కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా, 'మనం సాధించాం' అన్న సీజేపీ

ఫొటో సోర్స్, Raj K Raj/Hindustan Times via Getty Images
కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు.
నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో ఆయన రాజీనామా డిమాండ్ చేస్తూ దాదాపు నెల రోజులుగా దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసనలు జరుగుతున్నాయి.
ఈ అంశంపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి.
ఈ నేపథ్యంలో, ధర్మేంద్ర ప్రధాన్ సోషల్ మీడియా వేదికగా తన రాజీనామాను ప్రకటించారు.
ఈ మేరకు ఆయన ఎక్స్‌లో ఒక పోస్ట్ చేశారు. "జంతర్ మంతర్‌తో పాటు దేశంలో నెలకొన్న పరిస్థితులను దేశ వ్యతిరేక శక్తులు తమకు అనుకూలంగా మలుచుకునేందుకు అవకాశం ఇవ్వకూడదు. దేశ సమగ్రతను కాపాడుకోవాలి. విద్యార్థులు కూడా న్యాయపరమైన చిక్కుల్లో పడకూడదు. మన పిల్లలు తమ సమయాన్ని చదువుకు, కెరీర్ నిర్మాణానికి కేటాయించాలి. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని, నా రాజీనామా లేఖను గౌరవ ప్రధాన మంత్రికి సమర్పించాను" అని ఆయన అందులో రాశారు.
దీనికిముందు, కాంగ్రెస్‌తో సహా అన్ని ప్రతిపక్ష పార్టీలు ఆయన రాజీనామాను డిమాండ్ చేశాయి.
రాజీనామాపై కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే స్పందిస్తూ "మనం అనుకున్నది సాధించాం, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. మనం సాధించి చూపించాం" అని అన్నారు.

ప్రధాన్ ఏమన్నారంటే..
రాజీనామా చేస్తున్నట్లు ధర్మేంద్ర ప్రధాన్ ఎక్స్‌లో పోస్టు చేసిన లేఖను 'నా యువ మిత్రులారా' అంటూ ప్రారంభించారు.
ఆ లేఖలో "నేను గత 4 దశాబ్దాలుగా విద్యార్థులు, ఉపాధ్యాయులు, విద్యా సంస్కరణల కోసం పని చేస్తున్నాను. బలమైన, సమగ్రమైన, దూరదృష్టి గల విద్యా వ్యవస్థే బలమైన దేశానికి పునాది అని నా గట్టి నమ్మకం.
నేను దేశ యువత ఆకాంక్షలను, భావాలను, వారి న్యాయమైన కోరికలను ఎంతగానో గౌరవిస్తాను. భారత యువత కలలను సాకారం చేయడం మన అందరి రాజకీయ, సామాజిక జీవితాల నైతిక సంకల్పం. దూరదృష్టి గల ప్రధానమంత్రి నాయకత్వంలో దేశానికి సేవ చేసే అవకాశం లభించినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.
నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై మొదటి రోజు నుంచే నేను బాధ్యత తీసుకున్నాను, ఈ పరిస్థితి నుంచి ఎప్పుడూ పారిపోలేదు. పరీక్షా మాఫియా వల్ల ఏ ఒక్క ప్రతిభావంతుడైన విద్యార్థి భవిష్యత్తు పాడవకూడదనేది నా సంకల్పం, ఎవరికీ అన్యాయం జరగనివ్వను.
అయితే, ఈ సమయంలో కూడా బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న కొందరు వ్యక్తులు విద్యార్థులను తప్పుదోవ పట్టించడానికి, అడ్డంకులు సృష్టించడానికి ప్రయత్నించడం నా మనస్సును తీవ్రంగా బాధించింది.
జంతర్ మంతర్ వద్ద, దేశవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితులను దేశ వ్యతిరేక శక్తులు తమ స్వార్థానికి వాడుకునే అవకాశం ఇవ్వకూడదు. మన పిల్లలు చదువులపై దృష్టి పెట్టి, కెరీర్ నిర్మించుకోవాలి. అందుకే నా రాజీనామా లేఖను గౌరవనీయ ప్రధాన మంత్రికి సమర్పించాను" అని రాశారు.

ఫొటో సోర్స్, ANI
'ప్రశ్నించినప్పుడే దారిలోకి వస్తారు'
అభిజీత్ దీప్కే మాట్లాడుతూ, "ఏమనేవారు వీళ్లు? ఈ ప్రభుత్వంలో రాజీనామాలు ఉండవని చెప్పేవారు కదా? వీళ్లు అదే అనేవాళ్లు కదా? ఈ ప్రభుత్వంలో రాజీనామాలు ఉండవని చెప్పేవారు కదా? మేం ఒక్కటే చెప్పాలనుకుంటున్నాం.. 'ప్రపంచం తల వంచుతుంది.. తలవంచేవాళ్లు ఉండాలి అంతే."
"చూడండి, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అయితే అయిపోయింది. మీరు భయపడకుండా ఉంటే, ఈ ప్రభుత్వానికి తలవంచకుండా ఉంటే ఎంతటి వారినైనా గద్దె దించవచ్చు అనే దానికి ఈ రాజీనామా నిదర్శనం. కాబట్టి ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు. ఇది ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యంలో మాట్లాడటానికి కూడా భయపడితే అది ప్రజాస్వామ్యం ఎలా అవుతుంది?
మనం భయపడకూడదు. మనం గొంతెత్తి ప్రశ్నించినప్పుడే అందరూ దారిలోకి వస్తారు. వాళ్లను దారిలో పెట్టడం చాలా అవసరం. ఎందుకంటే, ఈ రోజు తమను తాము బాద్ షాలుగా భావించుకుంటున్న వీళ్లంతా.. మన వల్లనే తాము అక్కడ కూర్చున్నామనే సంగతి గుర్తుపెట్టుకోవాలి.
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. కానీ, మాకు ఇంకా రెండు డిమాండ్లు ఉన్నాయి. ఇక్కడితోనే అయిపోలేదు. మేం కాక్రోచ్‌లం.. ఒకసారి లోపలికి వచ్చామంటే అంత తేలిగ్గా బయటకు వెళ్లం.
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. కానీ, ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు న్యాయం జరగాలి. ప్రాణాలు కోల్పోయిన ప్రతీ విద్యార్థి కుటుంబానికి ప్రభుత్వం రూ. 1 కోటి నష్టపరిహారం అందించాలి. రెండోది, జులై 20న నిరసనకారులపై దాడికి పాల్పడిన పోలీసు అధికారులు డీసీపీ సందీప్ లాంబా, ఏసీపీ అజేయ్ శర్మ, సచిన్ శర్మలపై కఠిన చర్యలు తీసుకోవాలి.
మోదీ, అమిత్ షాల పేరుతో మీరు మాపై లాఠీచార్జ్ చేశారు కదా. ఇప్పటికైతే ఒక రాజీనామా మాత్రమే జరిగింది. ఒక కేంద్ర మంత్రి చేతే రాజీనామా చేయించగలిగినప్పుడు... మీరెంత? మేం లాఠీ దెబ్బలు తిన్నాం, తలలు పగలగొట్టించుకున్నాం. ఈ దేశ విద్యార్థులు ఎంతో ధైర్యంగా పోరాడారు. జులై 20 నుంచి నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులందరిపై పెట్టిన కేసులు, నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లు అన్నింటినీ ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలి" అని అన్నారు దీప్కే.
"భారతదేశ ప్రజలారా.. ప్రజాస్వామ్యం అంటే ఇలాగే ఉండాలి. ఇది నిజమైన ప్రజాస్వామ్యం" అన్నారాయన.

ఫొటో సోర్స్, Sonu Mehta/Hindustan Times via Getty Images
'విద్యార్థులారా, మిమ్మల్ని చూస్తే గర్వంగా ఉంది'
తమ భవిష్యత్తు రక్షణ కోసం బలంగా నిలబడిన ప్రతి ఒక్క యువకుడికి, ప్రతి విద్యార్థికి అభినందనలు తెలుపుతున్నానని లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు.
ఆయన ఎక్స్‌లో పెట్టిన వీడియో పోస్టులో "ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా మన విద్యా వ్యవస్థను మళ్లీ తీర్చిదిద్దే దిశగా ఒక చాలా పెద్ద అడుగు. శభాష్ దేశ విద్యార్థులారా, మీ అందరినీ చూస్తే గర్వంగా ఉంది.
వీధుల్లోకి వచ్చి ప్రజాస్వామ్యం, రాజ్యాంగం, తమ భవిష్యత్తు రక్షణ కోసం బలంగా నిలబడిన ప్రతి ఒక్క యువకుడికి, ప్రతి విద్యార్థికి అభినందనలు. ప్రధాన మంత్రి విద్యార్థులను, దేశ భవిష్యత్తును గౌరవిస్తూ క్షమాపణ చెప్పాలి, విద్యార్థులపై జరిగిన హింసకు కారణమైన దోషులపై చర్యలు తీసుకోవాలి.
సమాజంలోని ఇతర వర్గాలైన రైతులు, కార్మికులు, పేదలు - ఈ ప్రభుత్వం ఎవరినైతే అణచివేసిందో, తొక్కేసిందో వారందరికీ చెప్పేదేంటంటే, గౌరవం కోసం రాజ్యాంగబద్ధమైన పద్ధతిలో బలంగా నిలబడటంలోనే అసలైన ధైర్యం ఉంది.
ఈ ప్రభుత్వాన్ని తొలగించే సమయం వచ్చేసింది. భయపడకండి" అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)



























