You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
పెళ్లికి ఒప్పుకోలేదని బాలిక రొమ్మును గాయపరిచిన యువకుడు
- రచయిత, సయ్యద్ మొజీజ్ ఇమామ్
- హోదా, బీబీసీ కోసం
- ప్రచురణ
- చదివే సమయం: 5 నిమిషాలు
పెళ్లికి నిరాకరించిందని బాలికపై దాడి చేసి, రొమ్మును గాయపరిచిన ఘటన ఉత్తరప్రదేశ్‌లోని హర్దోయ్‌లో వెలుగుచూసింది. ఈ కేసులో 24 ఏళ్ల యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
మే 11న జరిగిన ఈ ఘటనలో, లైంగిక హింసకు సంబంధించిన తీవ్రమైన సెక్షన్లను పోలీసులు ఎఫ్ఐఆర్‌లో చేర్చారు.
తన అక్కతో కలిసి దిల్లీలో ఉంటున్నానని, మే 3న తన సోదరి పెళ్లికి హాజరయ్యేందుకు గ్రామానికి వచ్చినట్లు బాలిక పోలీసులకు తెలిపారు. పెళ్లి వేడుకల నుంచి ఇంటికి వస్తుండగా మే 11న ఈ ఘటన జరిగింది.
హర్డోయ్ పోలీసులు తొలుత దాడి కేసు నమోదు చేసినప్పటికీ, విషయం తీవ్రతరం కావడంతో లైంగిక హింసకు సంబంధించిన సెక్షన్లను కూడా చేర్చారు.
ఎస్‌హెచ్‌వో సతీశ్ చంద్ర తెలిపిన వివరాల ప్రకారం.. ఐపీసీ 115(2), 351(3), 352, 75, 118(2) సెక్షన్ల కింద కేసు నమోదైంది.
ఈ సెక్షన్లు గాయాలయ్యేలా దాడి చేయడం, చంపుతామని బెదిరించడం, శాంతి భద్రతలకు భంగం కలిగించడం, లైంగిక వేధింపులకు సంబంధించిన నేరాలకు వర్తిస్తాయి.
ఒక మహిళకు శారీరకంగానే కాకుండా మానసికంగా హాని కలిగించినా లైంగిక వేధింపులకు కిందకు వస్తుంది.
పోలీసులు విడుదల చేసిన ప్రకటన ప్రకారం, నిందితుడికి, మైనర్ బాలికకు ముందే పరిచయముంది.
బాలిక స్టేట్‌మెంట్‌లో ఏముంది?
"మా కుటుంబ సభ్యులందరూ మా ఇంటికి కొద్ది దూరంలో ఉన్న మా అంకుల్ ఇంట్లో ఉన్నారు. రాత్రి 11 గంటల సమయంలో, ఒకసారి ఇంటి దగ్గరకు వెళ్లి చూసి రమ్మని మా అమ్మ చెప్పింది. దీంతో నేను ఒంటరిగానే ఇంటికి వెళ్తున్నాను. ఆ దారిలో అతుల్ నన్ను అడ్డుకున్నాడు" అని బాలిక తన స్టేట్‌మెంట్‌లో చెప్పింది.
"అతుల్ నన్ను లాక్కెళ్లి, ఎవరూ లేని చోటుకు తీసుకెళ్లాడు. అక్కడ ఓ చెట్టుకు కట్టేసి, తనను పెళ్లి చేసుకోవాలంటూ ఒత్తిడి చేశాడు. తనతో మాట్లాడాలని, రోజూ తనని కలవాలని బలవంతం చేశాడు. నేను కుదరదని చెప్పడంతో నన్ను కొట్టాడు" అని చెప్పారామె.
"నువ్వు నాకు అన్నలాంటోడివని చెప్పా, కానీ అతను వినిపించుకోలేదు. నన్ను కొడుతూనే ఉన్నాడు. నన్ను పెళ్లి చేసుకుంటావా లేదా అని మళ్లీ అడిగాడు. అందుకు ఒప్పుకోకపోవడంతో నా రొమ్మును గాయపరిచాడు" అని ఆమె తన స్టేట్‌మెంట్‌లో పేర్కొన్నారు.
బాలిక ఇంటి బయట అపస్మారక స్థితిలో కనిపించిందని ఆమె కుటుంబ సభ్యులు చెబుతున్నారు.
అనంతరం ఆమెను ఆస్పత్రికి తరలించారు. స్పృహలోకి వచ్చిన తర్వాత, ఆమె కుటుంబ సభ్యులకు జరిగిన విషయం చెప్పారు. అనంతరం, బాలికను తీసుకుని కుటుంబ సభ్యులు సమీప పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు.
అయితే, పోలీసులు తమను పట్టించుకోలేదని ఆమె తల్లి ఆరోపిస్తున్నారు. మరోవైపు, తాము చర్యలు తీసుకున్నామని, నిందితుడిని అరెస్టు చేసి జైలుకి పంపినట్లు పోలీసులు చెబుతున్నారు.
తన వివరాలు వెల్లడించకూడదన్న షరతుపై నిందితుడి సోదరుడొకరు బీబీసీతో మాట్లాడుతూ, ఈ ఆరోపణలను తోసిపుచ్చారు. వాళ్లిద్దరికీ ముందు నుంచే పరిచయం ఉందని చెప్పారు.
బాలిక తల్లి మీడియాతో మాట్లాడుతూ, "మేం చదువుకున్నోళ్లం కాదు, కాబట్టి ఎఫ్‌ఐఆర్‌లో పోలీసులు ఏం రాశారో మాకు తెలీదు" అని అన్నారు.
పోలీసులు ఏం చెప్పారు?
ఈ విషయం తీవ్రతరం కావడం, పోలీసులు మరిన్ని సెక్షన్లను చేర్చడంతో మరోసారి వైద్య పరీక్షలు నిర్వహించారు.
హర్దోయ్ పోలీస్ సర్కిల్ ఆఫీసర్ అజిత్ చౌహాన్ మాట్లాడుతూ, "ఒక యువతిపై అదే గ్రామానికి చెందిన యువకుడు దాడి చేశాడు. ఆమె సోదరుడి ఫిర్యాదు మేరకు బేనీగంజ్ పోలీసులు వెంటనే సంబంధిత సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి, యువతికి వైద్య పరీక్షలు చేయించారు. ఆ తర్వాత, వైద్య నివేదికలో ప్రస్తావించని గాయాలున్నట్లు వారు చెప్పారు" అని అన్నారు.
అనంతరం పోలీసులు అదనంగా లైంగిక వేధింపులకు సంబంధించిన బీఎన్ఎస్ 75, ఆయుధాలతో గాయాలు చేయడానికి సంబంధించిన సెక్షన్ 118ను కూడా చేర్చారు.
ఈ కేసులో 'ప్రేమ వ్యవహారం' కూడా ఉన్నట్లు దర్యాప్తులో వెల్లడైందని పోలీసులు తెలిపారు.
నిందితుడు అతుల్, బాలిక హరియాణాలో కూలి పనులకు వెళ్లేవారని, గత మూడేళ్లుగా వీరిద్దరూ రిలేషన్‌షిప్‌లో ఉన్నారని పోలీసులు పేర్కొన్నారు.
ఊరికొచ్చిన తర్వాత ఏదో విషయమై వీరి మధ్య గొడవ జరిగిందని, ఆ తర్వాత ఈ ఘటన జరిగిందని పోలీసులు తమ ప్రకటనలో పేర్కొన్నారు.
పెళ్లి చేసుకోవాలని బలవంతం చేశారన్న ఆరోపణలకు సంబంధించి ఇప్పటివరకు తమ దర్యాప్తులో ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదని కూడా పోలీసులు తెలిపారు. అలాగే, కిడ్నాప్ ఆరోపణలు కూడా నిరాధారమని తేలిందన్నారు. వాళ్లిద్దరూ స్వచ్ఛందంగానే కలుసుకునేవారని పోలీసులు పేర్కొన్నారు.
'హృదయ విదారకం'
సామాజిక కార్యకర్త, లఖ్‌నవూ యూనివర్సిటీ మాజీ వైస్ చాన్సలర్ రూప్ రేఖ వర్మ ఈ విషయం గురించి మాట్లాడుతూ ప్రజల్లో భయమనేది పోయిందని అన్నారు.
"ఇలాంటివి విన్నప్పుడు, హృదయ విదారకంగా అనిపిస్తుంది. ఇలాంటి కేసుల్లో అసలేం జరిగిందో తెలియనివి ఎన్నో ఉన్నాయి" అన్నారు.
అయితే, ఇలాంటి నేరాలు ప్రతీకారేచ్ఛతోనే జరుగుతాయని మానసిక వైద్య నిపుణులు అంటున్నారు.
యూనిటీ లా కాలేజీలో సైకాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ షమ్సీ అక్బర్ మాట్లాడుతూ, "ఏదో ఒక 'మానసిక అనారోగ్యాన్ని' ఇలాంటి ఘటనలకు ఆపాదించలేం. ఒక వ్యక్తిలో ఇలాంటి హింసాత్మక, లైంగిక వేధింపుల వంటి స్వభావానికి మానసికంగా, సామాజికంగా అనేక కారణాలు ఉండొచ్చు" అని అన్నారు.
"తిరస్కరణను తట్టుకోలేకపోవడం, స్త్రీని తన ఆస్తిగా భావించడం, సంబంధం కోసం బలవంతం చేయడం వంటి సామాజిక, స్వాభావిక సమస్యలు ఇలాంటి ఘటనలకు దారితీయొచ్చు" అని ఆమె అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)