డీజిల్-పెట్రోల్ కొరత: ‘పగలు చెరువుల దగ్గర రాత్రి బంకుల దగ్గర పడిగాపులు.. ’ అంటున్న గోదావరి రైతులు

పెట్రోల్, డీజిల్, కొరత, ఇంధనం, వ్యవసాయం, చేపలు, రొయ్యలు, రైతులు, పంట, కూలీలు, గోదావరి జిల్లాలు
ఫొటో క్యాప్షన్, డీజిల్‌ కోసం బంకు వద్ద రైతుల ఎదురు చూపులు
    • రచయిత, గరికిపాటి ఉమాకాంత్‌
    • హోదా, బీబీసీ కోసం
  • చదివే సమయం: 7 నిమిషాలు

ఆంధ్రప్రదేశ్‌లోని చాలా ప్రాంతాల్లో గత నాలుగైదు రోజులుగా పెట్రోలు బంకుల వద్ద వాహనాల క్యూలు కనిపిస్తున్నాయి. చాలా బంకుల్లో నో స్టాక్‌ బోర్డులు దర్శనమిచ్చాయి. దీంతో పెట్రోల్, డీజిల్ కోసం చాలామంది వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.

ముఖ్యంగా డీజిల్‌ దొరక్క గోదావరి జిల్లాల్లో వరి రైతులు, ఆక్వా సాగుదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం రబీ సీజన్‌ వరి కోతల నేపథ్యంలో డీజిల్‌ దొరక్క హార్వెస్టర్లు,. కోత యంత్రాలు పని చేయని స్థితిలో తాము అష్టకష్టాలు పడుతున్నామని రైతులు చెబుతున్నారు.

రొయ్యలు చేపల చెరువుల్లో పనిచేసే ఏరియేటర్లు, వాటర్‌ పంప్‌లకు డీజిల్‌ అవసరం. అయితే ప్రస్తుతం డీజిల్‌ దొరక్క అవి పనిచేయని స్థితిలో ఆక్సిజన్‌ అందక చెరువుల్లోని చేపలు, రొయ్యలు చనిపోయే ప్రమాదం ఉందని ఆక్వాసాగు రైతులు ఆందోళన చెందుతున్నారు.

అయితే రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ కొరతను అధిగమిస్తున్నామని పరిస్థితి అదుపులోకి వస్తోందని రాష్ట్ర పౌర సంబంధాల శాఖ మంత్రి కె. పార్థసారథి బీబీసీకి చెప్పారు.

గోదావరి జిల్లాల వరిరైతులు, ఆక్వాసాగురైతుల ఆవేదన ఏమిటి? అధికారులు, పెట్రోలు బంకుల యజమానుల వాదనలేంటి? ఎవరేమంటున్నారు? బీబీసీ గ్రౌండ్‌ రిపోర్ట్‌

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
పెట్రోల్, డీజిల్, కొరత, ఇంధనం, వ్యవసాయం, చేపలు, రొయ్యలు, రైతులు, పంట, కూలీలు, గోదావరి జిల్లాలు
ఫొటో క్యాప్షన్, వరి రైతు కోటేశ్వరరావు

‘వారం రోజులుగా వరికోతల్లేవ్‌...’

సరిపడా డీజిల్‌‌లేక కోత యంత్రాలు పని చేయకపోవడంతో వారం రోజులుగా గోదావరి జిల్లాల్లో వరి కోత పనులు చాలా వరకు నిలిచిపోయాయని రైతులు చెబుతున్నారు.

''మే మొదటి వారంలో వర్షాలు పడే అవకాశముందని అంటున్నారు. ఇప్పుడు పొలాల్లో ధాన్యం ఉంది. డీజిల్‌ లేక అప్పటి వరకు అలానే ఉంటే.. తర్వాత వాన పడితే మా పరిస్థితి ఏంటి? కోలుకోలేని దెబ్బతింటాం'' అని పశ్చిమ గోదావరి జిల్లా ఆకువీడుకి చెందిన వరి రైతు ఎం.కోటేశ్వరరావు బీబీసీతో అన్నారు.

''నాకున్న ఆరు ఎకరాల్లో పంటకోసే పరిస్థితిలేదు. డీజిల్‌ లేక ఆగిపోయింది. లేదంటే ఈ పాటికే ధాన్యం మిల్లుకు వెళ్లిపోయేది. చాలా ఇబ్బంది పడిపోతున్నాం'' అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

మరో రైతు ఏలూరు శ్రీను బీబీసీతో మాట్లాడుతూ.. ఆయిల్‌ దొరక్క తనకున్న 15ఎకరాల్లో 11 ఎకరాల్లో కోత ఆగిపోయిందని చెప్పారు.

''ఆయిల్‌ తీసుకొస్తే మేం పని చేస్తామని కోత మిషన్‌ వాళ్లు అంటున్నారు. కానీ మేమెక్కడ నుంచి తేవాలి. దాంతో పనుల్లేక మిషన్లన్నీ రోడ్డు మీద ఉండిపోయాయి. ఆయిల్‌ ఉంటే ఈపాటికి ధాన్యం మిల్లులకు వెళ్లిపోయేది. కానీ ఇప్పుడు పొలాల్లోనే ఉంది. వాతావరణం ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. చినుకు పడిందంటే ఇక అంతే'' అని మరో రైతు నిమ్మల అబ్బులు ఆందోళన వ్యక్తం చేశారు.

పెట్రోల్, డీజిల్, కొరత, ఇంధనం, వ్యవసాయం, చేపలు, రొయ్యలు, రైతులు, పంట, కూలీలు, గోదావరి జిల్లాలు
ఫొటో క్యాప్షన్, డీజిల్‌ కొరతతో పనిచేయని జనరేటర్‌

‘ఆ స్లిప్పులతో పని అవ్వడం లేదు’

డీజిల్‌ కొరత నేపథ్యంలో తహశీల్దార్‌ కార్యాలయాల్లోని ప్రత్యేక కౌంటర్లలో రైతులకు స్లిప్పులు ఇస్తారనీ, అవి తీసుకువెళ్తే బంకుల్లో డీజిల్‌ పోస్తారని అధికారులు చెబుతున్నారు.

కానీ వాస్తవంగా చాలా చోట్ల అలా జరగడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు.

''మొన్న ఎమ్మార్వో ఆఫీసుకి వెళ్తే అక్కడ స్లిప్పులు ఇచ్చారు. అవి తీసుకుని బంకుకు వెళ్తే డీజిల్‌ లేదన్నారు. అయిల్‌ లేకపోతే మేమేం చేస్తామని బంకు వాళ్లు అనడంతో చేసేది లేక తిరిగి వచ్చేశాను" అని రైతు కోటేశ్వరరావు అన్నారు.

మరికొన్నిచోట్ల వంద లీటర్లకి స్లిప్పులు రాస్తే కేవలం 30 లీటర్లు మాత్రమే పోస్తున్నారనీ అది దేనికీ ఉపయోగడపడం లేదని రైతులు చెబుతున్నారు.

''ఆ 30 లీటర్లకు 3 గంటలు తిరుగుతుంది మిషన్. ఆ మూడు గంటలకు ఎకరం కోత కూడా అవదు. అందుకే కోత పనులు ఆగిపోయాయి" అని రైతు రాజనాల పట్టాభిరామయ్య బీబీసీతో అన్నారు.

పెట్రోల్, డీజిల్, కొరత, ఇంధనం, వ్యవసాయం, చేపలు, రొయ్యలు, రైతులు, పంట, కూలీలు, గోదావరి జిల్లాలు
ఫొటో క్యాప్షన్, ఆకువీడులో ధాన్యపు రాశుల వద్ద పనుల్లో రైతులు.

‘పనుల్లేక ఖాళీగానే.. ’

మరోవైపు వరికోత యంత్రాలను తమిళనాడు నుంచి తీసుకొచ్చినప్పటికీ ఇక్కడ డీజిల్‌ లేకపోవడంతో పనుల్లేక ఇబ్బందులు పడుతున్నామని అక్కడి నుంచి వచ్చిన కార్మికులు చెబుతున్నారు.

"ఎప్పుడూ ఈ ఇబ్బంది రాలేదు. ఈ ఏడాదే వచ్చింది. రెండు గంటలు పనిచేసి, తర్వాత ఖాళీగానే ఉంటున్నాం. చాలా ఇబ్బందిగా ఉంది'' అని తమిళనాడు నుంచి ఆకువీడు వచ్చిన కూలీ వేల్మూరు బీబీసీతో అన్నారు.

పెట్రోల్, డీజిల్, కొరత, ఇంధనం, వ్యవసాయం, చేపలు, రొయ్యలు, రైతులు, పంట, కూలీలు, గోదావరి జిల్లాలు
ఫొటో క్యాప్షన్, వంద లీటర్లకి స్లిప్పు రాసిచ్చినా 30 లీటర్లే కొడుతున్నారంటున్న వరి కోత మిషన్‌ కార్మికుడు

‘మాకు అలాంటి ఫిర్యాదులు రాలేదు’

ఈ విషయమై వ్యవసాయశాఖ జాయింట్‌ డైరెక్టర్‌ వెంకటేశ్వరరావుతో బీబీసీ మాట్లాడగా.. రైతులకు వందలీటర్ల చొప్పున స్లిప్పులు ఇస్తున్నామనీ, తక్కువ డీజిల్ ఇస్తున్నట్లు తమ దృష్టికి తీసుకువస్తే బంకు యాజమాన్యాలతో మాట్లాడతామని చెప్పారు. అయితే ఇప్పటివరకు అలాంటి ఫిర్యాదులేవీ వ్యవసాయశాఖ అధికారుల దృష్టికి రాలేదని వెంకటేశ్వరరావు స్పష్టం చేశారు.

ఆకువీడుకి చెందిన ఆక్వా రైతు రవితేజ బీబీసీతో మాట్లాడుతూ, ''నేను ఏడు ఎకరాలు రొయ్యల చెరువు చేస్తున్నా. పగలంతా చెరువుల దగ్గర నైటంతా పెట్రోలు బంకుల దగ్గర పడిగాపులు కాయాల్సి వస్తోంది. కరెంటు లేకుంటే డీజిల్‌తో ఏరియేటర్‌ పని చేస్తుంది. అది తిరిగితేనే నీళ్లల్లో ఉన్న చేపలు, రొయ్యలకు ఆక్సిజన్‌ అందుతుంది'' అని ఆందోళన వ్యక్తం చేశారు.

అయితే ఏపీలో అధికారికంగా కరెంట్ కోతలు లేనప్పటికీ, పొలాల వద్ద ప్రత్యేకంగా చెరువుల వద్ద కరెంటు పోతూనేఉందని రైతులు చెప్తున్నారు. లైన్ల మరమ్మతులు, అనధికారిక కోతలతో కరెంటు వస్తూ పోతూ ఉంటుందని అందుకే జనరేటర్లు పెట్టుకుంటామని రైతులు చెప్పారు. అయితే బీబీసీ ఈ విషయాలను స్వయంగా ధ్రువీకరించుకోలేదు.

డీజిల్ లేక సరకు తీసుకువెళ్లేందుకు లారీలు కూడా రావడం లేదని ఏలూరు జిల్లా జాలిపూడి గ్రామానికి చెందిన నందిగం రమేశ్ బీబీసీతో అన్నారు.

చేపలను చెరువుల్లో ఉంచుదామంటే ఏరియటర్లకు డీజిల్ లేక , పట్టి పంపిద్దామంటే లారీలు దొరక్క ఇబ్బంది పడుతున్నామని రమేశ్ చెప్పారు.

పెట్రోల్, డీజిల్, కొరత, ఇంధనం, వ్యవసాయం, చేపలు, రొయ్యలు, రైతులు, పంట, కూలీలు, గోదావరి జిల్లాలు

పరిస్థితి చక్కబడుతోంది: అధికారులు

ఈ విషయమై బీబీసీ ఏలూరు జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ అభిషేక్‌ గౌడ, భీమవరం ఆర్డీవో ప్రవీణ్‌కుమార్‌ రెడ్డితో మాట్లాడింది బీబీసీ.

ఏలూరు జిల్లాలో రైతులకు పెట్రోలు, డీజిల్‌ కొరత లేకుండా చర్యలు చేపట్టామనీ, రైతులు ఆందోళన చెందవద్దని వారు కోరారు. పశ్చిమగోదావరి జిల్లాలో ఎక్కడా కరెంటు కోతలు లేవనీ, ఆక్వా రైతులు ఆందోళన చెందాల్సిన పని లేదని భీమవరం ఆర్డీవో అన్నారు.

‘‘డీజిల్‌ కొరతతో పంటలు ఆగిపోయిన పరిస్థితి గతంలో లేదు.. రైతులు చాలా ఆందోళన చెందుతున్నారు. పగలు, రాత్రి తేడా లేకుండా పెట్రోలు డీజిల్‌ కోసం తిరుగుతున్నారు.'' అని ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం నేత కె.శ్రీనివాస్‌ ఆందోళన వ్యక్తం చేశారు.

పెట్రోల్, డీజిల్, కొరత, ఇంధనం, వ్యవసాయం, చేపలు, రొయ్యలు, రైతులు, పంట, కూలీలు, గోదావరి జిల్లాలు
ఫొటో క్యాప్షన్, పెట్రోల్ బంకుల యజమానుల సంఘం నేత శేఖర్‌

కృత్రిమ కొరత సృష్టించలేదు: పెట్రోలు బంకుల సంఘం

డీజిల్ కృత్రిమ కొరత సృష్టించడం లేదనీ, ప్రజలు భయంతో అవసరం లేకపోయినా ఎక్కువ పెట్రోల్, డీజిల్‌ కొనుగోలు చేయడం వల్ల ఈ పరిస్థితి వచ్చిందనీ పెట్రోలు బంకుల అసోసియేషన్‌ నేత స్వర్ణశేఖర్‌ బీబీసీతో అన్నారు.

''ఆయిల్‌ కంపెనీలు మాకు ఇచ్చే సరఫరాలో కోత పెట్టాయి. మేం పెంచమని అడిగినా పది శాతం కంటే పెంచలేదు. ఈ వేసవి సీజన్‌లోనే మనకి పనులు ఎక్కువ. భవన నిర్మాణాలు, రబీ సీజన్, ఫిష్‌ ట్యాంకులు. ఇలా చాలా రంగాలకు డీజిల్‌ అవసరం. దీంతో ఒక్కసారిగా డీజిల్‌ కొరత ఏర్పడింది. పెట్రోలు సరఫరాకి ఇబ్బంది లేదు'' అని శేఖర్‌ వివరించారు.

ఆయిల్ కంపెనీల ప్రతినిధులతో మాట్లాడేందుకు బీబీసీ ప్రయత్నించింది. వైజాగ్ హెచ్‌పీసీఎల్ అధికారులను సంప్రదించేందుకు ప్రయత్నించగా వాళ్లు అందుబాటులోకి రాలేదు.

రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ కొరతను అధిగమిస్తున్నామని పరిస్థితి పూర్తిగా అదుపులోకి వస్తోందని రాష్ట్ర పౌర సంబంధాల శాఖ మంత్రి కె.పార్థసారథి బీబీసీకి చెప్పారు.

మంగళవారం ఆయన బీబీసీతో మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 4600 పెట్రోలు బంకులు ఉంటే మంగళవారం నాటికి 4200 పెట్రోల్ బంకుల వరకు ఓపెన్ చేసి ఉన్నాయని తెలిపారు.

ఉద్దేశపూర్వకంగా పెట్రోల్ బంకులు మూసివేసిన యాజమాన్యాలపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ సమస్యను అధిగమించేందుకు ప్రభుత్వం పెట్రోలు సరఫరా కంపెనీలతో చర్చిస్తోందని, ఎక్కడా ఎటువంటి ఇబంది లేకుండా సరిపడా పెట్రోల్ డీజిల్ సరఫరా కోసం పూర్తిస్థాయిలో ప్రయత్నిస్తున్నామని సారధి తెలిపారు.

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)