ట్రంప్ భద్రతపై ప్రశ్నలు.. తరచూ ఎందుకు టార్గెట్ అవుతున్నారు?

    • రచయిత, జేక్ లఫామ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • చదివే సమయం: 5 నిమిషాలు

వైట్‌హౌస్ కరస్పాండెంట్స్ డిన్నర్ పార్టీలో కాల్పుల ఘటన జరిగిన కొన్ని గంటల తర్వాత మాట్లాడిన డోనల్డ్ ట్రంప్.. ‘దీనికంటే ప్రమాదకరమైన వృత్తి మరొకటి ఉందంటే నేనసలు ఊహించలేను'' అని తన పదవిని ఉద్దేశించి అన్నారు.

అమెరికా అధ్యక్షుడిని ప్రపంచంలోనే అత్యంత భద్రత గల మనిషిగా ఉంచేందుకు సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లతో ఒక చిన్నపాటి సైన్యమే ఉన్నప్పటికీ.. ఆయన్ను సురక్షితంగా ఉంచడం అంత తేలికైన పని కాదని నిరూపితమవుతోంది.

మొదట 2024 వేసవిలో పెన్సిల్వేనియాలోని బట్లర్‌లో ట్రంప్‌పై హత్యాయత్నం జరిగింది. ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో బుల్లెట్ ఆయన చెవిని తాకింది.

64 రోజుల తర్వాత.. ట్రంప్ మరోసారి లక్ష్యంగా మారారు. ఆయన ఫ్లోరిడా గోల్ఫ్ కోర్సులో ఉన్నప్పుడు హత్యాయత్నం జరిగింది.

ఇప్పుడు, దేశ రాజధానిలోని హిల్టన్ హోటల్‌లో వైట్‌హౌస్ కరెస్పాండెంట్స్ అసోసియేషన్‌కు డిన్నర్ పార్టీ ఇస్తుండగా కాల్పుల శబ్దాలు వినిపించాయి.

దీంతో, ట్రంప్ భద్రతను మరోసారి పరిశీలించాల్సిన అవసరం ఏర్పడింది.

అనుమానిత షూటర్ 31 ఏళ్ల కోల్ థామస్ అలెన్ అసలు లక్ష్యం ఏంటన్నది అస్పష్టంగా ఉన్నప్పటికీ, కోల్ అలెన్.. అధ్యక్షుడికి అంత దగ్గరగా ఎలా రాగలిగారన్న ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.

ఆ ప్రశ్నల్లో.. వాషింగ్టన్‌కు అత్యంత ఉన్నత స్థాయి రాజకీయవేత్తలు, అధికారులు, జర్నలిస్టులకు ఆతిథ్యం ఇచ్చే హోటల్‌లో నిర్వహించే భద్రత తనిఖీ స్థాయి కూడా ఒకటి.

గంటల తరబడి వాషింగ్టన్ హిల్టన్ చుట్టూ రోడ్లను మూసివేసినప్పటికీ, వెన్యూ వద్ద భదత్ర మాత్రం అంత ఎక్కువగా లేదని బీబీసీ చీఫ్ నార్త్ అమెరికా కరెస్పాండెంట్ గారీ ఓడోనో చెప్పారు.

''బయట ద్వారం వద్దనున్న వ్యక్తి ఆరు అడుగుల దూరం నుంచే నా టిక్కెట్‌ను పైపైన చూసి లోపలికి పంపించారు'' అని గారీ రాశారు.

విందు కార్యక్రమానికి ఇచ్చిన టిక్కెట్లపై కేవలం టేబుల్ నెంబర్లు మాత్రమే ఉన్నాయి. అవి అతిథులకు చెందిన అసలైన నంబర్లు కావు. హోటల్‌లో ప్రవేశించే వారిని కూడా ఎక్కడా గుర్తింపు తనిఖీలు చేయలేదు.

విందుకు వెళ్లే అతిథులు ప్రధాన లాబీల నుంచి ఎస్కలేటర్ల మీదుగా కిందకు దిగి, బాల్‌రూమ్ ప్రవేశ ద్వారాలకు ఒక అంతస్తు పైన ఉన్న ప్రాంతంలోని భద్రతా తనిఖీ కేంద్రంలోంచి వెళ్లారు. విందు ప్రారంభమైనప్పుడు, వారు లోపలికి ప్రవేశించడానికి మెట్ల నుంచి కిందకు దిగారు.

ట్రంప్ సోషల్ మీడియాలో పోస్టు చేసిన సీసీటీవీ ఫుటేజీలో.. సీక్రెట్ సర్వీసు ఏజెంట్లు కాల్పులు మొదలు పెట్టడానికి ముందు, ఈ చెక్ పాయింట్లలో ఒకదానిలోంచి అనుమానితుడు వెళ్లినట్లు కనిపిస్తుంది.

నిందితుడి వద్ద షాట్‌గన్, హ్యాండ్ గన్, కొన్ని కత్తులు ఉన్నాయని అధికారులు చెప్పారు. తనను అడ్డుకోవడానికి ప్రయత్నించిన అధికారులపై నిందితుడు కాల్పులు జరిపారు.

చాలా ప్రమాదకరమైన ఆయుధాన్ని వాడుతూ.. అనుమానితుడు పలుమార్లు కాల్పులు జరిపినట్లు సీఎన్ఎన్ జర్నలిస్ట్ వోల్ఫ్ బ్లిట్జర్ చెప్పారు.

ఆ తర్వాత అధ్యక్షుడు పోస్టు చేసిన ఫోటోలో నేలపై చొక్కా లేకుండా పడుకున్న వ్యక్తి ఉన్నారు. ఆయన చేతులకు వెనుక నుంచి సంకెళ్లు వేసి ఉన్నాయి. ఆయన చుట్టూ సీక్రెట్ సర్వీసు అధికారులు నిల్చుని ఉన్నారు.

అనుమానిత షూటర్ లక్ష్యం అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్, ఆయన అధికారులు అయి ఉండొచ్చని అమెరికా తాత్కాలిక అటార్నీ జనరల్ టాడ్ బ్లాంచి చెప్పారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, వాషింగ్టన్ హిల్టన్‌కు కోల్ థామస్ అలెన్ ఒక అతిథిగా హాజరయ్యారు.

ప్రపంచంలోని అత్యంత శక్తిమంతమైన వ్యక్తులు కొందరు అదే భవనంలో ఉన్నప్పటికీ, ఆ హోటల్ తన కార్యకలాపాలను కొనసాగించింది.

శనివారం విందు కార్యక్రమం ప్రారంభం కావడానికి కొన్ని గంటల ముందే ఆ హోటల్‌లో సాధారణ ప్రజలకు ప్రవేశం క్లోజ్ చేశారు.

హోటల్ అతిథులకు, అలాగే ఆ ప్రాంగణంలో జరిగే విందు లేదా రిసెప్షన్‌లకు టిక్కెట్లు ఉన్నవారికి మాత్రమే ప్రవేశం పరిమితం చేశారు.

బాల్‌రూమ్‌లోనే ట్రంప్ కూర్చున్నారు. బయట కాల్పుల శబ్దాలు వినిపించిన తర్వాత ఆ గదిని తమ ఆధీనంలోకి తీసుకునేందుకు భారీ ఆయుధాలు కలిగిన కౌంటర్ అసాల్ట్ టీమ్‌లతో పాటు పెద్ద ఎత్తున సెక్యూరిటీ రంగంలోకి దిగింది.

వాషింగ్టన్‌కు యూకే అంబాసిడర్‌గా పనిచేసిన కిమ్ డారోచ్ కూడా ఈ కరెస్పాండెంట్ల విందు కార్యక్రమానికి హాజరయ్యారు. ఆయన అక్కడి భద్రత ఏర్పాట్లను విమర్శించారు.

''ఒకవేళ మీరు అక్కడ (హోటల్ అతిథిగా) ఉండి, ఈ విందులోకి చొరబడాలనే దురుద్దేశాలు మీకు ఉంటే, మీరు దాటవలసిన భద్రతా వలయం ఒక్కటే ఉంటుంది. ఆ తర్వాత మీరు బాల్‌రూమ్‌లోకి ప్రవేశిస్తారు" అని ఆయన బీబీసీ 'సండే విత్ లారా క్యూయెన్స్‌బర్గ్' కార్యక్రమానికి తెలిపారు.

హిల్టర్ అంత సురక్షితమైన భవనం కాదని ట్రంప్ ఆ తర్వాత చెప్పారు. ఈ ఘటన నిర్మాణంలో ఉన్న సరికొత్త వైట్‌హౌస్ బాల్‌రూమ్ ప్రాధాన్యాన్ని తెలియజేస్తుందన్నారు. కానీ, ఈ భవన నిర్మాణం ఎన్నో లీగల్ సమస్యలను ఎదుర్కొంది.

''అది చాలా పెద్ద గది. చాలా సురక్షితమైనది. డ్రోన్ ప్రూఫ్‌. బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ ఉంటుంది. మనకు ఆ బాల్‌రూమ్ కావాలి'' అని ఆయన పేర్కొన్నారు.

అధ్యక్షుడిని, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ను వేదికపై నుంచి సురక్షితంగా బయటికి తీసుకొచ్చిన భద్రతా సిబ్బంది సమయ స్ఫూర్తిని ట్రంప్ ప్రశంసించారు. వారు చాలా ఉన్నతమైన పని చేశారని అన్నారు.

లా ఎన్‌ఫోర్స్‌మెంట్ నిపుణులు, అధ్యక్షుడి భద్రతకు సంబంధించిన నిపుణులు.. కాల్పులకు పాల్పడ్డ వ్యక్తి బాల్‌రూమ్‌లోకి ప్రవేశించలేదంటే అర్థం అక్కడ భద్రతా ఏర్పాట్లు బాగా పనిచేస్తున్నట్లే అన్నారు.

''సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు శిక్షణ తీసుకున్నది సరిగ్గా ఇలాంటి స్పందన కోసమే'' అని ఎఫ్‌బీఐ మాజీ స్పెషల్ ఏజెంట్ జెఫ్ క్రోగెర్ అన్నారు.

కాల్పుల శబ్దాలు విన్నప్పుడు, వెంటనే వారు అధ్యక్షుడి వద్దకు దూసుకువచ్చి, ఆయనకు రక్షణ గోడలా నిలిచారని తెలిపారు.

విందు కార్యక్రమంలో ఏజెంట్లు, అధికారులు, పోలీసుల కొరత లేదని సీక్రెట్ సర్వీసు మాజీ ఏజెంట్ బారీ డొనాడియో బీబీసీకి తెలిపారు.

ట్రంప్‌కు భద్రతా ఎలా మారుతుండొచ్చనే దానిపై స్పందించిన కొందరు నిపుణులు... ట్రంప్ కార్యక్రమాలకు ఇక నుంచి విస్తృతమైన వలయం వంటి గట్టి భద్రతా చర్యలు తీసుకుంటారని భావిస్తున్నారు.

అమెరికాలో రాజకీయ హింస పెరుగుతోందని గణాంకాలు సూచిస్తున్న నేపథ్యంలో, ఈ కాల్పుల ఘటన ఆ హింసలో తాజా పరిణామంగా మారింది.

2023లో అమెరికా కేపిటల్ పోలీసులు 8 వేలకు పైగా బెదింరిపు ఘటనలను విచారించారు. 2018తో పోలిస్తే 50 శాతం ఎక్కువ.

యుటాలో జరిగిన కాల్పుల్లో కన్జర్వేటివ్ యాక్టివిస్ట్ చార్లీ క్రిక్ చనిపోవడంతో అమెరికాలో తీవ్రమైన రాజకీయ విభేదాలు బహిర్గతమయ్యాయి.

కిర్క్‌ను అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్‌కు సన్నిహితుడిగా చెబుతారు. యూటా కాలేజీలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయనపై కాల్పులు జరిగాయి. ఆ కాల్పుల్లో 31 ఏళ్ల చార్లీ కిర్క్ ప్రాణాలు కోల్పోయారు.

అంతకుముందు కూడా అమెరికా అధ్యక్షులపై హత్యాయత్న ఘటనలు జరిగాయి. 1981లో రిపబ్లికన్ అధ్యక్షుడు రోనాల్డ్ రీగన్‌పై కూడా కాల్పులు జరిగాయి. జాన్ హింక్లీ జూనియర్ అనే వ్యక్తి ఆయనపై కాల్పులు జరిపి, గాయపరిచాడు. ఈ కాల్పుల్లో రీగన్ ఊపిరితిత్తులకు గాయమైనా, ఆయన ప్రాణాలతో బయటపడ్డారు.

తనపై తరచూ జరుగుతున్న దాడుల గురించి ట్రంప్‌ను ప్రశ్నించగా.. అంతకుముందు అబ్రహం లింకన్ వంటి అధ్యక్షులు కూడా లక్ష్యంగా మారినట్లు చెప్పారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)