నాజీల కాలంలో బలవంతంగా అమ్మారా? ' దాదాపు రూ. 1,600 కోట్ల పెయింటింగ్‌'పై వివాదం ఏంటి...

విన్సెంట్ వాన్ గో పెయింటింగ్, వేలం, సోథేబీస్
ఫొటో క్యాప్షన్, వేలానికి ముందు ప్రదర్శనకు ఉంచిన విన్సెంట్ వాన్ గో పెయింటింగ్ 'షాటేన్యే ఆన్ ఫ్లూర్'.
    • రచయిత, డాన్ సేల్స్
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • ప్రచురణ
  • చదివే సమయం: 3 నిమిషాలు

'రూ. 1,696 కోట్లు పలుకుతుందని అంచనా' వేస్తున్న ప్రముఖ చిత్రకారుడు విన్సెంట్ వాన్ గో పెయింటింగ్ ఇప్పుడు వివాదంలో చిక్కుకుంది. వేలం విషయంలో తలెత్తిన వివాదాన్ని పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు ప్రముఖ వేలం సంస్థ సోథెబీస్ తెలిపింది.

'షాటేన్యే ఆన్ ఫ్లూర్' పేరుతో ఉన్న ఈ పెయింటింగ్‌కు 180 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 1,696 కోట్లు) ధర పలకవచ్చని అంచనా వేస్తున్నారు. బుధవారం న్యూయార్క్‌లో దీన్ని వేలం వేయాల్సి ఉంది.

అయితే, ఈ పెయింటింగ్‌ను గతంలో జర్మనీకి చెందిన ఫిషర్ కుటుంబం సొంతం చేసుకుంది. నాజీలు అధికారంలోకి వస్తున్న సమయంలో తమ పూర్వీకులపై ఒత్తిడి తెచ్చి ఈ చిత్రాన్ని అమ్ముకునేలా చేశారని ఆ కుటుంబ వారసుల తరఫున వాదిస్తున్న ప్రతినిధులు చెబుతున్నారు.

అయితే, ఈ ఆరోపణలకు తమ విస్తృత పరిశోధనలో ఎలాంటి ఆధారాలు లభించలేదని సోథెబీస్ తెలిపింది.

అయినప్పటికీ, ఫిషర్ కుటుంబంతో చర్చలు జరిపి సమస్యకు పరిష్కారం కనుగొనేందుకు కృషి చేస్తామని వెల్లడించింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

"పెయింటింగ్ యాజమాన్య చరిత్ర, వాటిని తిరిగి అప్పగించాల్సిన అంశాలను సోథెబీస్ అత్యంత తీవ్రంగా పరిగణిస్తుంది. 'షాటేన్యే ఆన్ ఫ్లూర్' చిత్ర యాజమాన్య చరిత్రపై విస్తృతంగా పరిశోధన చేశాం" అని సోథెబీస్ బీబీసీకి వెల్లడించింది.

"ఫిషర్ కుటుంబ వారసుల ప్రతినిధులు ఇటీవల లేవనెత్తిన అభ్యంతరాలు మా దృష్టికి వచ్చాయి. ఈ పెయింటింగ్ చరిత్రకు సంబంధించి వారితో చర్చలు జరుపుతున్నాం. మా పరిశోధనలో ఇప్పటివరకు ఈ పెయింటింగ్‌ను ఒత్తిడితో విక్రయించినట్లు నిర్ధరణ కాలేదు. అయినప్పటికీ, ఆ కుటుంబంతో నిర్మాణాత్మకంగా, బాధ్యతాయుతంగా చర్చలు జరపాల్సిన అవసరాన్ని గుర్తించాం. ఇరువర్గాలకూ ఆమోదయోగ్యమైన పరిష్కారం కోసం కృషి చేస్తాం" అని సంస్థ ప్రతినిధి తెలిపారు.

1890 నుంచి చేతులు మారిన పెయింటింగ్..

బ్లాసమింగ్ చెస్ట్‌నట్ ట్రీస్ (వికసిస్తున్న చెస్ట్‌నట్ చెట్లు) అని అర్థం వచ్చే ఈ చిత్రాన్ని 'బ్లాక్వియర్-అరియెట్టా కలెక్షన్' పేరుతో ఉన్న చిత్రాల సమాహారంలో భాగంగా విక్రయిస్తున్నారు.

ఈ ఆయిల్ పెయింటింగ్ యాజమాన్య చరిత్రతోపాటు, అది 1890 నుంచి చేతులు మారిన తీరుపై తాము చేసిన పరిశోధన వివరాలను సోథెబీస్ తన వెబ్‌సైట్‌లో పొందుపరిచింది.

ప్రముఖ జర్మన్ ప్రచురణకర్త శామ్యూల్ ఫిషర్ 1909లో ఈ చిత్రాన్ని కొనుగోలు చేసినట్లు సంస్థ తెలిపింది. 1934లో ఆయన మరణించిన తర్వాత అది కుటుంబ సభ్యులకు వారసత్వంగా సంక్రమించింది.

1932 లేదా 1933లో ఈ చిత్రాన్ని ఆమ్‌స్టర్‌డామ్‌లోని పాల్ కాసిరర్ వద్ద భద్రపరిచారు. ఆ తర్వాత 1936లో పారిస్‌లోని హెన్రియెట్, మార్సెల్ కాప్ఫెరర్‌ల వద్దకు చేరినట్లు సోథెబీస్ పేర్కొంది.

ఈ ఏడాది వేలానికి వచ్చే ముందు మరో నలుగురు వ్యక్తుల చేతుల్లోకి కూడా ఈ చిత్రం మారింది.

ఫిషర్ కుటుంబ వారసులు ఈ వ్యవహారంపై ఓ న్యాయవాదిని నియమించుకున్నారు. ఆయన సోథెబీస్‌కు లేఖ రాసినట్లు న్యూయార్క్ టైమ్స్ వెల్లడించింది.

రెండో ప్రపంచ యుద్ధానికి ముందు ఆమ్‌స్టర్‌డామ్‌లో ఈ చిత్రాన్ని విక్రయించడానికి కారణం నాజీల పాలనలో ఫిషర్ కుటుంబ ప్రచురణ సంస్థ ఆర్థికంగా నష్టపోవడమేనని ఆ న్యాయవాది వేలం సంస్థకు తెలిపినట్లు సమాచారం.

ఈ వ్యవహారంపై స్పందన కోరుతూ బీబీసీ ఆ న్యాయవాదిని సంప్రదించింది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)