గనేరియా, సిఫిలిస్ కేసులు యూరప్‌లో రికార్డు స్థాయిలో పెరిగాయి - ఇన్ఫెక్షన్ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటి?

    • రచయిత, డాన్ సేల్స్
  • ప్రచురణ
  • చదివే సమయం: 4 నిమిషాలు

గనేరియా, సిఫిలిస్ వంటి లైంగికంగా సంక్రమించే ఇన్ఫెక్షన్స్ (ఎస్‌టీఐ) యూరప్‌లో భారీ సంఖ్యలో పెరిగాయి.

ఈ రెండు వ్యాధులు గత పదేళ్లలో ఎన్నడూ లేనంతగా 2024లో అత్యధిక స్థాయికి చేరుకున్నాయని యూరోపియన్ సెంటర్ ఫర్ డిసీజ్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ (ఈసీడీసీ) వెల్లడించింది.

గనేరియా కేసులు 1,06,331కి చేరాయి. ఇది 2015 సంవత్సరంతో పోలిస్తే 303 శాతం పెరుగుదల. ఇక సిఫిలిస్ కేసులు కూడా అదే సమయంలో రెండింతలు పెరిగి 45,557కి చేరాయి.

వ్యాధి నిర్ధరణ పరీక్షలు సరిగ్గా చేయకపోవడం, ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడమే ఈ వ్యాధులు ఇంత వేగంగా పెరగడానికి కారణమని ఆరోగ్య సంస్థ ఈసీడీసీ తెలిపింది. అంతేకాకుండా వీటి నివారణకు తక్షణ చర్యలు చేపట్టాలని కోరింది.

గనేరియా, సిఫిలిస్ ఇన్ఫెక్షన్ల వల్ల దీర్ఘకాలిక నొప్పి, సంతాన లేమి వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని, అలాగే సిఫిలిస్ వ్యాధి ముదిరితే గుండె లేదా నాడీ వ్యవస్థ దెబ్బతినే ప్రమాదం ఉందని ఈసీడీసీ వ్యాధుల నివారణ విభాగం అధిపతి బ్రూనో సియాన్సియో తెలిపారు.

పురిట్లోనే పిల్లలకు వచ్చే సిఫిలిస్ కేసులు 2023తో పోలిస్తే 2024 నాటికి దాదాపు రెండింతలు పెరిగాయని ఆయన చెప్పారు. ఈ వ్యాధి తల్లి నుంచి గర్భంలో ఉన్న శిశువులకు నేరుగా సోకుతుందని, దీనివల్ల అలాంటి పిల్లలు జీవితాంతం తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో బాధపడే ప్రమాదం ఉందని అన్నారు.

''లైంగిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా సులభం. కొత్త లేదా ఎక్కువ మంది భాగస్వాములతో సెక్స్‌లో కలిసేటప్పుడు కండోమ్ ఉపయోగించాలి. ఏవైనా రోగ లక్షణాలు కనిపిస్తే వెంటనే పరీక్షలు చేయించుకోవాలి'' అని బ్రూనో సియాన్సియో సూచించారు.

అత్యధికంగా స్పెయిన్‌లోనే...

2024లో లైంగిక సంక్రమణ వ్యాధుల సర్వేలో పాల్గొన్న ఐరోపా దేశాలన్నింటిలో కల్లా స్పెయిన్‌లోనే అత్యధికంగా గనేరియా, సిఫిలిస్ కేసులు నమోదయ్యాయి. ఆ దేశంలో 37,169 గనేరియా కేసులు, అలాగే 11,556 సిఫిలిస్ కేసులు నిర్ధరణ అయ్యాయి.

పురుషులతో లైంగిక సంబంధాలు కలిగి ఉండే పురుషులే (స్వలింగ సంపర్కులు) ఈ వ్యాధుల బారిన ఎక్కువగా పడుతున్నారని, వారిలోనే గనేరియా, సిఫిలిస్ కేసులు దీర్ఘకాలంగా వేగంగా పెరుగుతున్నాయని ఈసీడీసీ తెలిపింది.

అలాగే, సంతానోత్పత్తి వయస్సులో ఉన్న హెటెరోసెక్సువల్ మహిళల్లో (పురుషులతో లైంగిక సంబంధాలు కలిగి ఉండే మహిళలు) కూడా సిఫిలిస్ కేసులు భారీగా పెరిగినట్లు వెల్లడించింది.

మొత్తంమీద బ్యాక్టీరియా వల్ల వచ్చే ఇన్ఫెక్షన్లలో ఇప్పటికీ 'క్లామిడియా' అత్యధికంగా నమోదవుతున్నప్పటికీ, 2015తో పోలిస్తే ఈ కేసులు 6 శాతం తగ్గి 2,13,443కి చేరాయి.

బ్రిటన్‌లో అందుబాటులోకి వ్యాక్సిన్

బ్రెగ్జిట్ తర్వాత ఈ పరిశోధనలో బ్రిటన్ భాగం కాలేదు. కానీ, అక్కడి ప్రభుత్వం ఏటా ఇంగ్లండ్‌కు సంబంధించి సొంత గణాంకాలను విడుదల చేస్తోంది.

యూకే హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీ గత డిసెంబర్‌లో ప్రచురించిన నివేదిక ప్రకారం, 2024లో ఇంగ్లండ్‌లో 71,802 గనేరియా కేసులు, అలాగే 9,535 సిఫిలిస్ కేసులు నమోదయ్యాయి. అదే 12 నెలల కాలంలో 1,68,889 క్లామిడియా కేసులు కూడా నిర్ధరణ అయ్యాయి.

గనేరియా కేసులు 2023లో రికార్డు స్థాయిలో 85 వేల కేసులు నమోదవ్వడంతో, దీని నివారణకు బ్రిటన్ ప్రభుత్వం 2025లో వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తెచ్చింది.

గనేరియా, సిఫిలిస్ లక్షణాలు ఏమిటంటే...

గనేరియాకు సంబంధించి నొప్పి, అసాధారణమైన ద్రవాలు స్రవించడం, జననేంద్రియాల వాపు వంటి లక్షణాలు ఉంటాయి. అయితే, కొన్ని సందర్భాల్లో ఎలాంటి లక్షణాలు కూడా బయటకు కనిపించకపోవచ్చు.

కండోమ్‌లు సరిగ్గా ఉపయోగించడం, ప్రభుత్వం అందిస్తున్న వ్యాక్సిన్‌ తీసుకోవడం ద్వారా గనేరియా బారినపడకుండా జాగ్రత్త వహించవచ్చని బ్రిటన్ ఆరోగ్య సంస్థ (ఎన్‌హెచ్ఎస్) సూచిస్తోంది.

సిఫిలిస్‌కు సంబంధించి జననేంద్రియాలు, నోటి చుట్టూ పుండ్లు అవ్వడం, చేతులపై దద్దుర్లు రావడం, జుట్టు రాలడం, ఫ్లూ (జ్వరం, ఒళ్లు నొప్పులు) వంటి లక్షణాలు ఉంటాయి.

ఇవి మొదట్లో అంతగా గుర్తించలేనట్లుగా ఉంటాయి, అలాగే కాలక్రమేణా వస్తూ పోతూ ఉంటాయి.

సిఫిలిస్‌ను కూడా కండోమ్ ఉపయోగించడం ద్వారా నివారించవచ్చు. యాంటీబయాటిక్స్ మందులతో నయం చేయవచ్చు.

గనేరియా, సిఫిలిస్ వ్యాధులకు సరైన సమయంలో చికిత్స తీసుకోకపోతే దీర్ఘకాలంలో అవి తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తాయి.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)