'ప్రాజెక్ట్ ఫ్రీడమ్': హార్ముజ్ జలసంధిలో ట్రంప్ చేపట్టిన ఈ ఆపరేషన్ ఏంటి, ఎందుకు హఠాత్తుగా నిలిపేశారు?

హార్ముజ్ జలసంధి

ఫొటో సోర్స్, Reuters

    • రచయిత, పౌలిన్ కోలా, బెర్నార్డ్ డెబుష్మాన్ జూనియర్
    • హోదా, బీబీసీ ప్రతినిధులు
  • చదివే సమయం: 6 నిమిషాలు

ఇరాన్ మూసివేసిన హార్ముజ్ జలసంధిలో చిక్కుకుపోయిన నౌకలకు మార్గం నిర్దేశం చేసేందుకు అమెరికా చేపట్టిన ఆపరేషన్‌‌ ‘ప్రాజెక్ట్ ఫ్రీడమ్’ ను నిలిపేస్తున్నట్లు మంగళవారం సాయంత్రం అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ప్రకటించారు.

"ఏమాత్రం తప్పు చేయని ప్రజలకు, కంపెనీలకు, దేశాలకు స్వేచ్ఛనివ్వడానికి ఉద్దేశించిన" ఒక మానవతా దృక్పథంతో కూడిన చర్యే ప్రాజెక్ట్ ఫ్రీడమ్ ప్రోగ్రాం’’ అని ట్రంప్ అన్నారు.

మరోవైపు, తమ అనుమతితో మాత్రమే నౌకలు ఈ కీలక జలమార్గాన్ని దాటగలవని ఇరాన్ స్పష్టం చేసింది.

గత ఆదివారమే ఈ కొత్త ఆపరేషన్ డోనల్డ్ ట్రంప్ ప్రకటించారు.

అప్పటి నుంచి ఆ జలమార్గంలో ప్రయాణించకుండా అమెరికా యుద్ధ నౌకలను నిరోధించడానికి వాటిపై కాల్పులు జరిపినట్లు ఇరాన్ సైన్యం చెప్పగా, యుద్ధాన్ని ముగించడానికి ఉద్దేశించిన కాల్పుల విరమణకు ముప్పుగా పరిణమిస్తోన్న చిన్న పడవలను ముంచేసినట్లు అమెరికా పేర్కొంది.

ఈ కొత్త ఆపరేషన్‌ను లాంచ్ చేసిన రెండు రోజుల్లోనే అంటే మంగళవారంనాడు నిలిపేసింది అమెరికా.

ఇరాన్‌‌తో ఏదైనా ఒక ఒప్పందం కుదురుతుందేమోనని చూసేందుకు, కొంతకాలం పాటు ''ప్రాజెక్ట్ ఫ్రీడమ్'' ఆపరేషన్‌ను నిలిపివేస్తున్నట్లు ట్రంప్ తెలిపారు.

ఇంతకీ ''ప్రాజెక్ట్ ఫ్రీడమ్'' అంటే ఏమిటి? విస్తృత స్థాయిలో శత్రుత్వానికి ఇది దారి తీయగలదా?

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

అమెరికా సైన్యం ''ప్రాజెక్ట్ ఫ్రీడమ్'' ఎలా అమలు చేసింది?

ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ వరుసగా వైమానిక దాడులు ప్రారంభించినప్పటి నుంచి అంటే ఫిబ్రవరి 28 నుంచి హార్ముజ్ జలసంధి చాలా వరకు మూసివేతకు గురైంది.

గల్ఫ్‌లో 22,500 నావికులు, 1,550 వాణిజ్య నౌకలు చిక్కుకున్నట్లు అమెరికా తెలిపింది.

సరఫరాలు పడిపోతున్నాయని, నావికుల శారీరక, మానసిక ఆరోగ్యంపై ప్రభావం పడుతుందనే ఆందోళనలు విపరీతంగా పెరిగాయి.

ఈ ఆపరేషన్‌కు మద్దతుగా "గైడెడ్-మిసైల్ డిస్ట్రాయర్లను, 100కు పైగా భూ, సముద్ర ఆధారిత విమానాలను, మల్టీ-డొమైన్ అన్‌మ్యాన్డ్ ప్లాట్‌ఫామ్‌లను, 15,000 మంది సభ్యులను" ఉపయోగిస్తున్నట్లు యూఎస్ సెంట్రల్ కమాండ్ (సెంట్‌కామ్) తెలిపింది.

ఈ ఆపరేషన్ మొదలు పెట్టిన తొలిరోజు మాట్లాడిన సెంట్‌కామ్ కమాండర్ అడ్మిరల్ బ్రాడ్ కూపర్.. గల్ఫ్‌ ప్రాంతంలో 87 దేశాలకు చెందిన నౌకలు చిక్కుకుపోయాయని తెలిపారు.

నౌకల రాకపోకలు సజావుగా సాగేలా ప్రోత్సహించేందుకు సుమారు 12 నౌకలను, షిప్పింగ్ కంపెనీలను అమెరికా సంప్రదించిందని తెలిపారు.

ఈ ఆపరేషన్ ప్రకటించినప్పుడు, చిక్కుకుపోయిన నౌకలకు అమెరికా సైనిక రక్షణ కల్పించే ప్రయత్నం చేస్తుందా లేదా అనేది స్పష్టంగా తెలియదు.

నౌకలకు భౌతికంగా సైనిక రక్షణ కల్పించడం కంటే , వైమానిక రక్షణ, డ్రోన్ లేదా క్షిపణి దాడుల నుంచి రక్షణ కల్పించడంపైనే అమెరికా సైన్యం ఎక్కువగా దృష్టి పెట్టే అవకాశం ఉందని తాను భావిస్తున్నట్లు అమెరికా మాజీ డిప్యూటీ అసిస్టెంట్ సెక్రటరీ ఆఫ్ డిఫెన్స్ మిక్ మౌల్రాయ్ తెలిపారు.

'' అయితే, దాడికి గురికాకుండా ప్రయాణించగలమనే నమ్మకంతో ఓడలు ఉన్నాయా? లేదా? అంతకంటే ముఖ్యంగా, బీమా సంస్థలు విశ్వసిస్తున్నాయా? లేదా? అన్నదే ఇక్కడ అత్యంత ముఖ్యమైన ప్రశ్న" అని ఆపరేషన్‌ను నిలిపివేసే ముందు ఆయన అన్నారు.

ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఈ ఆపరేషన్ కోసం ఎలాంటి సహకారాన్ని అందివ్వలేదని, ఈ జలసంధి గుండా సురక్షితంగా ప్రయాణించే విషయంలో సభ్యులను ఆందోళనలో పడేసిందని స్వతంత్ర ట్యాంకు యజమానులకు, ఆపరేటర్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న వాణిజ్య సంస్థ ఇంటర్‌ ట్యాంకో మేనేజింగ్ డైరెక్టర్ టిమ్ విల్కిన్స్ చెప్పారు.

హార్ముజ్ జలసంధి

హార్ముజ్ జలసంధి గుండా నౌకలు వెళ్తున్నాయా?

సోమవారం మధ్యాహ్నం, ప్రాజెక్ట్ ఫ్రీడమ్‌కు మద్దతుగా హార్ముజ్ జలసంధిని దాటిన తర్వాత యూఎస్ నేవీ గైడెడ్-మిస్సైల్ డిస్ట్రాయర్లు (క్షిపణి విధ్వంసక నౌకలు) గల్ఫ్‌లో పనిచేయడం మొదలు పెట్టాయని సెంట్‌కామ్ తెలిపింది.

వాణిజ్య సరుకు రవాణాకు మార్గాన్ని పునరుద్ధరించేందుకు అమెరికా బలగాలు చురుకుగా సహాయక చర్యలు అందిస్తున్నాయని చెప్పింది. అయితే, మరిన్ని వివరాలను అందివ్వలేదు.

''తొలి ప్రయత్నంగా.. అమెరికా జెండాతో వెళ్లే రెండు మర్చెంట్ నౌకలు విజయవంతంగా హార్ముజ్ జలసంధి గుండా ప్రయాణించి, అవి సురక్షితంగా వాటి ప్రయాణాన్ని సాగించాయి'' అని సెంట్‌కామ్ పేర్కొంది.

అయితే, ఈ వాణిజ్య నౌకలకు చెందిన గుర్తింపు వివరాలనూ విడుదల చేయలేదు సెంట్‌కామ్.

అమెరికా సైన్యం సాయంతో ఈ రెండు నౌకల్లో ఒకటి విజయవంతంగా గల్ఫ్ నుంచి బయటికి రాగలిగిందని షిప్పింగ్ కంపెనీ మెర్స్క్ ధ్రువీకరించింది.

అయితే, హార్ముజ్ జలసంధిగుండా ఏ యుద్ధ నౌకలు వెళ్లలేదని ఇరాన్‌లో శక్తివంతమైన సైన్యమైన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కోర్ స్పష్టం చేసింది.

హార్ముజ్ జలసంధి

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, ప్రపంచ చమురు రవాణాలో 20 శాతం హార్ముజ్ జలసంధి ద్వారానే సాగుతుంది

అమెరికా యుద్ధ నౌకలు, ఇతర నౌకలపై ఇరాన్ దాడులు చేసిందా?

సోమవారం నాడు అమెరికా ఆపరేషన్ ప్రారంభం కావడానికి కొన్ని గంటల తర్వాత, అమెరికా, జియోనిస్ట్ శత్రు విధ్వంసక నౌకలపై తాము కాల్పులు జరిపినట్లు ఇరాన్ సైన్యం పేర్కొంది. రెండు క్షిపణులు ఒక యుద్ధ నౌకపై దాడి చేశాయనే ఇరాన్ వాదనలను సెంట్‌కామ్ వెంటనే ఖండించింది.

అమెరికా యుద్ధ నౌకలు, అమెరికా జెండాతో వెళ్లే వాణిజ్య నౌకలపై క్రూయిజ్ మిసైల్స్‌ను ఇరాన్ ప్రయోగించిందని మాత్రమే ధ్రువీకరించింది. వాణిజ్య నౌకలపై డ్రోన్లను, చిన్న బోట్లను వాడినట్లు చెప్పింది.

హార్ముజ్ జలసంధి గుండా వెళ్తున్నప్పుడు రెండు డ్రోన్లు తమ ప్రభుత్వానికి చెందిన చమురు కంపెనీ అడ్‌నాక్ అనుబంధ ట్యాంకర్‌పై దాడి చేసినట్లు యుద్ధ సమయంలో ఇరాన్ చేతిలో తరచూ దాడులకు గురైన, అమెరికాకు గల్ఫ్ మిత్రదేశమైన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) తెలిపింది.

అయితే, ఎవరికీ గాయాలు కాలేదని ఆ దేశ విదేశాంగ శాఖ పేర్కొంది.

యూఏఈకి సమీపంలో హార్ముజ్ జలసంధిలో లంగరు వేసి ఉన్న దక్షిణ కొరియా కార్గో నౌకపై దాడి జరిగిందని అనుమానిస్తున్నారు.

ఈ మిషన్‌కు మద్దతు ఇచ్చే అమెరికా అటాక్ హెలికాప్టర్లలో కొన్ని.. పౌరులు ప్రయాణించే నౌకలను లక్ష్యంగా చేసుకునే ఆరు చిన్న ఇరాన్ బోట్లను ముంచేశాయని సెంట్‌కామ్ కమాండర్ కూపర్ తెలిపారు. అయితే, దీన్ని ఇరాన్ ఖండించింది.

ఈ జలసంధి గుండా ఇరాన్ ప్రభుత్వం ఆమోదించిన మార్గాన్ని ఉపయోగించని నౌకలపై నిర్ణయాత్మక చర్యలు ఉంటాయని ఇరాన్ పునరుద్ఘాటించింది.

''కాల్పుల విరమణ ఉల్లంఘనలు, దిగ్బంధనాలు ద్వారా.. అమెరికా, దాని మిత్రదేశాలు సముద్ర భద్రతకు, ఇంధన సరఫరాలకు ప్రమాదం కలిగించాయి. అయినప్పటికీ, వారి దుష్ట ప్రయత్నాలు విఫలమయ్యాయి'' అని అమెరికాతో గత నెలలో చర్చలు జరిపిన ఇరాన్ మధ్యవర్తి ఘాలిబాఫ్ తెలిపారు.

ఇరాన్ ఓడరేవులపై సొంతంగా దిగ్బంధనం విధిస్తూ సరుకు రవాణా భద్రతకు అమెరికా ప్రమాదం కలిగిస్తుందని ఆరోపించిన ఇరాన్ టాప్ మధ్యవర్తి.. ''ప్రస్తుత పరిస్థితి ఇలాగే కొనసాగడం అమెరికాకు కూడా సహించరానిది'' అని అన్నారు.

అమెరికా, ఇరాన్‌ల మధ్య మధ్యవర్తిగా వ్యవహరిస్తున్న పాకిస్తాన్ అభ్యర్థన మేరకు తాను ప్రాజెక్ట్ ఫ్రీడమ్‌ను కొంతకాలం నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నట్లు ట్రంప్ సోషల్ మీడియా పోస్ట్‌లో పేర్కొన్నారు. అయితే, ఇరాన్ ఓడరేవులపై అమెరికా దిగ్బంధనం కొనసాగుతుందని చెప్పారు.

ఇరాన్ యుద్ధం

ఫొటో సోర్స్, Getty Images

ఇరాన్ యుద్ధం మళ్లీ మొదలవుతుందా?

అధ్యక్షుడి పోస్టుకు అదనంగా చేర్చడానికి మరేమీ లేదని వైట్‌హౌస్ బీబీసీకి తెలిపింది.

ఇరాన్ ప్రభుత్వ మీడియా దీన్ని ఒక విజయంగా అభివర్ణించింది. ప్రపంచంలో నౌకా రవాణాకు అత్యంత కీలకమైన జలమార్గాన్ని తిరిగి ప్రారంభించేందుకు పదేపదే వైఫల్యాలు ఎదురైన తర్వాత ట్రంప్ వెనక్కి తగ్గినట్లు ఇరాన్ ప్రభుత్వ మీడియా పేర్కొంది.

గల్ఫ్‌లో చిక్కుకుపోయిన నౌకలు సురక్షితంగా ప్రయాణించేలా చేయడం చాలా అంటే చాలా కష్టమైందని 2018 నుంచి 2021 మధ్య బైడెన్, ట్రంప్ అడ్మినిస్ట్రేషన్లకు సలహాదారుగా పనిచేసిన మధ్య ప్రాచ్యం నిపుణులు గ్రాంట్ రమ్లీ చెప్పారు.

ఈ ఆపరేషన్ నిలిపివేయడానికి ముందు.. దీనికి మరింత బలమైన, మరింత శక్తివంతమైన సైనిక ఆప్షన్లు అవసరమవుతాయని చెప్పారు.

అమెరికా ఆపరేషన్ అత్యంత ప్రమాదకరమైన, పరిస్థితి తీవ్రతరం చేసే ఆపరేషన్ అని లండన్ చాథమ్ హౌస్‌కు చెందిన ఇంటర్నేషనల్ సెక్యూరిటీ ప్రోగ్రామ్ ఫెలో నిత్యా లాభ్ తెలిపారు.

ట్రంప్ ప్రాజెక్ట్ ఫ్రీడమ్ ద్వారా ఈ జలసంధి గుండా కొన్ని నౌకలను బయటకు తీసుకురావడంలో విజయం సాధించినప్పటికీ.. అది తాత్కాలిక ఉపశమనమని ఆమె చెప్పారు.

ఈ కీలకమైన జలమార్గాన్ని పూర్తిగా తెరిచేందుకు మరింత కృషి అవసరమవుతుందని అన్నారు.

జలసంధిలో అమెరికా ఆపరేషన్స్ అంటే కాల్పుల విరమణ ముగిసినట్లేనా అని అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్‌ను మీడియా ప్రశ్నించినప్పుడు ''లేదు, కాల్పుల విరమణ ముగియలేదు'' అని ఆయన చెప్పారు.

ఇదొక ప్రత్యేకమైన, విభిన్నమైన ఆపరేషన్ అని పేర్కొన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)