కామ్రేడ్ కళ్యాణ్: లవ్ స్టోరీకి నక్సలిజం టచ్ ఇచ్చి కామెడీ పండించేందుకు చేసిన ప్రయత్నం ఫలించిందా?

కామ్రేడ్ కళ్యాణ్, శ్రీ విష్ణు, సత్య గవ్వ, కోన వెంకట్, నక్సలిజం
    • రచయిత, జీఆర్ మ‌హ‌ర్షి
    • హోదా, బీబీసీ కోసం
  • ప్రచురణ
  • చదివే సమయం: 4 నిమిషాలు

శ్రీ‌విష్ణుకి కామెడీ హీరోగా మంచి పేరుంది. ఈ మ‌ధ్య స‌త్య ఫుల్ స్పీడ్‌లో ఉన్నాడు. వీళ్ల‌ద్ద‌రికి రాధికా తోడుగా నిలిచి, కామ్రేడ్ క‌ళ్యాణ్ థియేట‌ర్‌లోకి వ‌చ్చింది.

క‌థ ఏమంటే 1994లో ఒరిస్సా బార్డ‌ర్‌లోని మాడుగుల‌లో క‌ళ్యాణ్ (శ్రీ‌విష్ణు) ఒక‌ పాత థియేట‌ర్‌ని లీజ్‌కి తీసుకుని నడిపిస్తూ ఉంటాడు.

ఆర్‌.నారాయ‌ణ‌మూర్తి సినిమాలు వేస్తూ ఉంటాడు. ఆయన త‌ల్లి రాధిక‌కి బాల‌కృష్ణ అభిమానం.

బాల‌య్య‌ని ఏమైనా అంటే బుర్ర బ‌ద్ధలు కొట్టి గొడ‌వ‌లు తెస్తూ ఉంటుంది.

ఒక‌రోజు ఆమెకి గుండెల్లో నొప్పి వ‌స్తే, అదే స‌మ‌యానికి సితార (మ‌హిమా నంబియార్‌) వ‌చ్చి సీపీఆర్ చేసి కాపాడుతుంది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
కామ్రేడ్ కళ్యాణ్, శ్రీ విష్ణు, సత్య గవ్వ, కోన వెంకట్, నక్సలిజం

త‌ల్లి ప్రాణాలు ర‌క్షించిన సితార‌పై క‌ళ్యాణ్‌కి ప్రేమ పుడుతుంది.

అయితే ఆమెకి తెలుగు రాదు.

ఒరియా అమ్మాయి. ప్రేమ‌ను వ్య‌క్తం చేయ‌డానికి హీరో తిప్ప‌లు ప‌డుతూ వుండ‌గా హ‌ఠాత్తుగా ఒక విష‌యం తెలుస్తుంది.

Skip ఎక్కువమంది చదివినవి and continue reading
ఎక్కువమంది చదివినవి

End of ఎక్కువమంది చదివినవి

సీరియస్‌గా మొదలై..

హీరోయిన్ తండ్రి ఒక ఒరియా సేట్ ద‌గ్గ‌ర రూ.5 ల‌క్ష‌లు అప్పు చేసి ఉంటాడు.

అప్పు తీర్చ‌క‌పోతే కూతుర్ని ఇచ్చి పెళ్లి చేయాలి,.ఇది ష‌ర‌తు. అందుకే ఊరు వ‌దిలి పారిపోయి ఉంటాడు.

ఈ విష‌యం తెలిసిన హీరో , త‌న ప్రేమ‌ని కాపాడుకోడానికి రూ.5 లక్ష‌లు ఇస్తాన‌ని అంటాడు. ఆ డ‌బ్బు కోసం ఒక ప్లాన్ అమ‌లు చేస్తాడు. అదేంట‌నేది మిగ‌తా సినిమా.

న‌క్స‌లిజం సీరియ‌స్ స‌బ్జెక్ట్‌. దీంట్లో కామెడీ క‌ల‌ప‌డం కొంచెం క‌ష్టం.

గ‌తంలో మేర్ల‌పాక గాంధీ లైక్ షేర్ స‌బ్‌స్క్రైబ్ లో ఇలాంటి ప్ర‌య‌త్నం చేసి దెబ్బ‌తిన్నారు. కామ్రేడ్ క‌ళ్యాణ్‌లో మాత్రం పూర్తిగా కాక‌పోయినా అక్క‌డ‌క్క‌డ వ‌ర్కౌట్ అయ్యింది.

దీనికి కార‌ణం శ్రీ‌విష్ణు , స‌త్య‌ల కామెడీ టైమింగ్‌.

సినిమాలో పూర్తిగా వేస్ట్ అయిన క్యారెక్టర్ రాధిక‌.

అంత మంచి న‌టి ఉన్న‌ప్పుడు కొంచెం మంచి సీన్స్ రాసుకుని ఉంటే ప్ల‌స్ అయ్యేది.

లొంగిపోయిన న‌క్స‌లైట్ల‌కి ప్ర‌భుత్వం డ‌బ్బులిచ్చే ప‌ద్ధ‌తి అప్ప‌ట్లో ఉండేది.

దీన్ని పోలీస్ అధికారులు దుర్వినియోగం చేశార‌నే ఆరోప‌ణ‌లు కూడా ఉండేవి.

కామ్రేడ్ కళ్యాణ్, శ్రీ విష్ణు, సత్య గవ్వ, కోన వెంకట్, నక్సలిజం

హీరో నక్సలైట్ ఎందుకు అయ్యాడంటే..

హీరో త‌న ప్రేమ కోసం, లొంగిపోయిన న‌క్స‌లైట్ అవ‌తారం ఎత్తి, ఇటు న‌క్స‌లైట్లు, అటు పోలీస్ అధికారుల మ‌ధ్య ఇరుక్కోవ‌డం మంచి పాయింట్‌.

అయితే స్క్రీన్ మీద చెప్ప‌డంలో ద‌ర్శ‌కుడు జాన‌కీరామ్ , సీనియ‌ర్ స్క్రీన్ ప్లే ర‌చ‌యిత కోన వెంక‌ట్ విఫ‌ల‌మ‌య్యారు.

ప్రారంభంలోనే పోలీస్ అధికారి (షైన్‌టామ్ చాకో) జీపుని న‌క్స‌లైట్లు పేల్చ‌డంతో సినిమా సీరియ‌స్ మోడ్‌లో ప్రారంభ‌మ‌వుతుంది.

వెంట‌నే శ్రీ‌విష్ణు విప్ల‌వం పాట ఎత్తుకోవ‌డంతో గంభీర‌మైన సినిమా అని ప్రేక్ష‌కుడు ఫిక్స్ అవుతాడు.

కానీ అక్క‌డి నుంచి కామెడీ మూడ్ మొద‌ల‌వుతుంది.

ఇంట‌ర్వెల్‌కి మ‌ళ్లీ సీరియ‌స్‌. సెకెండాఫ్ బిగినింగ్ కామెడీ , క్లైమాక్స్ సీరియ‌స్‌.

ఇలా ర‌క‌ర‌కాలుగా , లాజిక్‌లు లేకుండా కేవ‌లం అక్క‌డ‌క్క‌డ వ‌న్‌లైన‌ర్లు, జోక్స్‌తో సినిమా లాగించేయాల‌ని చూశారు.

సీరియ‌స్‌నెస్‌, మెసేజ్‌లు లేకుండా టాప్ టు బాట‌మ్ కామెడీ చేసి వుంటే వేరే లెవెల్ ఉండేది.

సినిమాలో హీరోయిన్ కీల‌కం. ఆమె ప్రేమ‌ కోస‌మే హీరో అంత రిస్క్ తీసుకుంటాడు.

కానీ వాళ్లిద్ద‌రి మ‌ధ్య కెమెస్ట్రీ పండే సీన్స్ లేవు.

మొన్న కొరియ‌న్ క‌న‌క‌రాజ్‌ని బ‌తికించిన‌ట్టు స‌త్య‌నే ఒక ర‌కంగా కామ్రేడ్‌ని బ‌తికించాడు. హీరోకి స‌త్య‌కి మ‌ధ్య కొన్ని సీన్స్ పేలాయి.

ముఖ్యంగా లవ్ లెట‌ర్ ఎపిసోడ్‌. సుద‌ర్శ‌న్ అక్క‌డ‌క్కడ న‌వ్వించాడు.

బ్ర‌హ్మాజీ, ర‌ఘుబాబు , ప్ర‌భాస్ శీను ఓకే.

పేంద్ర లిమాయే న‌వ్వించ‌లేక‌పోయాడు.

బుల్లిరాజు ఉన్నాడు కానీ, ఎందుకున్నాడో తెలియ‌దు. వెన్నెల కిషోర్ ఉన్నా, పెద్ద ప్ర‌భావం లేదు.

కామ్రేడ్ కళ్యాణ్, శ్రీ విష్ణు, సత్య గవ్వ, కోన వెంకట్, నక్సలిజం

టెక్నికల్‌గా ఎలా ఉందంటే..

ప్ర‌త్యేకంగా చెప్పుకోవాల్సింది సాయి శ్రీ‌రామ్ కెమెరా గురించి.

ప‌ల్లెటూరు, అడవిని చాలా అద్భుతంగా చూపించారు.

సంగీతం గురించి చెప్పాల్సింది ఏమీలేదు.

క‌త్తెర వేయ‌డానికి ఎడిట‌ర్‌కి అవ‌కాశం ఉన్నా వ‌దిలేశారు.

కోన వెంక‌ట్ చేయి తిరిగిన ర‌చ‌యితే కానీ, అది గ‌తం.

ఆయ‌న అక్క‌డే ఆగిపోయిన‌ట్టున్నాడు.

సినిమా కామెడీ ఎపిసోడ్స్ అన్నీ ఆయ‌న గ‌త సినిమాల్లో చూసిన‌ట్టే అనిపిస్తాయి.

క‌థ కూడా అక్క‌డ‌క్క‌డే తిరుగుతూ కొంచెం కూడా క‌ద‌ల‌న‌ట్టు అనిపిస్తే అది మ‌న త‌ప్పు కాదు.

ఆద‌ర్శ కుటుంబం వాయిదా ప‌డింది కాబ‌ట్టి ఈ వారం పెద్ద ఆప్ష‌న్ లేదు.

లాజిక్‌ల జోలికి వెళ్ల‌కుండా అక్క‌డ‌క్క‌డ న‌వ్వుకోడానికి ప్ర‌య‌త్నించొచ్చు.

కామ్రేడ్ కళ్యాణ్, శ్రీ విష్ణు, సత్య గవ్వ, కోన వెంకట్, నక్సలిజం

ప్ల‌స్ పాయింట్

1.శ్రీ‌విష్ణు, స‌త్య‌ల కామెడీ

2.కెమెరా

మైన‌స్ పాయింట్స్

1.లాజిక్ లెస్‌

2.సీరియ‌స్ సబ్జెక్ట్‌లోకి కామెడీ క‌ల‌ప‌డం

(అభిప్రాయాలు సమీక్షకుడి వ్యక్తిగతం)

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)