You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
హమ్జా బుర్హాన్: ‘టెర్రరిస్ట్’గా భారత్ ప్రకటించిన ఈయన్ను పాకిస్తాన్‌లో కాల్చి చంపారు, అసలెవరీయన?
- రచయిత, నసీర్ చౌధరి, రుహాన్ అహ్మద్
- హోదా, బీబీసీ ఉర్దూ, ఇస్లామాబాద్
- ప్రచురణ
- చదివే సమయం: 5 నిమిషాలు
పాకిస్తాన్ పాలిత కశ్మీర్ రాజధాని ముజఫరాబాద్‌లోని గోజ్రా ప్రాంతంలో హమ్జా బుర్హాన్ కాల్పుల్లో చనిపోయినట్లు అక్కడి పోలీసులు తెలిపారు.
ప్రైవేట్ కళాశాల ప్రిన్సిపాల్ అయిన హమ్జా బుర్హాన్ ఈ కాల్పుల్లో గాయపడి, సీఎంహెచ్‌లో చికిత్స పొందుతూ మరణించినట్లు డీఎస్పీ ఇష్తియాక్ గిలానీ బీబీసీకి తెలిపారు.
పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. ఆయన పనిచేస్తున్న కళాశాల ఎదుటే హమ్జాపై కాల్పులు జరిగాయి. పోలీసులు.. అబ్దుల్లా కమాల్ అనే వ్యక్తిని అరెస్టు చేశారు.
హమ్జా బుర్హాన్ తీవ్రంగా గాయపడినట్లు వచ్చిన వార్తల నేపథ్యంలో పోలీసులను ‘బీబీసీ’ సంప్రదించగా.. హమ్జా బుర్హాన్ ముజఫరాబాద్‌లో నివాసముంటున్నారని, భారత్ పాలిత కశ్మీర్ నుంచి పారిపోయి అక్కడకు వచ్చారని డీఎస్పీ ఇష్తియాక్ గిలానీ ధ్రువీకరించారు.
దాడి జరిగిన వెంటనే హమ్జా బుర్హాన్‌ను ఆస్పత్రికి తరలించారని, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్లు డీఎస్పీ గిలానీ చెప్పారు.
బుర్హాన్‌పై కాల్పుల అనంతరం, పాకిస్తానీ పంజాబ్‌లోని వాహ్ కంటోన్మెంట్‌కు చెందిన మరో అనుమానితుడిని కూడా అదుపులోకి తీసుకున్న డీఎస్పీ గిలానీ తెలిపారు. సదరు అనుమానితుడు ఆదివారం కంటోన్మెంట్ నుంచి ముజఫరాబాద్‌కు వచ్చి, స్థానిక హోటల్‌లో బస చేసినట్లు ప్రాథమిక విచారణలో తేలినట్లు చెప్పారు.
పోలీసులు తెలిసిన వివరాల ప్రకారం, "హమ్జా తన స్నేహితులతో కలిసి కళాశాల నుంచి బయటకు వచ్చారు. వారితో మాట్లాడి, తిరిగి కళాశాలలోకి వెళ్తుండగా మొదట ఆయనపై వెనుక నుంచి కాల్పులు జరిపారు, అనంతరం మరిన్ని రౌండ్లు కాల్చారు. వాటిలో ఒకటి ఆయన తలకు తగిలింది."
ముజఫరాబాద్‌లోని ఒక ప్రైవేట్ కళాశాల ప్రిన్సిపాల్ అయిన హమ్జా బుర్హాన్ అహ్మద్‌పై కాల్పుల అనంతరం, కళాశాల విద్యార్థులు నిరసనకు దిగారు.
భారత మీడియా ఏమంది?
పాక్ పాలిత కశ్మీర్‌లో జరిగిన ఈ ఘటనకు సంబంధించి భారత్ మీడియాలో ప్రముఖంగా కథనాలు వెలువడ్డాయి. హమ్జా బుర్హాన్ అసలు పేరు అర్జుమంద్ గుల్జార్ డార్ అని, కొన్నేళ్ల కిందట భారత ప్రభుత్వం ఆయన్ను టెర్రరిస్టుగా ప్రకటించినట్లు మీడియా సంస్థలు రిపోర్ట్ చేశాయి.
హమ్జా బుర్హాన్ భారత్‌లోని కశ్మీర్‌కు చెందినవారని, కొన్నేళ్ల కిందట పాకిస్తాన్‌కు వచ్చినట్లు పాక్ పాలిత్ కశ్మీర్‌కు చెందిన ఇద్దరు సీనియర్ అధికారులు తమ పేర్లు వెల్లడించొద్దనే షరతుపై బీబీసీ ఉర్దూకు ధ్రువీకరించారు.
భారత హోం మంత్రిత్వ శాఖ 2022లో అర్జుమంద్ గుల్జార్ డార్ అలియాస్ హమ్జా బర్హాన్ అలియాస్ డాక్టర్‌ను యూఏపీఏ చట్టం కింద టెర్రరిస్ట్‌గా ప్రకటించింది.
కాల్పులు ఎక్కడ, ఎప్పుడు జరిగాయి?
హమ్జా బుర్హాన్‌పై కాల్పులకు సంబంధించి ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు ముజఫరాబాద్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ రియాజ్ మొఘల్ బీబీసీకి తెలిపారు. అయితే, ఆయన మరిన్ని వివరాలు వెల్లడించేందుకు నిరాకరించారు.
గోజ్రా బైపాస్‌లోని ఒక ప్రైవేట్ కళాశాల ప్రిన్సిపాల్‌పై కాల్పులు జరిగినట్లు మధ్యాహ్నం 12.10 గంటల సమయంలో తమకు సమాచారం అందిందని సదర్ పోలీస్ స్టేషన్‌కు చెందిన అధికారులు తెలిపారు.
కళాశాలలో పనిచేస్తున్న ఓ సెక్యూరిటీ గార్డు బీబీసీతో మాట్లాడుతూ, "తనతో కలిసి కొందరు అతిథులు వస్తున్నట్లు ప్రిన్సిపాల్ హమ్జా బుర్హాన్ చెప్పడంతో వారిని తీసుకొచ్చేందుకు స్వయంగా కాలేజీ మెయిన్ గేటు వద్దకు వెళ్లాను" అని చెప్పారు.
సెక్యూరిటీ గార్డు తెలిపిన వివరాల ప్రకారం, ఆయన లోపల ఉన్నప్పుడే ఒక్కసారిగా తుపాకీ కాల్పుల శబ్దం వినిపించింది. బయటకు వచ్చి చూసేసరికి ప్రిన్సిపాల్ గాయాలతో పడివున్నారు.
ముజఫరాబాద్ డిప్యూటీ కమిషనర్ మునీర్ ఖురేషీ బీబీసీతో మాట్లాడుతూ, "హమ్జా బుర్హాన్‌పై జరిగిన దాడి ఒక టార్గెట్ కిల్లింగ్" అని అన్నారు.
ఎవరీ హమ్జా బుర్హాన్?
ముజఫరాబాద్ డిప్యూటీ కమిషనర్ మునీర్ ఖురేషీ మాట్లాడుతూ, "దర్యాప్తు కొనసాగుతోంది. భారత మీడియా దీనికి అధిక ప్రాధాన్యతనిచ్చింది. కాల్పులు జరిగిన 5, 10 నిమిషాల నుంచే వారు ఈ వార్తను ప్రసారం చేయడం మొదలుపెట్టినట్లున్నారు. పుల్వామా దాడికి ఇతనే సూత్రధారి అని అక్కడి మీడియా ప్రచారం చేసింది."
"ప్రస్తుతం మా పోలీసులు, ఇతర సంబంధిత ఏజెన్సీలు హమ్జా బుర్హాన్ ఎవరనే దానిపై దర్యాప్తు చేస్తున్నాయి."
అయితే, హమ్జా బుర్హాన్ భారత్‌లోని కశ్మీర్‌కు చెందినవారని ముజఫరాబాద్‌కు చెందిన ఇద్దరు సీనియర్ ప్రభుత్వ అధికారులు బీబీసీకి ధ్రువీకరించారు.
హమ్జా బుర్హాన్ భారత్ పాలిత కశ్మీర్‌కు చెందినవారా అని ముజఫరాబాద్ ఎస్పీ రియాజ్ మొఘల్‌ను అడిగినప్పుడు, "ఆయనొక కశ్మీరీ" అని మాత్రమే బదులిచ్చారు.
తీవ్రవాద సంస్థలతో సంబంధాల గురించి అడగ్గా, "ఇంకా ఏమీ తేలలేదు, దర్యాప్తు కొనసాగుతోంది" అని చెప్పారు.
హమ్జా పాకిస్తాన్ ఎప్పుడు వెళ్లారు?
అర్జుమంద్ గుల్జార్ డార్ (అలియాస్ హమ్జా బుర్హాన్, అలియాస్ డాక్టర్) సోదరుడు ఆరిఫ్ గుల్జార్ డార్ దిల్లీలో ఉంటున్నారు. ఆయన బీబీసీ ఉర్దూకు చెందిన రియాజ్ మస్రూర్‌తో మాట్లాడుతూ, "నాకు కూడా పోలీస్ ఎస్ఎస్పీ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. అసలేం జరిగిందో ఇంకా ఏమీ తెలియదు. ఇంతకుమించి నేనేమీ చెప్పలేను" అని అన్నారు.
కశ్మీర్‌లో ఉంటున్న అర్జుమంద్ గుల్జార్ డార్ తండ్రి దీనిపై వ్యాఖ్యానించేందుకు నిరాకరించారు.
అయితే, భారత హోం మంత్రిత్వ శాఖ 2022 ఏప్రిల్‌లో అర్జుమంద్ గుల్జార్ డార్ అలియాస్ హమ్జా బుర్హాన్ అలియాస్ డాక్టర్‌ను 'టెర్రరిస్ట్'గా ప్రకటించినట్లు నిర్ధరితమైంది.
భారత హోం మంత్రిత్వ శాఖ అధికారిక వెబ్‌సైట్ ప్రకారం, "అర్జుమంద్ గుల్జార్ డార్ అలియాస్ హమ్జా బుర్హాన్ అలియాస్ డాక్టర్‌ను 'టెర్రరిస్ట్'గా ప్రకటిస్తూ, 2022 ఏప్రిల్ 19న చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం, 1967లోని నాల్గవ షెడ్యూల్‌లో అధికారికంగా చేర్చారు."
అర్జుమంద్ గుల్జార్ డార్ అలియాస్ హమ్జా బుర్హాన్ పూర్తి వివరాలు హోం మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి.
వెబ్‌సైట్ ప్రకారం, "అర్జుమంద్ గుల్జార్ డార్ అలియాస్ హమ్జా బుర్హాన్ అలియాస్ డాక్టర్, వయస్సు 23 సంవత్సరాలు (ప్రస్తుత వయస్సు 27 సంవత్సరాలు), 1999లో జన్మించారు. పుల్వామాలోని ఖర్బత్‌పురా నివాసి. 'అల్-బదర్' అనే టెర్రరిస్ట్ సంస్థ అనుబంధ సభ్యుడు."
హోం మంత్రిత్వ శాఖ ప్రకారం, అల్-బదర్‌ను "టెర్రరిస్ట్ సంస్థ"గా పేర్కొన్న అధికారిక పత్రాల్లో ఆయన తండ్రి పేరు గుల్జార్ అహ్మద్ డార్‌గా పేర్కొని ఉంది.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)