‘మీ వార్షిక ఆదాయం 10 లక్షలు దాటింది’ అంటూ గ్యాస్ వినియోగదారులకు వస్తున్న మెస్సేజ్‌లకు అర్థం ఏమిటి?

ఫొటో సోర్స్, ANI/UGC
‘మీ వార్షిక స్థూల ఆదాయం పదిలక్షల రూపాయల కంటే ఎక్కువగా ఉంది ’’ అంటూ చాలామంది గ్యాస్ వినియోగదారుల ఫోన్లకు సందేశాలు వస్తున్నాయి.
ఈ సందేశాల కారణంగా నిర్దేశిత వార్షికాదాయంపై గ్యాస్ సబ్సిడీ తీసివేయనున్నారనే ప్రచారం జరుగుతోంది.
ఇప్పటివరకు ఈ విషయంపై అటు కేంద్రం నుంచీ గానీ, ఇటు ఆయిల్ కంపెనీల నుంచి గానీ ఎలాంటి అధికారిక ప్రకటనా రాలేదు.
అయితే, ఇదంతా అధికారికంగా పంపిస్తున్న సందేశాలేనని, ఎల్‌పీజీ సబ్సిడీ పాలసీలో భాగంగా కేంద్ర ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించిందని తెలంగాణ ఎల్‌పీజీ డీలర్స్ అసోసియేషన్ కల్లూరి జగన్ మోహన్ రెడ్డి బీబీసీతో చెప్పారు.


ఫొటో సోర్స్, UGC
ఆ సందేశాలలో ఏముందంటే..
గత వారం, పది రోజుల నుంచి వరుసగా చాలా మంది ఫోన్లకు గ్యాస్ కంపెనీలు ఈ 'టెక్ట్స్ మేసేజ్'లు పంపుతున్నాయి.
''ఆదాయపు పన్ను రికార్డుల ప్రకారం, మీకు లేదా మీ కుటుంబ సభ్యుల వార్షిక స్థూల ఆదాయం నిర్దేశిత పరిమితి అయిన పది లక్షల రూపాయల కంటే ఎక్కువగా ఉంది'' అని సందేశంలో ఉంటోంది.
స్థూల వార్షికాదాయం 10 లక్షల రూపాయలు దాటిన కారణంగా గ్యాస్ సబ్సిడీ ఎందుకు తొలగించకూడదో చెప్పాలని కంపెనీలు కోరుతున్నాయి.
అలాగే వార్షికాదాయం పదిలక్షల రూపాయలలోపే ఉంటే వినియోగదారులు తమ అభ్యంతరాలు చెప్పేందుకు కంపెనీలు వీలు కల్పిస్తున్నాయి.
''మీరు ఈ విషయంతో విభేదిస్తే, 1800-2333-555 నంబరుకు కాల్ చేయండి '' అని సందేశంలో ఉంటోంది.
అలాగే మేసేజ్‌లో పేర్కొన్న లింక్ పై క్లిక్ చేసి వివరాలు సమర్పించవచ్చని కంపెనీలు సూచిస్తున్నాయి.
కంపెనీలు పంపిస్తున్న సందేశాలలోని సంబంధిత గ్యాస్ కంపెనీ 'ఫీడ్ బ్యాక్' లింక్‌పై క్లిక్ చేసి వివరాలు సమర్పించవచ్చని కంపెనీలు చెబుతున్నాయి.
లింక్ ఓపెన్ చేస్తే, ఏ విధమైనా ఫీడ్ బ్యాక్ ఇవ్వాలనుకుంటున్నారో చెప్పాల్సి ఉంది.
ఆ తర్వాత వినియోగదారుడి పేరు, రాష్ట్రం, జిల్లా, డిస్ట్రిబ్యూటర్, వినియోగదారుడి సంఖ్య, అడ్రస్ వివరాలు సమర్పించాలి. సమస్య లేదా సూచనకు సంబంధించి వివరాలు నమోదు చేసిన తర్వాత అందుకు తగ్గ డాక్యుమెంట్లు జత చేయాలి. ఆ తర్వాత వివరాలు సమర్పించాలి.
ఒకవేళ నిర్దేశిత గడువులోగా ఎలాంటి స్పందన లేకపోతే, ఎల్పీజీ సబ్సిడీ నిలిపివేయనున్నట్లుగా కంపెనీలు పేర్కొంటున్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
రూ.40 రాయితీ చెల్లింపు
ప్రస్తుతం హైదరాబాద్ లో 14.2 కేజీల డొమెస్టిక్ (గృహావసరాల) నాన్ సబ్సిడీ గ్యాస్ సిలిండర్ ధర రూ.965గా ఉంది.
అయితే, వినియోగదారులు ఈ పూర్తి మొత్తం చెల్లిస్తే, సబ్సిడీ కింద 40రూపాయలను అర్హులైన వారికి నేరుగా బ్యాంకు ఖాతాల్లో కేంద్ర ప్రభుత్వం జమ చేస్తోంది.
ఇప్పుడు సబ్సిడీ ఎత్తివేస్తే, వినియోగదారులపై అదనంగా రూ.40 భారం పడనుంది. 2026 జనవరిలో గ్యాస్ సిలిండర్ ధర రూ.905 గా ఉండగా.. గ్యాస్ కంపెనీలు రూ.60 పెంచాయి.
పీఎం ఉజ్వల యోజన(పీఎంయూవై) కింద గ్యాస్ కనెక్షన్ తీసుకున్న వినియోగదారులకు సిలిండర్లకు రూ.300 సబ్సిడీపై అందిస్తోంది. ఈ సబ్సిడీ దేశంలో ఆయా ప్రాంతాలను వేర్వేరుగా ఉండే అవకాశం ఉంది.
అలాగే ఈ పథకం కింద 2023 వరకు ఏడాదికి 12 సిలిండర్లు బుక్ చేసుకునేందుకు వీలుండగా, నిరుడు ఆ సంఖ్యను కేంద్ర ప్రభుత్వం 9కి తగ్గించింది.
కేంద్ర ప్రభుత్వం వద్ద ఉన్న డేటా ఆధారంగానే అన్ని కంపెనీలు వినియోగదారులకు సందేశాలు పంపిస్తున్నాయని కల్లూరి జగన్ మోహన్ రెడ్డి బీబీసీతో చెప్పారు.
''గతంలో ప్రభుత్వం గివ్ ఇట్ అప్ కార్యక్రమం తీసుకువచ్చింది. అప్పట్లో ఎక్కువ మంది ముందుకు రాలేదని ప్రభుత్వం అభిప్రాయపడుతోంది. కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇవ్వాలని నిర్ణయించుకున్నప్పుడే, అందులో నిర్దేశిత వార్షికాదాయానికి మించి ఉంటే సబ్సిడీ వర్తించదని ఉంటుంది.'' అని వివరించారు.
ఇప్పటికిప్పుడు నిర్ణయం తీసుకోవడం వెనుక ఇరాన్ యుద్ధ పరిస్థితులు కారణం అయి ఉండొవచ్చని, అందుకే సబ్సిడీ విషయంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఉండవచ్చని చెబుతున్నారు. దానికి తగ్గట్టుగా ఎల్‌పీజీ కంపెనీలు కూడా సబ్సిడీ పరిధిలో లేకపోయినా, దాన్ని పొందుతున్నవారికి సందేశాలు పంపిస్తుండొవచ్చని జగన్ మోహన్ రెడ్డి వివరించారు.
''కేవలం రూ.40 సబ్సిడీ విషయంలో మేసేజ్‌లు వస్తున్నట్లుగా భావించడం లేదు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వ ఆలోచన మరేదైనా కావొచ్చు'' అని అన్నారు.
రాయితీ వదులుకున్న 1.16 కోట్ల మంది
ఆర్థికంగా భరించగలిగిన వినియోగదారులు స్వచ్ఛందంగా గ్యాస్ సబ్సిడీ వదులుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు.
'గివ్ ఇట్ అప్' పేరుతో గ్యాస్ సబ్సిడీ వదులుకోవాలని 2015 మార్చిలో సూచించారు.
ఇప్పటివరకు కోటి 16లక్షల మంది గ్యాస్ సబ్సిడీ వెనక్కి ఇచ్చేసినట్లుగా కేంద్ర ప్రభుత్వం చెబుతోంది.
పహల్ స్కీమ్ కింద కేంద్ర ప్రభుత్వం నేరుగా వినియోగదారులకు నగదు బదిలీ చేస్తోంది.
ఇప్పటివరకు రూ.30.61 కోట్ల మంది వినియోగదారులకు నగదు బదిలీ చేసినట్లుగా చెబుతోంది. ఇలా
రూ.1.73లక్షల కోట్ల నగదు అందించినట్లుగా కేంద్ర ప్రభుత్వం చెబుతోంది.

ఫొటో సోర్స్, Getty Images
కేవైసీ చేశారా?
గ్యాస్ వినియోగదారులు కేవైసీ (నో యువర్ కస్టమర్) పూర్తి చేయాలని గ్యాస్ కంపెనీలు, పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ మంత్రిత్వ శాఖ సూచిస్తున్నాయి.
దీనివల్ల ఒకే ఇంట్లో ఒకటి కంటే ఎక్కువ సంఖ్యలో గ్యాస్ కనెక్షన్లు లేకుండా సబ్సిడీ అనర్హులకు చేరకుండా నియంత్రించేందుకు వీలవుతుందని చెబుతున్నాయి.
కేవైసీ నేరుగా గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ కార్యాలయాలకు వెళ్లి చేయించుకోవచ్చని కంపెనీలు సూచిస్తున్నాయి.
ఈకేవైసీ కోసం వినియోగదారులు తమ గ్యాస్ కంపెనీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి.
తర్వాత ఓటీపీ వస్తుంది. అది ఎంటర్ చేసి పాస్‌వర్డ్ సెట్ చేసుకోవాలి.
తర్వాత మళ్లీ లాగిన్ పేజీకి వెళ్లి ఫోన్ నంబరు, పాస్ వర్డ్ ఎంట్రీ చేస్తే అకౌంట్ లాగిన్ అవుతుంది.
మొదటి పేజీలో ఈకేవైసీ అని వస్తుంది. అది క్లిక్ చేసి ఫేస్ స్కాన్ చేయాలి. అదే సమయంలో ఆధార్ ఫేస్ఆర్డీ యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలని వస్తుంది. అది డౌన్‌లోడ్ చేసుకుని, ఫేస్ స్కాన్ చేసి వెరిఫై చేసుకోవాలి. అలా ఈ కేవైసీ పూర్తి చేసుకునేందుకు వీలవుతుందని కంపెనీలు చెబుతున్నాయి.
అలాగే కేవైసీ దరఖాస్తును ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్ చేసుకుని వివరాలు సంబంధిత గ్యాస్ డిస్ట్రిబ్యూటర్‌కు సమర్పించే వీలుందని వివరిస్తున్నాయి.
60 శాతం దిగుమతి
భారత్ వినియోగిస్తున్న ఎల్పీజీలో 60శాతం దిగుమతి చేసుకుంటోందని పీఐబీ సమాచారం చెబుతోంది.
ఇందులోనూ 90శాతం హర్ముజ్ జలసంధి ద్వారా సరఫరా కావాల్సి ఉంది. ఇరాన్ తో అమెరికా, ఇజ్రాయెల్ యుద్దం మొదలయ్యాక సరఫరా పై తీవ్ర ప్రభావం పడినట్లుగా కేంద్ర ప్రభుత్వం చెబుతోంది.
''మార్చి 8వ తేదీన దేశీయంగా ఎల్పీజీ ఉత్పత్తిని పెంచాలని కేంద్ర ప్రభుత్వం కంపెనీలకు సూచించింది. దాని ప్రకారం, 25శాతం అధికంగా ఉత్పత్తి చేస్తున్నాయి. మొత్తం ఎల్పీజీ ఉత్పత్తిని గృహావసరాలకు వినియోగించాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది.'' అని పీఐబీ మార్చిలో తెలిపింది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)























