‘తెలంగాణ అనే పదం డిక్షనరీలో ఎక్కడా లేదు’ అన్న టీడీపీ నేత వ్యాఖ్యలపై వివాదమేంటి?

ఫొటో సోర్స్, X/Telugu Desam Party
- రచయిత, కమలాదేవి నల్లపనేని
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 5 నిమిషాలు
‘‘తెలంగాణ అనే పదం డిక్షనరీలో ఎక్కడా లేదు’’ అంటూ టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు బక్కని నర్సింహులు చేసిన వ్యాఖ్యపై వివాదం రేగింది.
ఏపీలోని మంగళగిరిలో టీడీపీ మహానాడు కార్యక్రమం మొదటిరోజు బక్కని నర్సింహులు మాట్లాడుతూ ''ఈ తెలంగాణ అనే పదం డిక్షనరీలో ఎక్కడా లేదు. ఆంధ్రకు కొన్ని పదాలున్నాయి తెలంగాణాకు లేవు. కానీ, కొంతమంది స్వార్థపరులు ప్రాంతీయ భేదాలు తెచ్చి తెలంగాణలో కష్టపడే అనేకమంది జీవితాల్లో మన్నుపోశారు. తెలంగాణలో పటేల్, పట్వారీ వ్యవస్థ, జోగిని , అంటరానితనం, దాని వెంట విశృంఖలంగా వెట్టిచాకిరీ నడుస్తుండేది’’ అని నర్సింహులు వ్యాఖ్యానించారు.
పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేసిన ఎన్టీఆర్ పుణ్యమా అని తెలంగాణకు నిజమైన స్వాతంత్య్రం వచ్చిందని ఆయన అన్నారు.


ఫొటో సోర్స్, Sravan Dasoju/FACEBOOK
‘ఏ డిక్షనరీ చూసి చెప్పారు?’
''షాద్ నగర్లో పుట్టి తెలంగాణం లేదంటున్నారంటే ఆయన ఎవరి మెప్పు కోసం మాట్లాడుతున్నారో అర్ధం కావడం లేదు. వేల సంవత్సరాల చరిత్ర కలిగిన తెలంగాణ ప్రాంతానికి ఓ భాష, సంస్కృతి, సాహితీపరమైన చరిత్ర ఉంది. అది తెలియకపోతే తెలంగాణ గడ్డ మీద పుట్టినట్టు కాదు'' అని బక్కని నర్సింహులు వ్యాఖ్యలను బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ ఖండించారు.
‘‘తెలంగాణ అనే పదం డిక్షనరీలో లేదనే విషయం ఏ డిక్షనరీలో చూసి చెప్పారో’’ బక్కని నర్సింహులు తెలపాలని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ప్రశ్నించారు.

ఫొటో సోర్స్, Venkat Balmoor/FACEBOOK
‘ఇలాంటి వ్యాఖ్యల అవసరమేంటి?’
తెలంగాణ బీజేపీ సీనియర్ నేత ప్రకాశ్‌రెడ్డి కూడా నర్సింహుల వ్యాఖ్యలను తప్పుపట్టారు. ఆయనకు డిక్షనరీ అనే పదం తెలుసో లేదో తనకు తెలియదని ప్రకాశ్ రెడ్డి అన్నారు. తెలగాణ, తెలంగాణ రూపాంతరం చెందిన పదాలని, ఉర్దూ, అరబిక్ సాహిత్యంలో కూడా కనిపిస్తాయని బీబీసీతో చెప్పారు.
తెలంగాణ సెంటిమెంట్, ఎమోషన్స్‌ని అగౌరవపరిచినట్టు మాట్లాడడం సరికాదని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ బీబీసీతో వ్యాఖ్యానించారు.
''ఎన్నో ఉద్యమాల తర్వాత తెలంగాణ ఏర్పాటయింది. ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అన్నదమ్ముల్లా కలిసి ఉన్నాయి. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సెటిలర్ల ఓట్ల కోసం ఇలాంటి మాటాలు కావాలని మాట్లాడుతున్నారు. మహానాడు వేదికపై నుంచి ఇలాంటి వ్యాఖ్యలు చేయాల్సిన అవసరమేంటి?'' అని ప్రశ్నించారు.

‘త్రిలింగదేశం నాటి నుంచే ఉంది’
తెలంగాణ అనే పదం త్రిలింగ దేశం నాటి నుంచి ఉందని, ఇవాళ తెలంగాణ పదం గురించి ప్రత్యేకంగా చర్చించాల్సిన అవసరం, ఆవశ్యకత రెండూ లేవని ఆర్థిక, రాజకీయ విశ్లేషకులు అందె సత్యం అభిప్రాయపడ్డారు.
‘‘ విభజన తర్వాత రెండు వైపులా ప్రజలకు ఆవేశాలు లేవు. కానీ రాజకీయ పార్టీలు, నేతలు తమ స్వపయ్రోయోజనాల కోసం ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు’’ అని ఆయన విమర్శించారు.

ఫొటో సోర్స్, https://x.com/TDP
‘అదంతా దుష్ప్రచారం’
మహానాడులో చేసిన వ్యాఖ్యలపై తర్వాత బక్కని నర్సింహులు స్పందించారు. మహానాడుకొస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకే తన వ్యాఖ్యలపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.
బక్కని నర్సింహులతో బీబీసీ ప్రత్యేకంగా మాట్లాడే ప్రయత్నం చేసింది. కానీ ఆయన అందుబాటులోకి రాలేదు.
అయితే మహానాడులో బక్కని నర్సింహులు మాట్లాడిన కాసేపటి తర్వాత టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేశ్ ప్రసంగిస్తూ..
''నేను వర్కింగ్ ప్రెసిడెంట్ అయి నెల దాటింది. తెలంగాణ, అండమాన్‌లోనూ తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయాల్సిన బాధ్యత నాపైన ఇప్పుడు ఉంది. తప్పనిసరిగా నాయకులను, కార్యకర్తలను కలుస్తా.' అని నారా లోకేశ్ అన్నారు.

‘తెలంగాణ అనే పదం ఎక్కడినుంచి వచ్చింది?’
మరోవైపు తెలంగాణ అనే పదం తెలంగాణ అనే పదం ఎక్కడినుంచి వచ్చిందనేదానిపై సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. దీనిపై గతంలో బీబీసీలో ఓ కథనం ప్రచురితమైంది.
తెలంగాణ పదం పుట్టుకకు సంబంధించిన చరిత్రను కొన్ని శాసనాల ఆధారంగా చెబుతున్నారు చరిత్రకారులు.
ఈ విషయంలో మనకు అందుబాటులో ఉన్నది తెల్లాపూర్ శాసనం.
హైదరాబాద్‌కు సుమారు 25 కిలోమీటర్ల దూరంలో తెల్లాపూర్ గ్రామం మధ్యలో ఈ శాసనం కనిపిస్తుంది.
అందులో 'తెలుంగణపురం' అని రాసి ఉంది. దీన్ని విశ్వకర్మ వంశస్థులు నాగోజు, అయ్యలోజు, వల్లభోజులు వేయించినట్లు శాసనం చెబుతోంది.
24 లైన్లలో ఈ శాసనం ఉంది. ఇందులోని 13వ లైనులో 'తెలుంగణపురం' అనే పదం ఉంది.
దీన్ని 1418 సంవత్సరం జనవరి 8న వేయించినట్టుగా శాసనంపై ఉంది.
''తెల్లాపూర్ శాసనం కంటే 60 ఏళ్లకు ముందే శ్రీరంగంలో వేయించిన తామ్రపత్రంలో తెలంగాణ ప్రస్తావన ఉంది. ముసునూరి నాయకుడైన కాపయ నాయకుడి అల్లుడు ముప్ప నాయకుడు 1358లో ఈ తామ్రపత్రం రాయించారు. ఇది శ్రీరంగంలోని రంగనాయకులు ఆలయంలో లభించింది.
ఆరు రాగి రేకులపై ఈ శాసనం రాసి ఉంది. మొదటి రేకులో మొదటి వైపు 8, 10 పంక్తులలో 'తిలింగణామా, తిలింగాణా' అని పదాలు ఉన్నాయి.ఈ రెండు పదాలు ఒక దేశాన్ని సూచించేలా ఉన్నాయి. తిలింగ అంటే తెలుగు, ఆణెము అంటే దేశము లేదా ప్రాంతం. తెలుగు, ఆణెము కలిసి తిలింగాణ అయింది.
రాను రాను వాడుక భాషలో తెలంగాణగా మారిందని చెప్పవచ్చు'' అని కొత్త తెలంగాణ చరిత్ర' బృందం కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్ బీబీసీతో గతంలో చెప్పారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)




























