ఫోర్ సీస్ ఇనిషియేటివ్: సిరియా వేసిన మాస్టర్ ప్లాన్... భారత్‌ ప్లాన్‌కు పోటీ అవుతుందా?

సిరియా, భారత్, మిడిల్ ఈస్ట్, ఇరాన్, తుర్కియే, యూరప్, గ్యాస్-ఇంధన రంగం

ఫొటో సోర్స్, Byron Smith/Getty Images

ఫొటో క్యాప్షన్, సిరియా అధ్యక్షుడు అహ్మద్ అల్-షరా
చదివే సమయం: 6 నిమిషాలు

ఇరాన్ యుద్ధ ప్రభావం, హార్ముజ్ జలసంధి మూసివేత ముప్పుతో మిడిల్ ఈస్ట్ సతమతమవుతున్న నేపథ్యంలో సిరియా ఒక ప్రతిష్టాత్మకమైన ప్రతిపాదనను ముందుకు తెచ్చింది.

ప్రపంచ ఇంధన, వాణిజ్య రవాణాకు తాను ఒక సెంట్రల్ కారిడార్‌గా వ్యవహరించగలనని సిరియా పేర్కొంటోంది.

ఏప్రిల్ 17న తుర్కియేలో జరిగిన అంటాల్యా డిప్లొమసీ ఫోరంలో, ఆ తర్వాత కొన్ని రోజులకు సైప్రస్‌లో జరిగిన యూరోపియన్ యూనియన్ నేతల సమావేశంలో సిరియా అధ్యక్షుడు అహ్మద్ అల్-షరా ఈ ప్రతిపాదన చేశారు.

తమ దేశ భౌగోళిక వ్యూహాత్మక స్థితిని ఉపయోగించుకుని ఇంధన, వస్తు రవాణాకు ఒక ప్రత్యామ్నాయ మార్గంగా మారాలని కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు.

ఈ మార్గం గల్ఫ్ దేశాలను తుర్కియేతో అనుసంధానించడమే కాకుండా, మధ్యధరా సముద్రానికి సురక్షితమైన యాక్సెస్ అందిస్తుందని పేర్కొన్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

అయితే, సిరియా ప్లాన్‌కు పలు ఇతర ప్రాజెక్టుల నుంచి గట్టి పోటీ ఎదురయ్యే అవకాశం ఉంది. వాటిలో భారత్‌ ప్రతిపాదించిన ఇండియా-మిడిల్ ఈస్ట్-యూరప్ ఎకనామిక్ కారిడార్ (ఐఎంఈసీ) కూడా ఒకటి.

ఈ ప్లాన్‌ను ముందుకు తీసుకెళ్లడానికి సిరియా ప్రభుత్వం రెండు ప్రధాన కార్యక్రమాలు.. ఫోర్ సీస్ (నాలుగు సముద్రాల) ఇనిషియేటివ్ ప్రాజెక్ట్, 4+1 ప్లాన్‌లను ప్రోత్సహిస్తోంది.

ఈ రెండు కార్యక్రమాలు ఆశాజనకంగా, వీటి ముందు భారీ సవాళ్లు కూడా ఉన్నాయి.

సిరియా, భారత్, మిడిల్ ఈస్ట్, ఇరాన్, తుర్కియే, యూరప్, గ్యాస్-ఇంధన రంగం

ఫొటో సోర్స్, Bakr Al Kasem/Anadolu via Getty Images

ఫొటో క్యాప్షన్, తుర్కియే నుంచి సిరియాకు గ్యాస్ సరఫరా 2025 ఆగస్టు 2న ప్రారంభమైంది.

'ఫోర్ సీస్' ఇనిషియేటివ్ ఏమిటి?

'ఫోర్ సీస్' ఇనిషియేటివ్ ప్రాజెక్ట్. దీనిని 'నైన్ కారిడార్స్ ఇనిషియేటివ్' అని కూడా పిలుస్తారు. ఇది గల్ఫ్, మధ్యధరా సముద్రం, కాస్పియన్ సముద్రం, నల్ల సముద్రాలను ఒకదానితో ఒకటి అనుసంధానించే ఒక సమగ్ర రవాణా, ఇంధన నెట్‌వర్క్‌కు సంబంధించిన ప్రతిపాదన.

ప్రాంతీయ వాణిజ్యం, ఇంధన రవాణాకు సిరియా, తుర్కియేలను ప్రధాన కేంద్రాలుగా నిలబెట్టడం దీని లక్ష్యం.

ఏప్రిల్ 24న సైప్రస్‌లో జరిగిన సమావేశంలో షరా ఈ ప్రణాళికను గట్టిగా సమర్థించారు. కాగా సిరియా విదేశాంగ మంత్రి అసాద్ అల్-షిబానీ తన తుర్కియే పర్యటనలో దీనిని ద్వైపాక్షిక వ్యూహాత్మక సహకారంలో ఒక కొత్త దశకు ప్రారంభంగా అభివర్ణించారు.

అరబ్ ప్రాంతంలో ప్రాచుర్యం పొందిన సౌదీ వార్తా సంస్థ అల్-మజల్లా సేకరించిన ఒక పత్రంలో, సిరియాను ప్రపంచ ఇంధన రవాణాకు ప్రధాన ట్రాన్సిట్ కేంద్రంగా మార్చాలనే అమెరికా ప్రతిపాదనకు సంబంధించిన ముసాయిదా ఉంది.

ఈ ముసాయిదా రూపకల్పన బాధ్యతను సిరియాలోని అమెరికా రాయబారి టామ్ బరాక్‌కు అప్పగించారు.

అల్-మజల్లా ప్రకారం.. గల్ఫ్, ఇరాక్ చమురు క్షేత్రాలను మధ్యధరా సముద్ర తీరంలోని ఓడరేవులకు, ఆపై యూరప్‌కు అనుసంధానించడానికి ప్రస్తుతం ఉన్న, ప్రతిపాదిత పైప్‌లైన్ల భారీ నెట్‌వర్క్‌ను పునరుద్ధరించడం, విస్తరించడంపై ఈ ప్రణాళిక దృష్టి పెడుతుంది.

కిర్కుక్-బనియాస్ చమురు పైప్‌లైన్‌ను పునరుద్ధరించడానికి 36 నెలల్లో సుమారు 4.5 బిలియన్ డాలర్ల (సుమారు రూ.37,800 కోట్లు) ఖర్చు అవుతుందని, దీని ద్వారా సిరియా ట్రాన్సిట్ ఫీజు రూపంలో ఏటా సుమారు 200 మిలియన్ డాలర్ల (సుమారుగా రూ.1,680 కోట్లు) ఆదాయాన్ని పొందుతుందని అల్-మజల్లా పేర్కొంది.

అరబ్ గ్యాస్ పైప్‌లైన్‌ను ఈజిప్ట్ నుంచి సిరియా మీదుగా తుర్కియే వరకు విస్తరించే ప్రణాళిక కూడా ఉందని అల్-మజల్లా తెలిపింది.

దీనితో పాటు, ప్రతిపాదిత ఖతార్-తుర్కియే గ్యాస్ రూట్ ప్రణాళిక కూడా ఉంది. దీని ద్వారా ఖతార్ గ్యాస్‌ను జోర్డాన్, సిరియా మీదుగా తుర్కియేకి, అక్కడి నుంచి యూరప్‌కు పంపిస్తారు.

4+1 ఇనిషియేటివ్ ఏమిటి?

ప్రాంతీయ ఇంధన ట్రాన్సిట్ కేంద్రంగా తనను తాను నిలబెట్టుకోవాలనే సిరియా ప్రయత్నాలలో భాగంగా, అక్కడి ప్రభుత్వం 2026 మార్చి నెలలో 4+1 ప్లాన్‌ను ప్రతిపాదించింది.

సంప్రదాయ సముద్ర మార్గాలపై ఆధారపడటాన్ని తగ్గిస్తూ సమీకృత, సురక్షితమైన భూతల ఇంధన కారిడార్లను ఏర్పాటు చేయడం ఈ ప్రణాళిక ప్రధాన ఉద్దేశం.

సిరియా ఆర్థిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ సలహాదారు ఒసామా అల్ ఖాదీ 'అల్ అరబీ అల్ జదీద్' వెబ్‌సైట్‌తో మాట్లాడుతూ.. 'ఫోర్ సీస్' ప్రాజెక్ట్ ప్రాంతీయ జలమార్గాలను అనుసంధానిస్తే, 4+1 ప్లాన్ ప్రాంతీయ ఆర్థిక వ్యవస్థలను పరస్పరం అనుసంధానిస్తుందని తెలిపారు.

ఇది సిరియాను సముద్ర, భూతల, రైలు మార్గాలతో కూడిన బహుముఖ నెట్‌వర్క్‌కు కేంద్ర బిందువుగా మారుస్తుంది.

ఈ రెండు ప్రాజెక్టులు ఒకదానికొకటి కాంప్లిమెంటరీగా ఉంటూ, ప్రాంతీయ స్థిరత్వం, అభివృద్ధి అనే ఉమ్మడి లక్ష్యాలను బలోపేతం చేస్తాయని అల్ ఖాదీ పేర్కొన్నారు.

అల్ ఖాదీ సహా పలువురు నిపుణుల అంచనాల ప్రకారం, 4+1 ప్రాజెక్టుల మొత్తం వ్యయం సుమారు 50 బిలియన్ డాలర్ల (దాదాపు నాలుగు లక్షల ఇరవై వేల కోట్ల రూపాయలు) వరకు ఉండవచ్చు.

సిరియా, భారత్, మిడిల్ ఈస్ట్, ఇరాన్, తుర్కియే, యూరప్, గ్యాస్-ఇంధన రంగం

ఫొటో సోర్స్, Izettin Kasim/Anadolu via Getty Images

ఫొటో క్యాప్షన్, పాత హెజాజ్ రైల్వేను ఇస్తాంబుల్, మదీనా నగరాలను అనుసంధానించడానికి నిర్మించారు. సిరియా రాజధాని డమాస్కస్‌లోని ఖదేమ్ స్టేషన్‌కు చెందిన ఈ చిత్రం 2025 ఫిబ్రవరి నాటిది.

సిరియా ప్లాన్‌కు ప్రధాన సవాళ్లు?

సిరియా ప్రతిపాదిత ప్రాజెక్టుల పట్ల ఆకర్షణ, ఆశావాదం ఉన్నప్పటికీ, వీటి ముందు సంక్లిష్టమైన సవాళ్లు కూడా ఉన్నాయి.

తన రాజకీయ, సంస్థాగత బలహీనతలను సిరియా అధిగమించగలదా? ఏళ్ల తరబడి సాగిన సంఘర్షణల వల్ల ధ్వంసమైన మౌలిక సదుపాయాలను పునర్నిర్మించగలదా? అలాగే భారీ ఆర్థిక, భద్రతా, భౌగోళిక రాజకీయ ఆంక్షల మధ్య తన మార్గాన్ని సుగమం చేసుకోగలదా?అనే అంశాలపైనే వీటి ఆచరణాత్మకత ఆధారపడి ఉంటుంది.

తుర్కియే, మధ్యప్రాచ్య వ్యవహారాల నిపుణులైన జర్నలిస్ట్ సార్కిస్ కాస్సార్జియాన్ 'యూరోన్యూస్'తో మాట్లాడుతూ ఇటువంటి ప్రతిపాదనలు కొత్తవేమీ కావని, సౌదీ అరేబియా, ఇజ్రాయెల్, తుర్కియే వంటి దేశాలకు ఉన్న మౌలిక సదుపాయాలు, స్థిరత్వం, భౌగోళిక ప్రయోజనాలు సిరియాకు లేవని పేర్కొన్నారు.

భద్రత, పరిపాలనకు సంబంధించిన లోటుపాట్లు ఇప్పటికీ ప్రధాన అడ్డంకులుగా ఉన్నాయని, సిరియా రాజకీయ, సంస్థాగత బలహీనతలు పునర్నిర్మాణం, అభివృద్ధి మార్గంలో అతిపెద్ద ఆటంకాలని సార్కిస్ కాస్సార్జియాన్ చెప్పారు.

సిరియా పెట్రోలియం ఇంజినీర్ ఘస్సాన్ అల్-రాయ్ కూడా యూరోన్యూస్‌తో మాట్లాడుతూ, 2011లో అంతర్యుద్ధం ప్రారంభం కాకముందు పనిచేసిన పైప్‌లైన్ నెట్‌వర్క్ భాగాలను మరమ్మతు చేయవచ్చని లేదా వాటిని విస్తరించవచ్చని తెలిపారు.

అయితే, ఏ రకమైన పునర్నిర్మాణమైనా ఆర్థిక వనరులు, భద్రతా పరిస్థితులపైనే ఆధారపడి ఉంటుందని ఘస్సాన్ అల్-రాయ్ స్పష్టం చేశారు.

ఏళ్ల తరబడి సాగిన పోరాటం కారణంగా నైపుణ్యం కలిగిన కార్మికుల కొరత కూడా ఏర్పడిందని ఆయన వివరించారు.

సిరియా అంతర్గత సరిహద్దులే కాకుండా, సరిహద్దు దాటి భారీ స్థాయిలో రైలు, రోడ్డు, పైప్‌లైన్ నెట్‌వర్క్‌ల నిర్మాణానికి ఆర్థిక, రాజకీయ సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉంది. వీటిని మారుతున్న ప్రాంతీయ సమీకరణాలు మరింత సంక్లిష్టం చేస్తున్నాయి.

సిరియా ఆర్థిక వ్యవహారాల నిపుణులు సల్మాన్ అల్ హకీమ్ లెబనాన్ వార్తాపత్రిక 'అన్నహర్'తో మాట్లాడుతూ, అతిపెద్ద సవాలు నిధుల సమీకరణేనని, ఎందుకంటే ఏ ఒక్క దేశం కూడా సొంతంగా ఇంత ఖర్చును భరించలేదని అన్నారు.

సిరియా, భారత్, మిడిల్ ఈస్ట్, ఇరాన్, తుర్కియే, యూరప్, గ్యాస్-ఇంధన రంగం

ఫొటో సోర్స్, Bakr ALKASEM/AFP via Getty Images

భారీ వ్యయం, భద్రత చాలా కీలకం

సిరియా ఆర్థికవేత్త జియాద్ అర్బాష్ అంచనా ప్రకారం, ఈ మార్గాల నిర్మాణం, అప్‌గ్రేడ్ చేయడానికి 10 నుంచి 15 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ ఖర్చు అవుతుంది.

దీని కోసం ఉన్నత స్థాయి ప్రాంతీయ సమన్వయం, కారిడార్ అంతటా భద్రత అవసరం. ముఖ్యంగా సిరియాలోని అంతర్యుద్ధ ప్రభావిత ప్రాంతాలలో ఇది చాలా ముఖ్యం.

గ్యాస్ పైప్‌లైన్ ప్రతిపాదనపై అర్బాష్ మాట్లాడుతూ దానికయ్యే భారీ వ్యయం, మార్గం పొడవు, అరబ్-తుర్కియే దేశాల మధ్య సహకారాన్ని ప్రస్తావించారు.

ఇప్పటికే యూరప్‌కు గ్యాస్ సరఫరా చేస్తున్న రష్యా, అజర్‌బైజాన్, అల్జీరియా నుంచి దీనికి తీవ్రమైన పోటీ ఎదురవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

సిరియా, భారత్, మిడిల్ ఈస్ట్, ఇరాన్, తుర్కియే, యూరప్, గ్యాస్-ఇంధన రంగం

ఫొటో సోర్స్, IMEC

ఫొటో క్యాప్షన్, ఇండియా-మిడిల్ ఈస్ట్-యూరప్ ఎకనామిక్ కారిడార్ (ఐఎంఈసీ) ప్రణాళికను 2023 సెప్టెంబర్‌లో జరిగిన జీ20 శిఖరాగ్ర సమావేశం సందర్భంగా ప్రవేశపెట్టారు.

భారత్ ‘ఐఎంఈసీ’ ప్రాజెక్టుతో పోటీ

ప్రత్యామ్నాయ ఆర్థిక కారిడార్లను నిర్మించే ప్రణాళికలను ప్రతిపాదిస్తున్న ఇతర దేశాల కార్యక్రమాల నుంచి సిరియా ప్లాన్‌కు గట్టి పోటీ ఎదురవుతుంది.

ఆ ప్రణాళికలలో సిరియాను పరిగణనలోకి తీసుకోలేదు.

వీటిలో అత్యంత ముఖ్యమైనది ప్రతిపాదిత ఇండియా-మిడిల్ ఈస్ట్-యూరప్ ఎకనామిక్ కారిడార్ (ఐఎంఈసీ).

2023 సెప్టెంబర్‌లో జరిగిన జీ20 శిఖరాగ్ర సమావేశం సందర్భంగా ఐఎంఈసీ గురించి చర్చ మొదలైంది.

అత్యాధునిక రవాణా, డిజిటల్, ఇంధన మౌలిక సదుపాయాల ద్వారా భారత్, మిడిల్ ఈస్ట్, యూరప్‌లను అనుసంధానించడం ఈ ప్రణాళిక ముఖ్య ఉద్దేశం.

భారతదేశం సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, అమెరికాతో పాటు కీలక ఐరోపా దేశాల మద్దతుతో ఐఎంఈసీని చైనా 'బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్'కు ప్రత్యామ్నాయంగా ప్రవేశపెట్టింది.

ఈ ప్రతిపాదిత కారిడార్ భారత్ నుంచి యూఏఈ వరకు ఉన్న సముద్ర మార్గాన్ని, అలాగే సౌదీ అరేబియా, జోర్డాన్ మీదుగా ఇజ్రాయెల్‌లోని హైఫా ఓడరేవు వరకు వెళ్లే రైలు మార్గంతో కలుపుతుంది. అక్కడి నుంచి సరుకులను యూరప్‌కు రవాణా చేస్తారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)