అంచనాలను మించిన భారత జీడిపి వృద్ధిపై అనుమానాలేంటి? నిపుణులు ఏం చెబుతున్నారు?

భారత జీడిపి, వృద్ధి, ఆర్థిక వ్యవస్థ

ఫొటో సోర్స్, Getty Images

ప్రచురణ
చదివే సమయం: 6 నిమిషాలు

ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో అంటే ఏప్రిల్ నుంచి జూన్ వరకు భారత్ జీడీపీ వృద్ధి రేటు 7.8 శాతంగా నమోదైంది. గతేడాది మొదటి త్రైమాసికంలో నమోదైన 6.9 శాతంతో పోలిస్తే ఇది ఎక్కువ.

అయితే, ఈ ఏడాది జనవరి నుంచి మార్చి వరకు నమోదైన 8.6 శాతం వృద్ధితో పోలిస్తే మాత్రం ఇది తక్కువే. ఈ గణాంకాలను ప్రభుత్వం సోమవారం విడుదల చేసింది.

మ్యానుఫాక్చరింగ్, సర్వీసెస్ (తయారీ, సేవల) రంగాలు ఈ వృద్ధిలో కీలక పాత్ర పోషించినట్లు చెబుతున్నారు.

మొదటి త్రైమాసికంలో నమోదైన వృద్ధి రేటు, బ్లూమ్‌బర్గ్ సర్వేలో వచ్చిన 7.3 శాతం మధ్యస్థ అంచనాను, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వేసిన 7 శాతం వృద్ధి రేటును అంచనాను అధిగమించింది.

ఈ వృద్ధిని కీలక విజయంగా అభివర్ణించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. చమురు ధరల పెరుగుదల, సరఫరా వ్యవస్థ(సప్లై చైన్) లో అంతరాయాలు, ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితి ఉన్నప్పటికీ భారత్ ఈ వృద్ధిని సాధించిందని ఆయన ఎక్స్‌లో చేసిన పోస్టులో పేర్కొన్నారు.

బీబీసీ వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

భారత్ ప్రస్తుతం ఆటోమొబైల్స్, మొబైల్ ఫోన్ల నుంచి ఔషధాలు, రసాయనాలు, ఉక్కు వంటి అనేక ఉత్పత్తులను తయారు చేస్తోంది. సెమీకండక్టర్ పరిశ్రమను కూడా భారీ స్థాయిలో అభివృద్ధి చేయడానికి ప్రయత్నిస్తోంది.

అయితే ఆర్థిక వ్యవస్థలో తయారీ రంగం వాటా ఇప్పటికీ 17 శాతమే. ప్రధానమంత్రి మోదీ నిర్దేశించిన 25 శాతం లక్ష్యానికి దూరంగానే కనిపిస్తోంది.

"జూన్ త్రైమాసికంలో చూపిన పనితీరు వల్ల 2027 మార్చితో ముగిసే 12 నెలల కాలంలో 7 శాతానికి పైగా వృద్ధిని సాధించే మార్గాన్ని భారత్‌కు సుగమం చేసింది" అని బ్లూమ్‌బర్గ్ తన నివేదికలో పేర్కొంది.

"ఈ పనితీరు బలంగానే ఉన్నప్పటికీ, 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కలను నెరవేర్చాలంటే భారత్ మరింత వేగంగా వృద్ధి చెందాల్సి ఉంటుంది" అనే బ్లూమ్‌బర్గ్ పేర్కొంది.

జీడీపీ వృద్ధి వేగంగా నమోదవుతున్నప్పటికీ, 2026-27 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో భారత్ కరెంట్ అకౌంట్ లోటు 4.2 బిలియన్ డాలర్లకు, అంటే జీడీపీలో 0.5 శాతానికి పెరిగింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో ఇది 3.4 బిలియన్ డాలర్లు, అంటే జీడీపీలో 0.4 శాతంగా ఉంది.

భారత జీడిపి, వృద్ధి, ఆర్థిక వ్యవస్థ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, సుభాష్ చంద్ర గార్గ్

అనుమానాలేంటి?

జీడీపీ వృద్ధి 7.8 శాతం అంటూ విడుదలైన గణాంకాలపై ప్రతిపక్ష పార్టీలు అనుమానాలు వ్యక్తం చేశాయి.

"నిరుద్యోగం 50 ఏళ్లలోనే గరిష్ఠ స్థాయిలో ఉంది. ఇటీవలె గ్రాడ్యుయేట్ అయిన యువతలో 40 శాతంమంది నిరుద్యోగులే. 2026 జూలైలో 15 నుంచి 29 ఏళ్ల మధ్య వయసున్న ప్రతి ఆరుగురు యువ భారతీయుల్లో ఒకరు నిరుద్యోగి. ప్రతి ఏడాది 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామన్న హామీ నీరుగారిపోయింది" అని రాజ్యసభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఎక్స్‌లో వేదికగా అన్నారు.

రిటైల్ ద్రవ్యోల్బణం 19 నెలల గరిష్ఠానికి చేరిందని, చక్కెర, ఉల్లి, టమాటా, పప్పులు, వంట నూనె, బియ్యం, పాలు, ఇతర వంటింటి నిత్యావసరాల ధరలు శరవేగంగా పెరుగుతున్నాయని ఆయన అన్నారు.

మోదీ ప్రభుత్వం రెండోసారి అధికారంలో ఉన్నప్పుడు ఆర్థిక శాఖ కార్యదర్శిగా పనిచేసిన సుభాష్ చంద్ర గార్గ్ కూడా జీడీపీ గణాంకాలపై ప్రశ్నలు లేవనెత్తారు.

చూడటానికి 7.8 శాతం వృద్ధి మంచి పరిణామంలాగే కనిపిస్తుందని, అయితే దాన్ని వాస్తవానికి లోతుగా పరిశీలించాల్సిన అవసరం ఉందని ఆయన ఒక ఎన్‌డీటీవీ కార్యక్రమంలో అన్నారు.

"గత ఏడాది తొలి త్రైమాసికంలో జీడీపీ వృద్ధి 7.8 శాతం. ఈ ఏడాది కూడా అదే శాతమని చెబుతున్నారు. అయితే గత ఏడాది జీడీపీని సవరించి 6.9 శాతంగా నిర్ణయించారు. సవరించిన గణాంకాల ఆధారంగా చూస్తే ఈ ఏడాది తొలి త్రైమాసిక వృద్ధి ఎక్కువగా కనిపిస్తోంది. కానీ విషయం అంతటితో అయిపోలేదు" అని గార్గ్ అన్నారు.

"7.8 శాతం జీడీపీ శాతం ద్రవ్యోల్బణం ప్రభావాన్ని తగ్గిస్తుంది. వాస్తవానికి జీడీపీని ప్రస్తుత ధరల ఆధారంగా కూడా లెక్కిస్తారు. మీరు, నేను చెల్లించే ధరలు, కార్పొరేట్ కంపెనీలు వసూలు చేసే ధరలు ఇందులో ఉంటాయి. అందువల్ల జీడీపీని ప్రస్తుత ధరల ఆధారంగా చూడటం వాస్తవ పరిస్థితిని అర్థం చేసుకోవడానికి సరైన మార్గం" అని గార్గ్ అన్నారు.

"ఇప్పటివరకు ఎవరూ ప్రస్తావించని విషయాన్ని నేను చెబుతున్నా. గత ఏడాది అప్పటి ప్రస్తుత ధరల ఆధారంగా లెక్కించిన జీడీపీ 86 ట్రిలియన్ రూపాయలుగా ఉంది. ఇప్పుడు దాన్ని 80 ట్రిలియన్ రూపాయలకు సవరించారు" అని ఆయన అన్నారు.

"గతేడాది జీడీపీని ఏకంగా 6 ట్రిలియన్ రూపాయలు తగ్గించి సవరించడం వల్ల ఈ ఏడాది తొలి త్రైమాసిక జీడీపీ వృద్ధి దాదాపు 10.3 శాతంగా కనిపిస్తోంది. గత ఏడాది జీడీపీని తగ్గించి సవరించకపోయి ఉంటే, ప్రస్తుత ధరలను బట్టి చూస్తే వృద్ధి కేవలం 2.6 శాతంగానే ఉండేది" అని గార్గ్ అన్నారు.

నిరుడు నామినల్ జీడీపీ ప్రాతిపదికలో భారీగా తగ్గుదల రావడం వల్ల భారత్ జీడీపీ వృద్ధిని ఎక్కువగా చూపించినట్లు గార్గ్ అభిప్రాయపడ్డారు.

ప్రభుత్వ గణాంకాలపై గార్గ్ ఎందుకు అనుమానం వ్యక్తం చేస్తున్నారు?దీనిపై ఆయన స్పందించారు.

"గత ఏడాది గణాంకాలు ప్రభుత్వానివే, ఈ ఏడాది గణాంకాలు కూడా ప్రభుత్వానివే’’ అని గార్గ్ అన్నారు.

"గత ఏడాది గణాంకాలతో ప్రభుత్వ గణాంకాలను పోల్చి చూస్తే, కేవలం రెండు లేదా మూడు రంగాల్లోనే వృద్ధి కనిపిస్తోంది. అవి వ్యవసాయం, గనులు’’ అని గార్గ్ అన్నారు. గత ఏడాది అప్పటి ప్రస్తుత ధరల ఆధారంగా నమోదైన జీడీపీతో పోలిస్తే తయారీ రంగం వాస్తవానికి ప్రతికూలంగా ఉందని ఆయన తెలిపారు.

"ప్రస్తుత ధరల ఆధారిత జీడీపీని ప్రభుత్వం ఇంత భారీగా ఎందుకు తగ్గించి సవరించిందనే విషయంపై లోతైన విశ్లేషణ జరగాలనేది నా అభిప్రాయం" అని ఆయన అన్నారు.

భారత జీడిపి, వృద్ధి, ఆర్థిక వ్యవస్థ

ఫొటో సోర్స్, Getty Images

ప్రభుత్వం బేస్ ఇయర్‌ను మార్చింది

జీడీపీ వృద్ధికి, భారత ఆర్థిక వ్యవస్థ బలానికి మధ్య ఉన్న సంబంధంపై తరచూ ప్రశ్నలు తలెత్తుతుంటాయి. గత ఏడాది ఫిబ్రవరిలో ప్రభుత్వం 2022-23ను బేస్ ఇయర్‌గా తీసుకుని కొత్త జీడీపీ సిరీస్‌ను ప్రకటించింది.

2026 ఫిబ్రవరి 27న 2022-23, 2023-24, 2024-25 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన కొత్త జీడీపీ అంచనాలు, ఇతర అనుబంధ గణాంకాలపై ప్రభుత్వం ఒక ప్రెస్ నోట్ విడుదల చేసింది. ఇందులో భాగంగా పాత బేస్ ఇయర్ అయిన 2011-12 స్థానంలో 2022-23ను తీసుకొచ్చింది.

బేస్ ఇయర్(సంవత్సరం) అనేది ధరలు, ఉత్పత్తి నిర్మాణం, వ్యయ విధానాలకు ఒక ప్రామాణిక ప్రాతిపదికగా పనిచేస్తుంది. కాలక్రమేణ ఉత్పత్తిలో వచ్చిన మార్పులను పోల్చడానికి దీన్ని ఉపయోగిస్తారు. ఆర్థిక వ్యవస్థలో మార్పులు చోటుచేసుకుంటున్నందున బేస్ ఇయర్‌ను మార్చడం కూడా అవసరంగా పరిగణిస్తారు. గతంలో భారత్ 2004-05, 1999-2000 సంవత్సరాలను బేస్ ఇయర్‌లుగా ఉపయోగించింది. స్వాతంత్య్రం తర్వాత ఇలాంటి సవరణ జరగడం ఇది ఎనిమిదోసారి.

మరింత అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలతో పోలిస్తే భారత్‌లో ఆర్థిక కార్యకలాపాల్లో గణనీయమైన భాగం ఇన్‌ఫార్మల్ (ప్రభుత్వ నియంత్రణ, పన్నులు, లైసెన్సులు, కార్మిక చట్టాలు లాంటి అధికారిక వ్యవస్థలకు బయట జరిగే ఆర్థిక కార్యకలాపాలు) రంగంలోనే (అన్‌ఆర్గనైజ్డ్ రంగం) జరుగుతుంది. సంప్రదాయంగా పన్నులు చెల్లించని చిన్న వ్యాపారాల గురించి అధికారిక పన్ను రికార్డుల్లో పెద్దగా సమాచారం అందుబాటులో ఉండదు.

నిరుడు డిసెంబర్‌లో ఆర్థికవేత్త అరుణ్ కుమార్ కూడా భారత్ అధికారిక జీడీపీ వృద్ధి రేట్ల విశ్వసనీయతను ప్రశ్నించారు. అంచనాలను లెక్కించడానికి దేశపు ఫార్మల్ ఎకానమీ (చట్ట పరిధిలోని) గణాంకాలపైనే ప్రభుత్వం ఎక్కువగా ఆధారపడిందని, దేశంలో అంతకన్నా పెద్దదైన ఇన్‌ఫార్మల్ ఎకానమీని తగిన స్థాయిలో పరిగణనలోకి తీసుకోవడంలో విఫలమవుతున్నారని ఆయన వాదించారు.

భారత జీడిపి, వృద్ధి, ఆర్థిక వ్యవస్థ

ఫొటో సోర్స్, National Herald

ఫొటో క్యాప్షన్, ప్రొఫెసర్ అరుణ్ కుమార్

"గత ఏడాది జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో రియల్ జీడీపీ వృద్ధి 8.2 శాతంగా నమోదైంది. ఇది దాదాపు 18 నెలల్లోనే అత్యధికం. అయితే ఇతర ఇండికేటర్లు చాలా బలహీనమైన పరిస్థితిని సూచించాయి. అక్టోబర్‌లో పారిశ్రామిక వృద్ధి కేవలం 0.3 శాతంగా ఉంది. నిరుద్యోగం ఆందోళనకరంగానే కొనసాగింది. అనేక పెట్టుబడి ప్రాజెక్టులు నిలిచిపోయినట్లు లేదా ఉపసంహరించుకున్నట్లు సమాచారం వచ్చింది. నికర ఎఫ్‌డీఐ ప్రతికూలంగా మారింది" అని అరుణ్ కుమార్ అన్నారు.

ఇలాంటి వైరుధ్యాలు ఉన్నప్పుడు అధికారిక వృద్ధి రేటును ఎలాంటి ప్రశ్నలు లేకుండా అంగీకరించకూడదని, జీడీపీ గణాంకాలను పరిశీలించాల్సిన అవసరం ఉందని అరుణ్ కుమార్ వాదించారు.

భారత్‌లో దాదాపు 94 శాతం మంది శ్రామికులు అసంఘటిత రంగంలో పనిచేస్తున్నారు. అయితే త్రైమాసిక ఉత్పత్తిని అంచనా వేయడానికి ఉపయోగించే విమాన ప్రయాణాలు, వాణిజ్య వాహనాల విక్రయాలు, సరుకు రవాణా వంటి అనేక సాధారణ ఇండికేటర్లు ప్రధానంగా సంఘటిత(ఆర్గనైజ్డ్) రంగం కార్యకలాపాలను మాత్రమే ప్రతిబింబిస్తాయంటారు ప్రొఫెసర్ అరుణ్ కుమార్.

సంఘటిత రంగం వృద్ధి చెందుతున్నప్పటికీ చిన్న సంస్థలు, అనధికారిక వ్యాపారాలు, స్వయం ఉపాధిపై ఆధారపడేవారు ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటుంటే, సంఘటిత రంగానికి సంబంధించిన గణాంకాల ఆధారంగా అసంఘటిత రంగ వృద్ధిని అంచనా వేయడం వల్ల మొత్తం ఆర్థిక వ్యవస్థ బలంగా విస్తరిస్తున్నట్లు తప్పుడు చిత్రం ఏర్పడే అవకాశం ఉందని ఆయన వాదిస్తున్నారు.

ఉపాధిపై ఆధారపడే అసంఘటటిత ఆర్థిక వ్యవస్థ కంటే సంఘటిత, కార్పొరేట్ కేంద్రిత ఆర్థిక వ్యవస్థను భారత్ జీడీపీ ఎక్కువగా పరిగణనలోకి తీసుకుంటోందని ప్రొఫెసర్ కుమార్ భావిస్తున్నారు.

జీడీపీ గణాంకాలను మెరుగుపరచడానికి అనేక మార్పులు అవసరమని ప్రొఫెసర్ అరుణ్ కుమార్ చెబుతున్నారు. వీటిలో కొత్త బేస్ ఇయర్, తాజా జనగణన నమూనాలు, అసంఘటిత రంగంపై మెరుగైన సర్వేలు, మెరుగైన డేటా సేకరణ పద్ధతులు ఉన్నాయి. అంతేకాకుండా ధరలను కొలిచే విధానాన్ని మెరుగుపరచాలని, త్రైమాసిక, వార్షిక జీడీపీ గణాంకాల మధ్య సమన్వయాన్ని మరింత పారదర్శకం చేయాలని ఆయన సూచిస్తున్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)