అమెరికాతో యుద్ధం జరుగుతున్న సమయంలో ఇరాన్‌లో ప్రజలు ఎలా జీవిస్తున్నారు?

చదివే సమయం: 6 నిమిషాలు

ఇరాన్ రాజధాని తెహ్రాన్‌ లాంటి నగరాల్లో దైనందిన జీవితం మెల్లమెల్లగా సాధారణ స్థితికి చేరుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి.

అయితే సోషల్ మీడియాలో ఇరాన్ ప్రజల విభిన్న అనుభవాలు వెలుగులోకి వస్తున్నాయి.

సాధారణ జీవితాన్ని కొనసాగించడం ఒక వైపు, మానసిక సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, ఇంటర్నెట్ దొరక్కపోవడం మరోవైపు... ఇరానియన్లు రోజువారీ జీవితంలో ఎదుర్కొంటున్న రెండు పార్శ్వాలను ఈ కథనం చర్చిస్తుంది.

ఇవి కొందరు వ్యక్తుల అనుభవాలు. వారి గురించి మనకు అవగాహన కల్పిస్తాయి. అంతే తప్ప మొత్తం సమాజాన్ని ప్రతిబింబించవు.

అయితే ఈ పరిస్థితులన్నీ కొన్నివారాల క్రితం ఏర్పడ్డాయని వాళ్లు చెబుతున్నారు. అందులో ఇంటర్నెట్ ఆంక్షలు, ఆర్థిక ఒత్తిళ్ల, యుద్ధానికి సంబంధించిన అంశాలు ఉన్నాయి.

ఈ పరిస్థితిని ఎదుర్కోవడం ఎలా అనే అంశంలోనూ ప్రజల్లో రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి.

ప్రస్తుత పరిస్థితుల్లోనూ కొంతమంది కెఫేకు వెళ్లడం, దుస్తులు కొనడం గురించి సోషల్ మీడియా అకౌంట్లలో రాయడం బాధ్యతా రాహిత్యానికి నిదర్శనమని కొందరు యూజర్లు విమర్శిస్తున్నారు.

యుద్ధ వాతావరణంలో

కొందరు తమ జీవితాలను కొనసాగించేందుకు తమకున్న హక్కును రక్షించుకుంటున్నట్లు కనిపిస్తున్నారు.

ఒక యూజర్ తాను రాత్రంతా చాలాసార్లు ఏడ్చినప్పటికీ "నేను ఇప్పటికీ మంచి దుస్తులు వేసుకుని నా స్నేహితులతో కలిసి బయటకు వెళ్లగలను. దాని గురించి నన్ను ఎవరూ ఏమీ అనరు" అని రాశారు.

ఫుట్‌బాల్ మ్యాచ్ గురించి ఓ నెటిజన్ గురించి మరో యూజర్ ప్రస్తావించారు. "మన మనసులకు కొన్ని సార్లు డైవర్షన్ అవసరం. కాబట్టి 'వైట్ సిమ్ కార్డులు' ఉన్నవారి ( ఇంటర్నెట్ వాడకంపై ఆంక్షలు తక్కువగా ఉన్న వారిని) ఏమీ అనకండి" అని రాశారు.

ఇతరులతో పోలిస్తే ఇరాన్‌లో వైట్ సిమ్ కార్డులు ఉన్న వారికి మెరుగైన ఇంటర్నెట్ ఉంటుంది. సాధారణ ప్రజలకు అందుబాటులో లేని సైట్లు వారికి అందుబాటులో ఉంటాయి.

"ఇందులో ఆశ్చర్యం కలిగించేది కాదు. మనం ఆందోళనలో చిక్కుకుపోకుండా ఉండాలంటే మన మనసులకు కొంత విశ్రాంతి అవసరం. మన జీవితాలు చాలా కాలం ఇలాగే ఉంటాయోమో" అని మరో యూజర్ రాశారు.

ప్రజలు తమ మనసుల్లో ఆందోళనను ఎదుర్కోవడానికి చేస్తున్న ప్రయత్నాల గురించి మెసేజ్‌లు పోస్ట్ చేశారు.

"నేను ఎంత ఆందోళనలో ఉన్నానంటే, ఉదయం ఆరు గంటలకే లేచి ఇల్లు శుభ్రం చేయడం మొదలు పెట్టాను" అని ఒక యూజర్ రాశారు.

ఇరాన్‌లో "ఇంటర్నెట్ ప్రో" అనేది తక్కువ పరిమితులతో కొంతమందికి మాత్రమే లభించే ప్రత్యేకమైన ఇంటర్నెట్ సర్వీస్.

ఇంటర్నెట్ సదుపాయం గురించి ప్రజలు విస్తృతంగా చర్చిస్తున్నారు. నెట్ వాడకంపై పరిమితులు, అధిక ఖర్చులు, రోజువారీ జీవితంలో దాని ప్రభావం గురించి ప్రజలు తమ అభిప్రాయాలను సోషల్ మీడియాలో తెలియజేస్తున్నారు.

పరిమిత ఇంటర్నెట్ యాక్సెస్‌పై ఆగ్రహం

ఇరాన్‌లో కొంతమంది ప్రజలు ఇంటర్నెట్ యాక్సెస్ సమస్యలు ఎదుర్కొంటున్నట్లు చెబుతున్నారు.

"నేను చాలా కష్టపడి ఒక జీబీ కొన్నాను. అందుకు నాకు 10 లక్షల రియాల్స్(సుమారు రూ. 72) ఖర్చైంది" అని ఓ యూజర్ రాశారు.

"నా ఫోన్‌లో ఉన్న 2 జీబీ అయిపోయి నేను మళ్లీ చీకట్లో ఉండిపోతానేమోనని ఆందోళన చెందుతున్నాను" అని మరో యూజర్ రాశారు.

ఇంటర్నెట్‌ను ప్రజల హక్కుగా భావిస్తున్నామని కొంతమంది యూజర్లు చెప్పారు.

"ఓపెన్ ఇంటర్నెట్ అనేది ప్రతి ఒక్కరి హక్కు" అనే సందేశాలు ఆన్‌లైన్‌లో కనిపిస్తున్నాయి.

"హక్కుల కోసం ఎవరూ యాచించరు. ఇంటర్నెట్ అంటే ఇంటర్నెట్ అంతే. అందులో ఎలాంటి సందేహాలు లేవు" అని మరో యూజర్ రాశారు.

ఈ మెసేజ్‌లలో ఇంటర్నెట్ ప్రో అనే ప్లాన్ తరచుగా ప్రస్తావిస్తున్నారు.

వ్యాపార లేదా విశ్వవిద్యాలయాలతో సంబంధం ఉన్న వ్యక్తుల వంటి ఒక నిర్దిష్ట సమూహానికి అందించే ఇంటర్నెట్ సదుపాయాన్ని తెలిపేందుకు ఈ పదాన్ని ఉపయోగిస్తున్నారు.

వీరికి అదనంగా చెల్లించండం లేదా నిర్ణీత కోటా ద్వారా తక్కువ ఆంక్షలున్న లేదా మరింత విస్తృతమైన ఇంటర్నెట్ సదుపాయం లభిస్తుంది.

ఇరాన్‌లో సామాన్య ప్రజలకు ఇంటర్నెట్ సదుపాయం మునుపటి లాగే పరిమితంగా ఉంది.

'ఇంటర్నెట్ ప్రో' గురించి ఎందుకింత చర్చ?

యూజర్లు దీన్ని 'వర్గ ఆధారిత ఇంటర్నెట్' అని చెబుతున్నారు.

ఇది ఇంటర్నెట్ సదుపాయం విషయంలో సమాజంలో అసమానతలకు సూచికని మరి కొందరు పేర్కొన్నారు

"ఇంటర్నెట్ ప్రో' అంటే ప్రజా హక్కును వర్గాలుగా విభజించడం" అనేది ఓ యూజర్ అభిప్రాయం.

"ప్రజలను వర్గాలుగా విభజించి వివిధ సమూహాలకు వేర్వేరు విధాలుగా ఇంటర్నెట్ సదుపాయం అందించడం సామాజిక వర్గ విభజనను మరింత పెంచుతుంది" అని మరో యూజర్ అభిప్రాయపడ్డారు.

బహిరంగ ఇంటర్నెట్ లభ్యత, దానిపై పరిమితుల గురించి అనేక మంది మెసేజ్‌లు పోస్ట్ చేశారు.

"ఇంటర్నెట్ లేని వారి గొంతుకగా ఉండండి" అని కొంతమంది యూజర్లు కోరారు.

యుద్ధం వల్ల దేశంలో ఆర్థిక కార్యకలాపాలు స్తంభించి పోవడం గురించి కొంతమంది మెసేజ్ చేశారు.

చిన్న వ్యాపారాలు ఇంటర్నెట్‌పై ఆధారపడిన ఉద్యోగాలపై దీని ప్రభావం గురించి ప్రత్యేకంగా చర్చ జరిగింది.

తమకు తెలిసిన వారు కొంతమంది నిరుద్యోగులుగా ఉన్నారనే పోస్టులు కూడా కనిపిస్తున్నాయి.

"ఉక్కు, పెట్రోకెమికల్ కర్మాగారాలపై జరిగిన దాడుల కారణంగా నా కుటుంబం మొత్తం నిరుద్యోగులుగా మారాల్సి వచ్చింది. అందరం ఇంట్లోనే ఉంటున్నాం" అని మరో యూజర్ రాశారు.

ధరల పెంపు అంశం కూడా పదేపదే తెరపైకి వస్తోంది.

నిత్యావసర వస్తువుల ధరలను వివరిస్తూ అది పెరుగుతున్న ఆర్థిక ఒత్తిడికి సంకేతంగా మరి కొంతమంది అభివర్ణించారు.

ఒక సందేశంలో బ్రెడ్, చీజ్ మొదలుకొని మందుల వరకు అన్ని వస్తువుల ధరలు పెరిగాయి. అందులో గుడ్ల ధరల పెరుగుదల ప్రముఖంగా ప్రస్తావించారు.

యుద్ధ భయం- మానసిక ఒత్తిడి

యుద్ధం వల్ల ఏర్పడిన మానసిక ఒత్తిడి సంకేతాలను వివరించే సందేశాలు అనేకం ఉన్నాయి.

"ఒత్తిడి వల్ల నా శరీరం మొత్తం వణికిపోతోంది" అని ఓ యూజర్ రాశారు.

కొన్ని సందేశాలు యుద్ధ అనుభవాన్ని, దాని ప్రభావాన్ని కూడా ప్రస్తావించాయి.

అందులో అకస్మాత్తుగా వచ్చే శబ్దాలకు భయపడటం లేదా గొడవ మళ్లీ మొదలవుతుందేమోనని ఆందోళన చెందడం లాంటివి ఉన్నాయి.

ఉరుముతున్న శబ్ధం వినిపించిన తర్వాత "ఎక్కడైనా బాంబు పడుతోందేమో" అని అనిపిస్తున్నట్లు ఓ యూజర్ మెసేజ్ పోస్ట్ చేశారు.

మళ్లీ యుద్ధం మొదలవుతుందేమో అనే భయం చాలా మందిలో కనిపిస్తోంది. ఈ భయం ఆన్‌లైన్ మెసేజుల్లో ప్రతిఫలిస్తోంది.

"బహుశా రేపు మళ్లీ యుద్ధం మొదలవుతుందేమో" అని ఓ మహిళ రాశారు.

ఈ సందేశాలన్నీ పరిమితంగా, చెల్లాచెదురుగా ఉన్నప్పటికీ కొన్ని వారాలుగా తలెత్తిన సమస్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయని చూపిస్తున్నాయి.

అందులో ఇంటర్నెట్ ఆంక్షలు, ఆర్థిక ఒత్తిడి, యుద్ధం వల్ల కలిగే ఆందోళన భవిష్యత్తుపై అభద్రత వంటివి ఉన్నాయి.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)