షీ జిన్‌పింగ్‌తో సమావేశం తరువాత ‘అధికారిక స్వతంత్రం’పై తైవాన్‌కు ట్రంప్ హెచ్చరిక

    • రచయిత, ఇయాన్ ఐక్‌మాన్
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • ప్రచురణ
  • చదివే సమయం: 5 నిమిషాలు

చైనా నుంచి తైవాన్ అధికారికంగా స్వాతంత్య్రం ప్రకటించుకోవద్దని అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ హెచ్చరించారు.

బీజింగ్‌లో చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో రెండు రోజుల పాటు జరిగిన శిఖరాగ్ర సమావేశం ముగిసిన తర్వాత శుక్రవారం ఫాక్స్ న్యూస్‌తో మాట్లాడిన అమెరికా అధ్యక్షుడు.. ''ఎవరైనా స్వతంత్రంగా మారాలని నేను కోరుకోవడం లేదు'' అన్నారు.

తైవాన్ ఇప్పటికే తనను తాను ఒక సార్వభౌమ దేశంగా భావిస్తున్నందున.. అధికారికంగా స్వాతంత్య్రం ప్రకటించుకోవాల్సిన అవసరం లేదని ఆ దేశ అధ్యక్షుడు లై చింగ్-టే గతంలో పేర్కొన్నారు.

తైవాన్‌కు ఆత్మరక్షణ మార్గాలను అందించడానికి అమెరికా చట్టబద్ధంగా కట్టుబడి ఉండటంతో సహా.. దీర్ఘకాలంగా మద్దతు ఇస్తోంది.

అయితే ఈ స్నేహాన్ని కొనసాగిస్తూనే.. చైనాతో దౌత్య సంబంధాలను కాపాడుకునేందుకు అమెరికా తరచూ ఇబ్బందులు పడాల్సి వస్తోంది.

స్వయం పాలన కలిగిన ఈ ద్వీపం విషయంలో 'తానెలాంటి హామీ ఇవ్వలేదు' అని ట్రంప్ గతంలో స్పష్టం చేశారు.

ఈ ద్వీపం తమ భూభాగంలో భాగమేనని చైనా అంటోంది. బలప్రయోగంతోనైనా స్వాధీనం చేసుకుంటామనే విషయాన్ని చైనా తోసిపుచ్చడం లేదు.

తైవాన్ స్వాతంత్య్రానికి తాము మద్దతు ఇవ్వడం లేదనే తమ స్థిరమైన వైఖరిని వాషింగ్టన్ స్పష్టం చేసింది. చైనాలో ఉన్నది ఒకే ఒక్క ప్రభుత్వం అనే విషయాన్ని అంగీకరించడంపైనే బీజింగ్‌తో సంబంధాలు ఆధారపడి ఉన్నాయి.

తైవాన్ అధ్యక్షుడిపై బీజింగ్ తన అయిష్టాన్ని వ్యక్త పరుస్తూనే ఉంది. గతంలో ఆయన్ను 'సమస్యలు సృష్టించే వ్యక్తిగా' , 'తైవాన్ జలసంధికి ఇరువైపులా శాంతిని నాశనం చేసే వ్యక్తి'గా అభివర్ణించింది.

చాలామంది తైవాన్ ప్రజలు తమను తాము ఒక ప్రత్యేక దేశంలో భాగంగా భావిస్తుంటారు. అయితే, చైనా నుంచి స్వాతంత్య్రం ప్రకటించుకోకుండా లేదా దానితో విలీనం కాకుండా యథాతథ స్థితిని కొనసాగించడానికే ఎక్కువ మంది తైవాన్ ప్రజలు మొగ్గు చూపుతున్నారు.

ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ... ఈ విషయంలో అమెరికా విధానంలో ఎలాంటి మార్పు లేదని పునరుద్ఘాటించారు.

''యుద్ధం చేయాలంటే 9,500 మైళ్లు (15,289 కి.మీలు) ప్రయాణించాల్సి ఉంటుంది. నేను దాన్ని కోరుకోవడం లేదు. వాళ్లు ప్రశాంతంగా ఉండాలని, చైనా కూడా శాంతంగా ఉండాలని కోరుకుంటున్నా'' అన్నారు.

వాషింగ్టన్‌కు తిరుగు ప్రయాణంలో విమానంలో రిపోర్టర్లతో మాట్లాడిన అమెరికా అధ్యక్షుడు, తాను, షీ జిన్‌పింగ్ ఈ ద్వీపం గురించి ''చాలా'' మాట్లాడుకున్నామని, అయితే అమెరికా దాన్ని కాపాడుతుందా లేదా అనే విషయాన్ని చర్చించేందుకు మాత్రం నిరాకరించినట్లు చెప్పారు.

ఈ ద్వీపం విషయంలో షీ జిన్‌పింగ్ చాలా బలమైన అభిప్రాయాలున్నాయని, స్వాతంత్య్ర ఉద్యమాన్ని ఆయన చూడాలనుకోవడం లేదని ట్రంప్ అన్నారు.

''చైనా-అమెరికా సంబంధాల్లో అత్యంత కీలకమైన అంశం తైవాన్ సమస్యే'' అని చర్చల సందర్భంగా షీ జిన్‌పింగ్ హెచ్చరించినట్లు చైనా ప్రభుత్వ మీడియా పేర్కొంది.

''దాని విషయంలో సరిగ్గా వ్యవహరించకపోతే, రెండు దేశాలు ఘర్షణ పడొచ్చు, సంక్షోభం కూడా తలెత్తవచ్చు'' అని హెచ్చరించినట్లు చైనా ప్రభుత్వ మీడియా తెలిపింది.

తైవాన్ విషయంలో చైనాతో ఘర్షణ జరిగే అవకాశం ఉందని భావిస్తున్నారా? అని ట్రంప్‌ను అడిగినప్పుడు, ''లేదు, అలా చేయాలనుకోవడం లేదు. బానే ఉంటామని భావిస్తున్నా. షీ జిన్‌పింగ్ యుద్ధాన్ని కోరుకోవడం లేదు'' అన్నారు.

ఇటీవల ఏళ్లల్లో చైనా తైవాన్ చుట్టూ సైనిక విన్యాసాలను ముమ్మరం చేసింది. ఈ విన్యాసాలు ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలను పెంచుతున్నాయి. పెరుగుతున్న ఈ ఉద్రిక్తతలు వాషింగ్టన్ కొనసాగిస్తోన్న సమన్వయానికి పరీక్షగా నిలుస్తున్నాయి.

ఆయుధాల విక్రయం సాగుతుందా?

గత ఏడాది చివరిలో.. ట్రంప్ ప్రభుత్వం తైవాన్‌కు అధునాతన రాకెట్ లాంచర్లు, వివిధ రకాల క్షిపణులతో సహా 11 బిలియన్ డాలర్ల విలువైన ఆయుధాలను విక్రయించనున్నట్లు ప్రకటించింది. దీన్ని బీజింగ్ ఖండించింది.

ఈ విక్రయం ముందుకు సాగుతుందా? లేదా? అనేది త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని ట్రంప్ చెప్పారు. దీనిపై తాను, షీ జిన్‌పింగ్ "చాలా వివరంగా" చర్చించుకున్నామని ట్రంప్ తెలిపారు.

''నేను చెప్పబోయేది ఏంటంటే.. ప్రస్తుతం తైవాన్‌ను నడుపుతున్న వ్యక్తితో నేను మాట్లాడాల్సి ఉంది. ఈ విషయం మీకు కూడా తెలుసు'' అని రిపోర్టర్లతో అన్నారు.

అమెరికాకు తైవాన్‌తో అధికారిక సంబంధాలు లేనప్పటికీ, అనధికారిక సంబంధాలను గణనీయంగా కొనసాగిస్తోంది. అమెరికా అధ్యక్షులు సాంప్రదాయకంగా తైవాన్ నాయకుడితో నేరుగా మాట్లాడరు.

ఒకవేళ అలా మాట్లాడితే బీజింగ్‌తో తీవ్ర ఉద్రిక్తతలు తలెత్తే అవకాశం ఉంది. ఎందుకంటే, తైవాన్ అధ్యక్షుడు లై చింగ్-టేను ఒక వేర్పాటువాదిగా బీజింగ్ పరిగణిస్తోంది.

''మేం యుద్ధాలను కోరుకోవడం లేదు. ఇప్పుడు ఎలా ఉందో అలాగే కొనసాగిస్తే చైనా కూడా దానికి అంగీకరిస్తుందని భావిస్తున్నాను. కానీ, 'అమెరికా మాకు మద్దతుగా ఉంది కాబట్టి మనం స్వతంత్రంగా మారిపోదాం’ అని ఎవరైనా అనడాన్ని మేం కోరుకోవడం లేదు'' అని ఫాక్స్ న్యూస్‌తో ట్రంప్ అన్నారు.

అయితే, తైవాన్ స్వాతంత్య్రం విషయంలో అమెరికా తన వైఖరి కాస్త మెతకగా మార్చుకున్నట్లు కనిపించడంతో గతంలో చైనా ఆగ్రహానికి గురైంది.

2025 ఫిబ్రవరిలో తైవాన్ స్వాతంత్య్రానికి వాషింగ్టన్ వ్యతిరేకమనే ప్రకటనను తన వెబ్‌సైట్ నుంచి అమెరికా స్టేట్ డిపార్ట్‌మెంట్ తొలగించింది. దీనిపై స్పందించిన బీజింగ్.. ఈ చర్య 'వేర్పాటువాద శక్తులకు తప్పుడు సంకేతాలను పంపుతుంది' అని పేర్కొంది.

''ఏ వర్గం వారైనా ఏకపక్షంగా యథాతథ స్థితికి మార్పులు చేస్తే వ్యతిరేకిస్తామని మేం చాలా కాలంగా చెబుతున్నాం'' అని ఆ సమయంలో తైవాన్‌లో ఉన్న అమెరికా అధికారులు చెప్పారు.

తమ బృందం అమెరికా-చైనా శిఖరాగ్ర సమావేశాన్ని నిశితంగా గమనిస్తోందని తైవాన్ విదేశాంగ మంత్రి లిన్ చియా-లుంగ్ చెప్పారు.

అలాగే, తైవాన్-అమెరికా సంబంధాలు స్థిరంగా మరింత బలపడటానికి, తైవాన్ ప్రయోజనాలను కాపాడటానికి అమెరికాతో పాటు ఇతర దేశాలతో కూడా సత్సంబంధాలు కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు.

ఈ ప్రాంతంలో శాంతికి, స్థిరత్వానికి తైవాన్ ఎల్లవేళలా ఒక సంరక్షకురాలిగా ఉందని తెలిపారు. చైనా దురాక్రమణ సైనిక కార్యకలాపాలు, నిరంకుశ అణచివేతతో ముప్పును పెంచుతుందని ఆరోపించారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)