You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
‘షూటర్’ ఫోటోను షేర్ చేసిన ట్రంప్.. ఆయన ఎవరు? సెక్యూరిటీ దాటుకుని తుపాకులు, కత్తులతో ట్రంప్ సమీపంలోకి ఎలా వచ్చాడు?
‘వాషింగ్టన్ హిల్టన్’ వేదికగా జరిగిన వైట్ హౌస్ కరెస్పాండెంట్స్ డిన్నర్ కార్యక్రమంలో కాల్పుల అలజడి అనంతరం వైట్ హౌస్ బ్రీఫింగ్ రూమ్ నుంచి విలేఖరులను ఉద్దేశించి ట్రంప్ మాట్లాడారు.
అనేక ఆయుధాలతో ఉన్న ఒక వ్యక్తి, సెక్యూరిటీ చెక్ పాయింట్ వైపు దూసుకురావడంతో సీక్రెట్ సర్వీస్ అతన్ని పట్టుకుందని ట్రంప్ వెల్లడించారు.
ఈ మేరకు కస్టడీలో ఉన్న అనుమానితుడి ఫోటోను, కాల్పులు మొదలైనప్పడు రికార్డయిన ఫుటేజీని సోషల్ మీడియాలో షేర్ చేసినట్లు ట్రంప్ తెలిపారు.
పారదర్శకత కోసమే దీన్ని షేర్ చేసినట్లు చెప్పారు.
సీక్రెట్ సర్వీస్ ఏజెంట్‌పై కాల్పులు..
ఈ ఘటనలో ఒక సీక్రెట్ సర్వీస్ అధికారిపై చాలా దగ్గరి నుంచి కాల్పులు జరిగాయని ట్రంప్ తెలిపారు.
'బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ధరించడం వల్ల ఆయన ప్రాణాలతో బయటపడ్డారు. నేను ఇప్పుడే ఆ అధికారితో మాట్లాడాను. ఆయన బాగున్నారు. చాలా ధైర్యంగా ఉన్నారు. ఆయన చాలా గర్వించదగిన వ్యక్తి' అని అన్నారు.
'బాల్ రూమ్' అవసరం అర్థమయ్యేలా...
నిర్మాణంలో ఉన్న వైట్ హౌస్ బాల్ రూమ్ గురించి ట్రంప్ ప్రస్తావించారు.
ఒక బాల్ రూమ్ కోసం '150 ఏళ్లుగా' లా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఎదురుచూస్తోందని అన్నారు.
'వైట్ హౌస్‌లో మేం ప్లాన్ చేస్తున్న అన్ని వసతులు ఎందుకు అవసరమో నేటి కాల్పుల ఘటన అర్థమయ్యేలా చేసింది. గతంలో ఎన్నడూ లేనంత భద్రత ఇప్పుడు అవసరం. గత రెండేళ్లలో ఒక రిపబ్లికన్ నాయకుడిపై దాడి జరగడం ఇది మొదటిసారి కాదు' అని వ్యాఖ్యానించారు.
'నిందితుడిది వికృత మనస్తత్వం'
కస్టడీలో ఉన్న అనుమానితుడు చాలా వికృత మనస్తత్వం కలవాడని ట్రంప్ అభివర్ణించాడు.
ఇలాంటి ఘటనలు జరగాలని ఎవరూ కోరుకోరని అన్నారు.
అనుమానితుడిని కస్టడీలోకి తీసుకున్నాం: ఎఫ్‌బీఐ
విందు జరుగుతున్న వేదిక వద్ద కాల్పులు జరిపినట్లుగా అనుమానిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు ఎఫ్‌బీఐ స్పష్టం చేసింది.
వాషింగ్టన్ హిల్టన్ హోటల్ వద్ద జరిగిన కాల్పుల ఘటనలో వెంటనే స్పందించిన నేషనల్ క్యాపిటల్ రెస్పాన్స్ స్క్వాడ్ నిందితుడిని అదుపులోకి తీసుకుందని ఎఫ్‌బీఐ ఒక ప్రకటన విడుదల చేసింది.
‘నిందితుడి ఉద్దేశం తెలియదు’ - పోలీసులు
ఈ కాల్పుల వెనుక నిందితుడి ఉద్దేశం ఏంటని మెట్రోపాలిటన్ పోలీస్ డిపార్ట్‌మెంట్ తాత్కాలిక చీఫ్ జెఫ్రీ కారోల్‌ను ప్రశ్నించగా... 'అది ఇంకా తెలియలేదు' అని ఆయన సమాధానమిచ్చారు.
కాల్పులు జరిగినంత మాత్రాన దీన్ని భద్రతా వైఫల్యంగా భావించలేమని అన్నారు.
నిందితుడికి సంబంధించిన పాత నేర చరిత్ర వివరాల గురించి మెట్రోపాలిటన్ పోలీస్ డిపార్ట్‌మెంట్‌కు సమాచారం లేదని చెప్పారు.
'అతని వద్ద రకరకాల గన్‌లు, కత్తులు ఉన్నాయి'
నిందితుని వద్ద ఒకటి కంటే ఎక్కువ ఆయుధాలు ఉన్నాయని మెట్రోపాలిటన్ పోలీస్ డిపార్ట్‌మెంట్ చీఫ్ జెఫ్రీ తెలిపారు.
''అతని వద్ద ఒక షాట్‌గన్, ఒక హ్యాండ్‌గన్, చాలా కత్తులు ఉన్నాయి'' అని ఆయన చెప్పారు.
నిందితుడికి ఎలాంటి గాయాలు కాలేదని స్పష్టం చేశారు. ఆతనొక్కడే ఈ దాడికి పాల్పడినట్లుగా కనిపిస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు.
'అనుమానితుడు ఆ హోటల్‌కు వచ్చిన ఒక అతిథి'
ఈ ఘటనకు పాల్పడిన నిందితుడు, కాలిఫోర్నియాలోని టోరెన్స్‌కు చెందిన 31 ఏళ్ల కోల్ థామస్ అలెన్‌గా గుర్తించినట్లు అమెరికా మీడియాలో వార్తలు వచ్చాయి.
నిందితుడు ఈ కార్యక్రమం జరుగుతున్న హోటల్‌లోనే అతిథిగా ఉన్నాడని వాషింగ్టన్ డీసీ పోలీస్ చీఫ్ జెఫ్రీ డబ్ల్యూ కారోల్ అన్నారు. దర్యాప్తులో భాగంగా అతను బస చేసిన గదిని ప్రస్తుతం పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)