‘గెట్ రెడీ విత్ మి’, ‘ఫస్ట్ ఇన్ మై బ్లడ్ లైన్’ లాంటి జెన్ జడ్ భాషను ప్రధాని మోదీ ఎందుకు మాట్లాడుతున్నారు?

ప్రధాని మోదీ

ఫొటో సోర్స్, Reuters

    • రచయిత, నిఖిత యాదవ్
    • హోదా, బీబీసీ న్యూస్
  • ప్రచురణ
  • చదివే సమయం: 7 నిమిషాలు

భారత్‌లోని జెన్ జడ్ తరంలో చాలామంది నరేంద్ర మోదీని ఒక స్నేహితునిగా చూడటం లేదు. కానీ, భారత ప్రధాని ఇప్పుడు వారిని ఒక స్నేహితుడిలా చేరుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

సుదీర్ఘ ప్రసంగాలు, అధికారిక ప్రసారాలు, జాగ్రత్తగా రూపొందించిన బహిరంగ కార్యక్రమాల ద్వారా 75 ఏళ్ల మోదీ ఒక బలమైన నాయకుడు అనే ప్రతిష్ఠను పెంపొందించుకున్నారు..

కానీ, ఇటీవల వారాల్లో, యువతలో బాగా ప్రాచుర్యం పొందిన ఫోటో, వీడియో షేరింగ్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాలో ఆయన చాలా రిలాక్స్‌డ్‌గా కనిపిస్తున్నారు.

సుమారు నెల రోజుల క్రితం వరకు కూడా ఎంతో జాగ్రత్తగా రూపొందించిన పోస్టులతో నిండిన మోదీ టైమ్‌లైన్‌లో, ఇప్పుడు సహజ, సాధారణ, కంటెంట్ కనిపిస్తోంది.

దీనిలో ''గెట్ రెడీ విత్ మీ'' వంటి వాటితో పాటు, యువతను ఉద్దేశిస్తూ చేసిన పలు సెల్ఫీ తరహా వీడియోలు కూడా ఉన్నాయి. వీటిల్లో ఆయన జెన్‌ జడ్ తరాన్ని స్నేహితులుగా సంబోధించడం కనిపిస్తోంది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ఒక వీడియోలో ఆయన జెన్ జడ్‌లో బాగా ప్రాచుర్యం పొందిన "ఫస్ట్ ఇన్ మై బ్లడ్‌లైన్ " అనే నానుడిని కూడా ఉపయోగించారు. దిల్లీలో జరిగిన ఒక స్నాతకోత్సవంలో మాట్లాడుతూ.. " నేను రాకెట్లు, చిప్‌లు, డ్రోన్‌లను నిర్మించిన తరానికి చెందినవాడిని" అన్నారు.

ఇన్‌స్టాలో మోదీని 10.6 కోట్ల మందికి పైగా అనుసరిస్తున్నారు. దీనివల్ల ఈ ప్లాట్‌ఫామ్‌లో అత్యధికంగా ఫాలో అవుతున్న రాజకీయ నాయకులలో ఆయన ఒకరిగా నిలిచారు.

కానీ, ఈ ప్లాట్‌ఫామ్‌పై ఆయన కమ్యూనికేషన్ శైలి ఇంతకుముందు ఆయన బృందంలో గానీ, భారతీయ జనతా పార్టీ (బీజేపీ) సోషల్ మీడియా వ్యూహంలో గానీ కీలక భాగంగా ఎప్పుడూ లేదు.

జెన్ జడ్ యవత

ఫొటో సోర్స్, NurPhoto via Getty Images

ఫొటో క్యాప్షన్, జెన్ జడ్ యువత నిరసనలు

యువతను ఆకట్టుకోవడానికి...

డిజిటల్ వ్యూహాన్ని సమర్థవంతంగా ఉపయోగించి 2014 ఎన్నికలలో గెలుపు సాధించిన పార్టీగా బీజేపీ ప్రాచుర్యం పొందింది.

అయితే, ఈ ఏడాది భారత్‌లో జరిగిన యువత నిరసనల తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది.

ఈ నిరసనలకు కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) నేతృత్వం వహించింది.

మీమ్స్, లైవ్‌స్ట్రీమ్‌లు, ఇన్‌స్టా రీల్స్ ద్వారా వీరి ఉద్యమం మరింత విస్తరించింది. ఇది తర్వాత ఎంత ప్రభావవంతంగా మారిందంటే, కేంద్ర విద్యాశాఖ మంత్రి సైతం రాజీనామా చేయాల్సి వచ్చింది.

సీజేపీ తొలుత ఒక వ్యంగ్య వ్యక్తీకరణగా ప్రారంభమైంది. ఆ తర్వాత దీని సామర్థ్యం ఆన్‌లైన్ మద్దతు నుంచి వీధుల్లోకి భారీగా తరలి వచ్చిన జనసమూహంగా మారింది. దాని రాజకీయ ఒత్తిడి బీజేపీని సైతం ఆశ్చర్యపరిచింది.

బీజేపీ గత శతాబ్దంపైగా వాట్సాప్ గ్రూప్‌లు, ఫేస్‌బుక్ పేజీలు, ఎక్స్ అకౌంట్ల ద్వారా తమ సందేశాలను విస్తరిస్తూ.. భారత్‌లో అత్యంత బలమైన ఆన్‌లైన్ రాజకీయ శక్తుల్లో ఒకదానిగా అవతరించిందని రచయిత, వ్యాఖ్యాత అనురాగ్ మైనస్ వర్మ చెప్పారు.

మోదీ తొలి సెల్ఫీ వీడియో

భారతీయ జనాభాలో 60 శాతానికి పైగా జనాభా 35 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు గలవారే ఉన్నారని నిపుణులు చెప్పారు.

1997-2012 మధ్య జన్మించిన జెన్ జడ్ తరం, 2029 సాధారణ ఎన్నికల నాటికి దేశంలోనే అతిపెద్ద ఓటరు సమూహాలలో ఒకటిగా మారుతుందని భావిస్తున్నారు.

వారిని ఆకట్టుకోవడానికి, ఇన్‌స్టా వంటి ప్లాట్‌ఫామ్‌లను చేరుకోవడం చాలా ముఖ్యం. ఇక్కడ సంప్రదాయ రాజకీయ సందేశాల కంటే వ్యక్తిగత, ఫిల్టర్ చేయని కంటెంట్ ఎక్కువ ప్రభావం చూపుతుంది.

మోదీ కొత్త పోస్ట్‌లు ఇన్‌స్టాలో మొదటిసారి కనిపించినప్పుడు ఈ మార్పు స్పష్టమైంది. దీనిపై యువ యూజర్లు వెంటనే ఎగతాళి చేయడం ప్రారంభించారు.

అప్పటికీ కొనసాగుతున్న యువత నిరసనలపై తన మౌనాన్ని వీడుతూ.. విడుదల చేసిన మోదీ తొలి సెల్ఫీ వీడియో రీల్‌ను చాలామంది ఎగతాళి చేశారు.

అయితే, ఆయన "స్నేహితులారా" అని చెప్పిన తర్వాత తీసుకున్న సుదీర్ఘ విరామమే అందరి దృష్టిని ఎక్కువగా ఆకర్షించింది.

వెంటనే, ఈ వీడియోకు సంబంధించిన పలు వెర్షన్లు ఆన్‌లైన్‌లో ట్రెండింగ్ అవ్వడం మొదలుపెట్టాయి.

ప్రజలు ఆ వీడియోలకు రకరకాల మార్పులను, జోకులను జోడించారు. చాలా మంది యూజర్లు ఆ వీడియోల్లోని లైటింగ్‌ను, కెమెరా యాంగిల్స్‌ను కూడా ఎగతాళి చేశారు.

ఆ తర్వాత పోస్టులలో ఈ విమర్శలకు స్పందించిన మోదీ టీమ్.. భిన్నమైన కెమెరా యాంగిల్స్, బ్యాక్‌గ్రౌండ్స్, లైటింగ్‌తో కొత్త ప్రయోగం చేసింది.

కొంతమంది యువత కొత్త శైలిని మెచ్చుకున్నప్పటికీ, చాలామంది వాటి సమయాన్ని ఇప్పటికీ ప్రశ్నిస్తున్నారు.

‘జన్ జడ్ శైలి సరే... సమస్యల మాటేమిటి?’

తన వయసులోని వారితో బీజేపీ ఎందుకు అనుసంధానం కావాలనుకుంటుందో తాను అర్థం చేసుకోగలనని 22 ఏళ్ల జిన్నీ మాలియా చెప్పారు.

ఈ వీడియోలు జెన్ జడ్ భాషను, ప్రదర్శన శైలిని అనుసరిస్తున్నాయని, కానీ నిరసనలకు దారితీసిన సమస్యలను ప్రస్తావించడం లేదని ఆమె అన్నారు.

ఇవి కేవలం మోదీ అకౌంట్‌కే పరిమితం కాదన్నారు.

యువతను చేరుకోవడానికి బీజేపీ సోషల్ మీడియా పేజీలు కూడా మీమ్స్‌ను, యాసను, పాప్-కల్చర్ ప్రస్తావనలను ఉపయోగించడం ప్రారంభించాయి.

నిరసనలు ముగిసిన కొద్దిసేపటికే, బీజేపీ ఒక జిమ్‌లో చిత్రీకరించిన రీల్‌ను పోస్ట్ చేసింది. అందులో కొంతమంది యువకులు, ఒక వయసు మళ్లిన శిక్షకుడితో కలిసి భారతీయ యువత నిరసనలకు దూరంగా ఉండాలని వాదిస్తూ కనిపించారు.

కానీ చాలా మంది ఆ వీడియోపై కామెంట్ చేసి, షేర్ చేస్తూ, దాన్ని ''క్రింజ్'' అని వర్ణించారు. అంటే, కృత్రిమంగా, అసౌకర్యంగా ఉందని విమర్శించారు.

బీజేపీ పోస్ట్ చేసిన మరో వీడియోలో, 90వ దశకంలోని 'ఫ్రెండ్స్' అనే సిట్యుయేషనల్ కామెడీ సీరియల్ టైటిల్ ట్రాక్ బ్యాక్‌గ్రౌండ్‌లో ప్లే అవుతుండగా, "పీఎం మోదీ మీ కోసమే" అనే క్యాప్షన్ ఉంది.

మిలీనియల్స్‌లో బాగా ప్రాచుర్యం పొంది, జెన్ జడ్ పెద్దగా గుర్తింపు లేని ఆ షోను ఉద్దేశించి ఈ వీడియో ఉంది.

తన తోటివారు ఈ వీడియోలను రాజకీయ సందేశంగా లేదా పబ్లిక్ రిలేషన్స్ ప్రయత్నంగా కాకుండా "వినోద కంటెంట్"గా చూస్తున్నారని జిన్నీ మాలియా అన్నారు.

అయితే, యువతను చేరుకోవడానికి చేస్తోన్న ఈ ప్రయత్నాలు ఆశించిన ప్రభావాన్ని కలిగించడం లేదని బీజేపీ కూడా గుర్తించిందని కొన్ని రిపోర్టులు పేర్కొంటున్నాయి.

నిరసనల సమయంలో.. తన కేబినేట్ మంత్రులందరూ తమ సోషల్ మీడియా వాడకాన్ని పెంచి, యువతను చేరుకోవాలని మోదీ పదేపదే కోరారు.

యువత నిరసన

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, యువత నిరసన

‘బీజేపికి ఇది సవాలు’

ఇటీవల ఈ పార్టీ తన సోషల్ మీడియా చీఫ్ అమిత్ మాల్వీయాను కూడా ఈ పదవి నుంచి తొలగించింది.

ఆయన 2015 నుంచి ఈ బాధ్యతను నిర్వహిస్తున్నారు.

నిరసనల సమయంలో బీజేపీ ఆన్‌లైన్‌లో ఎదుర్కొన్న విమర్శలు, అలాగే సోషల్ మీడియాలో రూపుదిద్దుకుంటున్న ప్రచారాన్ని సమర్థవంతంగా నియంత్రించడంలో ఆ పార్టీ విఫలమవ్వడం దీనికి ఒక కారణం కావచ్చని కొంతమంది విశ్లేషకులు భావిస్తున్నారు.

యువతను ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నది కేవలం బీజేపీ మాత్రమే కాదు.

కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో తరచుగా సెల్ఫీ తరహా వీడియోలు, సాధారణ ఫోటోలను పంచుకుంటూ ఉంటారు.

నిరసనల తర్వాత, ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో "ఆస్క్ మీ ఎనీథింగ్" అనే కార్యక్రమాన్ని కూడా నిర్వహించి, కొన్ని ప్రశ్నలకు హాస్యభరితంగా కూడా సమాధానం ఇచ్చారు.

ఇన్‌స్టాలో ప్రజలను ఆకర్షించడం ఒక విషయమైతే.. అక్కడ జరిగే సంభాషణల ధోరణిని నియంత్రించడం మరో అంశం.

మిషిగాన్ యూనివర్సిటీలో రాజకీయాల్లో సోషల్ మీడియా వాడకాన్ని బోధిస్తున్న జోయోజిత్ పాల్ మాట్లాడుతూ.. బీజేపీ తన సందేశాన్ని వ్యాప్తి చేయడానికి, ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేయడానికి ఎక్స్, వాట్సాప్‌లలోని తన మద్దతుదారుల నెట్‌వర్క్‌ను చాలాకాలంగా ఉపయోగించుకుంటోందని అన్నారు. కానీ, ఈ వ్యూహం ఇన్‌స్టాలో అదే విధంగా పనిచేయదని చెప్పారు.

ఎక్కువగా వీక్షించిన, పదేపదే వీక్షించిన, షేర్ చేసిన, కామెంట్లు చేసినవి ఎక్కువగా ఎంగేజ్‌మెంట్‌ పొందిన కంటెంట్‌ను ఈ ప్లాట్‌ఫామ్ సాధారణంగా ప్రమోట్ చేస్తుంటుంది.

"ఒక రీల్‌ను పోస్ట్ చేసిన అకౌంట్‌కు కేవలం 200 మంది ఫాలోవర్లు ఉన్నప్పటికీ, దాన్ని 10 మిలియన్ల సార్లు వీక్షించడం కష్టం కాదు" అని పాల్ అన్నారు. "అదే సమయంలో, లక్షలాది మంది ఫాలోవర్లు ఉన్న వ్యక్తుల కొన్ని పోస్ట్‌లకు కేవలం కొన్ని వేల వీక్షణలు మాత్రమే వస్తాయి" అని చెప్పారు.

"ఇది బీజేపీకి ఒక సవాలు. ఎందుకంటే వారి వ్యూహం నెట్‌వర్క్ ఆధారిత ఇంటర్నెట్‌ను దృష్టిలో పెట్టుకుని రూపొందించింది. అయితే నేటి ప్లాట్‌ఫామ్‌లు ఎక్కువగా భావోద్వేగాలు, ప్రతిస్పందనలపై ఆధారపడి ఉన్నాయి" అని తెలిపారు.

బీజేపీకి మరో సవాలు.. ఒకసారి పోస్టు చేసిన తర్వాత.. ఆ వీడియోపై పూర్తి నియంత్రణను అది కోల్పోతుంది.

దీనికి ప్రధాన ఉదాహరణ.. మోదీ పోస్టు చేసిన తొలి రీల్‌నే. ఇది 400 మిలియన్ టైమ్స్‌కు పైగా వీక్షించారు. పెద్ద సంఖ్యలో ప్రేక్షకులను చేరుకుంది.

అయితే, యువకులు దానిని వ్యంగ్యంగా, హాస్యభరితంగా ఎడిట్ చేసి తిరిగి షేర్ చేశారు. దీనివల్ల మోదీ అసలు ఉద్దేశానికి భిన్నంగా ఆ వీడియో స్వరూపం పూర్తిగా మారిపోయింది. ఈ పరిస్థితికి అనుగుణంగా మారడం బీజేపీకి ఒక సవాలుగా మారవచ్చని వ్యాఖ్యాత అనురాగ్ మైనస్ వర్మ అన్నారు.

"ఇన్‌స్టా ప్రాథమికంగా వ్యంగ్యం, ఎగతాళిపై ఆధారపడిన ఒక ప్లాట్‌ఫామ్. సీరియస్ రాజకీయ సందేశాలను కూడా రీల్స్ రూపంలో ప్రదర్శించడం ద్వారా వాటిని హాస్యాస్పదంగా మార్చవచ్చు" అని వర్మ అన్నారు.

నరేంద్ర మోదీ

ఫొటో సోర్స్, Getty Images

అయితే, జెన్ జడ్‌ను ఆకర్షించేందుకు బీజేపీ చేస్తున్న ప్రయత్నాలకు అనవసర ప్రాధాన్యం ఇవ్వకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

పార్టీ ఎన్నికల విజయం ఇప్పటికీ ఇన్‌స్టాలోని కంటెంట్ పనితీరు కంటే దాని సంస్థాగత బలం, విశ్వసనీయ మద్దతుపైనే ఎక్కువగా ఆధారపడి ఉందని వారన్నారు.

''ఎన్నికల్లో గెలిచే సామర్థ్యం, సోషల్ మీడియాను మానిపులేట్ చేసే సామర్థ్యం రెండూ కూడా భిన్నమైన అంశాలు'' అని పాల్ చెప్పారు.

''సోషల్ మీడియాలోని ప్రతి జెన్ జడ్ వ్యక్తి ఇష్టపడకపోయినా.. బీజేపీ ఘన విజయం సాధించగలదు'' అన్నారు.

ప్రస్తుతం, భారత రాజకీయాల్లోని అనేక ఇతర పార్టీల మాదిరిగానే, బీజేపీ కూడా తనకు కొత్తదైన రంగంలో పనిచేయడం నేర్చుకుంటోంది.

అయితే, బీజేపీ చివరికి ఈ విషయాన్ని గ్రహించి విజయం సాధిస్తే ఆశ్చర్యపోనక్కరలేదని పాల్ అన్నారు.

కొత్త రాజకీయ సంభాషణ శైలిని అవలంబించడంలో దీనికి సుదీర్ఘ చరిత్ర ఉందని తెలిపారు.

ప్రచారం కోసం సోషల్ మీడియాను ముందుగా ఉపయోగించడం నుంచి పాడ్‌కాస్ట్‌లు, ఇన్‌ఫ్లుయెన్సర్ ఇంటర్వ్యూల వంటి కొత్త ఫార్మాట్‌లను అవలంబించడం వరకు, ఆ పార్టీ కాలానికి అనుగుణంగా తనను తాను మార్చుకుంది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)