లైవ్‌లో మరణ శిక్ష అమలు చేస్తామని అమెరికా రక్షణ మంత్రి చెబుతున్న ఈయన ఎవరు?

నిదల్ హసన్, అమెరికా, పెంటగాన్, పీటర్ హెగ్‌సెత్, మరణశిక్ష
ఫొటో క్యాప్షన్, మేజర్ నిదల్ హసన్ మీద 13 హత్యాభియోగాలు, 32 హత్యా ప్రయత్నం అభియోగాలు నిరూపణ అయ్యాయి(ఫైల్ ఫోటో)
    • రచయిత, శరీన్ హాబెషియాన్
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • ప్రచురణ
  • చదివే సమయం: 4 నిమిషాలు

ఫైరింగ్ స్వ్కాడ్ చేతుల్లో అమెరికా ఆర్మీకి చెందిన మాజీ అధికారి మరణ శిక్ష అమలుని ప్రజలు ప్రత్యక్షంగా చూడవచ్చని యూఎస్ రక్షణ మంత్రి పీట్ హెగ్‌సెత్ తెలిపారు.

2009లో టెక్సాస్‌లోని ఫోర్ట్ హుడ్ ఆర్మీ పోస్ట్ వద్ద 13 మంది నిరాయుధ సైనికులను నిదల్ హసన్ కాల్చి చంపేశారు.

ఆయన మరణ శిక్షను లైవ్ స్ట్రీమింగ్ చేయనున్నట్లు అమెరికా రక్షణ మంత్రి తెలిపారు.

దాదాపు శతాబ్ద కాలంలో అమెరికాలో ఓ మరణ శిక్షను బహిరంగంగా అమలు చేయనుండడం ఇదే తొలిసారి.

దీనిని ప్రత్యక్ష ప్రసారం చేయాలనే నిర్ణయం ఆధునిక యుగంలో ఎన్నడూ తీసుకోలేదని, దీనికి చట్టపరంగా స్పష్టమైన విధివిధానాలు కూడా లేవని మరణ శిక్ష పడిన ఖైదీల కోసం పని చేసే జాన్ మిల్స్ అనే లాయర్ తెలిపారు.

అయితే ఇలాంటి నేరాలకు తీవ్రమైన పరిణామాలు ఉంటాయని ప్రజలు అర్థం చేసుకోవాలని హెగ్‌సెత్ అన్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
నిదల్ హసన్, అమెరికా, పెంటగాన్, పీటర్ హెగ్‌సెత్, మరణశిక్ష
ఫొటో క్యాప్షన్, అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్‌సెత్ తెలిపారు.

"దీనిని ప్రత్యక్ష ప్రసారం చేయడం బహిరంగ మరణశిక్షతో సమానం. ఇది చిత్రహింసపై విధించిన నిషేధాన్ని ఉల్లంఘించడమే." అని ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల కార్యాలయం ఏఎఫ్‌పీ వార్తా సంస్థకు తెలిపింది.

"ఇది చాలా అసహ్యకరమైన ఆలోచన. ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ చర్యలను తలపిస్తోంది" అని డెమొక్రటిక్ సెనేటర్ క్రిస్ మర్ఫీ సీఎన్‌ఎన్‌తో అన్నారు.

"గడిచిన 60 ఏళ్లలో సైన్యానికి చెందిన వ్యక్తికి మరణ శిక్ష అమలు చేయడం ఇదే తొలిసారి" అని పెంటగాన్ ప్రకటించింది.

హసన్ వర్జీనియాకు చెందినవారు. యూఎస్ ఆర్మీలో సైకియాట్రిస్ట్‌గా పనిచేశారు.

పోర్ట్ హుడ్ వద్ద రద్దీగా ఉన్న ఓ ఆసుపత్రి భవనంలో నిరాయుధులైన సైనికులపై కాల్పులను జరిపినట్లు హసన్‌ అంగీకరించారు.

"ఫైరింగ్ స్వ్కాడ్ చేతుల్లో మరణ శిక్ష విధించడమే హసన్‌కు తగిన శిక్ష" అని అలన్జో లన్స్‌ఫోర్డ్ అనే ఆర్మీ అధికారి అన్నారు.

హసన్ దాడిలో అలన్జో ఏడు సార్లు కాల్పులకు గురయ్యారు.

"నేను ప్రత్యక్ష ప్రసారం కోరుకోవడం లేదు. అది యువతకు ఎలాంటి సందేశం పంపిస్తుందో తెలియదు. కానీ, ఈ మరణ శిక్ష అమలును ఎలాంటి సెన్సార్ లేకుండా చూసే అవకాశం బాధిత కుటుంబాలకు ఉండాలని భావిస్తున్నాను" అని అలన్జో చెప్పారు.

క్షమాభిక్ష కోసం అధ్యక్షుడు ట్రంప్‌ని కలిసేందుకు హసన్ ప్రయత్నించారా? అని ప్రశ్నించినప్పుడు, "డోంట్ కేర్. డిసెంబర్ 3న అతడి చివరి రోజు" అని హెగ్‌సెత్ అన్నారు.

డిఫెన్స్ సెక్రటరీ సిఫార్సుకి ట్రంప్ ఆమోదం తెలిపినట్లు పెంటగాన్ ప్రతినిధి ఒకరు సోమవారం తెలిపారు. అయితే దీనిని ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు ట్రంప్ అంగీకరించారా? అని బీబీసీ వైట్‌హౌస్‌ని ప్రశ్నించింది.

నిదల్ హసన్, అమెరికా, పెంటగాన్, పీటర్ హెగ్‌సెత్, మరణశిక్ష
ఫొటో క్యాప్షన్, అమెరికాలో మిలటరీ చట్టాల ప్రకారం మరణ శిక్ష అమలుకు అధ్యక్షుడి అనుమతి తప్పనిసరి.

గత ఏడాది 17 దేశాల్లో 2700 మందికి మరణశిక్ష అమలు

గతేడాది, 17 దేశాల్లో 2,700 మందికి మరణ శిక్ష అమలు చేశారు.

రెండు దేశాల్లో మాత్రం వాటిని బహిరంగంగా అమలు పరిచారు.

2025లో ఇరాన్‌లో 11 మందికి, అఫ్గానిస్తాన్‌లో మరో ఆరుగురికి మరణ శిక్ష పడిందని అమ్నెస్టీ ఇంటర్నేషనల్ తెలిపింది.

టెక్సాస్‌లోని ఫోర్ట్‌హుడ్ వద్ద డిసెంబర్ 3న హసన్‌కి మరణ శిక్ష విధించనున్నారు.

2013లో కోర్టు మార్షల్ విచారణ సందర్భంగా తన 'తప్పు ఉంటే' మన్నించమని కోరిన హసన్, అఫ్గానిస్తాన్‌లో తాలిబన్లు, ముస్లింలను రక్షించేందుకే ఈ చర్యకు పాల్పడినట్లు చెప్పారు.

అమెరికాలో మిలటరీ చట్టాల ప్రకారం మరణ శిక్ష అమలుకు ఆ దేశ అధ్యక్షుడి అనుమతి తప్పనిసరి.

దీనిపై సమీక్షకు వెళ్లే అవకాశం ఉంటుంది. తుది నిర్ణయం కోర్టులదే.

"హసన్ అప్పీలేట్ ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు. ఫెడరల్ కోర్టులో ఆయన సమీక్ష కోరే అవకాశం ఉంది. మరణ శిక్ష అమలుపై కోర్టు స్టే విధించే అవకాశమూ ఉంది" అని మిల్స్ తెలిపారు.

"ప్రత్యక్ష ప్రసారం ద్వారా ఎలాంటి న్యాయం జరగదు. దీనిని ట్రంప్ ప్రభుత్వం ప్రచారం కోసమే చేస్తోంది" అని మిల్స్ పేర్కొన్నారు.

ఆర్మీ నిబంధనల ప్రకారం, 18 ఏళ్ల లోపు వారు మిలటరీ అమలుపరిచే మరణ శిక్షను చూసేందుకు అనుమతి లేదు.

యువత దీనిని చూడకుండా ఉండేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? అని పెంటగాన్‌తో పాటు అమెరికన్ సైన్యాన్ని బీబీసీ ప్రశ్నించింది.

గతేడాది చైనా, ఇరాన్, సౌదీ అరేబియా, యెమెన్, అమెరికా అత్యధిక మరణ శిక్షలు అమలు చేశాయని అమ్నెస్టీ ఇంటర్నేషనల్ డేటా సూచిస్తోంది.

ప్రభుత్వం మరణ శిక్ష అమలు చేయడాన్ని జో బైడెన్ నిలిపివేయగా, ట్రంప్ అధికారంలోకి వచ్చాక మళ్లీ వాటిని కొనసాగిస్తున్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)