You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
గదర్ పార్టీ: భారత స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్న ఈ గ్రూప్‌కు, ఇరాన్‌కు ఉన్న అనుబంధం ఏంటి?
- రచయిత, అవతార్ సింగ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
- చదివే సమయం: 6 నిమిషాలు
ఇరాన్-అమెరికా యుద్ధ సమయంలో భారత్‌లోని అనేక వర్గాలు ముఖ్యంగా రైతులు, సిక్కులు, ముస్లింలు ఇరాన్‌కు గణనీయమైన సానుభూతిని వ్యక్తం చేశాయి.
భారతీయులలో చాలామంది ఇరాన్ సంస్కృతి, సాహిత్యంతో అనుబంధం ఉంది. భారత స్వాతంత్ర్య పోరాట సమయంలో ఇరాన్ అనేకమంది స్వాతంత్ర్య సమరయోధులకు, గదర్‌వాదులకు (గదర్ ఉద్యమంలో పాల్గొన్నవారు) ఆశ్రయం కల్పించింది.
ఇరాన్ వెళ్లిన భారత స్వాతంత్ర్య సమరయోధుల తొలి పేర్లలో భగత్ సింగ్ మామ, పగ్డీ సంభల్ జట్టా ఉద్యమ నాయకుడు అజిత్ సింగ్, సూఫీ అంబా ప్రసాద్ ఉన్నారు.
వాళ్ల తర్వాత ఇరాన్‌లో నివసిస్తూ 'జర్మనీ సహాయంతో' బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడిన గదరీ వైద్యుడు పి.ఎస్. ఖాన్‌ఖోజే, ఆయన సహచరుల ప్రస్తావన కూడా ఉంది.
రచయిత గురుచరణ్ సింగ్ సహన్‌సరా రాసిన 'హిస్టరీ ఆఫ్ ది గదర్ పార్టీ' పుస్తకం ప్రకారం, గదర్ కార్యకర్తలు ఇరాక్, ఇరాన్ నుంచి పోరాటంలో పాల్గొన్నారు. జలంధర్‌లోని దేశ్ భగత్ యాద్గార్ కమిటీ ఈ పుస్తకాన్ని ప్రచురించింది.
ఇరాన్‌తో సంబంధాలు
1907లో బ్రిటిష్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన రైతు ఉద్యమంలో పాల్గొన్నవారిలో అజిత్ సింగ్ ప్రముఖుడు.
ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌కు చెందిన అంబా ప్రసాద్ 1907లో జైలు నుంచి విడుదలైన తర్వాత లాహోర్ వెళ్లి రైతు ఉద్యమంలో చేరారని లూథియానాలోని ఆర్య కళాశాల మాజీ ప్రొఫెసర్ పి.ఎస్. భోగల్ తెలిపారు.
"1908లో నేను సూఫీ అంబా ప్రసాద్, మరో ముగ్గురితో కలిసి భారతదేశం విడిచి పర్షియాకు (ప్రస్తుతం ఇరాన్) వెళ్ళాను. ఆ సమయంలో దేశం విడిచి వెళ్ళడానికి పాస్‌పోర్ట్ అవసరం లేదు. మేం కరాచీ నుంచి బుషెహర్‌కు వెళ్లే ఓడను తేలిగ్గానే పట్టుకున్నాం. అది పర్షియన్ విప్లవ కాలం" అని 'బరీడ్ అలైవ్' అనే తన ఆత్మకథలో అజిత్ సింగ్ రాశారు.
సూఫీ అంబా ప్రసాద్ హిందూ-ముస్లిం ఐక్యతకు మద్దతుదారని, తరచుగా అజిత్ సింగ్ ఇంటికి వెళ్లేవారని 'వెన్ టూ స్ట్రీమ్స్ మెట్' అనే పుస్తక రచయితలలో ఒకరైన భరత్ డోగ్రా చెప్పారు.
కానీ భారతదేశంలో పనిచేయడం వారికి చాలా కష్టంగా మారడం, అరెస్టు అవుతామనే భయం కారణాలతో వారిద్దరూ ఇరాన్ వెళ్లి, అక్కడ ప్రవాసంలో తమ ఉద్యమ కార్యకలాపాలను కొనసాగించారు.
అజిత్ సింగ్ తుర్కియేకు వెళ్లాల్సిరావడంతో ఇరాన్‌లోని చాలా పనుల భారం అంబా ప్రసాద్‌పై పడిందని భరత్ డోగ్రా తెలిపారు.
ఆ సమయంలో బ్రిటిష్ వారు కూడా ఇరాన్‌పై తమ పట్టును పెంచుకుంటున్నారు. అంబా ప్రసాద్ ఇరాన్‌లో ప్రవాసంలో ఉన్నప్పుడు ఒక వార్తాపత్రికను ప్రచురించడం కూడా ప్రారంభించారు.
ఇరాన్, బలూచిస్తాన్ నుంచి దాడికి సన్నాహాలు
కెనడా, అమెరికాలో నివసిస్తున్న భారతీయ వలసదారులు 1913లో గదర్ పార్టీని స్థాపించారు.
గదర్ పార్టీ అనేది సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా సాయుధ పోరాటాన్ని ప్రకటించి, భారతదేశానికి సంపూర్ణ స్వాతంత్ర్యం కోరిన ఒక రాజకీయ పార్టీ. దీని వ్యవస్థాపకుడు సోహన్ సింగ్ భక్నా. ఈ పార్టీ ప్రధాన కార్యాలయం శాన్ ఫ్రాన్సిస్కోలో ఉండేది.
'హిస్టరీ ఆఫ్ గదర్ పార్టీ' పుస్తకం ప్రకారం, డాక్టర్ ఖాన్‌ఖోజే, బిషన్ దాస్ కొచర్ నూర్‌మహల్, కిదార్‌నాథ్ హరియాణా (హోషియార్‌పూర్ జిల్లా), భాయ్ బసంత్ సింగ్ చొంధా (పాటియాలా), భాయ్ హర్నామ్ సింగ్, రిషికేశ్ లత్తా (మహారాష్ట్ర), అమీన్ చౌధురి (బెంగాల్)లను మెసపటోమియా(ఇరాక్), ఇరాన్‌లకు పంపింది గదర్ పార్టీ.
ఈ గదర్ దళాలు గ్రీస్ మీదుగా కాన్‌స్టాంటినోపుల్ (ప్రస్తుత ఇస్తాంబుల్) చేరుకుని, ఇండియన్ కమిటీ ఆదేశాల మేరకు మెసపటోమియా, ఇరాన్ యుద్ధ రంగాలలోకి దూకారు.
గదర్ ఉద్యమ విప్లవకారులు భారతదేశంలోని బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా బయటి నుంచి దాడి చేయడానికి ఒక ప్రణాళికను రూపొందించారని డాక్టర్ ఖాన్‌ఖోజే తన జ్ఞాపకాలలో రాశారని మాజీ ప్రొఫెసర్ హరీశ్ పూరి తన ' గదర్ మూవ్‌మెంట్: ఏ షార్ట్ హిస్టరీ' అనే పుస్తకంలో పేర్కొన్నారు.
"అమెరికాలో సైనిక శిక్షణ పొందిన ఖాన్‌ఖోజే.. ఇరాన్ (పర్షియా), బలూచిస్తాన్ ద్వారా భారత్‌లోకి ప్రవేశించి యుద్ధం ప్రారంభించాలని ప్లాన్ చేశాడు" అని పూరి రాశారు.
ఆ సమయంలో మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభమవుతుండడంతో జర్మనీ సాయం తీసుకోవాలని గదారీలు ఆలోచించారు.
జర్మనీ నుంచి అందిన సహాయం గురించి రాణా ప్రీత్ గిల్ ఇటీవల ప్రచురించిన తన 'గదర్ మూమెంట్: ఏ ఫర్‌గాటెన్ స్ట్రగుల్' అనే పుస్తకంలో ఇలా రాశారు.
"విల్‌హెల్మ్ వాస్మస్ నాయకత్వంలో పదిహేను మందితో కూడిన మొదటి బృందం 1914 సెప్టెంబర్ 6న బెర్లిన్ నుంచి తుర్కియేకి బయలుదేరింది"
"ఆ రోజుల్లో, ఇరాన్ వ్యూహాత్మక ప్రాముఖ్యత అపారమైనది. ఎందుకంటే దాని భూభాగం గుండా వెళ్ళకుండా ఏ ఆపరేషన్‌ను పూర్తి చేయడం సాధ్యమయ్యేది కాదు. విమానాల ద్వారా మందుగుండు సామగ్రిని జారవిడవడం సాధ్యమయ్యేది కాదు. మిలీషియాలు (పౌరుల సాయుధ బృందాలు) కూడా వైర్‌లెస్ రేడియో వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాలలో అంతగా నైపుణ్యంతో ఉండేవి కావు"
కానీ, బ్రిటిషర్లు, రష్యన్ల పట్ల ఇరాన్ అనుమానంతో ఉండేది. వారికి, తుర్కియే పౌరులకు మధ్య స్నేహం లేదు. కానీ జర్మన్లపట్ల సానుభూతి ఉండేది. డెమోక్రటిక్ పార్టీ, కొంతమంది గిరిజన నాయకులు జర్మన్లకు సానుభూతి చూపారు.
రాణా గిల్ ఇలా రాశారు, "వాస్మస్ మిషన్ జరుగుతుండగా, జర్మన్లు కెప్టెన్ ఆస్కార్ వాన్ నీడర్ మేయర్ నాయకత్వంలో కాబూల్‌కు రెండో మిషన్‌ను పంపారు. అఫ్గానిస్తాన్‌ను భారతదేశంపై దాడి చేయడానికి ఒప్పించడమే ఈ మిషన్ ప్రధాన లక్ష్యం"
ఆ బృందం 1914 డిసెంబరు 5న ఇస్తాంబుల్ నుంచి బయలుదేరి అలెప్పోలో వాస్మస్‌ను కలుసుకుంది. అక్కడి నుంచి వారంతా కలిసి బాగ్దాద్‌కు బయలుదేరి 1915 జనవరి మధ్యలో అక్కడికి చేరుకున్నారు.
నెరవేరని కల
'హిస్టరీ ఆఫ్ ది గదర్ పార్టీ' అనే పుస్తకంలో ఇచ్చిన ఆధారాల ప్రకారం, స్థానిక బ్రిటిష్ అనుకూల ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇరాన్ ప్రజలను రెచ్చగొట్టి బలూచిస్తాన్ వైపు ముందుకు సాగడమే గదర్‌వాదుల వ్యూహం.
బలూచిస్తాన్ నుంచి ఈ తిరుగుబాటు పంజాబ్‌లోకి మరింతగా వ్యాపించింది. బాగ్దాద్, బస్రా, బుషెహర్‌లలో గదర్‌వాదులు బ్రిటిష్ సైన్యంలోని హిందీ సైనికుల మధ్య తిరుగుబాటు కోసం ప్రచారం ప్రారంభించారు.
‘‘తర్వాత యుద్ధ గమనం మారడం ప్రారంభమైంది. తుర్కియే ఓడిపోయింది. బాగ్దాద్‌ను బ్రిటిష్ వారు స్వాధీనం చేసుకున్నారు. గదరీ సైన్యం విజయాలు ఇక్కడితో ఆగిపోయాయి. గదరీ సైన్యానికి మద్దతు ముగిసింది" అని సహన్‌సరా రాశారు.
"జర్మన్ కూటమి ఓడిపోయింది. మరోవైపు గదారీలు కూడా పట్టుబడ్డారు" అని భోగల్ రాశారు.
"1916 జనవరిలో, ఖాన్‌ఖోజే, ఆయన సహచరులలో కొందరు అంతకుముందు తమ ఆశయానికి విధేయత ప్రకటించిన స్థానిక గిరిజన నాయకుడు బహ్రామ్ ఖాన్ బంపూరితో చర్చలు జరపడానికి బంపూరికి వెళ్లారు. కానీ పశ్చిమ ప్రాంతంలో అలజడి సృష్టించాలన్న వారి ప్లాన్ బ్రిటిష్ వారికి తెలిసిపోయిందని వారికి తెలియదు" అని రాణా ప్రీత్ గిల్ రాశారు.
బ్రిటిష్ వారు ప్రతిస్పందించి బంపూరితో సహా ఆ ప్రాంతంలోని అనేకమంది గిరిజన నాయకులను తమవైపుకు తిప్పుకున్నారు. ఖాన్‌ఖోజే, ఆయన సహచరులు బంపూరిని కలవడానికి వెళ్ళినప్పుడు వారిపై దాడి జరిగిందిగానీ వారు తప్పించుకోగలిగారు.
"ఖాన్‌ఖోజే పశ్చిమం వైపు పారిపోతుండగా పట్టుబడ్డారు. ఆయన ఇతర సహచరులు అరెస్టయ్యారు. కొద్దిమంది మాత్రమే తప్పించుకుని షిరాజ్‌కు తిరిగి వచ్చారు. ఈ సమయానికి ఇరాన్‌లో జర్మన్ ప్రభావం క్రమంగా క్షీణిస్తోంది" అని రాణా ప్రీత్ గిల్ రాశారు.
"డాక్టర్ ఖాన్‌ఖోజే అమెరికా నుంచి ఇరాన్‌కు వచ్చారు. జర్మన్ కమిటీ సహాయంతో ప్రజలను సమీకరించి అఫ్గనిస్తాన్ ద్వారా భారత్‌పై దాడి చేయాలని ఆయన ఆశించారు. ఆయనకు గొప్ప ఆశయాలు ఉండేవి. మంచి కలలుకన్నారుగానీ వాస్తవికతకు కొంచెం దూరమయ్యారు"
"చాలామంది స్వాతంత్ర్య సమరయోధులు తమ భద్రత కోసం ఇరాన్‌కు వెళ్లి అక్కడి నుంచే పోరాటాన్ని కొనసాగించేవారు. షిరాజ్‌లో జరిగిన ఒక ఎన్‌కౌంటర్ తర్వాత అంబా ప్రసాద్ తన ఎడమ చేతితోనే రివాల్వర్‌ను పట్టుకుని తనపై దాడి చేసిన వారిని ఎదుర్కొన్నారు. ఆయన చాలా ధైర్యంగా పోరాడారు. కానీ చివరికి పట్టుబడి జైలుజీవితం గడిపారు" అని గిల్ రాశారు.
ఆయనకు మరణశిక్ష విధించారుగానీ జైలులోనే మరణించారు. ఇరాన్‌లో జరిగిన ఆయన అంత్యక్రియలకు పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. ఇప్పటికీ ఇరాన్‌లో ఆయన గౌరవార్థం నిర్మించిన స్మారక చిహ్నాన్ని చాలామంది సందర్శిస్తారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)