పారిపోవడం, దొరికిపోవడం: 'స్వేచ్ఛా ప్రపంచం'లో అడుగుపెట్టాలనే ఈ మాజీ పోలీసు చైనా నుంచి ఎలా పారిపోయారు?

ఫొటో సోర్స్, Dong Guangping
- రచయిత, ఫోబే కాంగ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 5 నిమిషాలు
అల్లకల్లోలంగా ఉన్న సముద్రంలో రబ్బరు పడవ అలలకు ఊగుతోంది. రెండు రోజులుగా నిద్ర లేకుండా ఆ పడవలోనే ప్రయాణిస్తున్న చైనా అసమ్మతివాది డాంగ్ గ్వాంగ్పింగ్ను భయం ఆవహించింది.
సముద్ర మార్గం ద్వారా చైనా నుంచి పారిపోవడానికి ప్రయత్నించడం చాలా ప్రమాదకరమని 68 ఏళ్ల డాంగ్‌కు తెలుసు.
ఈ ప్రయాణంలో ఎదురయ్యే సవాళ్లను ఆయన చాలా తక్కువగా అంచనా వేశారు.
తీవ్రమైన ఎండదెబ్బకు గురయ్యారు. ఫోన్ బ్యాటరీలో చార్జింగ్ అయిపోవడానికి దగ్గరగా ఉంది. ఆయన దగ్గరున్న పోర్టబుల్ చార్జర్ కూడా పూర్తిగా ఖాళీ అయింది.
ఆకాశం, సముద్రం తప్ప అక్కడ ఎలాంటి ఆనవాళ్లూ లేవు. ఫోన్ ఆగిపోకముందే అందులో ఉన్న డిజిటల్ కంపాస్ తనను దక్షిణ కొరియా చేర్చుతుందనేది ఆయన ఆశ.

"దారి కనుక్కోలేకపోవడం భయానకంగా ఉండేది. మళ్లీ చైనా వైపు కొట్టుకుపోయి ఉండేవాడిని" అని చైనా నుంచి పారిపోయి వచ్చిన రెండు నెలల తర్వాత డాంగ్ బీబీసీతో చెప్పారు.
చైనాలోని తూర్పు షాండాంగ్ ప్రావిన్స్ నుంచి బయలుదేరిన 40 గంటల తర్వాత మే 27 రాత్రి దక్షిణ కొరియా జలాల్లో కోస్ట్ గార్డ్ సిబ్బంది, మత్స్యకారులు డాంగ్‌ను రక్షించారు.
ఆయన్ను దక్షిణ కొరియాలో కొద్దిరోజులు నిర్బంధంలో ఉంచారు. తర్వాత, ఆయన తన కుటుంబం నివసిస్తున్న కెనడాకు వెళ్లి స్థిరపడ్డారు.

ఫొటో సోర్స్, Getty Images
"నేను చైనాలో బతకలేను" అని టొరంటో నుంచి వీడియో కాల్లో బీబీసీ చైనీస్‌తో మాట్లాడుతూ డాంగ్ అన్నారు.
"నేను చైనాను వదిలేయకపోతే నా జీవితంలో మనశ్శాంతి అనేదే ఉండేది కాదు. నేను దేశం వదిలి వెళ్లిపోగలనని చైనా కమ్యూనిస్ట్ పార్టీకి చూపించాల్సి వచ్చింది. వాళ్లు నన్ను ఆపలేరు. నియంత్రించలేరు."
దీనిపై స్పందన కోసం బీబీసీ చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధిని సంప్రదించింది.
"చైనా ప్రజలు దేశం విడిచి వెళ్లడం, దేశంలోకి రావడం చట్టప్రకారం జరుగుతుంది, పౌరులంతా రాజ్యాంగం, చట్టానికి కట్టుబడి ఉండాలి" అని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి చెప్పారు.

ఫొటో సోర్స్, Dong Guangping
చైనా నుంచి పారిపోయేందుకు విఫలయత్నాలు
చైనాలో ఉండగా డాంగ్ పోలీస్ అధికారిగా పని చేశారు. తర్వాత మానవ హక్కుల కార్యకర్తగా మారారు. వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నందుకు ఆయన పలుమార్లు జైలుకెళ్లారు.
1999లో టియానన్మెన్ స్క్వేర్ వద్ద ప్రజాస్వామ్య అనుకూల ఉద్యమకారులపై జరిగిన క్రూరమైన అణచివేత పదో వార్షికోత్సవాన్ని స్మరించుకునే సమయంలో ఒక పిటిషన్‌పై సంతకం చేసినందుకు ప్రభుత్వం ఆయనను పోలీస్ ఉద్యోగం నుంచి తొలగించింది.
అప్పటికే ఆయన 13 ఏళ్లు పోలీస్ విభాగంలో పని చేశారు.
2001లో "ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు ప్రేరేపించడం" ఆరోపణల కింద ఆయనకు మూడేళ్ల జైలు శిక్ష పడింది. 2014లో టియానన్మెన్ స్క్వేర్ స్మారక కార్యక్రమంలో పాల్గొన్నందుకు ఆయన్ను మళ్లీ జైలులో పెట్టినట్లు ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ తెలిపింది.
ఇంతకుముందు, నాలుగుసార్లు చైనా నుంచి పారిపోయారు డాంగ్. అయితే, ప్రతిసారీ ఆయన్ను ఆయా దేశాలు మళ్లీ చైనా పంపించాయి.
"నాకు ఒక నమ్మకం బలంగా ఉండేది. నేను స్వేచ్ఛా ప్రపంచంలోకి అడుగు పెడతానని" అని ఆయన బీబీసీతో అన్నారు.
భార్య, కుమార్తెతో కలిసి డాంగ్ 2015 సెప్టెంబర్‌లో బ్యాంకాక్‌కు వెళ్లారు. అక్కడ వారికి ఐక్యరాజ్యసమితి శరణార్థి హోదా మంజూరు చేసింది. కెనడాలో పునరావాసానికి అనుమతి లభించింది.
అయితే, వాళ్లు కెనడా వెళ్లడానికి కొన్ని రోజుల ముందు థాయ్ అధికారులు డాంగ్‌ను చైనా తిప్పి పంపారు.
అక్కడ ఆయనపై "ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు ప్రేరేపించడం, జాతీయ సరిహద్దులను అక్రమంగా దాటడం" అనే ఆరోపణల కింద జైలులో పెట్టారు. ఆయనకు మూడున్నరేళ్లు జైలు శిక్ష విధించారు.
2019లో జైలు నుంచి విడుదలైన తర్వాత డాంగ్ మళ్లీ చైనా నుంచి పారిపోయేందుకు ప్రయత్నించారు. తైవాన్‌కు చెందిన చిన్న దీవి కిన్మెన్కు ఈదుకుంటూ వెళ్లారు.
అయితే, చైనా మత్స్యకారులు ఆయన్ను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఆ తర్వాత ఆయన దేశం విడిచి వెళ్లకుండా ప్రభుత్వం నిషేధం విధించింది.
2020లో ఆయన చైనా నుంచి తప్పించుకుని వియత్నాంలో అడుగుపెట్టారు. హానోయిలో రెండేళ్లు అజ్ఞాతంలో జీవించారు. అయితే, వియత్నాం ప్రభుత్వం మళ్లీ ఆయన్ని చైనాకు పంపించింది. చైనాలో ఏడాది జైలు శిక్ష పడింది.
2023లో మళ్లీ జైలు నుంచి విడుదలయ్యారు. చైనా నుంచి పారిపోయేందుకు పదే పదే చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో ఆయనలో పట్టుదల మరింత పెరిగింది.
'ప్రమాదకరమైన మార్గం'
ఈసారి ఆయన మరింత ప్రమాదకరమైన ప్రణాళిక రూపొందించారు. ఎల్లో సీ మీదుగా దక్షిణ కొరియా తీరం వెంబడి 300 కిలోమీటర్లకుపైగా ప్రయాణించి జపాన్ చేరుకోవడమే ఆ ప్లాన్.
"ఇది చాలా ప్రమాదకరమైన మార్గం. ప్రాణాలు పణంగా పెట్టాల్సి వస్తుందని నాకు తెలుసు" అని ఆయన చెప్పారు.
2023 మేలో కొన్ని గంటల పాటు పడవ నడిపిన అనుభవంతో, షాండాంగ్లోని వెయ్హై నుంచి ఇంజిన్ అమర్చిన 3.3 మీటర్ల పొడవైన చిన్న రబ్బరు పడవలో డాంగ్ తన ప్రయాణాన్ని ప్రారంభించారు.
సముద్రంలో ప్రతికూల వాతావరణం వల్ల తన మార్గాన్ని మార్చుకుని దగ్గరగా ఉన్న దక్షిణ కొరియా వైపు వెళ్లారు.
సముద్రంలో ఎక్కువ సేపు ఉంటంతో ఆయన అలసిపోయారు. ఒక సమయంలో నిద్రలోకి జారుకున్నారు. నిద్ర లేచిన తర్వాత తన పడవ కార్గో షిప్‌ను ఢీకొట్టే ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకుందని డాంగ్ గుర్తించారు.
"మరో 20 సెకన్లు నిద్రలోనే ఉండి ఉంటే ఆ కార్గో షిప్‌ను ఢీకొని ఉండేవాడిని" అని డాంగ్ చెప్పారు.

ఫొటో సోర్స్, EPA
ఎట్టకేలకు కెనడాకు..
మే 25న దక్షిణ కొరియా స్థానిక సమయం రాత్రి 8.30 సమయంలో తనకు దగ్గరగా ఓ చేపలు పట్టే పడవను ఆయన గుర్తించారు. పెద్దగా అరుస్తూ "నాకు సాయం చేయండి! పోలీసులకు కాల్ చేయండి" కేకలు వేశారు. దక్షిణ కొరియాలోని టేయాన్ కౌంటీలో డాంగ్‌ను ఒడ్డుకు తీసుకువచ్చారు.
దక్షిణ కొరియాలోని ఇంచియాన్‌లో శరణార్థి కేంద్రానికి పంపించారు. తర్వాత ఆయనకు కెనడాలో రాజకీయ శరణార్థిగా ఆశ్రయం లభించింది.
సముద్రమార్గంలో దక్షిణ కొరియాకు పారిపోయిన చైనా అసమ్మతివాది ఆయనొక్కరే కాదు.
2023లో చైనా కార్యకర్త క్వాన్ ప్యోంగ్ దక్షిణ కొరియాకు పారిపోయారు. మొదట ఆయన్ను వలస చట్టాల ఉల్లంఘన ఆరోపణలపై నిర్బంధించారు. కానీ, తరువాత అమెరికాలో పునరావాసం కల్పించారు.
టొరంటోకు తన విమాన ప్రయాణం ఖరారైందని తెలిసిన క్షణం గురించి డాంగ్ మాట్లాడుతూ "విమాన టికెట్ చేతిలో పట్టుకున్నప్పుడు భావోద్వేగానికి లోనయ్యాను" అని చెప్పారు.
డాంగ్ చైనా వదిలి వెళ్లడానికి కొన్ని రోజుల ముందు ఆయన తల్లి 95వ పుట్టినరోజు జరుపుకున్నారు. దేశం వదిలి వెళ్లాలన్న తన ప్లాన్ గురించి ఆమెకు చెప్పలేదని డాంగ్ చెప్పారు.
"కుమారుడిగా నా తల్లి పట్ల పుత్ర ధర్మాన్ని నెరవేర్చలేకపోవడం నా జీవితంలో ఎప్పటికీ తీరని పశ్చాత్తాపంగానే మిగిలిపోతుంది" అని ఆయన చెప్పారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
































