‘నీట్’ ఎప్పటి నుంచి మొదలైంది, ఎన్‌టీఏ ఏం చేస్తుంది?

నీట్, ఎన్టీఏ, ప్రభుత్వం, పరీక్షలు, వైద్యవిద్య

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, కమలాదేవి నల్లపనేని
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • ప్రచురణ
  • చదివే సమయం: 5 నిమిషాలు

నీట్.. ఎన్‌టీఏ ఈ రెండు పేర్లు గత నాలుగురోజులుగా మీడియాలో మారుమోగి పోతున్నాయి. మే 3న నిర్వహించిన నీట్ పరీక్ష ను కేంద్ర ప్రభుత్వ ఆమోదంతో రద్దు చేసినట్లు ఎన్‌టీఏ పేర్కొంది. పేపర్ లీక్ కావడమే దీనికి కారణమని తెలిపింది.

ఈ నేపథ్యంలో నీట్ పరీక్ష గురించి దాన్ని నిర్వహించే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) గురించి చర్చ జరుగుతోంది.

ఇంతకీ అసలు నీట్ అంటే ఏంటి? ఈ పరీక్ష రాయడానికి కావాల్సిన అర్హతలేంటి?

ఆ పరీక్ష నిర్వహించే ఎన్‌టీఏ బాధ్యతలేంటి?

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
నీట్, ఎన్టీఏ, ప్రభుత్వం, పరీక్షలు, వైద్యవిద్య

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, భారత విద్యార్థులు వైద్య విద్య చదవాలంటే నీట్ రాయడం తప్పనిసరి

ఏమిటీ నీట్?

నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్‌నే సంక్షిప్తంగా నీట్ అని పిలుస్తున్నారు. ఇది జాతీయ స్థాయిలో నిర్వహించే వైద్య విద్య ప్రవేశ పరీక్ష. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని వైద్య ప్రవేశ పరీక్షలను ఏకీకృతం చేసే ప్రయత్నంలో భాగంగా 2013లో సీబీఎస్ఈ దీనిని ప్రవేశపెట్టింది. నీట్ పరీక్ష‌ను ఏపీఐఎంటీ (ఆల్ ఇండియా ప్రీ మెడికల్ టెస్ట్), ఇతర రాష్ట్ర స్థాయి పరీక్షల స్థానంలో ప్రవేశపెట్టారు.

​నీట్ పరీక్షను తెలుగు,తమిళం, కన్నడ, మలయాళం, మరాఠీ, ఒడియా, పంజాబీ, గుజరాతీ, ఇంగ్లీష్, హిందీ, అస్సామీ, బెంగాలీ భాషల్లో నిర్వహిస్తారు.

దేశవ్యాప్తంగా ప్రభుత్వ ప్రైవేట్ వైద్య కళాశాలల్లో అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సుల (ఎంబీబీఎస్)లో ప్రవేశం కోసం నీట్‌ను నిర్వహిస్తారు.

నీట్‌ను ఏటా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) నిర్వహిస్తుంది.

ప్రభుత్వ, ప్రైవేట్ వైద్యవిద్యాసంస్థలన్నింటిలో అండర్ గ్రాడ్యుయేట్ వైద్య విద్య, బీడీఎస్‌లో ప్రవేశాల కోసం ఈ పరీక్ష నిర్వహిస్తారు.

భారతీయ వైద్యవిధానంలోని ఆయుర్వేదిక్ సైన్సెస్, యునానీ మెడిసిన్, హోమియోపతిక్ మెడిసిన్, యోగిక్ మెడిసిన్, సిద్ధ సైన్సెస్... వంటివాటిలో ప్రవేశాలు కూడా నీట్ ద్వారానే జరుగుతాయి. అంటే వైద్యపరమైన ఏ చదువు చదవాలన్నా నీట్ రాయాల్సిందే.

నీట్‌ రాసే విద్యార్థుల సంఖ్య ఏటికేడాది పెరుగుతోంది.

నీట్‌కు ముందు ప్రవేశాలు ఎలా ఉండేవి

ఒకప్పుడు మెడిసిన్ చదవాలంటే రాష్ట్రాల స్థాయిలో, విద్యాసంస్థలకు ప్రత్యేక పరీక్షలుండేవి. తెలుగు రాష్ట్రాల్లో ఎంసెట్ రాసేవారు.

సుప్రీంకోర్టు ఆదేశాలతో అండర్ గ్రాడ్యుయేట్ వైద్య విద్యకు సంబంధించి అన్ని ప్రవేశపరీక్షలు రద్దయిపోయి వాటన్నింటి స్థానంలో నీట్ వచ్చింది.

నీట్‌ను మొదటగా 2013లో ప్రవేశపెట్టారు. కొన్ని రాష్ట్రాలు, ప్రైవేటు కాలేజీలు వ్యతిరేకించడంతో అప్పుడు అది అమలు కాలేదు.

2017నుంచి దాదాపు అన్ని రాష్ట్రాలు నీట్‌ను పరిగణనలోకి తీసుకున్నాయి.

వైద్యవిద్యాభ్యాసానికి 2020నుంచి నీట్ ప్రధాన ప్రవేశపరీక్షగా మారింది.

విదేశాల్లో వైద్య విద్యను పూర్తి చేసి భారత్‌లో వైద్యుడిగా స్థిరపడాలనుకున్నా నీట్ రాయడం తప్పనిసరి.

ఈ పరీక్షకు హాజరు కావాలంటే అభ్యర్థి వయసు 17 సంవత్సరాలు నిండి ఉండాలి.

మిలటరీ నర్సింగ్ సర్వీస్-ఎంఎన్ఎస్ అభ్యర్థులు, ఆర్మ్‌డ్ ఫోర్స్ మెడికల్ సర్వీస్ హాస్పిటల్స్ నిర్వహించే బీఎస్సీ నర్సింగ్ కోర్సులో ప్రవేశం పొందాలనుకున్నా నీట్ అర్హత తప్పనిసరి.

నీట్‌ను తమిళనాడు తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. నీట్ నుంచి తమ రాష్ట్రాన్ని మినహాయించాలని కోరుతూ 2025లో అప్పటి స్టాలిన్ ప్రభుత్వం తమిళనాడు అసెంబ్లీ అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ డిగ్రీ కోర్సుల ప్రవేశాల బిల్లు 2021ని ఆమోదించింది.

కానీ రాష్ట్రపతి ఆ బిల్లును ఆమోదించలేదు. రాష్ట్రపతి నిర్ణయాన్ని తమిళనాడు సుప్రీంకోర్టులో కూడా సవాల్ చేసింది.

నీట్, ఎన్టీఏ, ప్రభుత్వం, పరీక్షలు, వైద్యవిద్య

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, నీట్ సహా పలు కీలక పరీక్షలను ఎన్టీఏ నిర్వహిస్తోంది.

ఎన్‌టీఏ ఏం చేస్తుంది?

నీట్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహిస్తుంది. భారత్‌లో ఉన్నత విద్యాసంస్థల్లో ప్రవేశం కోసం ఎంట్రన్స్ టెస్ట్‌లు నిర్వహించే స్వయం ప్రతిపత్తి ఉన్న సంస్థే ఎన్‌టీఏ. దీనిని సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్ -1860 కింద నమోదు చేశారు.

అభ్యర్థుల సామర్థ్యాన్ని అంచనావేయడానికి సమర్థవంతమైన, పారదర్శకమైన, అంతర్జాతీయ ప్రమాణాలతో పరీక్షలు నిర్వహించడం ఈ సంస్థ ఏర్పాటులోని ముఖ్య ఉద్దేశం. 2017లో విద్యామంత్రిత్వశాఖ (గతంలో మానవ వనరుల మంత్రిత్వశాఖగా పిలిచేవారు) ఆధ్వర్యంలో ఈ సంస్థ ఏర్పడింది.

జేఈఈ మెయిన్స్, నీట్ (యూజీ), కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్, యూజీసీ నెట్, సీఎస్ఐఆర్ నెట్, ఫ్రీ ఆన్ లైన్ ఎడ్యుకేషన్ స్వయం పరీక్షలను నిర్వహిస్తామని ఎన్‌టీఏ తన వెబ్‌సైట్‌లో పేర్కొంది.

ఎన్‌టీఏ ఏర్పాటుకు ముందు నీట్ పరీక్షను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ నిర్వహించేది.

నీట్, ఎన్టీఏ, ప్రభుత్వం, పరీక్షలు, వైద్యవిద్య

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, దేశవ్యాప్తంగా నీట్‌ను రద్దు చేయడం ఇదే తొలిసారి.

గతంలోనూ వివాదాలు

ఇంజినీరింగ్, మెడిసిన్, మేనేజ్‌మెంట్, ఫార్మసీ వంటి రంగాల్లో ప్రవేశ పరీక్షలు, ఉద్యోగ నియామక పరీక్షలు నిర్వహించే ఎన్‌టీఏ చుట్టూ గతంలోనూ వివాదాలున్నాయి. నీట్‌తో పాటు జేఈఈ వంటి పరీక్షల నిర్వహణలో విమర్శలు ఎదుర్కొంది. 2024లో యూజీసీ నెట్‌ను రద్దు చేయడం అప్పట్లో సంచలనంగా మారింది.

గతంలో రాజస్థాన్, బీహార్ వంటి చోట్ల పేపర్ లీకైందనే ఆరోపణలు వచ్చినప్పుడు ఆయా రాష్ట్రాల్లో మాత్రమే నీట్ రద్దుచేశారని, ఇప్పుడు మాత్రం మొత్తంగా రద్దుచేశారని చైతన్య కళాశాలల ఎగ్జిక్యూటివ్ డీన్ శంకరనారాయణ బీబీసీ ఇంటర్వ్యూలో చెప్పారు.

నీట్ పరీక్ష రద్దుపై బాధ కలిగించినప్పటికీ...మరోసారిపరీక్షనిర్వహించడం ద్వారా కష్టపడి చదివిన విద్యార్థులకు న్యాయం జరుగుతుందని ఆయన అన్నారు.

2024లో నీట్ వివాదం సమయంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) సామర్థ్యంపై నిపుణులు ప్రశ్నలను లేవనెత్తారు. అప్పట్లో కొందరు అభ్యర్థులు పరీక్షా సమయం కోల్పోయినందున 1,563 మందికి అదనపు మార్కులు ఇచ్చినట్లు ఎన్‌టీఏ ప్రకటించడం వివాదానికి కారణమైంది.

2004 నుంచి 2010 వరకు ఎన్‌సీఈఆర్‌టీ డైరెక్టర్‌గా ఉన్న కృష్ణ కుమార్ "ఎన్‌టీఏలో శాశ్వత ఉద్యోగి లేరు. ప్రతి ఆరు నుంచి ఎనిమిది నెలలకు ఉద్యోగులు మారుతూ ఉంటారు. వ్యవస్థలోనే లోపం ఉంది. ఒక్క వ్యక్తిని దీనికి బాధ్యులుగా చూపలేం'' అని అప్పట్లో అన్నారు.

ఈ ఏడాది నీట్ (యూజీ) పరీక్షకు సుమారు 22 లక్షల మంది హాజరయ్యారు. ఈ నెల 3న పరీక్ష జరిగింది.

ఈ పరీక్ష రద్దయిన నేపథ్యంలో వారంతా మళ్లీ పరీక్ష రాయాల్సి ఉంటుంది.

అయితే, దీనికోసం ఎటువంటి అదనపు రుసుమూ చెల్లించాల్సిన అవసరం లేదు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)