వియత్నాం బోటు ప్రమాదం: ‘‘నీళ్లలో అర కిలోమీటరు దూరం కూడా వెళ్లక ముందే మునిగిపోవడం మొదలైంది’.. ప్రత్యక్ష సాక్షి ‘బీబీసీ’తో చెప్పిన వివరాలు...

వియత్నాం, పడవ ప్రమాదం, లావా సెల్ ఫోన్ కంపెనీ

ఫొటో సోర్స్, pradeep

ఫొటో క్యాప్షన్, వియత్నాంలో పడవ మునిగిపోతున్న దృశ్యం
    • రచయిత, గరికిపాటి ఉమాకాంత్‌
    • హోదా, బీబీసీ కోసం
  • ప్రచురణ
  • చదివే సమయం: 6 నిమిషాలు

"మా కళ్ల ముందే బోటు మునిగిపోయింది. ఒడ్డు నుంచి 500 మీటర్లు లోపలకు వెళ్లాక చాలా వేగంగా మునిగింది. దాదాపు 80శాతం బోటు నీళ్లలోకి వెళ్లిపోయింది. మా కళ్ల ముందే 15మంది చనిపోయారు" అని వియత్నాం బోటు ప్రమాద ఘటన ప్రత్యక్ష సాక్షులు బీబీసీతో అన్నారు.

జరిగిన ప్రమాద ఘటన వివరాలను వారు వెల్లడించారు. వియత్నాం విహారయాత్రకు భారత్‌లోని వివిధ రాష్ట్రాల నుంచి వెళ్లి అక్కడ జరిగిన బోటు ప్రమాదంలో 15మంది దుర్మరణం పాలైన సంగతి తెలిసిందే.

ఫూ - క్వాక్‌ స్టేట్‌.. పెరల్‌ ఐలాండ్‌ సమీపంలో పర్యాటకులు ప్రయాణిస్తున్న స్పీడ్‌ బోటు బోల్తా పడిన ఘటనలో ఆంధ్రప్రదేశ్‌కి చెందిన ముగ్గురు మృత్యువాత పడ్డారు.

మచిలీపట్నంకి చెందిన గెల్లి జయశ్రీ, కడప జిల్లాకు చెందిన శ్రీధర్, హిందూపురం పట్టణానికి చెందిన రవితేజ మృతి చెందారు.

గెల్లి జయశ్రీ భక్త గెల్లి కిశోర్‌ తీవ్ర అస్వస్థతకు గురై అక్కడ చికిత్స పొందుతున్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

'లావా' మొబైల్‌ కంపెనీ భారత్‌ నుంచి తమ డిస్ట్రిబ్యూటర్లు, వారి కుటుంబ సభ్యులను వియత్నాం ట్రిప్‌కు తీసుకెళ్లింది.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు. కర్ణాటక, కేరళ రాష్ట్రాల నుంచి 108 మంది వీరిలో ఉన్నారు. ఏపీ నుంచి 20మంది ఉన్నారు.

ఈ ఏడాది సంక్రాంతి సీజన్‌లో సేల్స్‌ బాగా చేసిన డీలర్లు, వారి కుటుంబ సభ్యులకు కంపెనీ వియత్నాం టూర్‌ ఆఫర్‌ చేసింది.

"ఏపీ నుంచి చాలామంది జూలై 8న చెన్నై నుంచి 11.30కి ఫైట్‌లో అక్కడి వెళ్లాం. 9,10వ తేదీ వివిధ ప్రాంతాలు సందర్శించాం. 11వ తేదీ శనివారం ఉదయం 9.30కి పూ క్వాక్‌ స్టేట్‌ పెరల్‌ ఐలాండ్‌కి తీసుకువెళ్లారు" అని ఆ టూర్‌కి వెళ్లిన ప్రకాశం జిల్లా కందుకూరుకి చెందిన డిస్ట్రిబ్యూటర్‌ సాయి నవీన్‌ బీబీసీకి చెప్పారు.

వియత్నాం, పడవ ప్రమాదం, లావా సెల్ ఫోన్ కంపెనీ

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, మచిలీపట్నానికి చెందిన గెల్లి కిశోర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

ప్రమాదం ఎలా జరిగిందంటే..

"సౌత్‌ ఇండియాకు చెందిన 108మందిని మూడు పడవల్లో శనివారం ఉదయంపెరల్‌ ఐలాండ్‌కి తీసుకువెళ్లారు. అక్కడ అందరూ ఎంజాయ్‌ చేసి ఫోటోలు తీసుకున్న తర్వాత తిరిగి ఒడ్డుకు బయలుదేరాం. భారత కాలమానం ఉదయం 11.30 ప్రాంతంలో (ఆ దేశ సమయం ప్రకారం ఒంటిగంటకు) ఒక స్పీడ్‌ బోట్‌ బయల్దేరింది. అందులో 32 మంది భారతీయులు, ముగ్గురు సిబ్బంది ఉన్నారు. మేము తర్వాతి బోట్ కోసం రెడీగా ఉండి లోపలకు వెళ్లిన బోట్ వైపు చూస్తున్నాం. ఆ బోటు బయలుదేరిన ఒకటి రెండు నిమిషాల్లోపే.. 500 మీటర్ల దూరం కూడా వెళ్లకుండానే మునగడం మొదలైంది. అంతే.. అందులో ఉన్నవాళ్లు ఒక్కసారిగా అరుపులు కేకలు వేశారు. అంతలోనే 80శాతం బోటు మునిగిపోయింది. మేం అది చూస్తూ వేసిన కేకలకు వెంటనే రెస్క్యూ టీం వాళ్లు పది చిన్న పడవలు వేసుకుని వెళ్లి చాలామందిని బయటకు తీశారు. కానీ అప్పటికే 15మంది మునిగిపోయి ఉప్పు నీళ్లు తాగేసి ఊపిరి ఆడక చనిపోయారు" అని సాయి నవీన్‌ బీబీసీకి వివరించారు.

చనిపోయిన 15మందిలో ముగ్గురు ఏపీ వాళ్లు, తమిళనాడుకి చెందిన వారు పదిమంది ఉండగా, కేరళకు చెందినవాళ్లు ఇద్దరున్నారు" అని నవీన్ చెప్పారు.

వియత్నాం, పడవ ప్రమాదం, లావా సెల్ ఫోన్ కంపెనీ

ఫొటో సోర్స్, Pradeep

ఫొటో క్యాప్షన్, మునుగుతున్న బోటు వద్దకి వచ్చిన రెస్క్యూ టీం బోట్లు

‘నేవీ బోట్లలో తిరిగి వచ్చాం’

"ఈ ఘటనతో అక్కడ ప్రైవేటు బోట్లన్నీ ప్రభుత్వం నిలిపివేసింది. దాంతో మేము ఐలాండ్‌లోనే ఉండిపోయాం. సాయంత్రం ఆరుగంటల సమయంలో నేవీ షిప్‌ వచ్చి అక్కడ ఉన్న వారిని సురక్షితంగా తీసుకువచ్చింది" అని నవీన్‌ చెప్పారు.

ఆ తర్వాత భారత ప్రభుత్వం తమను స్పెషల్‌ ఫ్లైట్లలో ఆదివారం రాత్రికి చెన్నైకి తీసుకు వచ్చిందని ఆయన వివరించారు.

టూర్‌ షెడ్యూల్‌ ప్రకారం కూడా ఘటన జరిగిన మరుసటి రోజు ఆదివారం మధ్యాహ్నం తిరిగి రావాల్సి ఉంది. కానీ అవాంఛనీయ ఘటన జరిగిందని నవీన్‌ అన్నారు.

వియత్నాం, పడవ ప్రమాదం, లావా సెల్ ఫోన్ కంపెనీ

ఫొటో సోర్స్, SAI NAVEEN

ఫొటో క్యాప్షన్, కందుకూరుకు చెందిన సాయినవీన్‌

'మా కళ్ల ముందే జరగడంతో షాక్‌కు గురయ్యాం'

అప్పటి వరకు మాతో సరదాగా కలిసి తిరిగిన 15మంది మా కళ్ల ముందే చనిపోవడంతో షాక్‌కి గురయ్యాం. తేరుకునే లోపే ఒక్కసారిగా హాహాకారాలు వినిపించాయి. చాలా దురదృష్టకర ఘటన అని నవీన్‌ ఆవేదన వ్యక్తం చేశారు.

"బోటు పూర్తిగా తలకిందులు కాలేదు. అలా జరిగుంటే అందరూ చనిపోయేవారు. పైన ఉన్న 17మంది బతికారు. పూర్తిగా నీళ్లల్లో మునిగిపోయి ఉప్పు నీరు తాగేసిన వారే చనిపోయారు. అలల తీవ్రత వల్ల పడవ మునిగిందని అంటున్నారు" అని నవీన్‌ తెలిపారు.

ప్రాణాలతో బయటపడిన వారందరినీ రెస్క్యూ సిబ్బంది ఆసుపత్రికి తరలించారని చెప్పారు.

"నేను కూడా ఆ బోట్‌ ఎక్కాను. మా కడప స్నేహితుడు శ్రీధర్‌‌తో కలిసి ఆ బోట్‌ ఎక్కాను. బోట్‌ బయలుదేరే ముందు సీట్లు లేవని నన్ను ఒక్కడిని కిందకి దింపారు. నేను మా ఫ్రైండ్‌ను కూడా దిగేయమన్నాను. కానీ, ఎంతసేపు... తర్వాతి బోట్‌లో నువ్వు వస్తావ్‌ కదా.. అని నన్ను దిగమన్నారు. దాంతో నేను దిగి ప్రాణాలు కాపాడుకున్నాను. నా ఫ్రెండ్ శ్రీధర్‌ మాత్రం చనిపోయారు" అని తిరుపతికి చెందిన లావా డిస్ట్రిబ్యూటర్‌ ప్రదీప్‌ కుమార్‌రెడ్డి బీబీసీ వద్ద విలపించారు.

వియత్నాం, పడవ ప్రమాదం, లావా సెల్ ఫోన్ కంపెనీ

ఫొటో సోర్స్, PRADEEP

ఫొటో క్యాప్షన్, తిరుపతికి చెందిన ప్రదీప్‌కుమార్‌రెడ్డి

చనిపోయిన 15 మంది బోట్‌లోనే ప్రాణాలు విడిచారు

"చనిపోయిన 15మంది బోట్‌లోనే ప్రాణాలు విడిచారు. బోట్‌ మునిగిన సమయంలో ఉప్పు నీరు తాగడం, ఊపిరి ఆడకపోవడంతో అక్కడే చనిపోయారు. ప్రాణాలతో ఉన్న మిగిలిన 17మందిని వెంటనే ఆస్పత్రికి తీసుకువెళ్లారు. 9మంది వెంటనే కోలుకున్నారు. మిగిలిన వారికి ఇంకా చికిత్స అందిస్తున్నారు. మచిలీపట్నంకి చెందిన కిషోర్‌ ఇంకా అక్కడే చికిత్స పొందుతున్నారు" అని ప్రదీప్‌కుమార్‌ రెడ్డి వివరించారు.

‘‘నేను నేవీబోట్‌ కోసం చూడకుండా రెస్క్యూ టీం బోట్‌లోనే లోపలకు వెళ్లి సహాయ చర్యల్లో పాల్గొన్నా. పైన ఉన్న నలుగురైదుగురిని నేను బయటకు తీసుకువచ్చాను కానీ నా ఫ్రెండ్‌ను కాపాడుకోలేకపోయా’’ అని ప్రదీప్‌కుమార్‌రెడ్డి అన్నారు.

ఏపీకి చెందిన ముగ్గురి మృతదేహాలను మంగళవారం ఉదయానికి వారి బంధువులకు అప్పగించనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.

కృష్ణా జిల్లా మచిలీపట్నంకి చెందిన మృతురాలు జయశ్రీ మృతదేహం సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత హైదరాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కి వస్తుందని, అక్కడి నుంచి తీసుకునివచ్చి ఆమె కుటుంబసభ్యులకు అప్పజెబుతామని మచిలీపట్నం ఆర్డీవో నరసింహారావు బీబీసీకి తెలిపారు.

ఆమె భర్త కిషోర్‌ ఇంకా అక్కడే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నందున ఆయన రాకపై స్పష్టత లేదన్నారు.

వియత్నాం, పడవ ప్రమాదం, లావా సెల్ ఫోన్ కంపెనీ

ఫొటో సోర్స్, PRADEEP

ఫొటో క్యాప్షన్, మృతదేహాలను ఒడ్డుకు తీసుకువచ్చిన తర్వాత పరిస్థితి

'86 మంది తిరిగొచ్చారు' లావా ప్రకటన

వియత్నాం వెళ్లిన లావా డిస్ట్రిబ్యూటర్లు, ఉద్యోగుల్లో 86 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని లావా కంపెనీ సోమవారం ఓ అధికారిక ప్రకటనలో వెల్లడించింది.

మిగిలిన ఉద్యోగులు మరణించిన వారి మృతదేహాలను స్వదేశానికి తరలించేందుకు అవసరమైన అధికారిక ప్రక్రియలను పూర్తి చేసేందుకు వియత్నాంలోనే ఉన్నారని తెలిపింది.

తమ డిస్ట్రిబ్యూటర్‌ ఒకరు ప్రస్తుతం వియత్నాంలోని ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని ఆ ప్రకటనలో వివరించింది.

వియత్నాంలోని భారత రాయబార కార్యాలయం, వియత్నాం ప్రభుత్వ అధికారులు, హోచిమిన్‌ సిటీలోని భారత కాన్సులేట్‌ జనరల్‌తో సమన్వయం చేసుకుంటున్నామని తెలిపింది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)