించారు. ఆ రాత్రంతా డ్రోన్లు, థర్మల్ కెమెరాల సాయంతో దాని కదలికలను నిరంతరం గమనిస్తూనే ఉన్నారు.

అయితే, ఏప్రిల్ 26న డ్రోన్ల ద్వారా చూసినప్పుడు ఆ పిల్ల ఏనుగు కనిపించలేదు. మళ్ళీ గాలింపు చేపట్టగా, ఒక నీటి కుంట సమీపంలో ఏనుగుల మందను అనుసరిస్తూ వెళ్తున్న ఆ పిల్ల దొరికింది. కానీ, అంత దగ్గరకు వెళ్ళినప్పటికీ ఆ మంద ఆ పిల్లను తనలోకి చేర్చుకోలేదు.

ఒక మగ ఏనుగు ఆ గున్న ఏనుగును తరిమికొట్టినట్లు అటవీ శాఖ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.

"ఏప్రిల్ 27న ఏనుగుల మంద వస్తుందని ఆశించి, పిల్ల ఏనుగును ఏనుగుల కోసం ఏర్పాటు చేసిన నీటి తొట్టి దగ్గర ఉంచారు. కానీ, తెల్లవారుజామున ఏ మంద అక్కడకు రాలేదు. ఆ రోజు మధ్యాహ్నం డ్రోన్ల ద్వారా మరో ఏనుగుల మందను గుర్తించి, ఆ పిల్లను అక్కడకు పంపారు. అది కాసేపు ఆ మందతో కలిసి ఉన్నప్పటికీ, మళ్లీ ఒక మగ ఏనుగు దానిని బయటకు తరిమేసింది"

"ఈ పిల్ల ఏనుగు తన మంద నుంచి విడిపోయింది. మేం దానిని గుర్తించిన తర్వాత కూడా మనుషులు దానికి అతి దగ్గరకు వెళ్లకుండా కొంత దూరం నుంచే నిఘా ఉంచాం. మందతో కలిపేటప్పుడు మనుషుల వాసన రావడం వల్ల ఆ మంద పిల్లను తిరస్కరించకూడదని 'మాస్కింగ్' అనే శాస్త్రీయ పద్ధతిని అనుసరిస్తున్నాం. ఏనుగు పిల్ల పేడ, మూత్రం, మట్టిని సేకరించి దాని శరీరంపై పూయడం ద్వారా మనుషుల వాసన తెలియకుండా జాగ్రత్తపడుతున్నాం" అని కోయంబత్తూరు జిల్లా అటవీ అధికారి వెంకటేశ్ ప్రభు వివరించారు.

పిల్ల ఏనుగు ప్రస్తుత పరిస్థితి ఏమిటి?

సిరుముగై అటవీ పరిధిలో తల్లికి దూరమైన పిల్ల ఏనుగు పరిస్థితిపై మద్రాస్ హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. దానిని తిరిగి అడవికి పంపడం, ఏదైనా ఏనుగుల మందతో కలిపే ప్రక్రియను వేగవంతం చేయాలని ఏప్రిల్ 30న అటవీ అధికారులను ఆదేశించింది.

ప్రస్తుతం ఈ ఏనుగు పిల్ల పశువైద్యులు, మావటీలు, సహాయకులతో కూడిన బృందం పర్యవేక్షణలో ఉందని కోయంబత్తూరు జిల్లా అటవీ అధికారి వెంకటేశ్ ప్రభు బీబీసీ‌తో చెప్పారు. ఎండ తీవ్రత దృష్ట్యా ఆ పిల్లకు నీరసం రాకుండా తగిన ఆహారం అందిస్తున్నట్లు ఆయన తెలిపారు.

ఈ అంశంపై హైకోర్టులో విచారణ సందర్భంగా న్యాయమూర్తులు జస్టిస్ ఎన్. సతీశ్ కుమార్, జస్టిస్ డి. భరత చక్రవర్తిలతో కూడిన ప్రత్యేక బెంచ్ స్పందిస్తూ.. "ఆ పిల్లను మందతో కలిపేందుకు అటవీ శాఖకు ఇంకా ఎంత సమయం కావాలి? నిబంధనల ప్రకారం ఈ పనులను వేగవంతం చేయాలి. అది ఒంటరిగా ఉండటం, ప్రస్తుతం ఉన్న ఎండలు ఆ పిల్ల ప్రాణాలకే ముప్పుగా మారవచ్చు" అన్నారు.

అయితే, ఆ పిల్లను వేర్వేరు మందలతో కలిపేందుకు ప్రయత్నించామని, కానీ ఫలితం దక్కలేదని అటవీ శాఖ తరపున హాజరైన స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ టి. శ్రీనివాసన్ కోర్టుకు వివరించారు.

సిరుముగై అటవీ పరిధిలో ఏప్రిల్ 25న ఈ పిల్ల ఒంటరిగా ఉన్నట్లు గుర్తించామని కోయంబత్తూరు జిల్లా అటవీ అధికారి వెంకటేశ్ ప్రభు తెలిపారు.

"దీని సంరక్షణ కోసం పశువైద్యులు, మావటీలు, సహాయకులతో కూడిన బృందాన్ని ఏర్పాటు చేశాం. నిబంధనలను కచ్చితంగా పాటిస్తున్నాం. ఆ పిల్లకు మూడు నెలలే కాబట్టి, పాలు ఇచ్చే ఆడ ఏనుగులున్న మందలో చేర్చడం అవసరం" అని ఆయన చెప్పారు.

ఐదు మందలతో కలిపే ప్రయత్నం విఫలమైందని, ఇదే పరిస్థితి కొనసాగితే నిబంధనల ప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు.

"ప్రస్తుతం ఆ పిల్ల వైద్యుల పర్యవేక్షణలో ఉంది. గతంలో ఇలాంటి ప్రయత్నాలు కొన్ని సఫలమయ్యాయి. మందలో పాలిచ్చే ఏనుగులు ఉంటే ఈ పని సులువవుతుంది. కానీ ఇది సవాలుతో కూడుకున్నది. అడవిలో అది సహజంగా పెరిగేలా చూడటమే మా లక్ష్యం. ఒకవేళ అది సాధ్యం కాకపోతే, పిల్లను క్యాంపునకు తరలించి సంరక్షిస్తాం" అని సుప్రియా సాహు బీబీసీతో అన్నారు.

‘‘వేసవిలో ఆహారం చాలా తక్కువగా దొరుకుతుంది. అందువల్ల ఏనుగుల మందలు మొత్తం ఒకే సమూహంగా వెళ్లకుండా, ఆహారం కోసం చిన్న చిన్న గ్రూపులుగా విడిపోతుంటాయి. అలా విడిపోయినప్పుడు కూడా అవి తమ మందలోని ఇతర సభ్యులతో టచ్‌లోనే ఉంటాయి. ఒక్కోసారి ఒక తల్లి ఏనుగు, దాని పిల్ల విడిగా వెళ్లాల్సి వచ్చినప్పుడు అవి మంద నుంచి తప్పిపోయే అవకాశం ఉంటుంది" అని 23 ఏళ్లుగా ఏనుగులపై పరిశోధన చేస్తున్న వన్యప్రాణి పరిశోధకులు డాక్టర్ రామకృష్ణన్ తెలిపారు.

అయితే, అటవీ శాఖ చేపట్టిన అనేక ప్రయత్నాలలో ఇతర ఏనుగు మందలు ఈ పిల్లను తమతో చేర్చుకోకుండా ఎందుకు నిరాకరించాయి అనే ప్రశ్న తలెత్తుతోంది. ఒక సందర్భంలో ఈ పిల్ల మందలో చేరడానికి ప్రయత్నించినప్పుడు, అందులోని ఒక మగ ఏనుగు దానిని తరిమికొట్టినట్లు అటవీ శాఖ విడుదల చేసిన ప్రకటన ద్వారా తెలుస్తోంది.

దీని గురించి డాక్టర్ రామకృష్ణన్‌ను అడగ్గా, "ఈ ఏనుగు పిల్ల చాలా చిన్న వయస్సులో ఉండటం వల్ల, దీనికి పాలిచ్చే తల్లి ఏనుగుల అవసరం ఉంటుంది. బహుశా అటవీ శాఖ ప్రయత్నించిన మందలలో అటువంటి ఏనుగులు ఏవీ లేకపోయి ఉండవచ్చు. ఆ కారణం చేతనే తాము దాన్ని స్వీకరించలేమని ఆ ఏనుగు పిల్లని అవి నిరాకరించి ఉండవచ్చు" అన్నారు.

"ఒకవేళ పాలిచ్చే తల్లి ఏనుగు ఉన్నప్పటికీ, అది తన సొంత పిల్లను చూసుకోవాల్సి ఉంటుంది. సాధారణంగా ఏనుగుల కుటుంబాలు ఒంటరిగా విడిపోయిన పిల్లలను తమలో చేర్చుకుంటాయి. అయినప్పటికీ, ఇది అన్ని సందర్భాల్లోనూ జరుగుతుందని కచ్చితంగా చెప్పలేం" అన్నారాయన.

ఈ ఏనుగు పిల్లను అడవిలోని మందతో కలిపేందుకు అటవీ శాఖ సాధ్యమైన అన్ని విధాలుగా ప్రయత్నిస్తుందని, అది సాధ్యం కాని పక్షంలో ప్రామాణిక నిబంధనల ప్రకారం క్యాంపులో పెంచి సంరక్షించడం గురించి నిర్ణయం తీసుకుంటామని కోయంబత్తూరు జిల్లా అటవీ అధికారి వెంకటేష్ ప్రభు తెలిపారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)