‘ఫ్లెక్స్, ఓజీ, నారాజ్ ఫూఫా’ అంటూ ఓ కాలేజ్ క్యాంపస్‌లో ప్రధాని ఎవరి గురించి మాట్లాడారు?

ఫొటో సోర్స్, Getty Images
దిల్లీ యూనివర్శిటీలోని ఓ కాలేజ్‌లో జరిగిన కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన రాజకీయ ప్రత్యర్థులపై తీవ్ర విమర్శలు చేశారు.
దిల్లీ యూనివర్శిటీ(డీయూ)లోని శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్(ఎస్ఆర్సీసీ)లో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రధాని మరోసారి 'దిమాగీ నక్సల్' అనే పదాన్ని ప్రస్తావించారు.
"2013తో పోలిస్తే ప్రస్తుతం దేశం ఆర్థికంగా, సామాజికంగా చాలా సురక్షితంగా ఉంది. కానీ కొంతమందిలో అసహనం మొదలైంది. అలాంటి వారికి నేను ఆగస్టు 15న ఎర్రకోట నుంచి హోమియోపతి మాత్ర ఇచ్చాను. అప్పుడు నేను 'దిమాగీ నక్సల్' అనే ఒక్క పదాన్ని వాడాను" అని ఆయన అన్నారు.
''హోమియోపతి చికిత్స కొంతకాలం పాటు వ్యాధిని మరింత తీవ్రతరం చేస్తుంది. నేను ఈ మాత్ర ఇవ్వగానే దిమాగీ నక్సల్స్ అందరూ బయటకు రావడం మొదలుపెట్టారు. కానీ ప్రజలు వారి నిజ స్వరూపాన్ని చూస్తున్నారు'' అని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు.
'దిమాగీ నక్సల్' అనే పదంపై తీవ్ర స్పందనలు వచ్చాయి. ప్రభుత్వ విధానాలను ప్రశ్నించే యువత, మేధావులు, ఆలోచనాపరులను ఇలాంటి పదాలతో లక్ష్యంగా చేసుకుంటున్నారని కొంతమంది విమర్శకులు ఆరోపించారు.

శనివారం(సెప్టెంబర్ 5) ఎస్ఆర్సీసీ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఎస్ఆర్సీసీకి ప్రధాని మెట్రోలో వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన పిల్లలతో మాట్లాడుతున్న ఫోటోలు కూడా బయటకు వచ్చాయి.
అంతకుముందు ప్రధాని మోదీ 'ఎక్స్'లో ఒక పోస్ట్ చేశారు. ఈ కార్యక్రమం గురించి, కాలేజీ అందించిన సేవల గురించి ప్రస్తావించారు.

ఫొటో సోర్స్, ANI
జెన్ జెడ్‌తో కనెక్ట్ అయ్యే ప్రయత్నం
ప్రధాని మోదీ తన ప్రసంగంలో జెన్ జెడ్లోప్రాచుర్యం పొందిన పదాలను ప్రత్యేకంగా ఉపయోగించారు. డీయూ కాలేజీల్లో ఎస్ఆర్సీసీ అని పిలవడమే ఒక రకమైన 'ఫ్లెక్స్' అని ప్రధాని మోదీ అన్నారు.
"ఎస్ఆర్సీసీ పూర్వ విద్యార్థులు కూడా చాలా ప్రత్యేకమైనవాళ్లు. మీ భాషలో చెప్పాలంటే ఇక్కడి పూర్వ విద్యార్థులే ఎస్ఆర్సీసీ పేరును ప్రపంచవ్యాప్తంగా తీసుకువెళ్లిన ఓజీలు. ఇక్కడ చదువుకున్నవారు ప్రతి రంగంలోనూ తమదైన ముద్ర వేశారు. వారు అత్యంత గొప్పవాళ్లు కాకపోయినా తమదైన ముద్ర మాత్రం వేశారు" అని ప్రధాని అన్నారు.
జెన్ జెడ్ సాధారణంగా తమ మాటల్లో అనుభవం ఉన్న, గౌరవనీయమైన వ్యక్తిని సూచించడానికి 'ఓజీ' అనే పదాన్ని ఉపయోగిస్తుంది.
ఈ కార్యక్రమానికి హాజరైన విద్యార్థులను ఉద్దేశించి ప్రధాని ప్రసంగించారు.
"క్యాంపస్ బయట మీకు రెండు రకాల వ్యక్తులు కనిపిస్తారు. ఒకరకం వారు సమాజ శక్తిని దేశ శక్తిగా సానుకూలంగా మార్చేవారు. రెండో రకం వారు ఏ పని మొదలైనా నారాజ్ ఫూఫా (కోపిష్టి మామలు)గా మారిపోయేవాళ్లు. ప్రతి పనిని వ్యతిరేకించడమే వారికి ఇష్టమైన పని. వారిమాట ఒక్కటే... దీని అవసరం ఏముంది?" అని అన్నారు.
"మనం ప్రపంచంలోనే అతిపెద్ద విగ్రహాన్ని నిర్మిస్తున్నప్పుడు, 'దీని అవసరం ఏమిటి?' అని వాళ్లడిగారు. మనం హై-స్పీడ్ రైలుపై పనిచేస్తున్నప్పుడు కూడా 'దీని అవసరం ఏంటి?' అని అడిగారు. యూపీఐని తీసుకొచ్చినప్పుడూ, 'దీని అవసరం ఏంటన్నారు? మనం కొత్త పార్లమెంట్ భవనాన్ని నిర్మించినప్పుడు, దాని అవసరం ఏంటని వాళ్లడిగారు. మన సైనిక వీరుల కోసం మనం ఒక స్మారక చిహ్నాన్ని నిర్మించినప్పుడూ ఆ పెద్దమనుషులు మళ్లీ రంగంలోకి దిగి దాని అవసరం ఏంటన్నారు. కానీ భారత్ అలాంటివాళ్లందరికీ తగిన సమాధానం ఇచ్చింది. ప్రజలకు ఏది అవసరమో అది చేయకుండా భారత్‌ను ఎవరూ అడ్డుకోలేరు'' అని ప్రధాని ప్రసంగించారు.

ఫొటో సోర్స్, Narendra Modi
పన్నెండేళ్లలో సాధించిన విజయాలు
ప్రధాని మోదీ తన ప్రసంగంలో 2013లో శ్రీరామ్ కాలేజ్‌లో తాను చేసిన ప్రసంగాన్ని కూడా గుర్తుచేసుకున్నారు. ఆ సమయంలో ఆయన గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నారు.
"2013లో నేనొక నీళ్లగ్లాసు ఉదాహరణ ఇచ్చాను. గ్లాసును చూసేవారిలో కొందరికి అది సగం ఖాళీగా ఉన్నట్టు కనిపిస్తుంది. మరికొందరికి ఆ గ్లాసు సగం నీళ్లు, సగం గాలితో పూర్తిగా ఉన్నట్టు కనిపిస్తుంది.
2014లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత మేం దీన్ని చేసి చూపించాం. ఒక ఉదాహరణ ద్వారా మీకు ఇది వివరిస్తాను. ఇటీవల జన్ ధన్ యోజనకు పన్నెండేళ్లు పూర్తయ్యాయి. ఈ రోజు మీరు ఫిన్టెక్కు సంబంధించిన ఒక కొత్త యుగంలో జీవిస్తున్నారు. కానీ 2014కు ముందు గ్రామాలు, చిన్న పట్టణాల్లోని ప్రజలు సేవింగ్స్ అకౌంట్ తెరవడానికి చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చేది. అందుకే మేం జన్ ధన్ పథకాన్ని తీసుకొచ్చాం. గత పన్నెండేళ్లలో దాని ద్వారా 60 కోట్ల కొత్త బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ అయ్యాయి"
"నేను చెప్పే ప్రతి మాటను చిన్న చిన్న ముక్కలుగా విడదీసి వాటిని నా ఖాతాలో వేసే ఒక గ్యాంగ్ ఉంది. నేను ముందుగానే హెచ్చరిస్తున్నాను. నేను చెబుతున్న విషయాలే 2013 నాటికాలంలో మీడియాలో ప్రధానంగా కనిపించేవి"
''ఉదాహరణకు... నియంత్రణ రేఖ వద్ద భారత సైనికుల హత్య, జీడీపీ వృద్ధి రేటు అంచనాను ప్రపంచ బ్యాంకు తగ్గించడం, కరెంట్ అకౌంట్ లోటు గరిష్ఠ స్థాయికి చేరడం, ద్రవ్యోల్బణం దాదాపు పదిశాతానికి చేరడం, పారిశ్రామిక రంగం మాంద్యం బారిన పడటం, హెలికాప్టర్ ఒప్పందంలో లంచాల వ్యవహారం బయటపడటం, హైదరాబాద్‌లో బాంబు పేలుడు... ఇవి ఆ సమయంలోని ప్రధాన వార్తా శీర్షికలు''
"ఆ సమయంలో అభివృద్ధి దిగువస్థాయిలో ఉండగా, ద్రవ్యోల్బణం గరిష్ఠ స్థాయిలో ఉంది. కుంభకోణాలు విపరీతంగా పెరిగిపోయాయి. అవినీతిపరులు నిర్భయంగా సంచరించారు. ఉగ్రవాదులు రెచ్చిపోయేవారు. పాకిస్తాన్ అదుపులేకుండా వ్యవహరించేది. అది అప్పటి పరిస్థితి. ఉగ్రవాదాన్ని వ్యాప్తి చేసేవారు ఓడిపోయిన రోజు ఈ రోజు. ఒకవేళ పాకిస్తాన్ ఏదైనా దుశ్చర్యకు పాల్పడితే, భారత సైన్యం దాని భూభాగంలోకి వెళ్లి దాడి చేస్తోంది. నక్సలిజం వెన్నువిరిచాం" అని ప్రధాని అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
యుద్ధపరిస్థితుల్లోనూ...
"మిడిల్ ఈస్ట్‌లో యుద్ధం జరుగుతున్న సమయంలో వాణిజ్యానికి సంబంధించిన అడ్డంకులు ఉన్నప్పటికీ భారత్ 7.8శాతం వృద్ధిని సాధించింది. ఈ సమయంలో ఇలాంటి వృద్ధిని సాధించడం భారత దేశపు ఆర్ధిక బలాన్ని చూపిస్తుంది" అని ప్రధాని అన్నారు.
నిజానికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2026-27) మొదటి త్రైమాసికంలో జీడీపీ వృద్ధిరేటు 7.8 శాతంగా నమోదైందని భారత ప్రభుత్వం పేర్కొంది. అయితే ప్రభుత్వ వాదన వివాదాస్పదమైంది.
దేశ మాజీ ఆర్థిక కార్యదర్శి సుభాష్ చంద్ర గార్గ్, ప్రతిపక్ష పార్టీల నేతలు ఈ గణాంకాలను లెక్కించిన విధానం, 'బేస్ ఇయర్'లో చేసిన మార్పులపై తీవ్రమైన ప్రశ్నలు లేవనెత్తారు.

ఫొటో సోర్స్, Santosh Kumar/Hindustan Times via Getty Images
కాంగ్రెస్ ఏమంటోంది?
ప్రధాని మోదీ ప్రసంగంపై కాంగ్రెస్ నాయకుడు, రాజ్యసభ ఎంపీ పవన్ ఖేరా స్పందించారు.
"అన్నా... ఎంత విసుగు పుట్టించే ప్రసంగం అంటే ఉల్లిపాయలు కూడా ఏడుస్తాయి" అని ఆయన 'ఎక్స్'లో రాశారు.
కార్యక్రమానికి ముందు పవన్ ఖేడా ఎస్ఆర్సీసీకి చెందిన విద్యార్థి గురించి ప్రస్తావించారు.
"మోదీ మళ్లీ ఎస్ఆర్సీసీకి వచ్చారు. 2013లో దేశ యువతకు పెద్ద పెద్ద కలలు చూపించి వారిని తప్పుదోవ పట్టించిన ప్రదేశం ఇదే" అని ఎక్స్‌లో పవన్ ఖేరా పోస్ట్ చేశారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)




























