గరివిడి లక్ష్మి ఈవిడే.. ‘ఆమె పాటల క్యాసెట్ లేని ఇల్లు ఉండేది కాదు’

గరివిడి లక్ష్మి, జానపదాలు, ఉత్తరాంధ్ర, హరికథ, బుర్రకథ
ఫొటో క్యాప్షన్, గరివిడి లక్ష్మి
    • రచయిత, లక్కోజు శ్రీనివాస్
    • హోదా, బీబీసీ కోసం
  • ప్రచురణ
  • చదివే సమయం: 7 నిమిషాలు

పెళ్లిళ్లు కావచ్చు..

పండగలు కావచ్చు..

జాతరలు కావచ్చు..

గరివిడి లక్ష్మి ప్రోగ్రామ్ తప్పనిసరి.. సందడి మామూలుగా ఉండేది కాదు. ఇదంతా 1990ల ప్రాంతంలో..

'నల్ల నలజిలకర్ర మొగ్గ.., 'కోసింది కొయగూర..','మందులోడా... ఓరి మాయలోడా..' 'మాలవారి మంగమ్మ' వంటి పాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నాయి.

అయితే ఇవేమీ కొత్త పాటలు కాదు. పాత పాటలే. జానపదాల్లో భాగంగా బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి నోటి నుంచి వచ్చిన పాటలివి.

ఈ పాటలు 1990ల ప్రాంతంలో ఉత్తరాంధ్రతో పాటు ఆంధ్రప్రదేశ్‌ అంతటా ఊరూవాడను ఉర్రూతలూపాయి.

ఉత్తరాంధ్రకు చెందిన ఆమె అసలు పేరు రెడ్డి విజయలక్ష్మి. కానీ రంగస్థల కళా ప్రపంచానికి మాత్రం 'గరివిడి లక్ష్మి'గా సుపరిచితం.

Skip ఎక్కువమంది చదివినవి and continue reading
ఎక్కువమంది చదివినవి

End of ఎక్కువమంది చదివినవి

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

90వ దశకంలో బుర్రకథను తనదైన శైలిలో పలికిస్తూ... జానపదాన్ని తన గొంతులో ఇముడ్చుకుని.. కొత్త బాణీలతో ప్రేక్షకులను అలరించిన కళాకారిణి ఆమె.

అప్పటివరకు సంప్రదాయంగా సాగిన బుర్రకథకు తనదైన జానపద బాణీలు, మాస్ శైలిని జోడించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు గరివిడి లక్ష్మి.

ఆమె బయోపిక్ 'గరివిడి లక్ష్మి' పేరుతోనే సినిమా రూపంలో వస్తోంది.

దీంతో అసలు ఆమె ఎవరు? ఆమె జీవితంలో ఏం జరిగింది? అనే ఆసక్తి నెలకొంది.

గరివిడి లక్ష్మి, జానపదాలు, ఉత్తరాంధ్ర, హరికథ, బుర్రకథ
ఫొటో క్యాప్షన్, బుర్రకథ చెబుతున్న బృందం

విజయలక్ష్మే... గరివిడి లక్ష్మి

"ఆ రోజుల్లో… గరివిడి లక్ష్మి పాటల క్యాసెట్ లేని ఇల్లు ఉందంటే నమ్మడం కష్టమే. గరివిడి లక్ష్మి వేలాది ప్రదర్శనలు ఇచ్చారు.

ఒకప్పుడు క్యాసెట్లలో, స్టేజ్‌లపై మార్మోగిన ఆ గొంతు… ఇప్పుడు వెండితెరపై ఒక కథగా రానుంది.

"అని జానపద గ్రంథాలయ నిర్వాహకులు 'కళింగాంధ్ర జానపదాలు' పుస్తక రచయిత బద్రి కూర్మారావు బీబీసీతో అన్నారు.

విజయనగరం జిల్లా గరివిడి మండలానికి చెందిన రెడ్డి విజయలక్ష్మి అలియాస్ పెద లక్ష్మికి జానపదాలన్నా... బుర్రకథలోని వచనమన్నా విపరీతమైన ఆసక్తి ఉండేది.

అలా ఆమె బుర్రకథ వైపు అడుగులు వేశారు.

"మహిళలు సమాజంలో కళలు ప్రదర్శించాలన్నా స్టేజ్‌పై వేషాలు వేయాలన్నా ఎన్నో రకాల అవమానాలు ఉంటాయి. వాటన్నింటినీ తట్టుకొని నిలబడ్డాను. మగాళ్లు బలంగా ఉన్న ఈ బుర్రకథలో నేను నాదైన శైలిని జోడించి ప్రేక్షకులను బుర్రకథకి రప్పించేలా హాస్యంతో, కాస్త మాస్ టచ్ తో చేసేదాన్ని. అది ప్రేక్షకులకి బాగా నచ్చి 90 దశకంలో ఊపిరి తీసుకోలేనన్ని ప్రొగ్రామ్స్ ఇచ్చేదాన్ని. ఇప్పటీకి నేను 10 వేలకు పైగా బుర్రకథ కార్యక్రమాలు నిర్వహించాను" అని గరివిడి లక్ష్మి బీబీసీకి చెప్పారు.

అయితే ప్రస్తుతం నెలలో సగం కంటే తక్కువ రోజులే ప్రదర్శనలు ఉంటున్నాయని ఆమె అన్నారు.

తాను పుట్టిన సంవత్సరం, కుటుంబ నేపథ్యం గురించి లక్ష్మి చెప్పేందుకు గరివిడి లక్ష్మి ఇష్టపడలేదు.

సినిమా విడుదలయ్యే వరకు ఎలాంటి సమాచారం చెప్పనని చిత్ర యూనిట్‌కు మాటిచ్చినట్లు ఆమె బీబీసీతో చెప్పారు.

అలాగే సినిమా ట్రైలర్‌లో చూపిస్తున్నట్లే తన జీవితం ఉండకపోవచ్చని సినిమా కోసం కొంత స్వేచ్ఛ తీసుకునే అవకాశం ఉందని ఆమె చెప్పారు.

గరివిడి లక్ష్మి, జానపదాలు, ఉత్తరాంధ్ర, హరికథ, బుర్రకథ
ఫొటో క్యాప్షన్, విజయనగంలో గరివిడి లక్ష్మి నివాసం

'గరివిడి లక్ష్మికి ఉన్న ఆదరణే వేరు'

ఉత్తరాంధ్రలో బుర్రకథ ఒక జానపద కళారూపం.

ఒకప్పుడు బుర్రకథలకు విపరీతమైన ఆదరణ ఉండేది.

రామాయణం, భారతం, శివ బాగోతం, బాల నాగమ్మ వంటి రకరకాల ఇతివృత్తాలను ఒక్కొక్కరు తమదైన శైలిలో బుర్రకథలుగా చెప్పేవారు.

ఇందులో హాస్యాన్ని కూడా జోడించి ప్రేక్షకులను అలరించేవారు.

అటువంటి సమయంలో హాస్య సంభాషణలతో, తనదైన ప్రత్యేకమైన గాత్రంతో ప్రేక్షకులను మెప్పించారు గరివిడి లక్ష్మి.

"విశాఖలోని శ్రీమాతా రికార్డింగ్ కంపెనీ 1995-96లో గరివిడి లక్ష్మి బుర్రకథను ఆడియో రూపంలో తీసుకొచ్చింది. దానికి 'నవ్వుల బండి' అనే జానపద హాస్య పాటల క్యాసెట్‌ను కలిపి అమ్మేవారు. ఈ క్యాసెట్లు కొనేందుకు జనం ఎగబడేవారు. దీంతో గరివిడి లక్ష్మి బుర్రకథ బాగా ఫేమస్ అయిపోయింది. సాధారణంగా ఒక కళాకారుడు ఏడాదిలో 100 ప్రదర్శనలు ఇస్తే గొప్ప. అటువంటిది గరివిడి లక్ష్మి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఏడాదిలో 300పైగా ప్రదర్శనలు ఇచ్చారు" అని గరివిడి లక్ష్మితో కలిసి బుర్రకథలు చెప్పిన కళాకారుడు కాళ్ల అప్పారావు బీబీసీతో చెప్పారు.

గరివిడి లక్ష్మి, జానపదాలు, ఉత్తరాంధ్ర, హరికథ, బుర్రకథ
ఫొటో క్యాప్షన్, గరివిడి లక్ష్మి పాత్రను సినీ నటి ఆనంది పోషించారు.

స్వరం, శైలి.. గరివిడి లక్ష్మి ప్రత్యేకతలు

గరివిడి లక్ష్మి బుర్రకథకు ప్రధాన ప్రత్యేకత ఆమె శక్తివంతమైన స్వరం, జానపద గాన శైలి. ఆమె గాత్రం ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా, బుర్రకథ కళారూపానికి ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిందని కళాకారులు చెబుతున్నారు.

కష్టతరంగా అనిపించే సాహిత్య భాషకు బదులుగా సామాన్య ప్రజలకు సులభంగా అర్థమయ్యే తెలుగులో, ఉత్తరాంధ్ర స్థానిక భాషా రుచితో కథలను చెప్పడం ఆమె శైలిలోని మరో ముఖ్యమైన అంశమని నాటకరంగ కళాకారిణి మంగాదేవి బీబీసీతో అన్నారు.

హరిశ్చంద్ర నాటకంలో హరిశ్చంద్ర పాత్రను వేల సార్లు పోషించిన మహిళా కళాకారిణి మంగాదేవిపై బీబీసీ గతంలో కథనం ప్రసారం చేసింది.

"గరివిడి లక్ష్మి బుర్రకథను కేవలం వినోద ప్రదర్శనగా పరిమితం చేయలేదు. సామాజిక అంశాలు, ప్రజా సమస్యలను బుర్రకథ ద్వారా ప్రజల ముందుకు తీసుకువచ్చి, ఆ కళారూపాన్ని ఒక సామాజిక ఉద్యమానికి సాధనంగా మార్చారు. పురుష కళాకారుల ఆధిపత్యం ఉన్న సంప్రదాయ బుర్రకథ రంగంలో మహిళగా నిలిచి, తనదైన శైలి, స్వరం, కథనంతో ప్రత్యేక గుర్తింపు సాధించడం ఆమె మరో విశేషం. ఈ అంశాలన్నీ గరివిడి లక్ష్మిని ఉత్తరాంధ్ర జానపద కళా రంగంలో ప్రత్యేక స్థానంలో నిలబెట్టాయి" అని బద్రి కూర్మారావు తెలిపారు.

గరివిడి లక్ష్మీ వంటి బలమైన వ్యక్తిత్వం ఉన్న మహిళ కళాకారిణి క్యారెక్టర్ తాను పోషించడం ఆనందంగా ఉందని హీరోయిన్ ఆనంది ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

గరివిడి లక్ష్మి బుర్రకథలకు కాస్త మాస్ శైలిని జోడించారని.. ప్రేక్షకులను రంజింపజేసేందుకు ఆమె ప్రదర్శనల్లో కొన్ని పాటలు, సంభాషణల్లో ద్వంద్వార్థ పదాలు, వినోదాత్మక తీరు కూడా ఉండేవని అవి బాగా ప్రాచుర్యం పొందాయని కూర్మారావు బీబీసీతో చెప్పారు.

కానీ చాలా చోట్ల ఈ పద్దతి విమర్శలు కూడా ఎదుర్కొందని కొందరు గరివిడి లక్ష్మి బుర్రకథలకు వెళ్లడాన్ని కూడా తప్పుపట్టేవారని కూర్మారావు అన్నారు.

అయితే మారుతున్న కాలానికి, మాధ్యమాలకు అనుగుణంగా బుర్రకథలకు ఆదరణ తగ్గినప్పటికీ.. ఇప్పటికీ ఇంటర్నెట్‌లో గరివిడి లక్ష్మి బుర్రకథ కోసం అన్వేషించే జానపద ప్రేమికులు ఉన్నారని బుర్రకథ కళాకారుడు కాళ్ల అప్పారావు తెలిపారు.

గరివిడి లక్ష్మి, జానపదాలు, ఉత్తరాంధ్ర, హరికథ, బుర్రకథ
ఫొటో క్యాప్షన్, గరివిడి లక్ష్మి సినిమా ప్రచార పోస్టర్

సినిమా విడుదలయ్యాక అన్నీ చెబుతా: గరివిడి లక్ష్మి

గరివిడి లక్ష్మి జీవితంలో ఒక దశలో ఆమె కనిపించకుండాపోయారనే అంశాన్ని ప్రస్తుతం తెరకెక్కుతున్న బయోపిక్‌లో చూపిస్తున్నట్లు ట్రైలర్‌ను చూస్తే అర్థమవుతోంది.

అయితే ఆమె నిజ జీవితంలో ఎప్పుడు, ఎందుకు కనిపించకుండా పోయారన్న దానిపై స్పష్టత లేదు.

గరివిడి లక్ష్మి కూడా ఈ విషయం గురించి ప్రస్తుతం చెప్పేందుకు ఇష్టపడలేదు.

ఈ విషయంపై గరివిడి లక్ష్మితో బీబీసీ మాట్లాడింది.

సినిమా విడుదలయ్యే వరకు తన జీవితానికి సంబంధించిన విషయాలు, సినిమాలో చూపిస్తున్న అంశాలపై ఎలాంటి వివరాలు చెప్పవద్దని సినిమా వాళ్లు సూచించారని ఆమె చెప్పారు.

అక్టోబర్ 17 తర్వాత తన జీవితానికి సంబంధించిన అన్ని విషయాలను చెబుతానని ఆమె స్పష్టం చేశారు.

తన జీవితంలోని ప్రతి అంశాన్ని సినిమా దర్శకుడు, ఆయన బృందానికి చెప్పానని.. అయితే 'గరివిడి లక్ష్మి' సినిమాలో తన జీవితంలోని ఏయే అంశాలను చిత్ర దర్శకులు తెరకెక్కించారన్నది సినిమా చూశాకే తెలుస్తుందని ఆమె బీబీసీతో చెప్పారు.

"1994లో బుర్రకథల స్టేజ్‌పైకి వచ్చిన గరివిడి లక్ష్మి, 1996 నాటికే కమర్షియల్ ఆడియో (మాతా కంపెనీ) రికార్డింగులతో గుర్తింపు పొందారు. అక్కడ నుంచి ఆమెకు పెద్ద ఎత్తున ఆదరణ లభించగా, 15 ఏళ్లలో వేల ప్రదర్శనలు ఇచ్చిన రికార్డు ఉంది. 2008లో ఆమె పేరుతో 21 పాటలున్న క్యాసెట్ రిలీజైంది. అయితే 2010 నుంచి 2021 మధ్య ఆమె జీవితానికి సంబంధించిన స్వతంత్ర ఆధారాలు, కథనాలు చాలా తక్కువగా ఉన్నాయి." అని ఏపీ జానపద కళాకారుల సంక్షేమం కోసం పని చేసే అఖిల ప్రజా కళాకారుల సంక్షేమ సంఘం ప్రతినిధి బొంగు భాస్కరరావు బీబీసీకి తెలిపారు.

ఆమెకు సంబంధించిన పాటలు, బుర్రకథల రికార్డింగులు ఇప్పటికీ అందుబాటులో ఉండటం.. అప్పట్లో ఆమెకు ఉన్న ప్రజాదరణకు ఉదాహరణని భాస్కరరావు చెప్పారు.

గరివిడి లక్ష్మి, జానపదాలు, ఉత్తరాంధ్ర, హరికథ, బుర్రకథ
ఫొటో క్యాప్షన్, గరివిడి లక్ష్మి పాటల వల్లే తనకు గుర్తింపు వచ్చిందని జానకి రావు చెప్పారు.

'ఆమె పాటలే నాకు పేరు తెచ్చాయి': 'రేలారే రేలా' జానకి రావు

జానకి రావు 'గరివిడి లక్ష్మి' సినిమా మ్యూజిక్ విభాగంలో పని చేశారు.

గరివిడి లక్ష్మి పాటలను ఎలా పాడాలనే అంశంపై ఆమెతో పలుమార్లు చర్చించి, సినిమా బృందానికి ఆ సారాంశాన్ని వివరించేవారని జానకి రావు చెప్పారు.

జానకి రావు స్వయంగా జానపద గాయకుడు.

'రేలారే రేలా' వంటి కార్యక్రమాల్లో అవార్డులు గెలుచుకున్నట్లు ఆయన బీబీసీతో చెప్పారు.

తనకు 'రేలారే రేలా' కార్యక్రమంలో అవార్డు తెచ్చిన పాట గరివిడి లక్ష్మి పాడిన పాటేనని ఆయన అన్నారు.

ఆ తర్వాత అనేక పాటలు నేర్చుకునేందుకు గరివిడి లక్ష్మి వద్దకు చాలా సార్లు వెళ్లానని చెప్పారు.

ఇప్పుడు 'గరివిడి లక్ష్మి' సినిమాలో మ్యూజిక్ విభాగంలో పని చేసినట్లు తెలిపారు.

గరివిడి లక్ష్మి పాటలను గతంలో చాలా సినిమాల్లో ఉపయోగించారని... తాను కూడా టీవీ కార్యక్రమాల్లో వాటిని పాడి అవార్డులు గెలుచుకున్నానని జానకి రావు బీబీసీకి చెప్పారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)