ఇరాన్ యుద్ధం: అమెరికా ప్రతినిధుల పాకిస్తాన్ పర్యటనను రద్దు చేసిన ట్రంప్

    • రచయిత, జెస్సికా రాన్‌స్లే
  • చదివే సమయం: 4 నిమిషాలు

ఇరాన్ యుద్ధంపై చర్చల కోసం అమెరికా ప్రతినిధుల పాకిస్తాన్ పర్యటనను శనివారం డోనల్డ్ ట్రంప్ రద్దు చేశారు. ఇస్లామాబాద్ నుంచి ఇరాన్ ప్రతినిధుల బృందం వెళ్లిపోయిన కాసేపటికే ఈ నిర్ణయం వెలువడింది.

అక్కడికి వెళ్లడం వల్ల తమ ప్రత్యేక ప్రతినిధి స్టీవ్ విట్కాఫ్, అల్లుడు జారెడ్ కుష్నర్‌ల 'సమయం చాలా వృథా' అవుతుందని ట్రంప్ అన్నారు.

ఇరాన్ నిజంగా మాట్లాడాలనుకుంటే 'వారు కేవలం ఫోన్ చేస్తే సరిపోతుంది' అని వ్యాఖ్యానించారు.

దీనికంటే ముందు, చర్చలకు మధ్యవర్తిగా వ్యవహరిస్తున్న పాకిస్తాన్‌తో ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ చర్చలు జరిపారు.

యుద్ధాన్ని ముగించే విషయంలో ఇరాన్ వైఖరిని పాక్‌తో పంచుకున్నామని... అయితే 'దౌత్యం విషయంలో అమెరికా నిజంగా సీరియస్‌గా ఉందో లేదో' తెలుసుకోవాల్సి ఉందని అరాగ్చీ తెలిపారు.

విఫలమవుతున్న దౌత్య ప్రయత్నాలు

ఇరు దేశాల మధ్య చర్చలు కొనసాగడానికి వీలుగా.. ఏప్రిల్ 22తో ముగియాల్సిన కాల్పుల విరమణను ట్రంప్ పొడిగించినప్పటికీ దౌత్య ప్రయత్నాలు నిలిచిపోయాయి.

హార్ముజ్ జలసంధిపై ఇరాన్ నియంత్రణ, ఇరాన్‌ అణు కార్యక్రమం, చమురు ఎగుమతులను అడ్డుకోవడానికి హార్ముజ్ జలసంధిలో అమెరికా తన నౌకాదళాన్ని మోహరించడం వంటి అంశాలపై ఇరుపక్షాలు వెనక్కి తగ్గడం లేదు.

శుక్రవారం ఈ పర్యటన గురించి ప్రకటన వచ్చినప్పుడు, 'ఇరానీయులు చర్చల్ని కోరుకుంటున్నారు' అని వైట్‌హౌస్ చెప్పింది. కానీ, నేరుగా సమావేశమయ్యే ఆలోచనలు తమకు లేవని ఇరాన్ వెల్లడించింది.

ఇరుపక్షాల మధ్య మరో రౌండ్ ముఖాముఖి చర్చలపై ఆశలు సన్నగిల్లినప్పటికీ, శనివారం వరకు కాల్పుల విరమణ కొనసాగుతుందని ట్రంప్ అన్నారు.

అమెరికా ప్రతినిధుల పర్యటన రద్దు అయిందంటే దానర్థం యుద్ధం మళ్లీ మొదలు కానుందా? అని ప్రశ్నించగా... 'లేదు, దానర్థం అది కాదు. మేం ఇంకా దాని గురించి ఆలోచించలేదు' అని వార్తాసంస్థ యాక్సియస్‌కు ట్రంప్ చెప్పారు.

అమెరికా ప్రతినిధుల పర్యటన రద్దు గురించి శనివారం ప్రకటిస్తూ ట్రంప్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశారు.

'ఇరాన్ నాయకత్వంలోనే చాలా గందరగోళం ఉంది. అక్కడ ఎవరు అధికారంలో ఉన్నారో వారితో పాటు బయట ఎవరికీ తెలియదు. అంతా మా చేతుల్లోనే ఉంది. ఇరాన్‌కు వేరే అవకాశమే లేదు. వాళ్లు మాతో మాట్లాడాలనుకుంటే ఫోన్ చేయడమే' అని ట్రూత్ సోషల్‌లో ట్రంప్ పేర్కొన్నారు.

తాము చర్చలకు సిద్ధంగా ఉన్నామని, కానీ 'ఒప్పందాల ఉల్లంఘన, దిగ్బంధనం, బెదిరింపులే ఈ చర్చలకు ప్రధాన అడ్డంకులు' అని గతంలో ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ అన్నారు.

అమెరికా, ఇరాన్ మధ్య చర్చలకు గత కొన్ని వారాలుగా పాకిస్తాన్ మధ్యవర్తిగా వ్యవహరిస్తోంది.

పాకిస్తాన్‌లో తన పర్యటన 'ఫలప్రదమైందని' ఇరాన్ విదేశాంగ మంత్రి అరాగ్చీ ట్వీట్ చేశారు.

'యుద్ధాన్ని శాశ్వతంగా ముగించే కార్యాచరణను వివరించాను. ఈ విషయంలో అమెరికా సీరియస్‌గా ఉందో లేదో చూడాలి' అని ట్వీట్‌లో ఆయన పేర్కొన్నారు.

ప్రాంతీయ పరిస్థితులపై ఇరువురి మధ్య సానుకూల చర్చలు జరిగాయని పాక్ ప్రధాని షాబాజ్ షరీఫ్ అన్నారు.

ప్రస్తుతం, ఒమన్ పర్యటనలో ఉన్న అరాగ్చీ.. తర్వాత తిరిగి ఇస్లామాబాద్ వచ్చే అవకాశం ఉంది.

లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు

మరోవైపు, శనివారం దక్షిణ లెబనాన్‌పై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో నలుగురికి పైగా చనిపోయినట్లు అక్కడి ప్రభుత్వ మీడియా పేర్కొంది.

హిజ్బొల్లా తమపై రాకెట్ దాడులు చేసిందని ఇజ్రాయెల్ సైన్యం పేర్కొంది.

ఇజ్రాయెల్, ఇరాన్ మద్దతు ఉన్న హిజ్బొల్లా మిలిటెంట్ గ్రూపు మధ్య కాల్పుల విరమణ ఒప్పందం ఉన్నప్పటికీ గత కొన్ని వారాలుగా ఇరుపక్షాలు పరస్పరం దాడులు చేసుకుంటూనే ఉన్నాయి. ఒప్పందాన్ని ఉల్లంఘించినట్లు పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నాయి.

లెబనాన్‌లోని హిజ్బొల్లా లక్ష్యాలపై తీవ్ర దాడులు చేయాలని సైన్యానికి ఆదేశాలు జారీ చేసినట్లు శనివారం ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)