డోనల్డ్ ట్రంప్ చైనా పర్యటన: ఈసారి ఎవరిది పైచేయి?

డోనల్డ్ ట్రంప్, షీ జిన్ పింగ్

ఫొటో సోర్స్, VGC via Getty Images

    • రచయిత, ఓస్మండ్ చియా
    • హోదా, బిజినెస్ రిపోర్టర్
  • ప్రచురణ
  • చదివే సమయం: 7 నిమిషాలు

అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ను కలవడానికి చైనాలో పర్యటిస్తున్నారు. భారత కాలమానం ప్రకారం బుధవారం సాయంత్రం బీజింగ్‌లో దిగారు ట్రంప్.

దాదాపు దశాబ్ద కాలంలో ఒక అమెరికా అధ్యక్షుడు చైనాలో పర్యటించడం ఇదే మొదటిసారి. ఈ పర్యటన మే 13వ తేదీ నుంచి 15 వరకు కొనసాగుతుంది.

ప్రపంచంలోని రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల మధ్య సంబంధాలు కీలక దశలో ఉన్న తరుణంలో ఈ పర్యటన జరుగుతోంది.

ఎన్విడియాకు చెందిన జెన్‌సెన్ హ్వాంగ్, యాపిల్ కంపెనీ సీఈవో టిమ్ కుక్, టెస్లా, స్పేస్‌ఎక్స్‌ల తరఫున ఎలాన్ మస్క్, బ్లాక్‌రాక్ నుంచి ల్యారీ ఫింక్ కూడా తనతో వస్తున్నారని అంతకు ముందు ట్రంప్ ప్రకటించారు.

అమెరికా–చైనాల మధ్య సున్నితమైన వాణిజ్య ఒప్పందానికి కూడా ఈ సమావేశం కీలకం కానుంది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గతేడాది ఏప్రిల్‌లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పలు దేశాలపై టారిఫ్‌లు విధిస్తున్నట్లు ప్రకటించారు.

ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం అమెరికా, చైనాల మధ్య టారిఫ్ యుద్ధానికి దారితీసింది. ఆ సమయంలో ఇరు దేశాలు ఒకదానిపై ఒకటి 100 శాతానికి పైగా సుంకాలను విధించుకున్నాయి.

గత అక్టోబర్‌లో దక్షిణ కొరియాలో ట్రంప్, షీ జిన్‌పింగ్‌ల సమావేశం తర్వాత టారిఫ్‌లపై తాత్కాలిక విరామం ప్రకటించారు. కానీ ఇరు దేశాల నుంచి హెచ్చరికలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి.

ఈ నేపథ్యంలో అసలు ఈ పరిస్థితి వరకు ఎలా వచ్చాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

అమెరికా, చైనా

ఫొటో సోర్స్, Getty Images

వాణిజ్య యుద్ధం ఎలా మొదలైంది?

వాణిజ్యాన్ని మరింత పారదర్శకంగా చేస్తానని, అలాగే తయారీ రంగానికి చెందిన ఉద్యోగాలను తిరిగి దేశానికి తీసుకువస్తానని హామీ ఇవ్వడం 2016 ఎన్నికలలో అధ్యక్షుడు ట్రంప్ విజయం సాధించడానికి ప్రధాన కారణం.

2018లో ట్రంప్ 250 బిలియన్ డాలర్ల విలువైన చైనా దిగుమతులపై సుంకాలను విధించారు. ఆ క్షణానే వాణిజ్య యుద్ధం మొదలైందని చాలామంది నిపుణులు భావిస్తున్నారు.

అదే ఏడాది మెక్సికో, కెనడా, యూరప్‌తో సహా ఇతర వాణిజ్య భాగస్వాములపై కూడా ట్రంప్ సుంకాలను విధించారు. ఈ దేశాలు అమెరికాను దోపిడీ చేస్తున్నాయని ఆయన వాదించారు.

"అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న ఈ చర్య చైనాకు పెద్దదెబ్బ" అని జార్జ్‌టౌన్ విశ్వవిద్యాలయంలో విధాన పరిశోధకురాలైన నింగ్ లెంగ్ అన్నారు.

"ట్రంప్‌తో చైనా తీవ్రమైన చర్చలు జరపడం ఇదే మొదటిసారి. బహుశా ట్రంప్ ఇలాంటి చర్య తీసుకుంటారని వారు ఊహించి ఉండకపోవచ్చు" అని లెంగ్ అన్నారు.

ఆ సమయంలో వాణిజ్యం కోసం అమెరికాపై ఎక్కువగా ఆధారపడేది చైనా.

అమెరికా చైనా వస్తువులను ప్రధానంగా దిగుమతి చేసుకునేది. ఒకవేళ అమెరికన్ కొనుగోలుదారులు వెనక్కి తగ్గితే, ట్రంప్ విధించిన సుంకాలు చైనా కార్మికుల భవిష్యత్తుకు ముప్పుగా పరిణమించాయి.

మందకొడి దేశీయ వినియోగం, పెరుగుతున్న నిరుద్యోగం, దీర్ఘకాలంగా కొనసాగుతున్న రియల్ ఎస్టేట్ సంక్షోభం వంటి చైనా ఆర్థిక వ్యవస్థను పట్టిపీడిస్తున్న ఏళ్లనాటి సమస్యలను ఈ ఉద్రిక్తతలు మరింత తీవ్రతరం చేశాయి.

అమెరికాకు జరిగే ఎగుమతులు చైనాలోని ఉద్యోగాలకు జీవనాధారంగా ఉండేవి. కానీ ట్రంప్ హయాంలో ఇది కూడా ప్రమాదంలో పడింది.

"ఒక దేశం మరొక దేశంతో ఎక్కువగా వ్యాపారం చేస్తే, ఆ దేశంతో వాణిజ్య యుద్ధాన్ని ఎదుర్కోవడం కష్టం" అని లెంగ్ అన్నారు.

బైడెన్

ఫొటో సోర్స్, Bloomberg via Getty Images

ఫొటో క్యాప్షన్, చైనాపై అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ కఠిన చర్యలు తీసుకున్నారని ఆర్థికవేత్త టెంగ్ హెయివాయి అన్నారు.

'ట్రంప్ కంటే బైడెన్ మరింత కఠినంగా వ్యవహరించారు'

2021లో ట్రంప్ స్థానంలో జో బైడెన్ అధికారంలోకి వచ్చినప్పుడు ఆయన కూడా చైనాపై ఒత్తిడిని కొనసాగించారు.

బైడెన్‌ చైనా కంపెనీలపై నిషేధాలు విధించారు, వీటిలో టెక్నాలజీ దిగ్గజం హువావే కూడా ఉంది. జాతీయ భద్రతా ఆందోళనల కారణంగా హువావేను అమెరికా మార్కెట్‌ నుంచి దాదాపు పూర్తిగా తొలగించారు.

అలాగే టిక్‌టాక్‌పై కూడా ఆయన లోతైన విచారణ జరిపించారు. ఫలితంగా అమెరికాలోని కార్యకలాపాలను చైనా పేరెంట్‌ కంపెనీ నుంచి వేరు చేశారు.

భారీ సుంకాలతో చైనా ఎలక్ట్రిక్ వాహనాలు (ఈవీలు) కూడా అమెరికా మార్కెట్లోకి ప్రవేశించకుండా బైడెన్ అడ్డుకున్నారు.

‘‘మనం తరచుగా ట్రంప్‌ చైనాపై కఠినంగా వ్యవహరించారని అనుకుంటాం. కానీ ట్రంప్ కంటే కూడా బైడెన్ మరింత కఠినంగా వ్యవహరించారని చెప్పొచ్చు" అని హాంకాంగ్ యూనివర్సిటీ ఆర్థికవేత్త టెంగ్ హెయివాయి అన్నారు.

చైనా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, 2024లో అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ రెండోసారి విజయం సాధించారు.

ట్రంప్ రెండో పదవీకాలం

2025లో రెండోసారి పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ట్రంప్ తన సుంకాల విధానాలను మరింత కఠినం చేశారు.

చైనాపై 20 శాతం సుంకం విధించి, ఆ దేశం ఫెంటానిల్‌ అనే మత్తు పదార్థాన్ని అమెరికాలోకి అక్రమంగా రవాణా చేస్తోందని ఆరోపించారు.

చైనా వస్తువులపై 34% సుంకం విధించడం వల్ల ఆ దేశంపై మొత్తం టారిఫ్‌ ఇతర దేశాల కంటే అత్యధికంగా మారింది.

ఈ నిర్ణయం చైనా వ్యాపారాలను తీవ్రంగా దెబ్బతీసింది. గిడ్డంగుల్లో సరుకు నిల్వలు పేరుకుపోయాయి.

అదే సమయంలో అమెరికన్ కంపెనీలు ప్రత్యామ్నాయ సరఫరాల కోసం తీవ్రంగా ప్రయత్నించాయి.

చైనా వెంటనే అమెరికా వ్యవసాయ ఉత్పత్తులపై సుంకాలు విధించి ప్రతీకారం తీర్చుకుంది. దీనివల్ల ట్రంప్ కీలక ఓటర్లలో ఒక వర్గమైన రైతులు భారీగా నష్టపోవాల్సి వచ్చింది.

కానీ, స్మార్ట్‌ఫోన్‌ల నుంచి యుద్ధ విమానాల వరకు అన్నింటి తయారీకి కీలకమైన అరుదైన రేర్ఎర్త్స్ ఖనిజాల సరఫరాలో ప్రపంచవ్యాప్తంగా చైనాకు ఉన్న గుత్తాధిపత్యం గురించి ట్రంప్ ఆలోచించలేదు.

అమెరికాతో ఒప్పందాలు కుదుర్చుకునేలా ఇతర దేశాలపై ఒత్తిడి తీసుకురావడానికి ట్రంప్ సుంకాలను ఉపయోగించారు. కానీ చైనా ముడి పదార్థాలపై ఆధారపడిన ప్రధాన వ్యాపార సంస్థల విషయంలో ఆయన రిస్క్ తీసుకోలేకపోయారు. అందుకే చివరకు చర్చలు అవసరమయ్యాయి.

అక్టోబర్‌లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ల మధ్య జరిగిన సమావేశం చైనా ఎగుమతి నియంత్రణలను నిలిపివేయడంతో ముగిసింది. ఒకరకంగా ఇది ట్రంప్‌కు విజయంగా చెప్పవచ్చు.

అమెరికా ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక అయిన అమెరికన్ వ్యవసాయ వస్తువులు, ఇతర వ్యవసాయ ఉత్పత్తులను వెంటనే కొనుగోలు చేసేలా తాను చైనాను ఒప్పించానని కూడా ట్రంప్ చెప్పారు.

ఇందుకు ప్రతిగా సింథటిక్ ఓపియాయిడ్ అయిన ఫెంటానిల్ తయారీలో ఉపయోగించే పదార్థాలపై విధించిన సుంకాల్లో కొంత భాగాన్ని అమెరికా తొలగించింది.

అలాగే పరస్పర టారిఫ్‌ల పెంపును కూడా తాత్కాలికంగా నిలిపివేశారు. సమావేశం జరిగిన కొన్ని వారాల తర్వాత చైనాకు అడ్వాన్స్‌డ్ సెమీకండక్టర్ల విక్రయాలపై ఉన్న కొన్ని ఆంక్షలను అమెరికా సడలించింది. కానీ అత్యాధునిక చిప్‌లపై మాత్రం ఆ ఆంక్షలు కొనసాగాయి.

సౌత్ కొరియా

ఫొటో సోర్స్, AFP via Getty Images

ఫొటో క్యాప్షన్, గతేడాది సౌత్ కొరియాలో జరిగిన సమావేశం తర్వాత అమెరికా, చైనా కాస్త వెనక్కి తగ్గినట్టు కనిపించాయి.

అజెండా ఏంటి?

గతేడాది సుంకాలపై ఒప్పందం కుదిరినప్పటికీ, ఈ వివాదానికి శాశ్వత పరిష్కారం ఇంకా లభించలేదు.

తయారీ రంగంలో చైనా భారీగా పెట్టుబడులు పెట్టడంవల్ల, దేశీయ వ్యయం మందగించడంతో అక్కడి వ్యాపారులకు విదేశాలకు అమ్ముకోవడం తప్ప మరో మార్గం లేకుండాపోయిందని ఆర్థిక నిపుణులు టెంగ్ హెయివాయి అన్నారు.

"చైనాకు అమెరికా మార్కెట్ అవసరం. వినియోగదారుల మార్కెట్ విషయంలో అమెరికా అంత పెద్ద దేశం మరొకటి లేదు" అని టెంగ్ అన్నారు.

అయితే ఈ సమావేశంలో చైనా బలమైన స్థితిలోనే ఉంది.

అమెరికాతో సంబంధాలు బలహీనపడిన తర్వాత ప్రపంచంలోని ఇతర దేశాలతో కొత్త వ్యాపార సంబంధాలు పెంచుకోవడంతో చైనా ఎగుమతులు రికార్డు స్థాయికి చేరుకున్నాయి.

రోబోటిక్స్‌ రంగంలో కూడా బీజింగ్ భారీగా పెట్టుబడులు పెడుతోంది. అలాగే సొంత అధునాతన చిప్‌లను అభివృద్ధి చేయడానికి, ఎన్విడియా వంటి పాశ్చాత్య కంపెనీలపై ఆధారపడటాన్ని తగ్గించుకోవడానికి కూడా ప్రయత్నిస్తోంది.

సోయాబీన్స్, విమాన విడిభాగాలు వంటి కీలకమైన అమెరికా పరిశ్రమల నుంచి మరిన్ని వస్తువులను కొనుగోలు చేయాలని ట్రంప్ ప్రభుత్వం చైనాపై ఒత్తిడి తెచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.

అయితే ఈ పర్యటన జరుగుతున్న సమయంలో ట్రంప్ వాణిజ్య విధానాలకు ఒక దెబ్బ తగిలింది. ఎందుకంటే అమెరికా సుప్రీంకోర్టు ఆయన ప్రకటించిన "లిబరేషన్ డే టారిఫ్"ను రద్దు చేసింది.

దాంతో ట్రంప్ తాత్కాలికంగా అన్ని దేశాలపై 10 శాతం సుంకం విధించడానికి మరో చట్టాన్ని ఉపయోగించారు. అలాగే చైనా, ఇతర దేశాలకు వ్యతిరేకంగా జరుగుతున్న అన్యాయమైన వాణిజ్య పద్ధతులపై దర్యాప్తును కూడా ప్రారంభించారు.

ఇటీవలే ఒక అమెరికా ట్రేడ్ కోర్టు కొత్త గ్లోబల్ టారిఫ్‌లు సరైనవి కావని తీర్పు ఇచ్చింది. దీని వల్ల భవిష్యత్తులో మరిన్ని న్యాయపరమైన సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉంది.

ఇజ్రాయెల్, ఇరాన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు ఫిబ్రవరి నెలాఖరున ఇరాన్‌పై దాడులు ప్రారంభించాయి.

ఇరాన్ సంగతేంటి?

ట్రంప్, షీ జిన్‌పింగ్ సమావేశంపై ఇరాన్‌ యుద్ధ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది.

విస్తారమైన చమురు నిల్వలు, విభిన్న ఇంధన వనరుల కారణంగా, చైనా ఇప్పటివరకు తన పొరుగు దేశాల కంటే మెరుగ్గా యుద్ధ ప్రభావాలను తట్టుకుంది.

చైనా ఒక ప్రధాన చమురు ఉత్పత్తిదారు. దాని ముడి చమురు దిగుమతులలో అధిక భాగం రష్యా నుంచి వస్తుంది. చైనా ఇరాన్‌కు అతిపెద్ద చమురు కొనుగోలుదారు అయినప్పటికీ, ఈ కారణాలు యుద్ధ ప్రభావాన్ని తగ్గించాయి.

యుద్ధం కొనసాగుతున్న కొద్దీ అది చైనా ఆర్థిక వ్యవస్థకు పరీక్ష పెడుతోందనడానికి సంకేతాలు ఉన్నాయని పాలసీ అనలిస్ట్ లయల్ మోరిస్ అంటున్నారు.

ఇంధన భద్రత, సరఫరా గొలుసులను పరిరక్షించేందుకు కఠిన చర్యలు తీసుకుంటామని చైనా ఉన్నతాధికారులు హామీ ఇచ్చారు.

కాబట్టి చైనా, అమెరికా రెండూ ఈ సంఘర్షణను ముగించాలని కోరుకుంటున్నప్పటికీ, ఇరాన్ విషయంలో వారి అభిప్రాయాల మధ్య చాలా తేడాలున్నాయి.

ఈ భేదాలను వారు ఎలా, ఏ మేరకు పరిష్కస్తారు అన్న అంశాన్ని ప్రపంచం కూడా ఆసక్తిగా గమనిస్తోంది.

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)