You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
వాతావరణ మార్పుల వల్ల మనుషులు పొట్టివాళ్లుగా మారిపోతున్నారా? పరిశోధనలు ఏం చెబుతున్నాయంటే...
- రచయిత, ఫెర్నాండో డ్యూర్టే
- హోదా, బీబీసీ ప్రతినిధి
- చదివే సమయం: 7 నిమిషాలు
గత సుమారు 150 సంవత్సరాలుగా, మనుషులు ఒక జాతిగా ఎత్తు విషయంలో అద్భుతమైన ఎదుగుదలను సాధించారు. కానీ, ఈ ఎదుగుదల ముగింపు దశకు చేరుకుంటోందనే సంకేతాలు కనిపిస్తున్నాయి. దీనికి గల కారణాలలో ఒకటి వాతావరణ మార్పుగా కనిపిస్తోంది.
గ్లోబల్ వార్మింగ్ (భూతాపం) వల్ల వడగాలులు, పెరిగిన తేమ వంటి తీవ్రమైన వాతావరణ పరిస్థితులు ఏర్పడుతున్నాయని స్పష్టంగా వెల్లడైంది.
ఇలాంటి పరిస్థితులు పిల్లలు పుట్టకముందే వారి ఎదుగుదలను అడ్డుకునేలా చేస్తున్నాయని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకుల బృందం తాజాగా కనుగొంది.
వాతావరణ మార్పు వల్ల తీవ్రంగా ప్రభావితమయ్యే దక్షిణాసియాలో ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయసున్న 2 లక్షల మంది చిన్నారులపై ఈ బృందం పరిశోధనలు చేసింది.
తల్లి కడుపులో ఉన్నప్పుడు, గర్భధారణ సమయంలోని ప్రతి త్రైమాసికంలో 35 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రతతో పాటు, అధిక తేమను ఎదుర్కొన్న పిల్లలు, వారి వయస్సుకు ఉండాల్సిన ఎత్తు కంటే 13 శాతం పొట్టిగా ఉన్నారని పరిశోధకులు అంచనా వేశారు.
పుట్టినప్పటి నుంచి ఐదేళ్ల లోపు పిల్లల్లో ఎత్తు పెరగడం అనేది మొత్తం పిల్లల ఆరోగ్యానికి సంబంధించి కీలకమైన సూచీగా చూస్తారు.
''మనం ఎంత ఎత్తు ఉంటామో జన్యువులు, పోషకాలు, ఆరోగ్యం వంటి ఇతర కారకాలు బలంగా నిర్ణయించేవైనా.. పర్యావరణ మార్పు వల్ల పెరుగుతున్న వేడి, అధిక తేమ వాతావరణం కూడా దక్షిణాసియాలో ఐదేళ్ల లోపున్న పిల్లల సగటు ఎత్తును తగ్గిస్తుందని అధ్యయనం సూచిస్తుంది'' అని ఈ అధ్యయన రచయిత కేటీ మెక్‌మహాన్ చెప్పారు.
''అయితే, ప్రపంచవ్యాప్తంగా పరిస్థితులు ఎలా ఉన్నాయో కచ్చితంగా తెలియదు. రాబోయే దశాబ్దాల్లో ఇది మనంఅనుసరించే పద్ధతులపై ఎక్కువగా ఆధారపడి ఉంటుంది'' అని తెలిపారు.
''ఇతర అల్ప, మధ్య ఆదాయ దేశాల్లో ఇలాంటి పరిస్థితులను చూసే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ దేశాలు అత్యధిక ఉష్ణోగ్రతలను, అత్యంత తేమ స్థాయిలను ఎదుర్కొంటున్నాయి'' అని చెప్పారు.
ప్రపంచ బ్యాంకు వర్గీకరణ ప్రకారం.. సుమారు 120 దేశాలు అల్ప, మధ్య ఆదాయ దేశాల కిందకు వస్తున్నాయి.
మనిషి ఎత్తుపై ప్రభావాలు
మనిషి జీవిత పరిణామ క్రమాన్ని గమనించినప్పుడు ఎత్తుల్లో ఎంతో వ్యత్యాసం వచ్చినట్లు శాస్త్రవేత్తలు గమనించారు. ముఖ్యంగా 10 వేల సంవత్సరాల కిందట వేటాడే జీవనం నుంచి వ్యవసాయం వైపుకు మారే సమయాల్లో, మనిషి సగటు ఎత్తుపై తొలుత ప్రతికూల ప్రభావం పడిందని పలు అధ్యయనాలు సూచిస్తున్నాయి.
ఇటీవల కాలంలో 2004లో అమెరికాలోని ఒహియో స్టేట్ యూనివర్సిటీ ఎకనామిక్స్ లెక్చరర్, ప్రొఫెసర్ రిచర్డ్ స్టెకెల్ ఒక కీలకమైన అధ్యయనాన్ని ప్రచురించారు.
తొమ్మిది నుంచి 19వ శతాబ్ద కాలాలకు చెందిన తూర్పు యూరప్‌లోని సమాధుల నుంచి వేలాది అస్థిపంజరాలను వెలికి తీసి, మనిషి ఎత్తు ఏ విధంగా ఉండేదో విశ్లేషించారు.
ఆ సమయంలో మనిషి సగటు ఎత్తులో భారీ హెచ్చుతగ్గులు ఉన్నాయని గుర్తించారు. ముఖ్యంగా 17వ శతాబ్దంలో మనిషి ఎత్తు బాగా తగ్గిపోయిందని తన విశ్లేషణలో గమనించారు.
ఈ సమయంలో యూరప్ వేగంగా విస్తరిస్తున్న నగరాల నుంచి అంటువ్యాధులు ప్రబలడం, వ్యవసాయ ఉత్పత్తిలో మార్పులు వరకు ఎన్నో గణనీయమైన మార్పులకు లోనైంది.
16 నుంచి 19వ శతాబ్దాల మధ్య కొనసాగిన చిన్న మంచు యుగాన్ని (‘లిటిల్ ఐస్ ఏజ్’) కూడా చవిచూసింది.
''ఉత్తర యూరప్‌లోని పురుషులు 1700 కాలానికి తమ ఎత్తులో సగటున 2.5 అంగుళాలు (6.4 సెంటీమీటర్లు) కోల్పోయారు. ఆ తగ్గుదలను 20వ శతాబ్దం ప్రథమార్థం వరకు కూడా పూర్తిగా పొందలేకపోయారు'' అని ప్రొఫెసర్ స్టెకెల్ తన అధ్యయనంలో రాశారు.
యూకేలోని ఇంపీరియల్ కాలేజీ లండన్‌లో పాపులేషన్ హెల్త్‌ను అధ్యయనం చేసిన డాక్టర్ ఆండ్రియా రోడ్రిగ్ మార్టినెజ్ దీనిపై స్పందించారు. మనుషుల ఎత్తు సరళిని విశ్లేషిస్తూ ఆండ్రియా పలు పేపర్లను రాశారు. పర్యావరణ మార్పు ఆధునిక జనాభాపై ఇలాంటి ఒత్తిడినే పెట్టనుందని డాక్టర్ ఆండ్రియా ఆందోళన వ్యక్తం చేశారు.
''పర్యావరణ మార్పు ప్రభావాల వల్ల ప్రపంచవ్యాప్తంగా సుమారు వంద కోట్లమంది పిల్లలు అత్యంత తీవ్రమైన ప్రమాదంలో ఉన్నట్లు ఐక్యరాజ్యసమితి అంచనావేసింది. వాతావరణ మార్పు పిల్లల ఎదుగుదలపై, ఆరోగ్యంపై అనేక రకాలుగా గణనీయమైన ప్రభావం చూపుతుందనడం నిజమే'' అని తెలిపారు.
20వ శతాబ్దంలో అన్ని విషయాలను పరిగణనలోకి తీసుకుంటే, ఎత్తులో మనిషి జీవన పరిస్థితులు కీలకంగా ఉన్నాయి.
1896 నుంచి 1996 మధ్యలో పుట్టిన 200 దేశాల మహిళలు, పురుషుల బయోమెట్రిక్ డేటా విశ్లేషణను ప్రపంచవ్యాప్తంగా ఉన్న వైద్య శాస్త్రవేత్తల నెట్‌వర్క్ ఎన్‌సీడీ-రిస్క్ (NCD-RisC) 2017లో ప్రచురించింది.
ఈ సమయంలో, ప్రపంచవ్యాప్తంగా పురుషుల సగటు ఎత్తు 162 సెంటీమీటర్ల నుంచి 171 సెంటీమీటర్లకు పెరిగింది. అలాగే, మహిళల ఎత్తు 151 సెంటీమీటర్ల నుంచి 159 సెంటీమీటర్లకు ఎగిసిందని వెల్లడైంది.
అయితే, కొన్ని దేశాల్లో ప్రజలు ఇతరుల కంటే ఎక్కువ పొడవు పెరిగారు. ఉదాహరణకు ఇరాన్ పురుషులు 16.5 సెంటీమీటర్లు ఎక్కువ ఎత్తు పెరగగా, దక్షిణ కొరియా మహిళలు 20.2 సెంటీమీటర్లు ఎక్కువ ఎత్తు పెరిగినట్లు తెలిసింది.
దీనికి విరుద్ధంగా, మడగాస్కర్‌లోని మహిళలు ఆ శతాబ్దమంతా కేవలం 1.5 సెంటీమీటర్లే పెరగగా.. పాకిస్తానీ పురుషులు 1.27 సెంటీమీటర్లు పెరిగారు.
అంత వ్యత్యాసం ఎందుకు?
''ఎత్తులో వ్యత్యాసం ఎక్కువగా జెనెటిక్స్ ఆధారంగా వివరిస్తారు. అలాగే, పోషకాలు, పర్యావరణం, సామాజిక ఆర్థిక అంశాలు కూడా దీనితో ముడిపడి ఉంటాయి'' అని డాక్టర్ మార్టినెజ్ చెప్పారు.
దీనిలో పోషకాహారం అందుబాటు, పరిశుభ్రమైన నీరు, వ్యాధులను తట్టుకునేలా రోగ నిరోధక సామర్థ్యాన్ని పెంపొందించేందుకు వైద్య పురోగతి వంటివి ఉన్నాయి.
చారిత్రకంగా జీవన ప్రమాణాలలో వచ్చిన మెరుగుదలలు, నాణ్యమైన ఆహారం అందుబాటులో ఉండటం, వైద్య రంగంలో పురోగతి కారణంగా ప్రపంచంలోనే అత్యంత పొడవైనవారిగా డచ్ ప్రజలు ప్రసిద్ధికెక్కారు.
"నివాస వాతావరణాలకు, ఆరోగ్యకరమైన జీవనానికి, ఎత్తు జనాభాకు మధ్య ఉన్న స్పష్టమైన సంబంధాన్ని వారి కథ తెలియజేస్తుంది" అని నెదర్లాండ్స్‌లోని వాగెనింగెన్ విశ్వవిద్యాలయంలో హెల్త్, సొసైటీ ప్రొఫెసర్ క్రిస్టినా థాంప్సన్ అన్నారు.
అయితే, వారి సగటు ఎత్తు తగ్గిపోయిందని నెదర్లాండ్స్ బ్యూరో ఆఫ్ స్టాటటిక్స్(సీబీఎస్)లో తేలింది.
1980లో జన్మించిన పురుషులు 19 ఏళ్లు వచ్చేసరికి సగటున 183.9 సెంటీమీటర్లు పెరిగారు. కానీ, 2001లో జన్మించిన పురుషుల సగటు ఎత్తు 182.9 సెంటీమీటర్లకు తగ్గింది. అలాగే, డచ్ మహిళల సగటు ఎత్తు 170.7 సెంటీమీటర్ల నుంచి 169.3 సెంటీమీటర్లకు తగ్గింది.
దీనికి గల కారణాన్ని సీబీఎస్ తన ప్రకటనలో పేర్కొంది. ''వలస వచ్చిన కొత్త జనాభా ఎత్తు తక్కువగా ఉందని, అందుకే, ఇక్కడే పుట్టిన వారి పిల్లల ఎత్తు కూడా తక్కువ'' అని తెలిపింది. అయితే, డచ్ సంతతికి చెందిన తల్లిదండ్రులకు పుట్టిన పిల్లల ఎత్తు కూడా తగ్గిందని గుర్తించారు.
''అయితే, ఎత్తు తగ్గడానికి కారణమేంటన్నది ఇప్పటికీ అస్పష్టంగానే ఉంది'' అని థాంప్సన్ చెప్పారు. ''వారి ఆహార నాణ్యత ఏమైనా తగ్గిందా? చిన్నతనంలోనే ఊబకాయం వారి ఎదుగుదలను ఆపేస్తుందా?'' అనే అనుమానాలు కూడా వస్తున్నాయి.
ఆశ్చర్యపరుస్తున్న వ్యత్యాసం
దీనిలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. ప్రపంచంలో అత్యంత ఎక్కువగా అభివృద్ధి చెందిన దేశాలు గ్లోబల్ హైట్ ర్యాంకింగ్స్‌లో ఉన్నత స్థానాల్లో తమ ఆధిపత్యం చెలాయిస్తున్నాయి.
అయితే, ఈ ర్యాంకింగ్‌లు మారుతూ ఉంటాయి. 19వ శతాబ్దం చివరి నాటికి, ప్రపంచంలో ప్రజలు అత్యంత ఎక్కువ ఎత్తుగా ఉండే దేశాల్లో అమెరికా మూడో స్థానాన్ని దక్కించుకుందని ఎన్‌సీడీ డేటా సూచించింది.
అయితే, ఇటీవల కాలాల్లో అమెరికన్లు కనీసం టాప్ 20ల్లో కూడా కనిపించడం లేదు.
కేవలం ఎత్తు తగ్గిపోవడమే కాదు.. 1996లో పుట్టిన అమెరికా పురుషుల సగటు ఎత్తు 100 ఏళ్ల కిందట పుట్టిన వారి పూర్వీకులతో పోలిస్తే కేవలం 6 సెంటీమీటర్ల కంటే ఎక్కువ పొడవే ఉన్నారు. ఈ సమయంలో మిగిలిన ప్రపంచమంతా చాలా వేగంగా పెరిగింది.
అమెరికాకు చెందిన ఆర్థికవేత్త, శతాబ్దాలుగా మానవ శరీర కొలతల అధ్యయనం చేస్తున్న ఆంత్రోపోమెట్రిక్ హిస్టరీ ప్రముఖుడు జాన్ కామ్లోస్ చెప్పిన వివరాల ప్రకారం.. ''దేశంలో కాలక్రమేణా తలెత్తిన సామాజిక-ఆర్థిక అసమానతలు ముఖ్యంగా ఇటీవలి దశాబ్దాలలో వైద్య సంరక్షణ అందుబాటులో ఉన్న లోపాలు దీనికి కారణం'' అని ఎత్తిచూపారు.
''పేద వారు సైతం తమ పిల్లల్ని వైద్యుని వద్దకు తీసుకెళ్లగలిగేలా సంక్షేమ విధానాలను అనుసరించిన దేశాల కంటే అమెరికా చాలా వెనుకబడింది'' అని వివరించారు.
20వ శతాబ్దం మధ్య కాలం నుంచి అమెరికాలో ఊబకాయం రేట్లు విపరీతంగా పెరగడమే దీనికి కారణమని ప్రొఫెసర్ కామ్లోస్ నిందిస్తున్నారు.
అయితే, గత రెండు దశాబ్దాల్లో అమెరికా ఆహారపు అలవాట్లు మెరుగుపడ్డాయని ప్రభుత్వ డేటా చూపుతున్నప్పటికీ, 18 ఏళ్ల లోపున్న సగం మంది అమెరికన్లు సరైన పోషకాహారం తీసుకోవడం లేదని డేటాలు సూచిస్తున్నాయి.
పెరగడం ఆగిపోతుందా?
కొన్ని అభివృద్ధి చెందిన దేశాలలో ప్రజల ఎదుగుదల గరిష్ఠ స్థాయికి చేరిందనడానికి లేదా నిలకడగా ఉండిపోయి ఉండవచ్చు అనడానికి ఆధారాలు ఉన్నాయి. కానీ అభివృద్ధి చెందుతున్న దేశాలు పుంజుకోవడం ద్వారా దీనిని భర్తీ చేసే అవకాశం ఉంది.
ప్రపంచంలో వెనుకబడిన ప్రాంతాల్లో సామాజిక-ఆర్థిక పరిస్థితులు ఇంకా మెరుగుపడే అవకాశం ఉన్నప్పటికీ, మానవ ప్రేరేపిత కార్యక్రమాల వల్ల మన వాతావరణానికి తలెత్తే పరిణామాలు కూడా ఎత్తు ఎదుగుదలకు అడ్డంకిగా మారే అవకాశం ఉందని అనుమానం వ్యక్తమవుతుంది.
''వేడి, తేమ ఎక్కువగా, వేగంగా పెరిగే ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు తరచూ పర్యావరణ మార్పుకు అనుగుణంగా మారడంలో తీవ్రమైన అడ్డంకులను ఎదుర్కొంటారు'' అని కేట్ మెక్‌మహాన్ చెప్పారు.
''వ్యవసాయం వంటివాటిల్లో పనిచేసే వారికి, ఏసీల సదుపాయం అసలు లేకపోయినా లేదా కొద్దిగానే ఉన్నా.. మనం గమనించిన ప్రతికూల ప్రభావాలు వాతావరణ మార్పు వల్ల మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంది'' అని హెచ్చరించారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)