You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ట్రంప్ సుంకాలు తట్టుకున్న చైనా.. ఇరాన్ యుద్ధంతో నష్టపోతోందా?
- రచయిత, లారా బికర్
- హోదా, బీబీసీ ప్రతినిధి
- చదివే సమయం: 7 నిమిషాలు
చైనాలోని ఓ పారిశ్రామికవాడ వెనక వీధిలో కొంతమంది వర్కర్లు ఉన్నారు. వారి ముఖాల్లో విషాదం కనిపిస్తోంది.
వాళ్లంతా ఆ వీధిలో ఉన్న చెట్టు కింద పొగతాగుతున్నారు. వారి ఎదురుగా ఉన్న దుకాణం వద్ద ఓ ఫ్యాక్టరీలో తాత్కాలిక ఉద్యోగులు కావాలనే ప్రకటన ఉంది.
పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ వ్యక్తి "మా జీవితాలు ఎలా ఉన్నాయో ఎవరికీ అర్థం కాదు" అని అన్నారు.
"మేం పని చేస్తూనే ఉంటాం. కానీ, మాకు జీవితం లేదు. మాకు కాస్త సాయం చేయండి" అని అక్కడున్న మరో వ్యక్తి అడిగారు.
ఒక విదేశీ జర్నలిస్టును ఇలా అభ్యర్థించడం ప్రమాదకరమే కాకుండా చాలా అరుదైన విషయం కూడా.
వాళ్లంతా చాలా నిరాశలో ఉన్నట్లు కనిపిస్తోంది. ఇంటికి డబ్బులు పంపించడం కోసం చాలా కష్టాలు పడుతున్నారు.
చౌకగా భారీ స్థాయిలో ఉత్పత్తయ్యే వస్తువులు, తయారీ రంగంలో ఏఐతో పాటు ఆధునిక సాంకేతికత వల్ల ఏర్పడిన సవాళ్లతో వారు ఇబ్బందులు పడుతున్నారు.
ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడి చేయడానికి ముందు నుంచే ఇలాంటి పరిస్థితి ఉంది.
తగ్గుతున్న ఉపాధి అవకాశాలు
గతేడాది డోనల్డ్ ట్రంప్ సుంకాల పెంపుతో వృద్ధిరేటు తగ్గుదల, నిరుద్యోగం పెరగడం వంటి సమస్యలతో చైనా ఆర్థిక వ్యవస్థ పోరాడుతోంది.
అయినప్పటికీ, ఎగుమతులను పెంచుకోవడం ద్వారా చైనా 5 శాతం జీడీపీ వృద్ధిరేటును నమోదు చేసింది.
అయితే ఇప్పుడు మధ్యప్రాచ్యంలో జరుగుతున్న యుద్ధం చైనాపై తీవ్ర ప్రభావం చూపుతోంది.
చైనా ఫ్యాక్టరీల ఆర్డర్లు, ఖర్చులు, ఉద్యోగాలపై ఒత్తిడి పెంచుతోంది.
దక్షిణ పారిశ్రామిక రాష్ట్రమైన గ్వాంగ్‌డాంగ్‌లోని ఫోషన్ నగరంలో వర్కర్లకు మంచి అవకాశం అని ఎర్రటి అక్షరాలతో రాసి ఉంది.
కొన్ని వారాల పాటు ప్లాస్టిక్ పదార్ధాల తయారీ లేదా మొబైల్ ఫోన్లను అసెంబుల్ చేయడం వంటి పనులు చేసే వారికి గంటకు 18 నుంచి 20 యువాన్లు చెల్లిస్తామని అందులో ఉంది. ఈ కథనం రాసేప్పటికి ఒక చైనీస్ యువాన్ 13.81 రూపాయలుగా ఉంది.
"నేను ఇంకెక్కడైనా పని వెతుక్కోవడానికి ప్రయత్నిస్తాను" అని గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన మరో కార్మికుడు చెప్పారు. చెట్టు కింద ఉన్న వర్కర్లలో చాలా మంది వయసు 40 ఏళ్ల పైనే ఉంటుంది. చైనా ఆర్థిక వ్యవస్థలో ఏర్పడిన అనిశ్చితి వారిలో నిరాశను పెంచింది.
ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధాన్ని త్వరగా ముగించాలని బీజింగ్ నాయకత్వం కోరడానికి కారణం ఇదే.
భారీ చమురు నిల్వలు, పునరుత్పాదక ఇంధనం, ఎలక్ట్రిక్ కార్ల రంగంలో సాధించిన విజయాల వల్ల చైనా మీద చమురు సంక్షోభం ప్రభావం పెద్దగా లేదు.
ట్రంప్ సుంకాలు, చమురు సంక్షోభం వంటి సమస్యలను ఎదుర్కొని స్థిరంగా ఉన్నప్పటికీ, హార్ముజ్ జలసంధి విషయంలో జరుగుతున్న పరిణామాలు ఎగుమతుల మీద ఎక్కువగా ఆధారపడిన చైనా ఆర్థిక వ్యవస్థకు మరింత నష్టాన్ని కలిగించేలా ఉన్నాయి.
వ్యాపారాలపై యుద్ధం ప్రభావం
"ఖర్చులు 20 శాతం పెరిగాయి" అని ఓ మహిళా వ్యాపారి చెప్పారు.
బట్టల మూటలను ట్రక్‌లో నుంచి దించి వేరే వాహనాల్లోకి ఎక్కిస్తున్న కార్మికులను ఆమె పర్యవేక్షిస్తున్నారు.
ఈ వాహనాలు ఆ బట్టల మూటలను స్థానిక ఫ్యాక్టరీలకు తీసుకెళతాయి. అక్కడ వాటిని కత్తిరించి కుట్టి ప్రపంచవ్యాప్తంగా ఉన్న జారా, షీన్, టెము వంటి రిటైల్ వ్యాపారులకు సరఫరా చేస్తారు.
ఫొషాన్ నుంచి గంట ప్రయాణం దూరంలో ఉన్న గ్వాంగ్జౌలో ప్రపంచంలో అతిపెద్ద వస్త్ర మార్కెట్ ఉంది.
రంగురంగుల వస్త్రాల మూటలతో నిండిన మోటార్ బైక్‌లతో గ్వాంగ్జౌ వీధులు ఎప్పుడూ సందడిగా ఉంటాయి.
వస్త్రాల మూటల్ని, తయారైన దుస్తులను అటూ ఇటూ తీసుకెళ్లే చిన్న వ్యాన్‌లు, ట్రక్కుల హారన్ల మోతలు వినిపిస్తుంటాయి.
నైలాన్, పాలిస్టర్, పట్టు వస్త్రాల కుప్పల మధ్య దుకాణాలను గుర్తించడం కష్టం.
అయితే ఆ దుకాణాల యజమానులు, అమ్మకందారుల కథ మాత్రం ఒకేలా ఉంటుంది.
వారి వ్యాపారం కొనసాగాలంటే నిరంతరాయంగా, చౌకగా చమురు అవసరం. బట్టల తయారీకి చమురు నుంచి వచ్చే ముడి పదార్థాలు కావాలి.
పెరిగిన చమురు ధరలు వారిని దెబ్బతీస్తున్నాయి.
"దీని వల్ల ఆర్డర్లు తగ్గిపోతాయి" అని ఓ వ్యాపారి చెప్పారు.
దుస్తుల ధరలు పెరిగితే అమ్మకాలు తగ్గుతున్నాయని దీంతో గోడౌన్లలో వస్త్రాల మూటలు పేరుకుపోతున్నాయని ఆయన చెప్పారు.
పెరిగిన చమురు ధరల్ని వినియోగదారులపై వేయాల్సి ఉంటుంది. అలా చేయకపోతే వారే భరించాలి. ఇప్పటికే స్వల్ప లాభాలతో వ్యాపారం చేస్తున్న వారికి ఇది చాలా కష్టంగా మారుతుంది.
ఏడాది క్రితం అమెరికా - చైనా వాణిజ్య యుద్ధంలో చిక్కుకున్నప్పుడు గ్వాంగ్జౌ వీధుల్లో ధిక్కారం కనిపించింది. ఇప్పుడు వాళ్లలో నిస్సహాయత కనిపిస్తోంది.
టెక్నాలజీలో ముందంజ
ఈ అనిశ్చిత పరిస్థితుల మధ్య కూడా అవకాశాలు కనిపిస్తున్నాయి.
గ్వాంగ్జౌ బట్టల మార్కెట్ నుంచి కాస్త దూరంలో విశాలమైన ప్రాంగణాలలో ఏర్పాటు చేసిన కాంటన్ వాణిజ్య ప్రదర్శనలో పారిశ్రామికవేత్తలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న కొనుగోలుదారులను ఆహ్వానిస్తున్నారు.
అక్కడ హ్యూమనాయిడ్ రోబోలు చేతులు ఊపుతూ, పాటలు పాడుతుంటే అంతర్జాతీయ పర్యటకులు సెల్ఫీలు తీసుకుంటున్నారు.
బీజింగ్ నాయకత్వం ప్రపంచానికి చూపించాలనుకుంటున్న చైనా ఇదే.
తన ప్రత్యర్థి అమెరికా మధ్యప్రాచ్యంలో యుద్ధంలో చిక్కుకుని ఉంటే, భవిష్యత్ కోసం కొత్త సాంకేతికతను నిర్మిస్తోంది చైనా.
కాంటన్ ఫెయిర్‌లో విదేశీ భాషలను అనువదిస్తాయని చెప్పే ఏఐ కళ్లజోళ్లు, పర్వతారోహణకు సాయపడే రోబోటిక్ కాళ్లను పరీక్షించడానికి వ్యాపారులు క్యూ కట్టారు.
క్షణాల్లో మరకలను తొలగించే వాక్యూమ్ క్లీనర్‌ల నుంచి మెరిసే డ్రింక్ మేకింగ్ మెషీన్లు, హెయిర్ కర్లర్ల వరకు రోజువారీగా ఉపయోగించే వస్తువుల్ని ఈ వాణిజ్య ప్రదర్శనలో ప్రదర్శిస్తున్నారు.
ఈ మొత్తం పరిణామాల సారాంశం ఏంటంటే, ధరలు పెరగడమే అని వ్యాపారులు చెబుతున్నారు. వీటి తయారీకి ప్లాస్టిక్ అవసరం. ప్లాస్టిక్ తయారీకి చమురు నుంచి తీసే ముడిపదార్ధం అవసరం.
ఇవన్నీ ఎలా ఉన్నా.. కొనుగోలుదారులు కాంటన్ ఫెయిర్‌కు క్యూ కడుతున్నారు.
చైనా ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్
మార్కెట్‌లో ముడి చమురు ధరలు పెరుగుతున్న సమయంలో ఎలక్ట్రిక్ వాహనాల రంగంలో చైనా ఆధిపత్యాన్ని ఈ యుద్ధం స్పష్టం చేసింది.
చైనా ఎలక్ట్రిక్ వాహనాల తయారీదారులు ఈ ఏడాది మార్చిలో మూడున్నర లక్షల ఈవీలను ఎగుమతి చేశారు. ఫిబ్రవరితో పోలిస్తే ఇది 30 శాతం ఎక్కువ. గతేడాది మార్చితో పోలిస్తే చైనా ఈవీ అమ్మకాలు 140 శాతం పెరిగాయని చైనీస్ ప్యాసింజర్ కార్ అసోసియేషన్ డేటా చెబుతోంది.
మిడిల్‌ఈస్ట్‌కు చైనా ఎక్కువగా చేసే ఎగుమతుల్లో ఎలక్ట్రిక్ వాహనాలు కూడా ఉన్నాయి. అయితే, ఇప్పుడు అక్కడి కస్టమర్లకు వాహనాలను అందించడం కష్టంగా మారిందని వ్యాపారి జాయ్‌సి లియు చెప్పారు
"గతేడాది మా కార్లలో 90 శాతం మిడిల్‌ఈస్ట్‌కు పంపించాం. అయితే, ఈ ఏడాది యుద్ధం కారణంగా మధ్యప్రాచ్యంలో వ్యాపారం ఆగిపోయింది. కొన్ని కార్లు ఇప్పటికీ చైనా పోర్టుల్లో వేచిచూస్తున్నాయి" అని ఆమె తెలిపారు.
ఆఫ్రికా లేదా దక్షిణ అమెరికా నుంచి వచ్చే కొత్త కొనుగోలుదారుల కోసం కాంటన్ ఫెయిర్‌లో ఎదురు చూస్తున్నారు.
అయితే అక్కడ ఎలక్ట్రిక్ వాహనాల స్టాల్స్ వద్ద భారత్, బంగ్లాదేశ్, తుర్కియే నుంచి వచ్చిన వ్యాపారులు కూడా ఉన్నారు.
పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో కొన్ని దేశాల్లో చైనా ఎలక్ట్రిక్ వాహనాల కోసం ఎదురు చూస్తున్న వారి వెయిటింగ్ లిస్ట్ పెరుగుతూ ఉంది.
అయితే, అక్కడ ఒమన్ నుంచి వచ్చిన బృందం కూడా ఉంది. వెలుగులు చిమ్ముతున్న లైట్ల కింద ఇంగ్లిష్, అరబిక్‌లో రాసి ఉన్న ప్రకటనల మధ్య మెరుస్తున్న కార్లను పరిశీలిస్తున్నారు.
వారు ఒప్పందం చేసుకునేందుకు ఈవీ వ్యాపారులతో బేరాలు ఆడుతున్నారు.
"మేం చైనా కంపెనీలతో పరస్పర సహకారానికే ఇక్కడున్నాం. ప్రస్తుతం కష్టంగానే ఉంది. దేవుడి దయ వల్ల యుద్ధం ముగిసి వ్యాపారం గాడినపడుతుందని అనుకుంటున్నాం" అని జహీర్ మొహమ్మద్ అన్నారు.
యుద్ధాన్ని ఆపేందుకు బీజింగ్ ప్రయత్నాలు
బీజింగ్ కూడా ఇదే కోరుకుంటోంది.
స్వయంసమృద్ధి కోసం చైనా ప్రయత్నాలను మిడిల్ ఈస్ట్‌లో జరుగుతున్న యుద్ధం బలోపేతం చేసినప్పటికీ, పరిస్థితులు ఏమాత్రం బీజింగ్‌కు అనుకూలంగా లేవని లండన్ థింక్‌ట్యాంక్ చాథమ్ హౌస్‌కు చెందిన యూలీ అన్నారు.
"విచిత్రమేమిటంటే, అమెరికా పతనాన్ని చూడాలని చైనా భావించింది. కానీ, చైనా కోరుకున్న అమెరికా ఇదేనా? బహుశా, తేలిగ్గా అంచనా వేయగలిగిన, వ్యవహారాల నిర్వహణ సులువుగా ఉండే అమెరికానే చైనా కోరుకుంటుంది" అని ఆమె చెప్పారు.
ఇప్పుడు చైనా సమతుల్యత పాటించాల్సిన పరిస్థితి ఏర్పడింది. "ట్రంప్‌ను చికాకు పెట్టాలని బీజింగ్ నాయకత్వం అనుకోవడం లేదు" అని ఆమె అన్నారు.
మేలో జరగనున్న అమెరికా - చైనా అధ్యక్షుల శిఖరాగ్ర సదస్సులో ఇరాన్ యుద్ధం ప్రస్తావన చాలా తక్కువగా ఉండవచ్చని ఆమె అభిప్రాయపడ్డారు.
"ఈ సదస్సును విజయవంతం చేసేందుకు బీజింగ్ చేయగలిగినంత చేస్తోంది" అని యూలీ చెప్పారు.
మిడిల్ ఈస్ట్‌లో కాల్పుల విరమణను ప్రోత్సహిస్తూనే, తన మిత్ర దేశమైన ఇరాన్‌ను చర్చల కోసం ప్రోత్సహిస్తోంది.
ట్రంప్ కూడా ఇదే కోరుకుంటున్నారు. షీ జిన్‌పింగ్ తన మిత్రదేశాలైన యూఏఈ, సౌదీ నాయకులతో చర్చలు, ఫోన్ సంభాషణలు చేస్తున్నారు.
చైనా దౌత్యపరమైన బలాన్ని ప్రదర్శిస్తోందని గ్రోనింగెన్ యూనివర్సిటీలో అంతర్జాతీయ సంబంధాల ప్రొఫెసర్ విలియం ఫిగ్యురోవా చెప్పారు.
"ఈ ప్రాంతంలో తన ప్రయోజనాల పట్ల తాను సీరియస్‌గా ఉన్నానని అమెరికా, దాని మిత్ర పక్షాలు, బహుశా ప్రపంచ దేశాలకు చెప్పాలని చైనా ప్రయత్నిస్తోంది" అని ఫిగ్యురోవా అన్నారు.
ఇదంతా చైనా ప్రపంచ ఆర్థిక శక్తిగానే కాకుండా ప్రపంచ శక్తికి కేంద్రంగా మారుతుందని గుర్తు చేస్తుంది.
అయితే, తక్కువ జీతాలతో నిరాశలో ఉన్న ఫొషాన్‌లోని కార్మికులకు దీనితో ఎలాంటి ప్రయోజనం లేదు.
ఆ కార్మికుల్లో ఒకరు కాంటన్ ఫెయిర్‌లోకి వెళ్లే అనుమతి ఉన్న పాస్ చూపించారు.
"నేనక్కడ మరుగుదొడ్లు శుభ్రం చేశాను" అని నవ్వుతూ సిగరెట్ పొగను గాలిలోకి వదిలారు.
రోజులో 14 గంటలు పని చేసినందుకు అతనికి 150 యువాన్లు, అంటే దాదాపు 2070 రూపాయలు వచ్చాయి.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)