తెలంగాణలో కనీస వేతన సవరణ : ఇప్పటికే ఎక్కువ చెల్లిస్తుంటే తగ్గిస్తారా? 5 ప్రశ్నలు - జవాబులు

ఫొటో సోర్స్, Getty Images
తెలంగాణలో కనీస వేతనాలు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ వేతనాలు ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా అమల్లోకి వచ్చాయి.
ఉత్తర్వుల ప్రకారం ప్రాంతాల వారీగా కనీస వేతనాలు పెరిగాయని, రాష్ట్రంలో 178 రకాల పనులు చేస్తున్న వారికి ఈ వేతనాలు వర్తిస్తాయని ప్రభుత్వం ప్రకటించింది.
''14 ఏళ్లుగా కనీస వేతన సవరణ జరగలేదు. తెలంగాణ ఏర్పడినప్పట్నుంచి ప్రతిపాదనలు ఉన్నప్పటికీ ముందుకు సాగలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వేతన సవరణ సలహా మండలిని నియమించింది. ఆ తర్వాత మంత్రివర్గ ఉపసంఘం వేసింది. ఆ సిఫార్సుల మేరకు వేతన సవరణ చేశాం'' అని తెలంగాణ వేతన సవరణ సలహా మండలి చైర్మన్ జనక్ ప్రసాద్ బీబీసీతో చెప్పారు.

1. ఎన్ని రకాల నైపుణ్య వర్గీకరణ జరిగింది?
కనీస వేతనాల అమలు కోసం మొత్తం రాష్ట్రాన్ని మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాల్టీ, గ్రామీణ ప్రాంతాల పేరుతో 3 జోన్లుగా విభజించారు.
అలాగే కనీస వేతనాలను నైపుణ్యాల ఆధారంగా చెల్లించేందుకు వీలుగా 4 రకాలుగా వర్గీకరించారు. వీటిల్లో అసలేమాత్రం నైపుణ్యం లేనివారు, పాక్షికంగా నైపుణ్యం కలిగినవారు, నైపుణ్యం కలిగినవారు, ఉన్నత నైపుణ్యం కలిగినవారని వర్గీకరించారు.
ఆయా నైపుణ్యాల ఆధారంగా వేతనాల చెల్లింపులు ఉంటాయి.
''కేంద్ర ప్రభుత్వం మరోసారి కనీస వేతన సవరణ చట్టం రెండు, మూడు నెలల్లో తీసుకు వచ్చే అవకాశం ఉంది. తెలంగాణ అమలు చేస్తున్న వేతనాల కంటే ఎక్కువ ఉంటే, వాటినే అనుసరిస్తాం. రాష్ట్రం అమలు చేస్తున్న వేతనాల కంటే తక్కువ ఉంటే, అప్పుడు తెలంగాణలో అమల్లోకి వచ్చిన వేతనాలే కొనసాగుతాయి'' అని జనక్ ప్రసాద్ చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
2. ఎన్ని రంగాల్లో వేతన సవరణ చేశారు?
భారత్‌లో కనీస వేతన చట్టం 1948లో అమల్లోకి వచ్చింది. ఈమేరకు .. ప్రతి కార్మికుడికి/కార్మికురాలికి, ఉద్యోగికి పనికి తగ్గట్టుగా వేతనాన్ని చెల్లించాలి.
తాజా వేతన సవరణలో భాగంగా మొత్తం 73 ఉపాధి కల్పనా రంగాల్లో వేతన సవరణ చేసినట్లుగా ప్రభుత్వం చెప్పింది.
ఇందులో 65 పరిశ్రమ ఆధారిత రంగాలు , 8 వ్యవసాయ ఆధారిత రంగాలున్నాయి.
3. సెలవురోజుల్లో పనిచేస్తే..?
కార్మికులకు పేపర్ ఆధారిత పేమెంట్స్‌ను పూర్తిగా నిషేధిస్తున్నట్లుగా ప్రభుత్వం ప్రకటించింది.
''ఉద్యోగులకు వేతనాలను డైరెక్ట్ ఎలక్ట్రానిక్ ట్రాన్స్‌ఫర్ లేదా బ్యాంకు చెక్‌ల ద్వారానే జరగాలి'' అని జీవోలో పేర్కొంది.
వారాంతపు సెలవు కచ్చితంగా ఉండాలి. నెలలో 26 రోజులకు మించి పని చేయించుకునేందుకు వీల్లేదు.
అయినప్పటికీ, పెయిడ్ వీక్లీ ఆఫ్స్ కల్పించాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. రోజుకు ఎనిమిది పని గంటలు ఉండాలి. అంతకుమించి పనిచేయించుకున్నా లేదా సెలవు దినాల్లో పనిచేయించుకున్నా ఆ మేరకు ఆ రోజుకు రెండింతల వేతనం ఇవ్వాలి.
ట్రైనీ లేదా అప్రెంటిస్‌గా తీసుకుంటే, వారికి సంబంధిత స్కిల్ విభాగంలో 75 శాతం వేతనాలు చెల్లించాల్సి ఉంటుందని ప్రభుత్వం చెప్పింది.

ఫొటో సోర్స్, Getty Images
4. కొత్తగా చేర్చిన రంగాలెన్ని?
కనీస వేతనాలను మరికొన్ని రంగాలకు కూడా విస్తరించింది
ఇందులో కొత్తగా పది రంగాలకు చెందిన ఉద్యోగాలను తీసుకువచ్చింది.
- ఈ కామర్స్ అండ్ కొరియర్ సర్వీసెస్
- ఆధ్యాత్మిక- సామాజిక సంస్థల కార్యాలయాలు
- పబ్లిక్ అమ్యూజ్‌మెంట్ పార్కులు (వాటర్ థీమ్ పార్కలు, రిక్రియేషన్ పార్కులు)
- టీవీకేబుల్ నెట్‌వర్క్, మొబైల్ టవర్ మెయింటినెన్స్
- హ్యాండ్ క్రాఫ్ట్ సంస్థలు
- చెరకు, వెదురు పరిశ్రమ
- బోర్‌వెల్ డ్రిల్లింగ్
- రెడీ మిక్స్ కాంక్రీట్ యూనిట్స్
- అల్యూమినియం, టిన్ ఉత్పత్తుల యూనిట్లు
- ఎల్పీజీ స్టోరేజ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఏజెన్సీలు
కనీస వేతనాల కేటగిరీ కిందకు తీసుకువచ్చింది ప్రభుత్వం.
''కొత్త రంగాలను కనీస వేతన సవరణ చట్టం పరిధిలోకి తీసుకురావడం ద్వారా ఆయా రంగాలకు మేలు జరుగుతుంది. ప్రభుత్వం నోటిఫై చేసిన రంగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు కచ్చితంగా ప్రాంతాలను బట్టి వేతనాలు చెల్లించాల్సి ఉంటుంది'' అని కార్మిక, ఉపాధి కల్పన శాఖ కార్యదర్శి దాసరి హరిచందన తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
5. ఇప్పటికే ఎక్కువ చెల్లిస్తుంటే తగ్గిస్తారా?
తెలంగాణలో 1.11 కోట్ల మంది కార్మికులు, ఉద్యోగులు ఉన్నారని రాష్ట్ర ప్రభుత్వ అంచనా. రాష్ట్రంలో కార్మికులు, ఉద్యోగుల కనీస వేతనాలు తక్కువగా ఉన్నాయని 2022లో హైకోర్టులో కార్మిక సంఘాలు పిటిషన్ వేశాయి.
గతంలో రూ.5300 నుంచి రూ.9500 మధ్య కనీస వేతనాలు ఉండేవి.
హైకోర్టు సూచనల మేరకు కనీస వేతన సవరణ సలహా మండలిని ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
ఇది తెలంగాణలో అధ్యయనం చేసి నిరుడు మే నెలలో నివేదిక సమర్పించింది.
ఆ నివేదికపై అధ్యయనం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘం వేసింది. నూతన వేతన కోడ్ రూపొందించి వేతన సవరణ చేయాలని సూచించింది.
దీనికి తగ్గట్టుగా నూతన వేతన సవరణ మేరకు వివిధ కేటగిరీల పరిధిలో రూ.16 వేల నుంచి రూ.20 వేల వరకు నిర్ణయించి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
మరోవైపు, 2026 మార్చిలో వీడీఏ (వేరియబుల్ డియర్‌నెస్ అలవెన్స్) రేట్లలో మార్పులు చేసింది. వీటిన్నింటిని పరిశీలించిన తర్వాత కొత్త వేతన కోడ్ రూపొందించామని జనక్ ప్రసాద్ వివరించారు.
ప్రభుత్వం కనీస వేతనాల చట్టం తీసుకువచ్చినప్పుడు కార్మిక సంఘాలతో చర్చించి మరింత పెంచి ఉంటే కార్మికులకు ప్రయోజనం కలిగేదని సీఐటీయూ జీడిమెట్ల, గాంధీనగర్ జోనల్ బాధ్యలు లక్ష్మణ్ బీబీసీతో చెప్పారు.
''కనీస వేతన కింద రూ.16వేలు ప్రతిపాదించారు. ఇప్పుడున్న ద్రవ్యోల్బణం ప్రకారం కనీస వేతనం రూ.26వేలు చేయాలి’’
ఇప్పటికే కొన్ని పరిశ్రమల్లో కనీస వేతనాలకు మించి ఇస్తున్నారు. ప్రభుత్వం ప్రతిపాదించినట్లుగా చేస్తే కార్మికులకు తక్కువ వేతనాలు దక్కే అవకాశం ఉంటుంది. దానివల్ల కార్మికులకు ఇప్పటికే ఎక్కువ వేతనాలు ఇస్తున్నారని ప్రభుత్వం చెప్పినట్లు అవుతుంది కదా.. ఇది కార్మికులవేతనాలపై ప్రతికూల ప్రభావం చూపుతుంది'' అన్నారు.
ప్రభుత్వం ప్రతిపాదించిన వేతనాల కంటే ఎక్కువగా ఇస్తున్నట్లయితే, ఆ వేతనాలే కొనసాగించాలని తగ్గించడానికి వీల్లేదని ప్రభుత్వ ఉత్తర్వుల్లో ఉందని జనక్ ప్రసాద్ వివరించారు.
ప్రభుత్వం తీసుకువచ్చిన కనీస వేతనాల ఉత్తర్వులను అమలు చేసేందుకు ప్రత్యేక పర్యవేక్షణ వ్యవస్థ ఉండాలని లక్ష్మణ్ వివరించారు.
''గతంలో ప్రతిపాదించిన కనీస వేతనాలు అమలు కావడం లేదనే చెప్పాలి. అయితే, దాన్ని పర్యవేక్షించేందుకు ప్రత్యేక పర్యవేక్షణ వ్యవస్థ లేకపోవడంతో కనీస వేతనాలు కాగితాలపై ఉన్ అమలు కావడం లేదు.'' అని లక్ష్మణ్ చెప్పారు.
''నేను పదేళ్లుగా ప్యాకింగ్ విభాగంలో పనిచేస్తున్నాను. రోజూ ఉదయం తొమ్మిది గంటలకు వస్తే, రాత్రి ఏడు, ఎనిమిది గంటల వరకు పనిచేయాల్సి వస్తోంది. పని గంటల విషయంలో తీవ్ర ఇబ్బంది పడుతున్నాం. ప్రభుత్వం ఎనిమిది గంటల పని అని చెబుతున్నా.. పని చేసే చోట మాత్రం అలా ఉండదు.
అదనపు గంటలు పనిచేయాల్సిందే. అలా చేసినా చివరకు నాకు దక్కేది నెలకు రూ.20వేలే. దీనివల్ల కుటుంబ పోషణ కూడా కష్టంగా మారింది. నాకు భార్య, ఒక కుమార్తె ఉన్నారు.'' అని జీడిమెట్లలోని ఒక ప్లాస్టిక్ పరిశ్రమలో పనిచేస్తున్న రమేష్(పేరు మార్చాం) చెప్పారు.
అయితే, కనీస వేతనాలను అమలు చేసే విషయంపై జిల్లా స్థాయి కమిటీలను ప్రభుత్వం నియమించి పర్యవేక్షిస్తున్నట్లుగా జనక్ ప్రసాద్ చెప్పారు.
''జిల్లా స్థాయిలో కమిటీలు పనిచేస్తాయి. అవి కనీస వేతనాలతో పాటు ప్రభుత్వం తీసుకువచ్చిన ఉత్తర్వుల్లో ఏయే అంశాలు ఉన్నాయో.. వాటన్నింటిని అమలు చేసేలా కృషి చేస్తాయి'' అని వివరించారు.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)




























