మీమ్‌ టు మూవ్‌మెంట్: జంతర్ మంతర్ వేదికగా కాక్రోచ్ జనతా పార్టీ నిరసనలు.. శనివారం ఉదయం నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఏం జరిగింది?

కాక్రోచ్ జనతా పార్టీ, దిల్లీ, నిరసనలు
    • రచయిత, పవన్ కాంత్ దిగవల్లి
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • ప్రచురణ
  • చదివే సమయం: 5 నిమిషాలు

దేశ రాజధాని దిల్లీలోని జంతర్ మంతర్ శనివారం కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) మద్దతుదారులతో కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో మార్మోగింది.

నీట్ పరీక్షా పత్రాల లీకులపై నిరసన తెలిపిన సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే.. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

''పరీక్షా పత్రాల లీకులతో లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతో కేంద్ర ప్రభుత్వం ఆటలాడుకుంది. దీనికి కేంద్ర విద్యాశాఖ మంత్రి నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలి'' అని అభిజీత్ దీప్కే అన్నారు.

అమెరికాలోని బోస్టన్ యూనివర్సిటీలో చదువుతున్న అభిజీత్ దీప్కే, శనివారం ఉదయం 7 గంటల 35 నిమిషాలకు దిల్లీ విమానాశ్రయంలో ల్యాండ్ అయినట్లు ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. పది గంటలకల్లా సీజేపీ మద్దతుదారులంతా జంతర్ మంతర్‌కు రావాలని కోరారు.

నీట్ పరీక్ష పత్రాల లీకులు, సీబీఎస్ఈ పరీక్షల నిర్వహణలో సాంకేతిక లోపాలకు వ్యతిరేకంగా శాంతియుతంగా నిరసన చేసేందుకు సీజేపీ మద్దతుదారులంతా దిల్లీలోని జంతర్ మంతర్‌కు చేరుకోవాలని సామాజిక మాధ్యమాల ద్వారా కాక్రోచ్ జనతా పార్టీ పిలుపునిచ్చింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
కాక్రోచ్ జనతా పార్టీ, దిల్లీ, నిరసనలు

ఫొటో సోర్స్, X/SauravDassss

జంతర్ మంతర్ వద్ద అభిజిత్ దీప్కే మాట్లాడుతూ, "నువ్వు తిరిగి వస్తే నిన్ను జైల్లో పెడతారని గడిచిన రెండు మూడు రోజులుగా మా అమ్మ, సోదరి ఏడుస్తున్నారు. నేను ఇంటికి వస్తున్నానని తెలిసి భయపడ్డారు. ఇది మా అమ్మ ఒక్కరి ఆందోళన మాత్రమే కాదు" అన్నారు.

"ఈ దేశంలో రాజకీయాల గురించి, ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏ పిల్లవాడు, విద్యార్థి, యువకుడు మాట్లాడినా.. తమ బిడ్డను ఎక్కడ లోపల వేస్తారోనని ప్రతి తల్లి భయపడే పరిస్థితి ఉంది. ఎంతకాలం మనం ఇలాంటి భయంలో బతకాలి? మీ భయపెట్టే రాజకీయాలకు ఇక లొంగేది లేదని వీరికి ఒకసారి గట్టిగా చెప్పండి" అన్నారు.

అలాగే, "గత 5, 10 రోజులుగా సోషల్ మీడియాలో పేజీ నడిపితే ఏం లాభం అని ప్రజలు నన్ను ప్రశ్నిస్తున్నారు. జంతర్ మంతర్ వద్దకు ఎంతమంది 'కాక్రోచ్‌లు' ఇళ్ల నుంచి బయటకు వచ్చారో వారికి ఒకసారి కెమెరా తిప్పి చూపించండి" అని అభిజిత్ వ్యాఖ్యానించారు.

"కేవలం ఒకటి రెండు రోజుల్లోనే లక్షలాది మంది విద్యార్థులు మాతో చేరబోతున్నారు. ఈ కాక్రోచ్ జనతా పార్టీ ముందస్తు ప్రణాళికతో పెట్టిన పార్టీ కాదు. ప్రభుత్వంపై అసంతృప్తితో ఉన్న ప్రతి విద్యార్థి గళం ఇది" అని ఆయన స్పష్టం చేశారు.

"గత 10-12 ఏళ్లుగా వీరు మనల్ని హిందూ-ముస్లిం రాజకీయాల్లో బంధించారు. దీనివల్ల ఎవరికి లాభం చేకూరింది? హిందూ-ముస్లిం గొడవల వల్ల దేశంలో ఎవరికైనా ఉద్యోగాలు వచ్చాయా" అని ప్రశ్నించారు.

'ఉద్యమాన్ని ప్రేమాభిమానాలతో, శాంతియుతంగా ముందుకు తీసుకెళ్లాలి' అని కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) తన మద్దతుదారులకు పిలుపునిచ్చింది.

కాక్రోచ్ జనతా పార్టీ, దిల్లీ, నిరసనలు

ఫొటో సోర్స్, Cockroach Janta Party/Instagram

ఫొటో క్యాప్షన్, జంతర్ మంతర్‌లో సీజేపీ చేపట్టిన నిరసనకు విద్యావేత్త, సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌ఛుక్ మద్దతు తెలిపారు.

కట్టుదిట్టమైన భద్రత

కాక్రోచ్ జనతా పార్టీ నిరసన పిలుపుతో దిల్లీ పోలీసులు నగరమంతా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. దాదాపు 500 మందికి పైగా పోలీసు బలగాలు, 700 మందికి పైగా సీఆర్పీఎఫ్ బలగాల, అదనంగా సీఐఎస్‌ఎఫ్, రాపిడ్ యాక్షన్ ఫోర్స్ బలగాలను రంగంలోకి దించారు.

''సీఆర్పీఎఫ్ నుంచి 700 వందల మంది బలగాలను మోహరించారు. అయితే నిరసనకారులపై లాఠీలు ఎత్తడానికి వీల్లేదనే ఆదేశాలు మాకున్నాయి. కాబట్టి శాంతియుతంగా నిరసనలు కొనసాగినంత సేపు ఎలాంటి ఇబ్బంది ఉండదు'' సీఆర్పీఎఫ్ ఏఎస్‌ఐ గుమ్మడి ప్రసాద్ ‘బీబీసీ’తో చెప్పారు.

కాక్రోచ్ జనతా పార్టీ, దిల్లీ, నిరసనలు

జంతర్ మంతర్‌కు చేరుకునే ప్రతి ఒక్కరినీ నిశితంగా గమనించేందుకు మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు.

'మొబైల్ కమాండ్ అండ్ కంట్రోల్' వాహనాన్ని మోహరించి, వచ్చిపోయే వారి కదలికలను నిరంతరం పర్యవేక్షించారు.

అదనంగా, దిల్లీ పోలీస్ డిపార్ట్‌మెంట్ నుండి ప్రత్యేకంగా 150 మంది ఫోటోగ్రాఫర్లను రంగంలోకి దించారు. జంతర్ మంతర్‌కు వచ్చేవారి ఫోటోలు, వీడియోలు తీస్తూ ఆ ఫుటేజీని పోలీసులకు అందించడమే వీరి ప్రధాన విధి.

''వచ్చేవాళ్లందరినీ ఫోటోలు, వీడియోలు తీయడమే మా పని. ఎవరైనా రాళ్లు రువ్వినా, అల్లర్లకు పాల్పడినా అలాంటి వారందరినీ ఫోటోలు తీస్తాం. ఫోటోగ్రాఫర్లుగా మేమందరం కాంట్రాక్ట్ ఉద్యోగులుగా పని చేస్తున్నాం. పోలీస్ డిపార్ట్‌మెంట్ మాకు రోజుకి రూ.2000 వరకూ ఇస్తుంది. ఇలాంటి నిరసనలు, ఇతర ఈవెంట్లు ఏమున్నా మమ్మల్ని పిలుస్తారు'' అని పేరు చెప్పడానికి ఇష్టపడని ఒక ఫోటోగ్రాఫర్ చెప్పారు.

కొన్ని ఆసక్తికర సంఘటనలు

జంతర్ మంతర్ నిరసనల ప్రాంగణంలో సీజేపీ మద్దతుదారులతో పాటు వ్యతిరేకులు కూడా వచ్చి నినాదాలు చేశారు.

అలానే సీజేపీ మద్దతుదారులతో మాట్లాడుతున్న కొందరు సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయన్సర్లు వారితో వాగ్వాదానికి దిగుతూ గట్టిగా అరిచిన సంఘటనలు కనిపించాయి.

జంతర్ మంతర్ నిరసన ప్రాంగణానికి రెండు వైపులా బారికేడ్లు ఏర్పాటుచేశారు.

భారతీయ జనతా పార్టీ మద్దతుదారులు ప్రధాని మోదీకి అనుకూల నినాదాలు చేస్తూ బారికేడ్లు దాటి లోపలికి వచ్చే ప్రయత్నం చేశారు. అయితే వీళ్లను పోలీసు బలగాలు అడ్డుకుని బలవంతంగా వెనక్కు పంపించేశారు.

కాక్రోచ్ జనతా పార్టీ, దిల్లీ, నిరసనలు
ఫొటో క్యాప్షన్, ఉదయం సీజేపీ మద్దతుదారులంతా రోడ్డు పక్కన ఉన్న ప్లాట్‌ఫాంపై కూర్చుని నిరసనలు తెలిపారు.

ముందుగానే వెళ్లిపోయిన అభిజీత్

సీజేపీ నిరసనల కోసం దిల్లీ పోలీసులు సాయంత్రం ఐదు గంటల వరకు అనుమతి ఇచ్చారు. అయితే సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే మధ్యాహ్నం మూడున్నర గంటల సమయంలో జంతర్ మంతర్ నుంచి వెళ్లిపోయారు.

ఉదయం నుంచి 40 డిగ్రీలసెల్సియస్‌కు పైగా ఉష్ణోగ్రత నమోదైనప్పటికీ, సీజేపీ మద్దతుదారులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. అయితే వేడి తీవ్రత ఎక్కువగా ఉండటంతో వచ్చిన వాళ్లు చాలా ఇబ్బంది పడ్డారు.

ఉదయం 11 గంటల సమయంలో సీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ వేడి దెబ్బకు ఇబ్బంది పడటం కనిపించింది. చాలాసేపు చెట్టుకింద నీడలోకి వచ్చి కూర్చుండిపోయారు.

కాక్రోచ్ జనతా పార్టీ, దిల్లీ, నిరసనలు
ఫొటో క్యాప్షన్, జంతర్ మంతర్ వద్ద ఓ వ్యక్తి పట్టుకున్న ప్లకార్డు

ఉదయం సీజేపీ మద్దతుదారులంతా రోడ్డు పక్కన ఉన్న ప్లాట్‌ఫాంపై కూర్చుని నిరసనలు తెలిపారు. తర్వాత స్టేజీ వేసుకునేందుకు పోలీసుల నుంచి అనుమతి తీసుకుని, మధ్యాహ్నం దాదాపుగా ఒంటిగంట సమయంలో స్టేజీని సెటప్ చేసుకున్నారు.

ఇదే సమయంలో విద్యావేత్త, సామాజిక కార్యకర్త, శాస్త్రవేత్త సోనమ్ వాంగ్‌ఛుక్ అక్కడకు చేరుకున్నారు. దాంతో అభిజిత్ దీప్కేతో సహా సీజేపీ మద్దతుదారులంతా "సోనమ్ వాంగ్‌ఛుక్ జిందాబాద్" అంటూ నినాదాలు చేశారు.

''ఈ ఉద్యమం ఇక్కడితో మొదలవ్వాలే కానీ అంతమవ్వకూడదు. దేశంలో మార్పు కోరుకునే వాళ్లంతా ఇక్కడికి వచ్చారు'' అని సోనమ్ వాంగ్‌ఛుక్ అన్నారు.

క్రమంగా ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్‌ఎఫ్, ఏఐఎస్‌ఏ, డీయూఎస్‌యు లాంటి విద్యార్థి సంఘాలకు చెందిన విద్యార్థులు భారీ సంఖ్యలో చేరుకున్నారు. దీంతో జంతర్ మంతర్ ప్రాంతమంతా నిరసనకారులతో, సీజేపీ మద్దతుదారులతో కిక్కిరిసింది.

కాక్రోచ్ జనతా పార్టీ, దిల్లీ, నిరసనలు

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయకపోతే?

తమ డిమాండ్లకు తలొగ్గి కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయకపోతే మళ్లీ వచ్చే శనివారం అంటే వారం రోజుల తర్వాత కూడా జంతర్ మంతర్‌కు వచ్చి నిరసనలు చేస్తామని సీజేపీ సంకేతాలిస్తోంది.

కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయకపోతే వచ్చే శనివారం ఇక్కడికి వచ్చి నిరసన తెలుపుతారా? అని అభిజిత్ దీప్కే అడిగిన ప్రశ్నకు స్పందనగా స్టేజ్ ముందున్న సీజేపీ మద్దతుదారులంతా అవునన్నారు.

గడిచిన రెండేళ్లుగా జరిగిన పరీక్షా పత్రాల లీకులను ప్రస్తావిస్తూ, దీని కారణంగా పలువురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని ఆరోపిస్తూ వారి పేర్లనూ అభిజిత్ దీప్కే చదివి వినిపిస్తున్న సమయంలో అక్కడున్న నిరసనకారులంతా సంఘీభావం తెలుపుతూ మొబైల్ ఫోన్ల టార్చ్ లైట్ వెలిగిస్తూ ఫోన్లను పైకెత్తారు.

విద్యార్థుల మరణాలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని మరోసారి డిమాండ్ చేశారు.

jantar mantar

మీమ్‌గా మొదలై..

ఒక సెటైరికల్ మీమ్‌గా మొదలైన కాక్రోచ్ జనతా పార్టీ, భారీ ఉద్యమానికి తెరలేపింది. దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల నుంచి వచ్చి సీజేపీకి మద్దతు తెలిపిన వారంతా ఇప్పుడీ ఉద్యమాన్ని ఏ దిశగా ముందుకు తీసుకెళ్తారనేది పెద్ద ప్రశ్నగా మారింది.

కాగా సీజేపీ నిరసనలకు సాయంత్రం 5 గంటల వరకు సమయం ఇచ్చినప్పటికీ 4 గంటలకే జంతర్ మంతర్ వద్ద మొత్తం ఖాళీ అయింది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)