"రైలు ఎక్కి తనిఖీలు చేశారు, పోలీసుల నిర్బంధాలు చూస్తే భయమేస్తోంది"-తెలుగు రాష్ట్రాల యువకులు ఇంకా ఏం చెప్పారు?

దిల్లీ, పోలీస్, తెలుగు రాష్ట్రాలు
ఫొటో క్యాప్షన్, దిల్లీలో పోలీసులు
    • రచయిత, పవన్ కాంత్ దిగవల్లి
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • ప్రచురణ
  • చదివే సమయం: 4 నిమిషాలు

భారత్ ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేశ్ కుమార్‌ రాజీనామా, ‘సర్’ రద్దు కోరుతూ చేస్తున్న నిరసనలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి.

నిన్నటి వరకు ప్రతిపక్షాలు దిల్లీలో ఆందోళన చేపడితే ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ ధర్నాలకు పిలుపునిచ్చింది. దీంతో దేశ రాజధాని కట్టుదిట్టమైన భద్రత నడుమ ఉంది.

భారీ భద్రతా బలగాల మోహరింపు, చెట్లకు కట్టిన లౌడ్ స్పీకర్ల ద్వారా వినిపించే దిల్లీ పోలీస్ ప్రకటనలతో సెంట్రల్ దిల్లీ గంభీరంగా మారింది.

యువత నిరసనల్లో పాల్గొనకుండా చేసేందుకు పోలీసులు చేస్తున్న ప్రయత్నాలు సోషల్ మీడియాలో చర్చనీయాంశమవుతున్నాయి. ముఖ్యంగా కాలేజీల హాస్టళ్లకు, పేయింగ్ గెస్ట్ యజమానులకు, రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్లకు దిల్లీ పోలీసులు విజ్ఞప్తులు చేస్తున్న వీడియోలు బాగా వైరల్ అవుతున్నాయి.

ఓవైపు ప్రకటనలు కొనసాగుతుండగానే, దిల్లీ చుట్టుపక్కల ప్రాంతాల నుంచే కాకుండా తెలుగు రాష్ట్రాల నుంచి కూడా యువత ఈ నిరసనల్లో పాల్గొనడానికి వచ్చింది. దాదాపుగా 25 మంది తెలుగు రాష్ట్రాలకు చెందిన నిరసనకారులు వేర్వేరు రైళ్లలో దిల్లీ చేరుకున్నారు. తామంతా కాక్రోచ్ జనతా పార్టీ సభ్యులుగా వారు చెప్పుకుంటున్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

''మేమంతా వేర్వేరు రైళ్లలో శుక్రవారం ఉదయం దిల్లీకి చేరుకున్నాం. దాదాపుగా 25 మంది వచ్చాం. ఇంకా చాలా మంది వేర్వేరు మార్గాల ద్వారా దిల్లీకి చేరుకుంటున్నారు. వైజాగ్, కాకినాడ, కావలి, కర్నూలు, కడప, హైదరాబాద్, వరంగల్‌కు చెందిన వ్యక్తులు శుక్రవారం వచ్చిన వారిలో ఉన్నారు'' అని బీబీసీ తెలుగుతో కడపకు చెందిన సీజేపీ సభ్యుడు చేతన్ ప్రమోద్ చెప్పారు.

ప్రయాణ మార్గంలో అనేకచోట్ల పోలీసులు తమను తనిఖీ చేశారని వీరు చెబుతున్నారు. ముఖ్యంగా మధ్యప్రదేశ్‌లో నాలుగు చోట్ల పోలీసులు రైలులోకి వచ్చి దిల్లీ వెళ్తున్న సీజేపీ సభ్యుల కోసం గాలించారనీ, వాళ్లకు దొరికిన కొందరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారని చెప్పారు. మిగతా వాళ్లు ప్రతి చోటా పోలీసుల నుంచి తప్పించుకుంటూ ఎలాగోలా దిల్లీ చేరుకున్నారని చేతన్ ప్రమోద్ చెప్పారు.

అయితే అదుపులోకి తీసుకున్న కాసేపటికే నిరసనకారుల్లో కొందరిని విడుదల చేసి వెనక్కి పంపించినట్టు మధ్యప్రదేశ్‌ పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు.

''భోపాల్, ఇటార్సీ, గ్వాలియర్ స్టేషన్లలో పోలీసులు మా కోసం తీవ్రంగా గాలించారు. మేం కర్నాటక సంపర్క్ క్రాంతి రైలులో వచ్చాం. తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌లో వస్తున్న హైదరాబాద్‌కు చెందిన వాళ్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇంకా చాలామంది వేర్వేరు రైళ్లలో దిల్లీ వస్తున్నారు'' అని చేతన్ ప్రమోద్ వివరించారు.

కొన్ని రైళ్లలో పోలీసులు తనిఖీలు జరుపుతున్న వీడియోలు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. అయితే, బీబీసీ ఈ వీడియోలను స్వయంగా ధ్రువీకరించ లేదు. ఇటార్సీలో తనిఖీలు జరుపుతున్న పోలీసు అధికారిని ఇలా ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించినప్పుడు, ‘‘పై నుంచి వచ్చిన ఆదేశాల మేరకు తనిఖీలు నిర్వహిస్తున్నామ’’ని చెప్పినట్లు ది హిందూ పత్రిక కథనం పేర్కొంది.

తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్లంతా దిల్లీలోని గురుద్వారాల్లో, నిజాముద్దీన్, న్యూదిల్లీ రైల్వే స్టేషన్ల చుట్టూ ఉన్న హోటళ్లలో ఉంటున్నారని, పోలీసు బలగాల మోహరింపు స్థాయిని చూస్తుంటే కొంచెం భయంగా ఉన్నా కూడా శనివారం జంతర్ మంతర్‌కు చేరుకునే ప్రయత్నం కచ్చితంగా చేస్తామని బీబీసీ తెలుగుతో మాట్లాడిన ఇతర సీజేపీ సభ్యులు చెప్పారు.

మరోవైపు సెంట్రల్ దిల్లీలోని నాలుగు కిలోమీటర్ల పరిధిలో ఇంటర్నెట్ సేవలు నిలిపివేస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. దిల్లీవ్యాప్తంగా మొత్తం 57 మెట్రో స్టేషన్లను మూసివేయడంతోపాటుగా వేర్వేరు రాష్ట్రాల నుంచి దిల్లీకి వెళ్లే కొన్ని రైళ్లను కూడా రైల్వే శాఖ రద్దు చేసింది.

మరోవైపు దిల్లీ పోలీసులు తాజాగా ఒక ప్రకటనతోపాటు వీడియోను కూడా విడుదల చేశారు. గత జూలై 20న సీజేపీ నిర్వహించిన జంతర్ మంతర్ టూ పార్లమెంట్ మార్చ్ సందర్భంగా నిరసనకారులు ఏ విధంగా దిల్లీ పోలీసులపై దాడులు చేశారో, పోలీసు వాహనాలను ధ్వంసం చేశారో చూపించే దృశ్యాలను విడుదల చేశారు. జూలై 20 నాటి అనుభవాలను దృష్టిలో ఉంచుకుని తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకున్నామని, అవసరమైన ఆంక్షలను అమలు చేస్తున్నామని దిల్లీ పోలీసులు ప్రకటించారు.

దిల్లీవ్యాప్తంగా పది డిటెన్షన్ కేంద్రాలను ఏర్పాటు చేశారనే ప్రచారంపై పోలీసులను బీబీసీ తెలుగు ప్రశ్నించింది. దీనిపై స్పందించిన దిల్లీ పోలీస్ జాయింట్ కమిషనర్ నూపుర్ ప్రసాద్‌, ఇవన్నీ ఇంటర్నల్ ఆపరేషనల్ వివరాలనీ, వీటి గురించి చెప్పలేమనీ అన్నారు.

మరోవైపు వామపక్షాలకు చెందిన నేతలంతా ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశారు. నిరసన తెలపడం దేశ ప్రజల ప్రాథమిక హక్కు అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. పోలీసు బలగాలు అమలు చేస్తున్న ఆంక్షలను తీవ్రంగా ఖండిస్తున్నామని వామపక్ష పార్టీలకు చెందిన నేతలు అన్నారు. జంతర్ మంతర్ చేరుకునే నిరసనకారులను అడ్డుకోకుండా వెళ్లనివ్వాలని కోరారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)