ఇరాన్ యుద్ధం: బిలియన్ల కొద్దీ లాభాలు గడిస్తున్న కంపెనీలు

మిడిల్ ఈస్ట్, ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్, బ్రిటన్, చమురు, ఇంధన రంగం, బ్యాంకింగ్, పారిశ్రామిక రంగం

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, ఆర్చీ మిచెల్
    • హోదా, బిజినెస్ రిపోర్టర్
  • చదివే సమయం: 6 నిమిషాలు

ఇరాన్‌తో అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా, ప్రపంచవ్యాప్తంగా సామాన్యులు ఆర్థిక భారంతో సతమతమవుతుంటే, కొన్ని కంపెనీలు భారీ లాభాలు గడిస్తున్నాయి.

యుద్ధం సృష్టించిన అనిశ్చితితో పాటు ఇరాన్ 'స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్'ను మూసివేయడం వల్ల ప్రజల జీవన వ్యయం భారీగా పెరిగింది. దీని ప్రభావం కంపెనీలు, కుటుంబాలు, ప్రభుత్వాల బడ్జెట్‌లపై తీవ్రంగా పడింది.

ఇలా ఒకవైపు అనేకమంది ఆర్థికంగా కుదేలై దివాలా అంచున నిలబడితే, మరోవైపు యుద్ధ సమయాల్లో ఎక్కువ లాభాలు పొందే వ్యాపారాలు, అస్థిరమైన ఇంధన ధరల ద్వారా లబ్ధి పొందే మరికొన్ని సంస్థలు మాత్రం రికార్డు స్థాయిలో సంపాదనను కళ్ల చూస్తున్నాయి.

మధ్యప్రాచ్య సంక్షోభం కొనసాగుతున్న వేళ, బిలియన్ల కొద్దీ లాభాలను ఆర్జిస్తున్న రంగాలు, కంపెనీల వివరాలేమిటో చూద్దాం.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
మిడిల్ ఈస్ట్, ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్, బ్రిటన్, చమురు, ఇంధన రంగం, బ్యాంకింగ్, పారిశ్రామిక రంగం

ఫొటో సోర్స్, Getty Images

చమురు, సహజ వాయువు పరిశ్రమలు

ఇరాన్ యుద్ధం కారణంగా ఇప్పటిదాకా కనిపించిన అతిపెద్ద ఆర్థిక ప్రభావం ఇంధన ధరల పెరుగుదలే.

ప్రపంచంలోని చమురు, సహజ వాయువులలో దాదాపు ఐదో వంతు (20 శాతం) 'స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్' ద్వారా రవాణా అవుతుంది. అయితే, ఫిబ్రవరి చివరి నాటికి ఈ రవాణా దాదాపు పూర్తిగా నిలిచిపోయింది. ఫలితంగా ఇంధన మార్కెట్లలో ధరల హెచ్చుతగ్గులు ఒక 'రోలర్ కోస్టర్'లా మారిపోయాయి.

ఈ పరిస్థితిని ప్రపంచంలోని కొన్ని అతిపెద్ద చమురు, గ్యాస్ కంపెనీలు తమకు అనుకూలంగా మార్చుకుని భారీగా లాభపడ్డాయి.

ప్రధానంగా ఐరోపాకు చెందిన దిగ్గజ చమురు సంస్థలు లబ్ధి పొందాయి.

ఈ కంపెనీలకు సొంతంగా ట్రేడింగ్ విభాగాలు ఉండటంతో, మార్కెట్‌లో ధరల్లో వచ్చిన భారీ మార్పులను తమకు అనుకూలంగా మార్చుకుని లాభాలు పెంచుకోగలిగాయి.

ముఖ్యంగా బ్రిటిష్ పెట్రోలియం (బీపీ) కంపెనీ లాభాలు ఈ ఏడాది మొదటి మూడు నెలల్లోనే రెండింతలు పెరిగి 3.2 బిలియన్ డాలర్ల (సుమారు రూ.30,230 కోట్లు)కు చేరుకున్నాయి. తన ట్రేడింగ్ విభాగం కనబరిచిన 'అసాధారణ' పనితీరు వల్లే ఈ స్థాయిలో లాభాలు వచ్చాయని సదరు కంపెనీ పేర్కొంది.

షెల్ కంపెనీ తన మొదటి త్రైమాసిక లాభాలు 6.92 బిలియన్ డాలర్ల (సుమారు రూ.65,379 కోట్లు)కు పెరిగినట్లు నివేదించింది. ఇది విశ్లేషకుల అంచనాలను కూడా మించిపోయింది.

మరో అంతర్జాతీయ దిగ్గజ సంస్థ 'టోటల్ ఎనర్జీస్' చమురు, ఇంధన మార్కెట్లలోని హెచ్చుతగ్గుల కారణంగా 2026 మొదటి త్రైమాసికంలో తన లాభాలను దాదాపు మూడో వంతు పెంచుకుని, 5.4 బిలియన్ డాలర్ల (సుమారు రూ.51,014 కోట్లు)కు చేరుకుంది.

మధ్యప్రాచ్యంలో ఇంధన సరఫరాకు ఏర్పడిన ఆటంకాల కారణంగా అమెరికా దిగ్గజ సంస్థలు ఎక్సాన్ మొబిల్, షెవ్రాన్ ఆదాయాలు గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే తగ్గాయి.

అయితే, ఈ రెండు కంపెనీలు విశ్లేషకుల అంచనాలను మించి రాణించాయి. యుద్ధం ప్రారంభమైనప్పటి కంటే చమురు ధరలు ఇప్పటికీ గణనీయంగా ఎక్కువగానే ఉండటంతో, ఈ ఏడాది గడిచేకొద్దీ తమ లాభాలు మరింత పెరుగుతాయని అవి భావిస్తున్నాయి.

మిడిల్ ఈస్ట్, ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్, బ్రిటన్, చమురు, ఇంధన రంగం, బ్యాంకింగ్, పారిశ్రామిక రంగం

ఫొటో సోర్స్, Getty Images

బ్యాంకులకూ లాభాలు

కొన్ని అతిపెద్ద బ్యాంకులు కూడా ఇరాన్ యుద్ధ సమయంలో తమ లాభాలను భారీగా పెంచుకున్నాయి.

జేపీ మోర్గాన్ ట్రేడింగ్ విభాగం 2026 మొదటి మూడు నెలల్లో రికార్డు స్థాయిలో 11.6 బిలియన్ డాలర్ల (సుమారు రూ.1,09,585 కోట్లు) ఆదాయాన్ని ఆర్జించింది. ఇది ఆ బ్యాంక్ మొత్తం మీద తన చరిత్రలోనే రెండవ అతిపెద్ద త్రైమాసిక లాభాన్ని నమోదు చేయడంలో సహాయపడింది.

అలాగే బ్యాంక్ ఆఫ్ అమెరికా, మోర్గాన్ స్టాన్లీ, సిటీ గ్రూప్, గోల్డ్‌మన్ సాక్స్, వెల్స్ ఫార్గో వంటి మిగిలిన 'బిగ్ సిక్స్' బ్యాంకులన్నీ కూడా ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో గణనీయమైన లాభాలను సాధించాయి.

మొత్తంగా, ఈ బ్యాంకులు 2026 మొదటి మూడు నెలల్లో 47.7 బిలియన్ డాలర్ల (సుమారు రూ.4,50,621 కోట్లు) లాభాలను నివేదించాయి.

''భారీ స్థాయిలో జరిగిన ట్రేడింగ్ లావాదేవీలు ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకులకు, ముఖ్యంగా మోర్గాన్ స్టాన్లీ, గోల్డ్‌మన్ సాక్స్ సంస్థలకు బాగా లబ్ధి చేకూర్చాయి'' అని వెల్త్ క్లబ్ ప్రధాన ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజిస్ట్ సుసానా స్ట్రీటర్ పేర్కొన్నారు.

పెట్టుబడిదారులు రిస్క్ ఎక్కువగా ఉండే స్టాక్స్, బాండ్లను వదిలించుకుని, సురక్షితమైన ఆస్తులలో పెట్టుబడి పెట్టడానికి పోటీ పడటంతో ట్రేడింగ్‌కు పెరిగిన డిమాండ్ వాల్ స్ట్రీట్ రుణదాతలకు బాగా కలిసివచ్చింది.

అలాగే, ఆర్థిక మార్కెట్లలో నెలకొన్న అస్థిరతను సొమ్ము చేసుకోవాలని పెట్టుబడిదారులు ప్రయత్నించడం వల్ల కూడా ట్రేడింగ్ లావాదేవీల పరిమాణం గణనీయంగా పెరిగింది.

''యుద్ధం వల్ల తలెత్తిన అస్థిరత ట్రేడింగ్ ఒక్కసారిగా పెరగడానికి కారణమైంది. పరిస్థితులు మరింత విషమిస్తాయన్న భయంతో కొందరు పెట్టుబడిదారులు తమ స్టాక్స్‌ను విక్రయించగా, మరికొందరు తక్కువ ధరల్లో కొనుగోలు చేశారు. ఇది మార్కెట్ మళ్లీ పుంజుకోవడానికి దోహదపడింది'' అని స్ట్రీటర్ విశ్లేషించారు.

మిడిల్ ఈస్ట్, ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్, బ్రిటన్, చమురు, ఇంధన రంగం, బ్యాంకింగ్, పారిశ్రామిక రంగం

ఫొటో సోర్స్, Getty Images

రక్షణ రంగ పరిశ్రమలు...

ఆర్‌ఎస్‌ఎం యూకే సీనియర్ అనలిస్ట్ ఎమిలీ సావిచ్ ప్రకారం, ఏ సంఘర్షణలోనైనా తక్షణమే ప్రయోజనం పొందే రంగాలలో రక్షణ రంగం ఒకటి.

''ఈ సంఘర్షణ వాయు రక్షణ సామర్థ్యంలోని లోపాలను స్పష్టం చేసింది. దీనివల్ల యూరప్, అమెరికా అంతటా మిస్సైల్ డిఫెన్స్, కౌంటర్ డ్రోన్ సిస్టమ్స్, మిలిటరీ హార్డ్‌వేర్‌లపై పెట్టుబడులు వేగవంతమయ్యాయి'' అని ఆమె బీబీసీతో చెప్పారు.

రక్షణ సంస్థల ప్రాముఖ్యతను నొక్కిచెప్పడమే కాకుండా, ఈ యుద్ధం వల్ల ప్రభుత్వాలు తమ ఆయుధ నిల్వలను తిరిగి నింపుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఇది డిమాండ్‌ను పెంచుతోంది.

ఎఫ్-35 ఫైటర్ జెట్ భాగాల సహా వివిధ ఉత్పత్తులను తయారుచేసే బీఏఈ సిస్టమ్స్, గురువారం నాటి ట్రేడింగ్ అప్‌డేట్‌లో ఈ ఏడాది అమ్మకాలు, లాభాల్లో బలమైన వృద్ధిని ఆశిస్తున్నట్లు తెలిపింది.

ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న 'రక్షణపరమైన ముప్పులు' ప్రభుత్వ రక్షణ వ్యయాన్ని పెంచుతున్నాయని, ఇది తమ కంపెనీకి 'అనుకూలమైన వాతావరణాన్ని' సృష్టించిందని ఆ సంస్థ పేర్కొంది.

ప్రపంచంలోని అతిపెద్ద రక్షణ కాంట్రాక్టర్లలో మూడు సంస్థలైన లాక్‌హీడ్ మార్టిన్, బోయింగ్, నార్త్రోప్ గ్రూమ్మన్ 2026 మొదటి త్రైమాసికం చివరి నాటికి తమ వద్ద రికార్డు స్థాయిలో ఆర్డర్లు పేరుకుపోయినట్లు నివేదించాయి.

అయితే, గత కొన్నేళ్లుగా విపరీతంగా పెరిగిన రక్షణ రంగ సంస్థల షేర్లు, మార్చి మధ్య కాలం నుంచి తగ్గుముఖం పట్టాయి. ఈ రంగంలోని షేర్ల విలువ వాస్తవ స్థాయి కంటే ఎక్కువగా ఉందనే ఆందోళనల మధ్య ఈ క్షీణత కనిపిస్తోంది.

మిడిల్ ఈస్ట్, ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్, బ్రిటన్, చమురు, ఇంధన రంగం, బ్యాంకింగ్, పారిశ్రామిక రంగం

ఫొటో సోర్స్, Getty Images

పునరుత్పాదక వనరులు...

శిలాజ ఇంధనాలపై ఆధారపడటాన్ని తగ్గించి, ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాల్సిన అవసరాన్ని ఇరాన్ సంఘర్షణ నొక్కి చెప్పిందని స్ట్రీటర్ అన్నారు.

దీనివల్ల అమెరికాలో కూడా 'పునరుత్పాదక ఇంధన రంగంపై ఆసక్తి ఒక్కసారిగా పెరిగింది' అని ఆమె పేర్కొన్నారు.

వాస్తవానికి అమెరికాలో ట్రంప్ ప్రభుత్వం 'డ్రిల్ బేబీడ్రిల్' అనే నినాదంతో శిలాజ ఇంధనాల వినియోగాన్ని ప్రోత్సహించినప్పటికీ, ప్రస్తుత పరిస్థితుల్లో మార్పు వచ్చింది.

స్థిరత్వానికి, ఆకస్మిక సంక్షోభాలను తట్టుకోవడానికి పునరుత్పాదక ఇంధనాల్లో పెట్టుబడులు పెట్టడం ఎంతో కీలకమని ఈ యుద్ధం నిరూపించినట్లు స్ట్రీటర్ చెప్పారు.

ఇరాన్ పరిణామాల వల్ల లబ్ధి పొందిన సంస్థల్లో ఫ్లోరిడాకు చెందిన నెక్స్ట్ ఎరా ఎనర్జీ ఒకటి. పెట్టుబడిదారులు ఈ సంస్థ లక్ష్యాలపై నమ్మకంతో భారీగా పెట్టుబడులు పెట్టడంతో, ఈ ఏడాదిలో ఇప్పటివరకు దీని షేర్లు 17 శాతం పెరిగాయి.

డానిష్ విండ్ పవర్ దిగ్గజాలు వెస్టాస్, ఓర్‌స్టెడ్ కూడా భారీ లాభాలను ప్రకటించాయి.

ఇరాన్ యుద్ధ ప్రభావం పునరుత్పాదక ఇంధన సంస్థలకు ఎలా కలిసొస్తుందో ఇది సూచిస్తోంది.

బ్రిటన్‌కు చెందిన ఆక్టోపస్ ఎనర్జీ ఇటీవల బీబీసీకి తెలిపిన వివరాల ప్రకారం, యుద్ధం కారణంగా సోలార్ ప్యానెల్స్, హీట్ పంప్స్ అమ్మకాలు ఒక్కసారిగా పెరిగాయి. ఫిబ్రవరి చివరి నుంచి సోలార్ ప్యానెల్స్ అమ్మకాలు 50 శాతం పెరిగాయి.

మరోవైపు పెట్రోల్ ధరలు పెరగడం వల్ల ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరిగింది. ముఖ్యంగా చైనా తయారీదారులు ఈ అవకాశాన్ని పూర్తిస్థాయిలో ఉపయోగించుకుంటున్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)